సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, January 2, 2011

మరో దశాబ్దపు మొదటిరోజు

రంగులు దిద్దుతున్న మా "ముగ్గుగుమ్మ"

దశాబ్దపు మొదటిరోజు అయితే ఏమన్నా కొమ్ములుంటాయా? ఏమీ ఉండవు. అదీ ఒక మామూలు రోజే...it's just an other day...another day !! కానీ నేను మాత్రం bryan adams "Here I am - this is me" పాట గుర్తొచ్చి "It's a new day - it's a new plan ... It's a new world ... it's a new start ..." అని పాడుకున్నా !! ఎందుకంటే మనిషి ఆశాజీవి. నిన్న నిరాశను మిగిల్చినా రేపు బాగుంటుందేమోని అని ఆశ పడతాడు మనిషి. ఆశ లేకపోతే కొత్త ఉదయాలను చూడటం కష్టం. కొత్త కేలండర్లతో అలాంటి ఆశలు రేపేకొత్త సంవత్సరం అంటే నాకు ఇష్టం. మామూలుగానే గడచిపోవచ్చు..మరో ఏటికి ఇది just another year అయిపోవచ్చు. కానీ ప్రస్తుతానికి it's a new start.

చాలాసందర్భాల్లో నేను మారిపోయాననుకుంటూ ఉంటాను...కానీ మనిషిలో ఆలోచనకు మార్పు వస్తుంది కానీ బేసిక్ స్వభావం ఏదైతే ఉందో అది అరిచి గీపెట్టినా మారదు. గ్రీటీంగ్స్ తయారు చేసి పోస్ట్ చేసేరోజులు పోయాయి కాబట్టి ఎప్పటిలానే రెండ్రోజుల ముందరే (అందరికన్నా ముందు విషస్ చెప్పాలనే అజ్ఞానపు తాపత్రయం) మైల్ బాక్స్ లో ఉన్న ఎడ్రస్లన్నింటికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించాను. ఎప్పటిలానే మావారూ నవ్వారు.."వీళ్ళలో సగం మంది కూడా తిరిగి జవాబివ్వారు. ఎందుకు పంపిస్తావు?" అని. ఒక విష్ పంపినందువల్ల తప్పేముంది? కొట్టరు కదా. "Be aware that your kindness may be treated as your weakness...but still be kind" అన్నరు స్వామి. నా అలవాటునాది. ఓపిక, వీలు ఉన్నన్నాళ్ళు పంపిస్తాను. అంతే.

కౌన్ట్ డౌన్ లెఖ్ఖపెట్టుకుంటూ టీవీ చానల్స్ తిప్పుతూ కూచునే రోజులు పోయి నాలుగైదేళ్ళు అయ్యింది. చిన్నప్పుడు, పెద్దయ్యాకా కూడా హడావుడి పడిపోయి ప్రోగ్రామ్స్ మొదలెయ్యేలోపూ బయట న్యూ ఇయర్ ముగ్గు పూర్తి చేసేసి, టివీ ముందుకి చేరిన రోజుల్ని, పన్నెండవ్వగానే లైన్స్ కలవవని అరగంట ముందుగానే స్నేహితులకీ, బంధువులకీ ఫోన్లు చేసిన క్షణాల్ని తలుచుకుంటే నవ్వు వస్తుంది ఇప్పుడు. ముగ్గు వెయ్యటం మాత్రం ఇప్పటికీ మానలేదు నేను. ఈసారి నా న్యూ ఇయర్ ముగ్గు వేస్తూండగానే మొదలయ్యింది. నిశ్శబ్దంలో నేనూ, చీకటిలో ఓపిగ్గా తోడు నించున్న తనూ ఇద్దరమే ఒకరికొకరం విషెస్ చెప్పుకున్నాం. పేచీపెట్టి రంగులు కొనిపించుకుని తానే రంగులు మా పాప వేస్తానని మరీ మరీ చెప్పటం వల్ల ముగ్గు మాత్రం వేసి ఊరుకున్నా. పొద్దున్నే లేచి రంగులు ప్లేట్లో పెట్టుకుని పాప ముగ్గుకి రంగులు దిద్దుతూంటే "ముగ్గు గుమ్మ" అనుకున్నా. నా వారసత్వాన్ని,అభిరుచుల్నీ అన్నివిధాలా కాపాడుతుంది అనిపించే నా బంగారాన్ని చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఇక పొద్దున్నే పనులన్నీ అయ్యాకా నేను చేసిన మంచి పని ఏమిటంటే ఫోన్ నంబర్ల బుక్ దగ్గర పెట్టుకుని అందరు మిత్రులకీ ఫోన్లు చేయటం. ఇది గత కొన్నేళ్ళుగా నేను మానేసిన పని. కొందరి లైన్లు కలవలేదు. కొందరు పలికారు. నాతో ఇంగ్లీష్ ఎంఏ చదువుకున్న ఒక పాత స్నేహితురాలు లైన్ దొరికింది. ఇప్పుడు బొంబాయిలో ఉన్నారుట. ఇద్దరు అబ్బాయిలు. బోలెడు జ్ఞాపకాలు నెమరేసుకున్నాం. మళ్ళీ ఫోన్ చేస్తాలే అన్నా. "నువ్వు ఉత్తరాలు బాగా రాస్తావు. మళ్ళీ నీ ఉత్తరం చదవాలని ఉంది. ఎడ్రస్ కి ఉత్తరం రాయవే" అని పోస్టల్ ఎడ్రస్ ఇచ్చింది. దాదాపు మూడునాలుగేళ్ళ క్రితాం దాకా ఊరు మారినా తనకు లెటర్స్ రాస్తూనే ఉండేదాన్ని. లెటర్ పాడ్స్, స్టాంపులు, రంగురంగుల ఎన్వలాప్ కవర్లు... గత జన్మేమో అనిపిస్తాయి జ్ఞాపకాలు.

తరువాత మైల్ బాక్స్ తెరిచాను ఎవరన్నా జవాబులు రాసారేమో అని. కొందరు రాసారు. ఒక కాలేజీ మిత్రురాలు డిగ్రీ క్లాస్మేట్స్ కొందరు కలిసారనీ వివరాలు అవీ రాసింది. ఆశ్చర్యంగా కొన్ని పేర్లు నాకు గుర్తుకు రాలేదు. నాక్కూడా మరపు వచ్చేస్తోంది అని అర్ధమైంది. లేకపోతే నేను ఏదన్నా మర్చిపోవటమా? ఎంఏ ప్రెండ్ చెప్పిన కొన్ని వార్తలు, ఇప్పుడీ స్నేహితురాలు రాసిన కొన్ని విషయాలు చాలా బాధాకరమైనవి ఉన్నాయి. న్యూ ఇయర్ పూటా ఇలాంటి వార్తలేమిటీ అనుకున్నాను... కానీ నాకు ఒక సంగతి అర్ధమైంది. బహుశా దేవుడు నాకు పెద్ద గీత చూపిస్తున్నడేమో అని. పెద్ద గీత ముందు చిన్న గీత ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది కదా. గతించిన కాలంలో నీపై రోకలి పోటు పడకుండా సుత్తి దెబ్బతో సరిపెట్టాను అని దేవుడు చెప్తున్నాడన్న మాట అనుకున్నాను.


విజయవాడలో పుస్తక ప్రదర్శన మొదలు. పధ్నాలుగేళ్ళు పాటు విడువకుండా వెళ్ళాను. వీలవదు కానీ ప్రతి ఒకటవ తారీఖున వెళ్ళాలని మనసు కొట్టుకుంటుంది. ఇంకా...బయట అమ్మొచ్చిన మొక్కలబ్బాయిని పిలిచేసి, నన్ను బయటకు పిలిచేసి నాతో చేమంతి మొక్కలు కొనిపించేసింది మా చిన్నారి.బయటకు వెళ్ళి వస్తూంటే దారిలో పండగకు ముగ్గు వెయ్యటానికి అని మరో ఐదారు రంగుల పేకెట్లు వాళ్ళ నాన్నతో కొనిపించేసుకుంది. మరోసారి పుత్రికోత్సాహం పెల్లుబికింది. మిగిలిన దినచర్య మామూలే.. కొత్త సంవత్సరం అని పొద్దుపోక మానుతుందా? వెలుతురు నిశీధిగా మారింది. రాత్రి గడిచి మరో ఉదయం ప్రారంభమైంది...ఎన్నో సత్యాలను కళ్ల ముందు ఉంచిన దశాబ్దపు మొదటి రోజు ఇలా గడిచింది.


మరొక ఉదయం
మరొక రేపు
మరొక చిరునవ్వు
మరొక వసంతం
మరొక హేమంతం
మరొక సంవత్సరం...మళ్ళీ మొదలు !!

Friday, December 31, 2010

సింహావలోకనం-2 (కొన్ని discovered blogs)


ఇన్వెన్షన్ కీ డిస్కవరీకీ తేడా తెలిసేది కాదు నాకు చిన్నప్పుడు. అప్పుడు నాన్న చెప్పారు "ఏదైన కొత్త విషయాన్ని కనిపెడితే "ఇన్వెన్షన్", ఆల్రెడీ ఉన్నదాన్నే కొత్తగా కనుక్కుంటే "డిస్కవరీ" అని. అలాగ ఈ మధ్యన నేను డిస్కవర్ చేసిన బ్లాగులు కొన్నింటి గురించి ఈ టపాలో రాయాలని. అసలీ సింహావలోకనం-2 ఏమిటంటే, రేడియోలో ప్రతి డిసెంబర్ 31st కీ "సింహావలోకనం" అనే కార్యక్రమం వస్తూ ఉంటుంది. ఆ సంవత్సరంలో ప్రసారమైన అన్నికార్యక్రమాల బిట్స్, విశేషాలు ఉంటాయి అందులో. క్రితం ఏడాది అలాంటి ఒక టపా రాయాలనే ఆలోచన బుర్రని దొలిచింది. ఆ టపా "ఇక్కడ" చూడవచ్చు. ఆ పోస్ట్ లో నేను అప్పట్లో చూసిన బ్లాగుల్లో నాకు నచ్చిన టపాలు కొన్ని ఏరి కూర్చాను.



కానీ ఈ సారి సగం ఏడాది దాకా అసలు నా బ్లాగు నేనే సరిగ్గా రాయలేదు. మూడు కొత్తవి తెరిచి, వాటిల్లోనూ అనుకున్నవి రాయలేకపోతున్నాను. ఇక బ్లాగులు చదవటం, వ్యాఖ్యానించటం కూడా చాలా తక్కువైపోయింది. సగం మంది బ్లాగ్మిత్రులు నన్ను మర్చిపోయారు. అడపాదడపా టపాల్రాసినా వ్యాఖ్యలు రావటం కూడా తగ్గిపోయాయి. అందుకని అప్పుడప్పుడూ ఖాళీ దొరికినప్పుడల్లా బ్లాగ్లోకంలో విహరించటం మొదలుపెట్టాను. అప్పుడు పాత బ్లాగ్మిత్రులు చాలామంది టపాలు రాయటం తగ్గించేసారని అర్ధమైంది. బ్లాగుల నాణ్యత తగ్గిపోతోందని కూడా చాలామంది అనుకుంటున్నారని తెలిసింది.


అయ్యో, తెలుగు బ్లాగుల పరిస్థితి ఇదా? అని బాధపడుతూ బ్లాగ్విహారాలు చేస్తున్న ఇటీవల సమయంలో కొత్త బ్లాగులు డిస్కవర్ చేసాను...అంటే నేను అదివరకూ చూడనివన్నమట. నాకు బాగా నచ్చాయి. బ్లాగ్లోక సాహిత్యానికి మంచి రోజులు ఉన్నాయి అనిపించింది. వీటిని మించిన మంచి బ్లాగులు ఉండి ఉండవచ్చు. కానీ నా పరిధిలో, నా విహరణలో కనబడ్డ బ్లాగులు ఇవి. బ్లాగులను పరిచయం చేసేంత ప్రాముఖ్యం నా బ్లాగుకీ, నాకూ లేకపోయినా, ఈ బ్లాగులను గురించి ఓ నాలుకు వాక్యాలు రాయాలనిపించింది.

ముందుగా అందరికీ తెలిసినదే కానీ నేను ఆలస్యంగా చూసిన మంచి బ్లాగ్..."
నీలాంబరి ".
నా "సినిమా పేజీ" బ్లాగ్లో శారదగారు రాసిన కామెంట్ వల్ల ఆ బ్లాగ్ తెలిసింది. వీరు చాలా కాలం నుంచీ బ్లాగుతున్నారని ఖజానా చూస్తే తెలిసింది. ఎన్నో జ్ఞాపకాలు, బోలెడు పుస్తకాలు, సంగీతం, సాహిత్యం..ఎన్ని కబుర్లో...చదివిన ప్రతి టపా ఈ బ్లాగర్ పట్ల అభిమానం పెంచేసింది.

"అంచేత నేను చెప్పొచ్చేదేంటంతే!!!!!!"
అంటూ చెప్పుకుపోయే ఈయన ఈ బ్లాగ్ మొదలు పెట్టింది చాలా కాలం క్రితమైనా టపాలు చాలా తక్కువగా రాస్తూంటారు. "SHANKY" పేరుతో బ్లాగే ఈయన రాసే పేరడీలు భలే చమత్కారంగా ఉంటాయి. ఆసక్తికరమైన ఈ బ్లాగ్లోని చాలా టపాలను నేనింకా చదవాల్సి ఉంది. మర్క్ చేసుకుని మరీ చదవాల్సినంత మంచి బ్లాగ్ ఇది.

అనుకోకుండా నకు కనబడ్డ బ్లాగ్ "
కలం కలలు(పాత బ్లాగ్)"
ఈ బ్లాగుని మూసివేస్తున్నాను...అంటూ ఫణీంద్ర అనే ఆయన రాసిన టపా ముందర కనబడుతుంది. చాలా మంది బ్లాగ్మిత్రులు రాసిన వ్యాఖ్యలు కూడా కనబడతాయి. ఎందుకు మూసేసారో తెలీదు కానీ పుస్తకాలూ,సాహిత్యం అంటూ ఎన్నో మంచి విషయాలను రాసిన ఈయన మళ్ళీ బ్లాగ్ తెరిస్తే బాగుండును అనిపిస్తుంది ఆ టపాలను చదువుతూంటే.

కొన్ని బ్లాగులు చదవాలంటే సాహిత్యం పట్ల కాసింత అవగాహన, భాషపై పట్టు ఉండాలి. అలాంటి ఒక బ్లాగ్ "
కలం కలలు"
పైన మెన్షన్ చేసిన బ్లాగ్ పేరూ, ఈ బ్లాగ్ పేరూ ఒకటే. మరి రెండీటికీ లింక్ ఉండా లేదా అన్నది వాళ్ళని అడగి తెలుసుకోవాల్సినదే. మేంఇద్దరం రాస్తున్నం అంటూ "మెహెర్, సంహిత" కలిసి రాసే ఈ బ్లాగ్ నాకు ఎంతో ముచ్చటగా అనిపించింది. సంహితగారు రాసే కవితలు ఎంతో భావయుక్తంగా చక్కని పదాల కూర్పుతో చదువుతూంటే తొలకరి జల్లుని, సంపెంగల సుగంధాన్ని గుర్తుకుస్తాయి. అంత మంచి కవితలవి. ఇక ఈ బ్లాగ్లో రాసే మిగతా సాహిత్యపు కబుర్లు కూడా సాహిత్యాభిమానులను ఆకర్షించేవిగానే ఉంటాయి.

"
MHS గ్రీమ్స్ పేట్ 76 -81 బ్యాచ్ మైత్రీ వనం"
రెండు రోజుల క్రితం చూసిన బ్లాగ్ ఇది. బ్లాగ్ పేరు విచిత్రంగా అనిపించి చూద్దామని వెళ్ళా. చిత్తూరు గ్రీమ్స్ పేట్ మునిసిపల్ హై స్కూల్ లో చదువుకున్న విద్యార్థులు తమ సహాధ్యాయులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉండేందుకు ఈ సైట్ నిర్మింపబడినది. అని రాసారు. చిన్నప్పటి గ్రూప్ ఫోటోలూ, కబుర్లూ చూసి వాళ్ళ నెట్వర్కకింగ్ ఐడియాకు సలాం చేసేసా. ఈ బ్లాగ్లో చిన్ననాటి ముచ్చట్లే కాక పాటలూ, సినిమాల తాలూకూ కబుర్లు కూడా ఉన్నాయి. ఈ బ్లాగ్లోని గ్రూప్ ఫోటోస్ అవీ చూసి నేను కూడా నా స్కూల్ డేస్ గుర్తు తెచ్చుకున్న...ఆ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారో...ఆటోగ్రాఫ్ బుక్ తీసి ఆ ఎడ్రస్సులకి ఉత్తరాలు రాస్తే జవాబులు వస్తాయా? అనిపించింది. అప్పట్లో ఫోన్లు కూడా అందరికీ ఉండేవి కాదు మరి. అడ్రసులే ఆధారం.

ఇక "ఇందు" గారి చేస్తున్న
"వెన్నెలసంతకం"
గురించి నేను కొత్తగా ఏం చెప్పేది? ఈవిడ తోటలోని సీతాకోకచిలుకలు బాగున్నాయి నా తోటలోకి కూడా పంపించమని అడిగాను...ఎప్పటికి పంపుతారో...! ఈ బ్లాగ్ రచయిత్రి కథలు కూడా చాలా బాగా రాయగలరు అని మొదటి కథతోనే నిరూపించేసుకున్నారు.



బ్లాగ్ మొదలెట్టింది క్రితం ఏడాది. రాసినవి ఆరో ఏడో టపాలు. "ఈ పేరు నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు" అని గోల పెట్టిన "శివరంజని"గారి పేరు మాత్రం బ్లాగ్లోకంలో మారుమ్రోగిపోతోంది.ఆద్యంతం హాస్యంతో నిండిన ఈ బ్లాగ్ల్ లోని అతి తక్కువ టపాలు మళ్ళీ ఎప్పుడు రాస్తారో అని ఎదురుచూసేలా చేస్తాయి.

ఇది మౌనరాగం కాదంటూ "మనసుపలికే" అపర్ణగారు ఆలపించే మధురమైన రాగాలు బ్లాగ్లోకమంతటా వినిపించేస్తున్నాయి. మా గోదావరి అమ్మాయిలు ఎక్కువైపోతున్నారే అని నేను సంబర పడిన బ్లాగ్ ఇది. ఇటీవలే ఈ బ్లాగ్లో పెట్టిన పాపికొండల ట్రిప్ ఫోటోలు అమాంతం గోదావరి దగ్గరకెళ్ళిపోయి ఆ సోయగాల్ని చూడాలనిపించేలా ఉన్నాయి.

"ఎన్నెల రామాయణం" అని మాలికలో చూసి అటువెళ్ళిన నేను ఆ వెన్నెల చల్లదనం చూసి మైమరచిపోయాను. అంత బాగుంటుంది ఆ చందమామ ఫోటో. టపాలు ఎక్కువ లేకపోయినా ఈ "ఎన్నెల" ఎందుకో మరి నా మనసు దోచేసింది. "వెన్నెల" పేరులో ఉన్న మేజిక్ అది. తెలంగాణా స్లాంగ్ లో ఈవిడ రాసిన ఎన్నెల రామయణం ఎంత చదువుదామని ఆత్రుత పడ్డా ఆ భాషరాక పట్టుమని నాలుగు లైనులైనా చదవలేకపోయాను..:( ఆ టపాలకు వచ్చిన వ్యాఖ్యలు ప్రశంసల వెన్నెలలు వెదజల్లాయి. ఈవిడ మరిన్ని మంచి మంచి టపాలు రాసి చిరునవ్వుల ఎన్నెలలు కురిపించాలని మనవి.

ఈ పల్లవులు కనుక్కోగలరా అని ఈ బ్లాగర్ విసురుతున్న సవాళ్ళు ఎన్నో పాత పాటలనూ, అంతే మంచి జ్ఞాపకాలనూ గుర్తుకు తెస్తున్నాయి. పాటలపై ఆసక్తి ఉన్నవారికి నచ్చే బ్లాగ్ ఇది. జ్ఞాపకాల గులాబీల పరిమళాలు అంటూ "
మెహక్
" గుర్తుచేసే పాటలు అన్నీ మధురమైనవే.


గోదారి సుధీర గారి "పాపాయ్" నేనీమధ్యన చూసిన బ్లాగుల్లో ఒకటి. ఖలీల్ జిబ్రాన్ మాటలతో స్వాగతం చెప్పే ఈ బ్లాగ్లో బెంగాలీ సాహిత్యంతో పరిచయమున్న ప్రతివారికీ ఇష్టమయ్యే "శరత్" ఇల్లు, ఇంకా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఉండే ప్రదేశం తాలూకూ కబుర్లు, కొన్ని కథలతో ఆసక్తికరమైన బ్లాగ్ ఇది.

టపాలు తక్కువగా ఉన్నా మంచి అభిరుచి ఉందే అనిపించే బ్లాగ్ "కలభాషిణి" . ఈ బ్లాగ్లో టపాలు చదివితే ఆ సంగతి అర్ధమౌతుంది.

జూన్ నుంచీ మొదలైన "శ్రీసుగన్ ధ్" బ్లాగ్లో కూడా ఆరేడు టపాలకు మించి లేవు. కానీ వీరు టపాలు ఎక్కువ రాస్తే బాగుంటుంది అనిపించేలా ఉన్నాయి 'కేకే'గారి టపాలు.


*****************************
చిగురించే కొత్త ఆశలతో
పెదవుల నవ్వుల హరివిల్లులతో
గెలుపుబాటనే పయనంతో
మధుర క్షణాల జ్ఞాపకాలతో
మీ మరొక సంవత్సరం
నిండాలని మనసారా కోరుతూ

బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో
తృష్ణ.

Thursday, December 30, 2010

గొల్లపూడిగారి "సాయంకాలమైంది"


గతంలో గొల్లపూడి మారుతీరావు గారు రాసిన "ఎలిజీలు" చదివాకా ఆ పుస్తకం గురించి రాయాలనిపించింది. ఇప్పుడు "సాయంకాలమైంది" చదివగానే నాకు కలిగిన ఆలోచనలు రాయాలనిపించింది. కాబట్టి ఈ టపా నవల చదవగానే కేవలం నాలో కలిగిన అభిప్రాయాల సారం. అంతే.

అన్ని నవలల్లోనూ సాహసకృత్యాలో, రొమాన్సో, జనోధ్ధరణో చేసే హీరోనే ఉండనఖ్ఖరలేదు. కొన్ని నవలల్లో కథను తన చూట్టూ తిప్పుకునే ఒక ముఖ్య పాత్రధారి కూడా ఉంటూంటాడు. అతడే "Protagonist". ఎవరిచుట్టు అయితే కథ మొత్తం తిరుగుతుందో, ఎవరివైపైతే మన సానుభూతి వెళుతుందో, కథలో ప్రాముఖ్యత ఏ పాత్రకైతే ఉంటుందో అతడ్ని Protagonist అంటారు. "శంకరాభరణం" సినిమాలో Protagonist "శంకరశాస్త్రి"గారైతే, గొల్లపూడిగారి "సాయంకాలమైంది" నవలలో Protagonist "సుభద్రాచార్యులు" గారు. సుభద్రాచార్యులుగారి మరణంతో మొదలైన కథ ఆయన పూర్వీకుల చరిత్ర, ఆయన జీవనపయనం ఎలా గడిచిందో మొదలైన విశేషాలతో నడుస్తుంది. కథలో మిగిలిన పాత్రలు బలమైనవే అయినా మొత్తం కథకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ సుభద్రాచార్యులుగారు.

ఇది ఒక Picturesque novel. అంటే చదివే ప్రతి దృశ్యం, సన్నివేశం కళ్ల ముందు జరుగుతున్నట్లు ఉంటుంది. కళ్ళకుకట్టినట్లున్న వర్ణన ఇది కల్పితం కాదేమో ఎక్కడైనా నిజంగా జరిగిన కథేమో అనిపిస్తుంది. టైటానిక్ సినిమాలో సినిమా అయిపోయాకా పాడుబడిన షిప్లోంచి షాట్ మళ్ళీ లోపలికి వెళ్ళి అందరూ ఆడుతూ పాడుతూ ఉండే దృశ్యాన్ని చూపిస్తారు. అలాగ ఈ నవల చదవటం అయిపోయాకా అందులో పాత్రలన్నీ టాటా చెబుతూ వెళ్పోతున్నట్లు అనిపించింది. 2001లో ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో సీరియల్ గా వచ్చినట్లు పుస్తకంలో రాసారు. కానీ అప్పటికీ ఇప్పటికీ తమ పిల్లలు విదేశాలలో ఉండే చాలామంది తల్లిదండ్రుల పరిస్థితి ఏమీ మారలేదని ఇంకా దిగజారిపోయిందనే అనిపించింది నాకు.

కథలో నా ఆసక్తి అంతా సుభద్రాచార్యులుగారి పైనే ఉండిపోయింది. ఒక సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తూ, చిన్ననాటి నుంచీ దాన్ని కాపాడుకోవటానికి ఆయన పడే ఆరాటం, తాపత్రయం, అది కాపాడుకోలేకపోతున్నప్పుడు ఆయన పడే మానసిక వేదన ప్రత్యేకంగా వర్ణించకపోయినా పుస్తకం చదువుతున్నంత సేపూ ఆ భావనలు మన అనుభూతికి అందుతాయి. సాంప్రదాయాన్ని కాపాడాలని కాకపోయినా తండ్రిని బాధపెట్టకూడదని, సదాచారానికి ఏ లోటూ రాకుండా కాపాడిన పెదతిరుమలాచార్యులవారి పారంపర్యం సుభద్రాచార్యులుగారు స్వీకరించినట్లు అతని కుమారుడు తిరుమల కొనసాగించలేకపోతాడు. తల్లి మరణించినప్పుడు అతనిలో కలిగిన ప్రకంపనలు తండ్రి మరణం సమయానికి ఉండవు. తండ్రి కర్మకాండలకు ఎప్పుడో తీసేసిన యజ్ఞోపవీతాన్ని వేయించి కర్మకాండంతా జరిపించటం బాధను కలిగిస్తుంది. ఆ వాక్యంతోనే నవలలో రచయిత చెప్పదలుచుకున్న విషయం అర్ధమైపోతుంది. పెట్టిన నవలాశీర్షికకు అర్ధం గోచరమౌతుంది.

వరదమ్మ కాలంచేసాకా "సుభద్రాచార్యులవారి కథకు కాళ్ళు చేతులు లేవు" అంటారు రచయిత. ఆయన జీవితంలో ఆమె లేని లోటు ఆ ఒక్క వాక్యం చెబుతుంది. "మడిబట్ట ఆరవేసుకోవటం కొత్త...నళీనాక్షమాల పెరిగిపోతే నల్లదారంతో అతుకులు వేసుకోవటం కొత్త" "ఏభైఏళ్ళు అలవాటైన పిలుపు పిలిస్తే వరద పలకకపోవటం కొత్త" లాంటి వాక్యాలు భార్యను పోగొట్టుకున్న భర్త ఏం కోల్పోతాడో తెలుపుతాయి. ఇద్దరు పిల్లల్ని కని కూడా చివరిరోజుల్లో అలా ఒంటరిగా, వండిపెట్టే దిక్కులేని దీనస్థితిలో ఉన్న ఈ నిష్ఠాగరిష్ఠులు జీవితంలో సాధించిందేమిటి? అనిపిస్తుంది. అంతవరకూ కాస్తో కూస్తో అభిమానం ఉన్న ఆయన పిల్లలపై కోపం వస్తుంది. రెక్కలు రాగానే కష్టనష్టాలు భరించి పెంచిన తల్లిదండ్రులను మరిచి ఎగిరిపోయే కృతజ్ఞత, బాధ్యత తెలీని పిల్లలపై కోపం వస్తుంది.

ఈ ఉత్కృష్టమైన కథలో ఉదాత్తమైన పాత్ర ఎవరిదైనా ఉందీ అంటే అది సంజీవి పాత్ర.. ఉన్నతమైన వ్యక్తిత్వంతో నిండిన ఆ పాత్ర బరువు మిగిలిన పాత్రల మంచితనాన్ని ఆక్రమించేస్తుంది. పెళ్ళి రోజు బహుమతిగా నవనీతాన్ని తిరుమలతో మాట్లాడించినప్పుడే అతని వ్యక్తిత్వం ఆకాశం అంత ఎదిగిపోతుంది. మరొకరిని ప్రేమించే స్త్రీని మనస్ఫూర్తిగా తనదాన్నిగా చేసుకోవటం, జీవితాంతం అదే అనురాగాన్ని, అభిమానాన్ని అందివ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఉద్రేకాలు, భేదాలు, ఖేదాలు లేని తృప్తి నిండిన ఆదర్శప్రాయమైన జంట వాళ్లది. మనస్థైర్యం, జీవనవేదాంతం ఉండాల్సిన పాళ్లలో ఉన్న నిండుకుండ నవనీతం పాత్ర.. తనపై జరిగిన అత్యాచారం తన శరీరానికే గానీ మనసుకు, ఆత్మకూ కాదన్న సత్యం అర్ధం అయిన స్థితప్రజ్ఞత నవనీతానిది. తిరుమలతో ఆమెకున్న అనుబంధం ఆత్మబంధం. వాళ్ళిద్దరూ ఆత్మబంధువులు. అంతే. కళ్ళు లేని "నారిగాడిని" పెంచుకుందానని భర్తను అడిగిన ఆమె కోరికలో మరొక బిడ్డ అనాథగా పెరగకూడదన్న సద్భావం కనబడుతుంది.

తల్లిని, చెల్లెలిని గొప్పగా అభిమానించి, ప్రేమించే తిరుమల తండ్రిపై గౌరవాభిమానాలున్నా వాటిని నిలబెట్టుకోలేని అసమర్ధునిలానే కనిపిస్తాడు. తరతరాలుగా మహోన్నతంగా కాపాడబడి వెలిగించబడిన శ్రీవైష్ణవ ఆచారం, సాంప్రదాయం అతని హయాంలో సన్నగిల్లుతుండగా చూసి బాధపడని పాఠకుడు ఉండడేమో. ఎంత వయసు ప్రభావం అని సరిపెట్టుకుందామన్నా శ్యామల విషయంలో అతని తొందరబాటూ, అమెరికాలో పాడ్ తో ప్రేమాయణం తిరుమల పాత్రలోని గాంభీర్యాన్ని పోగొడతాయి. నవనీతం వంటి ఉత్తమురాలితో అతని వివాహం జరగకపోవటమే మంచిదయింది అనిపిస్తుంది. సంజీవి తరువాత నన్ను ఆకర్షించిన మరో పాత్ర కూర్మయ్యది. విద్య వివేకాన్నీ, వినయాన్ని ఇస్తుందన్న వాక్యానికి ఉదాహరణ ఈ పాత్ర.. నవలలో కన్నతల్లిగా వరదమ్మ చూపెట్టిన పుత్రవాత్సల్యం సహజమైనదే. కానీ తండ్రుల్లో కూడా కన్నతల్లికి మించిన పుత్రవాత్సల్యాన్ని "రేచకుడు" పాత్రలో చూసి మనసు ఆర్ద్రమౌతుంది.

తిరుమల ఉన్నతికీ, అతనిలోని ప్రతిభ బయటకు రావటానికీ కారణభూతుడైన వెంకటాచలం ఎంత మంచిపని చేసాడనిపించినా, చివరలో అతనికి వచ్చిన వ్యాధి, కష్టాలు చదివితే నిష్ఠాగరిష్ఠులైన సుభద్రాచార్యులు వంటి అమయక వైష్ణవుడిని మోసం చేసిన పాపమే అదని అనిపిస్తుంది. ప్రేమ ఎంత గొప్పదైనా తల్లిదండ్రుల గౌరవప్రతిష్ఠలను గాలికి వదిలేసి కూర్మయ్యను వివాహమాడిన ఆండాళ్ళు పాత్ర కూడా అటువంటిదే. తండ్రి పార్ధివశరీరాన్ని దగ్గర నుంచి చూసి, ఆఖరి నమస్కారం చేసుకోలేని దుస్థితి స్వయంకృతమే. కానీ "To err is human" కదా. అందుకనేనేమో మనకు కూడా perfection ఉన్న పాత్రల కన్నా పొరపాట్లు చేసే పాత్రల పట్లే సానుభూతి, దగ్గరితనం కలుగుతుంది. ఎందుకంటే అవి సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలు కాబట్టేమో. అలా సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రల్లో మనల్ని మనం పోల్చుకోవటం వల్లనేమో చాలా నవలలు, వాటిల్లోని పాత్రలు మనకు గుర్తుండిపోతాయి.

"భరించరాని దు:ఖం మనిషిని ఆవరించినప్పుడు ఎండు జరుగుతాయి. వేదన గల మనిషి పిచ్చివాడయినా అవుతాడు. అంత:కరణ గల వ్యక్తి ఊహించని మలుపుతో ఏకోన్ముఖుడౌతాడు."
"కన్నీళ్ళు ఆర్ద్రతకీ, అభిమానానికీ, క్షమాపణకీ, పశ్చాత్తాపానికీ, ప్రేమకీ, ఆవేశానికీ అన్నిటికీ నిదర్శనమనే సంస్కృతిని చాలా చిన్నతనంలోనే నష్టపోయిన దురదృష్టవంతుడతను";
"ఇంకా సెంటిమెంటుకు దూరం కాని 22ఏళ్ళ నల్ల పిల్ల";
"కొత్త ఆకర్షణలు అలవాటయి, అవసరమయి, వ్యసనమయి, వదులుకోలేని లంపటమయి...";
"మేధస్సు అగ్నిశిఖలాంటిది. దాని ఆకర్షణకి లోనైన ఏ పదార్ధాన్ననినా అది జీర్ణం చేసుకుంటుంది."
"మృత్యువు కొందరికి విముక్తి, కొందరికి విజయం, కొందరికి ముగింపు, కొందరికి అవకాశం" మొదలైన నవలలోని ఎన్నో వాక్యాలు గొల్లపూడిగారి జీవితాన్ని, మనుషులనూ ఎంత బాగా అర్ధం చేసుకున్నారో తెలుపుతాయి. శ్రీవైష్ణావ సాంప్రదాయాన్నీ, పధ్ధతుల్నీ ఎంతో శ్రధ్ధతో తెలుపుతూ రాసిన రచనావిధానం ముచ్చటగొలుపుతుంది. అయితే అక్కడక్కడా కథలో చోటు చేసుకున్న కొన్ని "వర్ణనలు" అవసరమా అనిపించాయి. బహుశా ఒక వారపత్రికలో సీరియల్ కోసం రాసినదవటం వల్ల ఆ విధంగా రాయాల్సివచ్చిందేమో మరి. అటువంటి వర్ణనలు, సన్నివేశాలు లేకపోయినా ఈ ఉత్కృష్టమైన కథకు వచ్చే లోటేమీ లేదనిపించింది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.

చదివిన చాలాకాలం మనసు పొరల్లో గుర్తుండిపోయే కథ, పాత్రలు రెండూ ఈ నవల ప్రత్యేకతలే. కేరెక్టర్ ఎనాలసిస్ కు ఉపయోగపడేలాంటి రకరకాల స్వభావాలు గల పాత్రలున్న ఈ నవలను పిజీ స్టూడెంట్స్ సిలబస్ లో ఒకపుస్తకంగా చేరిస్తే బాగుంటుండేమో అని కూడా అనిపించింది. అలాంటి ప్రతిపాదన ఇప్పటికే ఉందేమో తెలీదు మరి.

Wednesday, December 29, 2010

ఆత్మ బంధువు(1985)


"మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు
జీవితం కానే కాదు
మమతనే మధువు లేనిదే చేదు.."

జానకి గొంతులో వినిపించిన ఈ పాట ఎన్నో స్మృతుల్ని నిద్ర లేపింది. ఈ సినిమా పాటలు బ్లాగ్లో పెడదాం అనిపించింది. చిన్నప్పుడు స్కూల్లో ఉండగా ఒకసారి టివీలో వస్తే చూసిన సినిమా ఇది. కానీ రాధ పాత్ర, సినిమా కథ, సినిమాలోని పాటలు బాగా గుర్తుండిపోయాయి. తరువాత సినిమా పాటలు సొంతంగా రికార్డ్ చేయించుకునే స్టేజ్ కి వచ్చాకా పాటలన్నీ రికార్డ్ చేయించుకున్నాను. రాధకు తాను చేసిన సినిమాల్లో, నటనకు ప్రాధాన్యత ఉన్న అతి తక్కువ పాత్రల్లో ఈ సినిమా ఒకటై ఉంటుందని నేననుకుంటూ ఉంటాను. శివాజీ గణేషన్ నటన గురించి కొత్తగా చెప్పేదేం లేదు. పాటలు మాత్రం పక్కా ఇళయరాజా మార్క్ తో కళాకళాలాడుతూ ఇప్పటికీ పచ్చగా మురిపిస్తూ ఉంటాయి. అంతే చక్కని సాహిత్యం పాటలకు జీవం పోసింది. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన మరో మంచి చిత్రమిది.


సినిమా చూసి ఇన్నాళ్ళైనా అందమైన రాధ,ఆద్భుతమైన ఆమె నటన, మంచి పాటలు, వాటికి సరిపోయే సాహిత్యం..ఇవే నాకు గుర్తుండిపోయినవి."muthal mariyathai" పేరుతో తమిళంలో వచ్చిన ఈ సినిమా 1985 నేషనల్ అవార్డ్స్ లో ఆ ఏటి బెస్ట్ రీజనల్(తమిళ్) ఫిల్మ్ గానూ, బెస్ట్ లిరిసిస్ట్(తమిళంలో) సిల్వర్ లోటస్ అవార్డ్ లను పొందింది. కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే పేచీకోరు, గయ్యాళీ అయిన భార్యతో విసిగివేసారిపోయిన ఒక గ్రామ పెద్దకు, ఒక పడవ నడిపే అతని కూతురితో ఏర్పడిన స్నేహం, ఆ స్నేహం వల్ల వాళ్ళ జీవితాల్లో ఉత్పన్నమైన అలజడులు ఏమిటి అన్నది కథ. స్ట్రైట్ తెలుగు సినిమా కాకపోయినా కథా బలం, అద్భుతమైన సంగీతం ఈ సినిమాకు ప్రాణాలు.

ముఖ్యంగా ఒక 'మ్యూజికల్ హిట్' గురించి రాయాలనుకున్నాను కాబట్టి సినిమాలోని కొన్నిపాటల లింక్స్ క్రింద చూసి, విని ఆనందించండి.

మనిషికో స్నేహం మనసుకో దాహం
మమతనే మధువు లేనిదే చేదు







మూగైన హృదయమా
నీ గోడు తెలుపుమా
ఓదార్చి తల్లివలె లాలించే
ఎడదను ఇమ్మని అడుగుమా..




నీదాన్నీ ఉన్నాననీ నా తోడై నువ్వున్నావనీ
గుండెలోనా ఉన్నా ఊసు..






పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
ఆహా నా మావ కోసం..





ఇంకా "నేరేడు తోటంతా" అనే పాట, "ఏ గువ్వ చిట్టి గువ్వ" అనే పాట కూడా బాగుంటాయి.

ఈ songs "రాగా.కామ్"లో ఇక్కడ వినచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలంటే లింక్ ఇక్కడ

Tuesday, December 28, 2010

"ళృ ...ళౄ"



గుణింతం గుర్తులు
 మధ్యనే నేను మా పాపతో పాటూ గుణింతం గుర్తులు నేర్చుకున్నాను. తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము etc..etc.. అంతవరకూ బానే ఉంది. చిన్నప్పటివి ఎలానూ గుర్తులేవు. మళ్ళీ నేర్చేసుకోవటం అయ్యింది. అక్షరాలు కూడబలుక్కుని పేపర్లో హెడ్డింగులు, ఏదైనా కథల పుస్తకంలో వాక్యాలు చదివిస్తూంటే చక్కగా చదువుతోంది పాప. అది చూసి రెండు కాకులమూ("కాకి పిల్ల..." సామెత ప్రకారం) చాలా ఆనందిస్తున్నాం.


ఇక గుణింతాలు రాయటం, పలకటం నేర్చుకుంటున్నాం(నేనూ,పాప). దాదాపు అన్ని గుణింతాలు వచ్చేసాయి. "" నుంచి "" వరకూ, ఆఖరుకి "" "క్ష" గుణింతాలు కూడా పలకటం వచ్చేసాయి. కానీ ఒక్క గుణింతం మాత్రం నాకు పలకటం రావట్లేదు. అది కూడా మొత్తం కాదు. రెండే రెండు అక్షరాలు. అదీ "" గుణింతం. , ళా, ళి, ళీ, ళు, ళూ వరకూ వస్తోంది ఇకపై నాలిక పలకటం లేదు... "ళృ ...ళౄ" నేను పలికిన తీరు చూసి మా పాప పడీ పడీ నవ్వుతోంది...:(

మీకెవరికైనా పలకటం వస్తోందేమో కాస్త చెబుదురూ...

Monday, December 27, 2010

మన్మథబాణం


* చాలా రోజుల తరువాత వ్యక్తిత్వం ఉన్న ఒక హీరోయిన్ ను చూడాలంటే
* పేరిస్, బార్సిలోనా, వెనిస్ మొదలైన అందమైన ఫారెన్ సిటీల్లో చిత్రీకరణ
* అందమైన లొకేషన్స్, నీట్ అండ్ క్లీన్ రోడ్స్ అండ్ fast మూవింగ్ ట్రైన్స్
* తనదైన స్టైల్లో smart even in his fifties అనిపించే సహజనటుడు కమల్ కోసం


* చిత్రంలో లీనమయ్యేలా చేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం
* వెకిలి హాస్యం, మితిమీరిన హింస, ఓవర్ ఎక్స్పోజింగ్ లేని cool movie కావాలంటే
* డబ్బింగ్ సినిమా అయినప్పటికీ అర్ధమవుతూ నవ్వు తెప్పించే సంభాషణల కోసం
* చాలా రోజుల తరువాత హాయిగా నవ్వుకోవాలంటే
* ప్రేక్షకులు ఊహించలేనన్ని ట్విస్ట్ లతో పిచ్చెక్కించే తిక్క కధలు వద్దనుకునే వారు
* ఒక మామూలు సాధారణమైన ప్లైన్ కథ కావాలనుకునేవారు
* మాధవన్ sweet smile ఇష్టమైనవారు(ofcourse, ఈ సినిమాలో అవి ఎక్కువగా లేకపోయినా)
* రొటీన్ సినిమాలు చూసీ..చూసీ....బోర్ కొట్టినవాళ్ళు ఓ సినిమా చూసి బాగుందనుకోవాలంటే
* నటనకు అవకాశం ఉన్న పాత్రలో సంగీత ను చూడాలనుకుంటే


చూడాల్సిన చిత్రం "మన్మధబాణం". ముత్తు, సూర్యవంశం మొదలైన సూపర్ డూపర్ హిట్స్ తీసిన ప్రఖ్యాత తమిళ దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ గతంలో కమల్ హాసన్ తో భామనే సత్యభామనే, తెనాలి, పంచతంత్రం, దశావతారం మొదలైన సినిమలు తీసారు. మళ్ళీ కె.ఎస్.రవి కుమార్, కమల్ కాంబినేషన్ తో ఇటివలే రిలీజైన రొమాంటిక్ కామిడీ "మన్మథబాణం". ఇవాళ్టి రోజున తెలుగు సినిమాల్లో లోపించిన సహజత్వం నాకు ఈ సినిమాలో కనిపించింది. డబ్బింగ్ సినిమాలు సాధరణంగా నేను చూడను. ఈ సినిమాలో కూడా లోపాలు ఉన్నాయి. కానీ, సినిమాలోని ప్లస్ పయింట్స్ చూసుకుంటే ఈ లోపాలు చిన్నవిగా కనబడతాయి.

కొన్ని లోపాలు చెప్పాలంటే:

* ప్రముఖ విలక్షణ గాయని "ఉషా ఉతుప్" వేయక వేయక ఇలాంటి అత్తగారి పాత్ర వేయటమేమిటి అని నవ్వు పుట్టిస్తుంది.
* కథనంలో ఉన్న స్లోనెస్ అప్పుడప్పుడు బోర్గా ఉందా అనిపించేలా చేస్తుంది.
* చివరలో మాధవన్ కూ, సంగీత కు కుదిర్చిన లింక్ చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
* రెండవ భాగంలో ఒక పాయింట్ లో కన్ఫ్యుజన్ బాగా ఎక్కువైంది అనిపిస్తుంది.
* అక్కడక్కడ క్లోజప్స్ లో కమల్ ఏజ్ కనబడినప్పుడు కాస్త కాన్షియస్ గా ఉండకూడదూ(ఐ మీన్ ఫేస్ యంగ్ గా కనపడటానికి) అన్పిస్తుంది.
* చివరలో బోట్ సీన్స్ దగ్గర పాత్రలతో పాడించిన కొన్ని సినిమా పాటల పల్లవులు డబ్బింగ్ కు సరిపోయేలా అతికినట్లు స్పష్టంగా తెలిసిపోయాయి.
* మాధవన్ ఫోన్ ఫ్రెష్ రూంలో జారిపడడం లాంటి తమిళ ప్రేక్షకులకు అలవాటైన, వాళ్ళకు హాస్యమనిపించే కొన్ని సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.



సినిమాలో నాకు నచ్చినవి:

* చాలా రోజుల తర్వాత డాన్స్ లు చేయటం, చాలీచాలని బట్టలతో ఎక్స్పోజింగ్ చేయటం తప్ప పెద్దగా ప్రాముఖ్యత లేని హీరోయిన్ ని కాక కాకుండా కాస్త ఆలోచన, విచక్షణ ఉన్న హీరోయిన్ కథలో ఉండటం.
* ఒక పాట మొత్తం రివర్స్ షాట్స్ తో తీయటం చాలా బాగుంది.
*"భూషణమా? పేరు ఓల్డ్ గా లేదు అన్నప్పుడూ కమల్ అనే "అంబుజం.. కన్నానా";

"అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే చాలండీ." "అబ్బే నాకీ ఉడకడాలూ అవీ తెలీదు. నేను ప్రెషర్ కుక్కర్. ఒక్క విజిల్.. అంతే." లాంటి కొన్ని కొన్ని డైలాగులు,
* స్త్రీల చిత్త ప్రవృత్తి గురించి మాధవన్ చెప్పే డైలాగ్ లు,

* అప్పుడప్పుడు పిల్లల ప్రవర్తన గురించి, మగవారి నైజం గురించీ సంగీత చెప్పే డైలాగులు,
* ప్రొడ్యూసర్ కురుప్, అతని భార్య (వాళ్ళున్న ప్రతి ఫ్రేం)
* సంగీత పిల్లవాడి డైలాగులు
* మాధవన్ కూ, త్రిష కూ సినిమా మొదట్లో జరిగే ఘర్షణ తాలూకు డైలాగులు
* "ఏం మాయ చేసావే" సినిమాలో హీరోయిన్ కు డబ్బింగ్ చెప్పిన వాయిస్ తోనే ఈ సినిమాలో త్రిషకు చెప్పించారు. స్వచ్ఛమైన తెలుగు పలకకపోయినా ఆ వాయిస్ లోని మెత్తదనం, మాట విరుపు అన్నీ నాకు బాగా నచ్చేసాయి.
* మాధవన్ కు అబధ్ధం చెప్పాకా కమల్ పాడే పాట సాహిత్యం, ఆ పాట లోని కమల్ డాన్స్
* కమల్ నటనకు అతికినట్లు ఉండే బాలూ డబ్బింగ్


ఈ సిన్మా గురించి ఇంకా ఏం చెప్పాలంటే:ఈ మధ్యన భారీ బడ్జట్లతో తీసిన మూడు కొత్త సినిమాలు చూసి కొత్త సినిమా అంటేనే భయం పట్టుకుంది. చివరిగా నెల క్రితం చూసిన ఒక సినిమాలోంచి అయితే వెళ్పోదాం అని లేచి వచ్చేసాను. జీవితంలో మొదటిసారి థియేటర్ లోంచి నేను బయటకు వచ్చిన సినిమా అది. అలాంటిది ఈ సినిమా చూస్తూంటే కొన్న టికెట్ కు పూర్తి న్యాయం జరిగింది. అనిపించింది. చూడగానే "అబధ్ధం" పాట గుర్తుకు తెచ్చే సంగీత ను మరి కాస్తంత బొద్దుగా చూడ్డం ఇబ్బందే అనిపించినా ఆ పాత్రకు ఉన్న వైటేజ్ మన దృష్టిని పాత్ర తాలూకు నటన వైపుకే లాగుతుంది.సినిమా మొదట్లో కాస్త లావుగా కనిపింఛిన కమల్, సంగీత ఇద్దరూ తరువాతి సీన్స్ లో కాస్త సన్నబడ్డట్టు కనిపిస్తారు.సంగీత నటన అప్పుడప్పుడూ ఓవర్ అనిపించినా మొత్తమ్మీద బాగా చేసిందనిపిస్తుంది. త్రిష నటన కూడా బాగుంది. కథంతా కమల్, త్రిష, సంగీతల చుట్టూ ఉండటంతో మాధవన్ కు పెద్దగా నటనకు చాన్స్ లేదు.

కమల్ అదివరకూ కూడా సినిమాల్లో పాటలు పాడారు. అయితే ఈ సినిమాలో పాడిన రెండు పాటల్లో వాయిస్ క్వాలిటీ పెరిగినట్లు అనిపించింది. దేవీశ్రీప్రసాద్ ఒక పాటలో ఓ చోటెక్కడో తళుక్కుమన్నారు. పాటలు బానే ఉన్నాయి కానీ నాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే బాగుంది. "అనుమానం" మనిషిని ఎంత హీనమైన స్థితికి దిగజారుస్తుందో, దానివల్ల మనిషి ఏం పోగొట్టుకోగలడో మధవన్ పాత్ర బాగా తెలియజేస్తుంది. నాకు బాగుంది కానీ ఫార్ములా సినిమాలకూ, మూస సినిమాలకు అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షక్లులకు ఈ సినిమా నచ్చుతుందా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే మరి తొడ కొడితేనో చిటిక వేస్తేనో విలన్ గానీ రౌడీలు కానీ అల్లంత దూరాన ఎగిరిపడే సీన్లూ్; జీపులూ,బస్సులూ తగలబడే సీన్లూ; రక్తం ఏరులా పారే వెర్రి హింస ఈ సినిమాలో లేవు మరి.

"సతీ లీలావతి" అంతటి పూర్తిహాస్యభరిత చిత్రం కాకపోయినా చూసాకా "బాగుంది. చాలా రోజులకు ఒక మంచి(డబ్బింగ్) సినిమా చూసాం" అని తప్పక అనిపిస్తుంది. క్రితం నెల జయప్రదం(లోకల్)లో ప్రసారమైన కమల్ ఇంటర్వ్యూ చూసాకా ఇప్పటివరకూ అన్నయ్య అభిమాన నటుడిగానే నాకు నచ్చే కమల్ ఒక అసాధారణ వ్యక్తిగా నాకు అనిపించాడు. పర్సనల్ రిలేషన్స్ సంగతి ఎలా ఉన్నా హీ ఈజ్ డెఫినేట్లీ ఏ గుడ్ హ్యుమన్, ఏ నాలెడ్జబుల్ మేన్ అనిపించాడు. నిన్న రాత్రి సినిమా చూసాకా నాకనిపించినవన్నీ రాసేసాననే అనుకుంటున్నాను...:)

Sunday, December 26, 2010

(గడచిన)కాలానికి కృతజ్ఞత


T.S.Eliot ఒక poemలో "I have measured out my life with coffee spoons.." అని చెప్పినట్లుగా చెప్పాలంటే నేనొక సగటు వ్యక్తిని మాత్రమే. కానీ నేను నా ఆలోచనలనూ, కొన్ని జీవిత సంఘటనలనూ ఇలా బ్లాగులో గొప్పకో సరదాకో రాయను. నేను తెలుసుకున్న సత్యం మరెవరికైనా ఉపయోగపడుతుండేమో అని రాస్తాను. అది అర్ధమయ్యేవారే 'తృష్ణవెంట' నడుస్తారు. వణికించే చలి వాకిట తిరుగుతున్న ఈ పొద్దుటి పూట ఓసారి ఈ ఏడాది ఎలా గడిచిందా అని వెనక్కి తిరిగి చూసాను..

కాలం గిర్రున తిరిగింది అంటూంటారు కధల్లోనూ నవలల్లోనూ. జీవితంలో మొదటిసారి అది ప్రాక్టికల్ గా తెలిసింది ఈ సంవత్సరంలో. ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోయిందో తెలియలేదు ఈ ఏడాది. ఇక నాలుగురోజులు మిగిలి ఉంది. ఈసారి మొదటి రెండు మూడు నెలల తరువాత డైరీ ముట్టుకున్నదే లేదు. అయితే ఇది అలా వెళ్ళిపోవటమే బాగుంది. ఎందుకంటే ఈ ఏడాది విధి నాకు చూపించిన విశ్వరూపం బహుశా నే ఎప్పుడూ చూసి ఎరుగను. రోజులు తెలిసేలా గడిస్తే వాటి భారాన్ని మోయటం కష్టమే. ఈ ఏడు నేను చూసినది పదినెలల అమావాస్యని. కోల్పోయినవి ఎన్నో...ఒక నమ్మకాన్ని, ఒక నిజాన్ని, ఒక అనుభూతినీ, ఒక గౌరవాన్ని...ఎన్నింటినో. ఇంట్లో జరిగిన అనర్ధాలు కూడా ఎన్నో పాఠాలు నేర్పించాయి. చేతికొచ్చిన పంట కళ్ళెదురుగా నష్టపోతూంటే విలవిల్లాడిన రైతు సోదరుల్లాగ, నా ఆశలు ఫలించబోయే తరుణంలో జరిగిన అనర్ధం నా చైతన్యాన్ని వేళ్ళతో కుదిపేసింది. ఒకటి రెండు కాదు...మూడో నష్టం. ఒక ఆరని మంటని రగిల్చింది. మిగిలిన సంఘటనలు అయితే నాలోని వివేకాన్ని, వివేచననీ తొక్కివేసాయి. నమ్మకం అన్న పదానికున్న నమ్మకాన్నే పోగొట్టాయి.

కాలం ఎంత మధురమైనదో అంత జాలిలేనిది కూడా. మన కోసం ఎక్కడా ఆగదు. తన దారిన తాను పోతూ ఉంటుంది. విచిత్రమేమిటంటే కాలం చేసిన గాయాలకు కాలమే మందు. మొన్నలా నిన్న, నిన్నలా ఇవాళ అసలు ఉండనే ఉండవు. ఇదే సృష్టి రహస్యమేమో మరి. నేనూ ఆ సూత్రానికి లొంగిపోయను. లేచి నిలబడ్డాను. ఈసారి మరింత జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మళ్ళీ నడవటం మొదలెట్టాను. కాలం నేర్పిన పాఠాలు మననం చేసుకుంటూ. కొత్త పాఠాలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ.

నిలబడటానికి మరో చేయి అవసర మౌతుందేమో అనుకున్న క్షణం నిర్ణయించుకున్నాను no more help..అని. "ఇంతా తెలిసియుండి.." అని పాడినట్లు ఇంతకాలం, ఇన్నేళ్ళు జీవించాకా ఇంకా ఊతం కోసం ఎదురుచూడటం మూర్ఖత్వమే. పేజీలు తిప్పబడిన కేలండర్లు, పెట్టె నిండిన పాత డైరీలు నేర్పిన అనుభవల పాఠాలు మర్చిపోతే ఎలా? దారిలో వచ్చిన ప్రతి అడ్డంకి దగ్గరా ఆగిపోతే గమ్యం ఎప్పటికైనా చేరతామా? nobody can help us untill we help ourselves అని ఎప్పుడో చెప్పారు కదా. రేపు ఎప్పుడూ ప్రశ్నార్ధకమే. ఇక ఇవాళలో జీవించకపోతే ఇన్నాళ్ల జీవితం ఎందుకు? అనుకున్నాను. and then...i stood up. జీవితాన్ని ఆస్వాదించటానికి ఏవైతే చెయ్యగలనో అవన్నీ చేసాను..చేస్తున్నాను... finally iam here writing my blog posts. మళ్ళీ అసలు తెరవననుకున్న బ్లాగ్ రెండునెలలలోపే తెరిచాను. రాస్తూనే ఉన్నాను. రాస్తూనే ఉండాలనుకుంటున్నాను..ప్రస్తుతానికి...:)

అయితే ఇన్ని గాయాలు చేసినా ఈ సంవత్సరానికి నేనెంతో ఋణపడిపోయాననిపిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు నేర్పిన పాఠాలు చాలా విలువైనవి. నన్ను కొంతైనా ప్రాక్టీకల్ గా తయారుచేసింది. నాలో గొప్ప మార్పుని తెచ్చింది. అది నేను నిలబెట్టుకోవాలి. కాలం మామూలుగా గడిచిపోయి ఉంటే ఈ మర్పు వచ్చేదే కాదు. అందుకే నన్నెంతో బాధపెట్టి మనసు విరిచేసిన ఈ సంవత్సరం అంటే నాకు ఎంతో కృతజ్ఞత.




==========================================
note:ఈ టపా కేవలం ఈ సంవత్సరం గురించిన నా మనోభావాలే తప్ప నేనేవిధమైన వ్యాఖ్యలనూ ఆశించి రాయలేదు. అందువల్ల కామంట్ మోడ్ తొలగిస్తున్నను.ఇప్పటిదాకా కామెంట్లు రాసినవాళ్ళకు ధన్యవాదాలు.