సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, September 27, 2010

ఆనాటి జ్ఞాపకాలు నా ఆనంద నిధులు...!!

చిన్ననాటి కబుర్లు ఎన్ని చెప్పుకున్నా తనివితీరదు. ఆనందాన్నిచ్చే మధురమైన జ్ఞాపకాలను తలుచుకున్న కొద్దీ మనసు పసిపాపలా మారిపోయి ఆ జ్ఞాపకాల దొంతరల్లో పరుగులు పెడుతుంది. జ్యోతిగారు "గుర్తుకొస్తున్నాయి.." అనే శీర్షికతో రాయమని అడిగినప్పుడు, చిన్నప్పటి జ్ఞాపకాల గురించి రాయాలని అనుకున్నా.. కానీ అన్నింటిలో వేటి గురించి రాయాలి...అని ఆలోచిస్తే దేన్నీ వదలాలనిపించలేదు. అందుకనే నా అందమైన జ్ఞాపకాల్లో ముఖ్యమైన కొన్నింటిని కలిపి ఇలా ఓ చోట పోగేసాను...

























గోదారిఒడ్డూ...జన్మనిచ్చిన రాజమండ్రీ...
తాతగారిల్లూ...పెద్ద గేటు
మెట్లమీదుగా రేకమాలతి పందిరి
జ్ఞాపకాల్లోనూ మత్తెక్కించే ఆ పూల పరిమళం
దొంగా పోలీస్ ఆటలు, పరుగులూ
పాపిడీ బండి, రిబ్బన్లబ్బాయ్...

విజయవాడ వీధులూ...సూర్యారావుపేట
భాస్కరమ్మగారిల్లు...పక్కింటి తాతగారూ...
పెరడు, మొక్కలు, పక్కింటి పిల్లలు
అడుకున్న ఆటలూ, గోడల మీద విన్యసాలు
చింతల్లేని చిన్నతనం...తిరిగిరాని అమాయకత్వం




















సర్కార్ ఎక్సప్రెస్...కాకినాడ ప్రయాణాలు
రామారావుపేట..శివాలయం ప్రదక్షిణాలు
తాతమ్మా,నానమ్మల కథలు కబుర్లు
అన్నయ్యతో షికార్లు...గాంధీపార్క్ సాయంత్రాలూ
దొడ్లో మొక్కలూ...సంపెంగిపువ్వులూ
సన్నజాజిమాలలు...గిన్నెమాలతి అందాలు
సొంత ఇల్లు అందం...మహారాణీ భోగం..
గేటు దగ్గరి నైట్ క్వీన్ పూల సుగంధం...


మన్ చాహేగీత్ పాటలూ...నాన్నతో ముచ్చట్లు
టేపులూ....రికార్డింగులూ...ఆకాశవాణి స్టూడియోలూ
నిర్వహించిన యువవాణి కార్యక్రమాలు...
చెప్పిన హిందీ పాఠాలూ...కవితలూ..
చిరు చిరు సంపాదనల విజయగర్వాలు




















మేరీస్టెల్లా, బాబాగుడి , ఐదవనెంబరు బస్ రూటు
ఆప్షన్స్, ప్రబోధా, ఆర్చీస్ గేలరీలు, గ్రీటింగు కలక్షన్లు
కాలేజీ స్నేహితులూ..చెప్పుకున్న ఊసులూ
పోస్ట్ మేన్ కోసం పడిగాపులూ...ఉత్తరాల పరంపర..
సినిమా సరదాలు...టికెట్ క్యూల్లో పడిగాపులు
తిరిగిన వీధులు...తిన్న ఐస్క్రీములు


నాన్న అవార్డులు...ఢిల్లీ ప్రయాణాలు
ఆయన సన్మానాలూ..పేపర్లో వార్తలు
నాన్న కూతురినన్న గర్వం
వెళ్ళిన ప్రతిచోటా మర్యాదల పర్వం





















పున్నమ్మతోట క్వార్టర్స్, డి-వన్ ఇల్లు 
పెంచిన పూదోటలూ, పండించిన కాయగూరలు
మెట్ల మీద కబుర్లూ, బేట్మెంటన్ ఆటలు..
న్యూ ఇయర్ సంబరాలు, సంక్రాంతి ముగ్గులూ
పిన్నల మన్ననలు, పెద్దల దివెనలూ
ఆనాటి జ్ఞాపకాలు నా ఆనంద నిధులు...!!



తలిచినప్పుడల్లా నిన్నటివా గత జన్మావా అనిపించే ఈ చిన్ననాటి స్మృతులు ఎన్నటికీ తరగని నా ఆనంద నిధులు. రాస్తున్నంత సేపూ మనసు ఈ జ్ఞాపకాల తరంగాల్లో ఉయ్యాలలూగింది. ఈ శీర్షికకు రాయటం ద్వారా నాకు లభించిన మధుర క్షణాల ఆనందానికి కారణమైన జ్యోతిగారికి కృతజ్ఞతలు. ఆలస్యమేమిటి...అందరూ ఓసారి అలా మీ మీ చిన్నతనంలోకి వెళ్ళి వచ్చి నాలా రిఫ్రెష్ అయిపోండి మరి...!!

Thursday, September 23, 2010

శోధన...


'చిత్రం భళారే విచిత్రం' అని పాడాలనిపించింది.....
అసలేం జరిగిందంటే, ఇవాళ టపా రాసే మూడ్ లేక రాయలేదు.so, కొన్నికావాల్సిన ఫోటోలు వెతుకుదాం అని శోధన మొదలెట్టా. బ్లాగ్లో పెట్టే ఫోటోలు రాయల్టీ ఫ్రీ అయితే ఇబ్బంది ఉండదు అని ప్రత్యేకం అలాంటివాటి కోసం వెతకటం నా పనుల్లో ఒక పని. అవసరమైనప్పుడే కాక దొరికినప్పుడే దొరికినన్ని దాచుకోవటం కూడా ఒక అలవాటు. అలానే ఇందాకా ఒక ఫోటో కోసం నెట్లో వెతుకుతున్నా. ఒక ఫోటో లోంచి మరో ఫోటో లోకి వెళ్ళా, అక్కడ్నుంచి ఆ ఫోటో నన్నొక పికాసా వెబ్ ఆల్బమ్ లోకి తీసుకువెళ్ళింది. ఆ ఆల్బం తాలూకూ మనిషి ఇండియనో కాదో తెలీదు. పేరు కూడా హిందూవులా లేదు. అక్కడ కొన్ని పబ్లిక్ ఆల్బమ్స్ ఉన్నాయి. పబ్లిగ్గా పెట్టిన ఆల్బమ్స్ అన్నీ కొన్ని దేవాలయాలవి(ఇండియాలోవి కాదు),
చారిత్రాత్మక ప్రదేశాలవీ. ఎంతో శ్రధ్ధతో డీటైల్డ్ గా తీసినట్లు తెలుస్తున్నాయి. కొన్ని ఇతర దేశాలవీ ఉన్నాయి. అద్భుతమైన ఫోటోలు.

నాకసలే హిస్టరీ అంటే చాలా ఇష్టం. చారిత్రాత్మక కట్టడాలన్న, పూర్వీకుల, తరతరాల రాజుల తాలూకూ చరిత్రలు అన్నా మహా ఇష్టం. (డిగ్రీలో అన్నింటికన్నా హిస్టరీలోనే బోలెడు ఎక్కువ మార్కులు వచ్చాయి). మహానందపడిపోతూ ఫోటోలనీ చూసేసాను. ఇక ఆ ఆల్బమ్స్ లో ఒక ఆసక్తికరమైన ఆల్బం కనిపించింది. బహుశా అవి ఒక ఆధ్యాత్మిక మ్యూజియం తలూకూ ఫోటోలై ఉంటాయి అనిపించింది. మానవజాతి ఎలా ఆరంభమైంది, ఎలా పరిణితి చెందింది మొదలుకుని యోగా, కుండలిని, సైన్స్ కు సంబంధించిన చిత్రాలు రకరకాలు ఉన్నాయి. మధ్యలో అది ఏ భాషో తెలియదు కానీ నోట్స్ తాలూకూ పేజీలకు తీసిన కూడా ఉన్నాయి.

నాకా మనిషికి ఉన్న వైవిధ్యమైన ఆసక్తులు పట్ల మక్కువ కలిగింది. ఒక ప్రదేశం తలూకూ ఫోటోలు బాగున్నాయని ఆ పేరు పట్టుకెళ్ళి గూగుల్లో పెట్టా ఏ ప్రదేశమో తెలుసుకోవాలని. అది శ్రీలంక లోని ఒక చారిత్రాత్మక ప్రదేశం అని వచ్చింది. ఇక ఆ పేరు తాలుకు ’వికీ’లోకి వెళ్ళి వివరలు చదివా. ఆ తరువాత ఆ వ్యక్తి వివరాలు దొరికాయి. అతనొక జియోఫిజిసిస్ట్, రచయిత కూడా అని ఉంది. అదీ కధ. అక్కడితో నా పరిశోధన పూర్తి అయ్యింది. ఈ వెతుకులాటలో ఒక మంచి ఇంగ్లీషు బ్లాగు కూడా తగిలింది. ఏమి నా భాగ్యము అనుకున్నా.

ఒకోసారి అనుకోకుండా జరిగే చిన్న చిన్న సంఘటనలు ఏంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. తెలియని కొత్త విషయాలను తెలుసుకున్నప్పుడు, మనకు ఇష్టమైన సంగతులు మరొకచోట కనబడినప్పుడు కలిగే సంతోషాన్ని భావాలను మాటల్లో చెప్పటం కష్టం.

Wednesday, September 22, 2010

"మనసుగతి ఇంతే.." పాటకు పేరడీ !!


"మనసుగతి ఇంతే.." పాటకు పేరడీ సరదాగా రాద్దామనిపించింది...చదివి నవ్వుకోండి..!!

బ్లాగరు బ్రతుకింతే
బ్లాగు కథ ఇంతే
బ్లాగున్న మనిషికీ
తృప్తిలేదంతే

పోస్ట్ రాస్తే ఖూషీరాదు
వ్యాఖ్య కోసం ఆశపోదు
రాసే చేతికి అదుపులేదు
రాయకపోతే శాంతిలేదు

అంతా చదువుతారని తెలుసు
అయినా వ్యాఖ్య రాయరని తెలుసు
తెలిసీ చూసే ఎదురుచూపులో
తీయదనం బ్లాగరుకే తెలుసు

మరుజన్మ ఉన్నదోలేదో
ఈ బ్లాగులప్పుడేమౌతాయో
బ్లాగరు కథయే ఓ ప్రహసనం
బ్లాగరెలా వదుల్చుకుంటాడీ వ్యసనం

***** ****** *****

అసలు పాట ఇక్కడ వినండీ..


Monday, September 20, 2010

సలీల్ చౌదరి మాట...అంతరా చౌదరి పాట


"అంతరా చౌదరి" ప్రముఖ సంగీత దర్శకుడు సలీల్ చౌదరి కుమార్తె. ఆమె చిన్నప్పుడు "మీనూ" అనే అమోల్ పాలేకర్ తీసిన హిందీ చిత్రంలో "తేరీ గలియోంమే హమ్ ఆయే.." అనే పాటను పాడించారు. శాస్త్రీయంగా హిందుస్తానీ తో పాటుగా వెస్ట్రన్ మ్యూజిక్ కూడా నేర్చుకున్న ప్రతిభగల కాళాకారిణి. పాటలకు బాణీలు సమకూర్చగలరు. ఆమె పియానో కూడా చక్కగా వాయించగలరు. బెంగాలీలో పిల్లల పాటలతో ఆమె ఎన్నో ఆల్బమ్స్ రిలీజ్ చేసారు. అయితే ప్రతిభ ఉన్నా కూడా, పిల్లల పాటలు పాడే గాయని అనే ముద్ర నుంచి తప్పుకోలేకపోయారు. అయితే గాయనిగా ఆమె తన తండ్రి దగర ఎన్నో మెళుకువలు నేర్చుకున్నారు.



నా చిన్నప్పుడు ఒకసారి డిడి-1లో సి.పి.సివాళ్ళు ప్రసారం చేసిన సలీల్ చౌదరీ ఇంటర్వ్యూ ప్రసారమైంది. అన్నింటిలానే అది కూడా రికార్డ్ చేసాం. సలీల్ చౌదరీ సంగీతం అంటే ప్రత్యేకమైన ఇష్టం నాకూ, నాన్నకూ. అందంగా, పాడటానికి సులువుగా ఉంటూనే ఎంతో కాంప్లికేటెడ్ గా ఉంటాయి ఆయన ట్యూన్స్. ఆయన సంగీతం సమకూర్చిన పాటలు నేర్చుకోవటం అంత తేలికైన పని కాదు. ఇంతకీ ఆ కార్యక్రమంలో ఆయన స్వరపరిచిన కొన్ని ప్రైవేట్ గీతాలను వినిపించారు. ఎన్ని సార్లు ఆ కేసెట్ మొత్తం వినేవాళ్ళమో లెఖ్ఖ లేదు. వాటిల్లో అంతరా చౌదరి పాడిన ’బీత్ జాత్ బర్ఖా రుత్, పియ న ఆ..యేరీ...’ అనే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట సంగీతం, సాహిత్యం రెండూ చాలా అద్భుతంగా ఉంటాయి.

ఈ పాటను "మధుర్ స్మృతి" అనే ఆల్బమ్ లో రిలీజ్ చేసారు. కానీ అది బయట దొరకలేదు నాకు. నా దగ్గర ఉన్నది డిడి లోంచి రికార్డ్ చేసుకున్న పాట మాత్రమే. పాటను ఆసక్తి ఉన్నవాళ్ళు క్రింద వినండి. మొదట్లో ఉన్నది సలీల్ చౌదరి
ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు...

పాపం వినాయకుడు..!!


కొన్నాళ్ళ క్రితం ఒక రాత్రి మా ఇంటికి ఐదారిళ్ళ అవతల డాబా మీద ఒక పార్టీ జరిగింది. అలా చాలా జరుగుతూ ఉంటాయి, అర్ధరాత్రి దాటాకా లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేసేస్తూంటారు. కానీ ఆ రోజు పన్నెండు, ఒంటిగంట, రెండు అయినా ఆ పార్టీ అవలేదు. లౌడ్ స్పీకర్లో అలా భీకర శబ్దాలు(వాళ్ళ దృష్టిలో అది పార్టీ మ్యూజిక్ అన్నమాట) వస్తూనే ఉన్నాయి. పిచ్చి పిచ్చి పాటల ఆ విపరీతమైన సౌండ్ వల్ల ఇంటిల్లిపాది నిద్రకు చాలా ఇబ్బంది కలిగింది. మావారు ఇక ఆగలేక "ఫలానా ఏరియలో పార్టి....ఈ ఏరియాలో అందరికీ ఇబ్బంది కలిగిస్తోంది" అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కాసేపటికి పోలీస్ వ్యాన్ సైరను వినబడింది, పార్టీ ఆగింది. ప్రభుత్వం అర్ధరాత్రి లౌడ్ స్పీకర్స్ పెట్టరాదు, పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడదు అని ఎన్ని రూల్స్ పెట్టినా ఉపయోగంలేదు. ఎక్కడో అక్కడ ఇలా లౌడ్ స్పీకర్స్ వల్ల చుట్టుపక్క జనాలకు చికాకు కలుగుతూనే ఉంది.


నిన్న రాత్రి అలానే కాస్తంత దూరంలో మళ్ళీ పెద్ద సౌండ్లో పాటలూ గట్రా వినబడ్డాయి. స్కై షాట్స్ అవీ కాల్చారు. కానీ పన్నెండు దాటినా ఇంకా పాటలు ఆగలేదు.నిద్ర పట్టడం లేదు. ప్రాంతీయ జానపద పాటలు, కొత్త సినిమా పాటలు ఒకటేమిటి అన్నిరకాలూ వినబడుతున్నాయి. "ఎందుకే రమణమ్మా....", "రింగ రింగా...." ఇంకా ఏవో. కాసేపయ్యాకా మళ్ళి "రింగ రింగా..." అంటూ ఇంకా పెద్దగా వినబడింది. ఏదో పెళ్ళి కాబోలు అనుకున్నాము. ఊరేగింపు దగ్గరకు వచ్చినట్లుంది, కిటికీలు మూసేస్తే కాస్తైనా సౌండ్ తగ్గుతుంది అని కిటికీ దగ్గరకు వెళ్ళాను. దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఊరేగింపు వెళ్తోంది. మధ్య మధ్య ఆగి మైక్లో పాడుతూ వెళ్తున్నారు. గుంపుకి మధ్యన ఓపెన్ వ్యాను, అందులో వినాయక విగ్రహం....!! మతిపోయింది. నాకీ నవరాత్రి ఉత్సవాలు వద్దు బాబోయ్...ఇంకా పారిపోకుండా వినాయకుడు అందులోనే ఉన్నాడా? అని ఆశ్చర్యం కలిగింది... !


ఆ తరువాత "పాపం వినాయకుడు..!" అనిపించింది. జనాల మీద కోపం వచ్చింది. వాడ వాడలాదేవుడి పూజ చేస్తున్నారు. బాగుంది. సుభ్భరంగా భక్తి పాటలో, భజనో చేయకుండా ఈ చెత్త పాటలేమిటి? నేను విన్నది ఒక్కచోటే. ఇలాంటివి ఇంకెన్ని చోట్ల జరుగుతున్నాయో. చిన్నప్పుడు రామనవమి పందిళ్ళలోనూ, ఈలాటి గణేశనవరాత్రి రోజుల్లోనూ మైకుల్లో సినిమా పాటలు పెట్టడం ఎరుగుదును. కానీ ఇలా రోడ్డు మీద పబ్లిగ్గా రింగా రింగా పాటలు పాడుతూ నిమజ్జనానికి తీసుకువెళ్ళటం ఇదే మొదటిసారి నేను చూడటం. ఇంతకన్న ఘోరం లేదు అనిపించింది...ప్చ్...! పోలీసు బందోబస్తుల మధ్యన, అల్లర్ల మధ్యన, నిమజ్జనం అంటే ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని రోడ్డేక్కే జనాలను చూసి, చెత్త సినిమాపాటల ఊరేగింపుల మధ్యన...పాపం వినాయకుడు...అని మరోసారి నిట్టూర్చాను. అంతకన్నా చేసేదేముంది ఇలా బ్లాగ్ లో ఘోషించటం తప్ప...!!



ఒక సైట్లో కనబడిన ఈ జోక్ బాగుందని ఇక్కడ పెడుతున్నను. ఈ ఫొటో ప్రచురణపై ఎవరికన్నా అబ్యంతరాలుంటే తొలగించబడుతుంది.






Saturday, September 18, 2010

లీలానాయుడు




ఆమె ఒక మనోహరమైన స్త్రీ. ఒక కథ. ఒక జ్ఞాపకం. భారతదేశ చలనచిత్ర జగత్తలో ఒక వెలుగు వెలిగిన అలనాటి అందాల నటీమణి లీలానాయుడు. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి కి చెందిన ప్రముఖ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ రామయ్య నాయుడు గారి కుమార్తె లీలానాయుడు. తల్లి ఫ్రెంచ్ దేశస్తురాలు.1954లో మిస్ ఇండియా గా ఎన్నుకోబడింది. అప్పట్లో "వోగ్" అనే పత్రికవారు ప్రపంచంలోని పదిమంది అత్యంత సుందరీమణూల్లో ఈమెను ఒకతెగా ప్రకటించారు. ఆమె మొదటి చిత్రం హృషీకేష్ ముఖర్జీ తీసిన "అనురాధ(1960)". నాకెంతో ఇష్టమైన సినిమాలలో అది ఒకటి. ఆ సినిమాకు ఆ సంవత్సరంలో నేషనల్ అవార్డ్ కూడా లభించింది. సినిమా పెద్దగా ఆడకపోయినా ఆమెకు నటిగా పేరును తెచ్చిపెట్టింది. ఆమె ఆంగ్ల నటి "సోఫియా లారెన్" తో పోల్చబడింది కూడా.

తరువాత 1962లో ఆమె "ఉమ్మీద్" అనే చిత్రం చేసారు. వివాదాస్పదమైన నానావతి మర్డర్ కేస్ ఆధారంగా చిత్రించిన "యే రాస్తే హై ప్యార్ కే(1963) సినిమాలోని ఆమె నటన దేశవ్యాప్తంగా గుర్తింపుని, మన్ననలనూ పొందింది. అదే సంవత్సరంలో లీలానాయుడు జేమ్స్ ఐవొరీ తీసిన "ద హౌస్ హోల్డర్" అనే ఆంగ్ల చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆమెకు ఎంతో ప్రతిష్ఠను సంపాదించిపెట్టింది.

సత్యజిత్ రాయ్ కూడా ఆమె నటనను ఎంతో ప్రశంసించి "ద జర్నీ" అనే సినిమా తీయాలని సంకల్పించారు కానీ చేయలేకపోయారు. రాజ్ కపూర్ ఆమెతో చిత్రాలు తీయాలని ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారని చెబుతారు. ఒకసారి ఒప్పుకుని సెట్స్ కు కూడా వెళ్ళి ఆ తరువాత మరో నాలుగు చిత్రాలకు బాండ్ రాయటానికి ఇష్టపడక షూటింగ్ విరమించుకుని వెళ్ళిపోయరుట. "ద గురు(1969)" అనే సినిమాలో ఒక అతిథి పాత్ర పోషించిన తరువాత లీలానాయుడు నటించటం మానివేసారు.

ఇరవైయేళ్ళు నిండకుండానే ఆమె ఒక పారిశామికవేత్తను వివాహమాడారు. ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె మొదటి వివాహం ఎక్కువకాలం నిలవలేదు. ఆ తరువాత 'డోమ్ మోరిస్' అనే కవిని వివాహమాడి పదేళ్ళు విదేశాల్లోనే భర్తతో గడిపారు. పత్రికా రంగంలో పేరున్న వ్యక్తి ఆయన. డోమ్ మోరిస్ ఇందిరాగాంధీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ట్రాన్సలేటర్ గా వ్యవహరించారు. పలు పత్రికల్లో ఎడిటర్ గా, కొన్ని ఇతర దేశీయ చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసారు లీలానాయుడు.

ఎందువల్లనో ఆమె రెండవ వివాహం కూడా నిలవలేదని అంటారు. ఎన్నో సంవత్సరాల తరువాత మళ్ళీ శ్యామ్ బెనిగల్ "త్రికాల్(1985)"లో ఆమె నటించారు. ఆమె చివరిసారిగా నటించినది 1992లో. కోర్టు ఆమె ఇద్దరు కుమర్తెల సంరక్షణను మొదటి భర్తకు అప్పగించింది. ఆ కేసును ఓడిపోయాకా ఆమె చాలా కృంగిపోయారు. తరువాత గొప్ప తత్వవేత్త అయిన జిడ్డుకృష్ణమూర్తి గారి బొధనల పట్ల ఆమె ఆకర్షితులై ఆయన శిష్యులైయ్యారు. దీర్ఘకాల అనారోగ్యం తరువాత 69 ఏళ్ళ వయసులో లీలానాయుడు కన్ను మూసారు. చిన్నవయసులోనే ఎంతొ ఖ్యాతి గడించిన ఆమె...ఎందరికో ఆరాధ్యమైన ఆమె జీవితంలో ఎన్ని విషాదాలో...!


కానీ భారతీయ చలనచిత్ర రంగంలో గుర్తుంచుకోదగ్గ మంచి నటి, అపురూప సౌందర్యవతి లీలానయుడు. ఆమె జెర్రి పింటో తో పంచుకున్న జ్ఞాపకాలను "ఏ పేచ్ వర్క్ లైఫ్" అనే పుస్తకంగా పెంగ్విన్ బుక్స్ వాళ్ళు ప్రచురించారు.

యూట్యూబ్ లో దొరికిన లీలానయుడు క్లిప్పింగ్స్:




Friday, September 17, 2010

"భజగోవిందం"


జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన "భజగోవిందం" అంటే నాకు చాలా చాలా ప్రీతి. అందులోనూ ఎమ్మెస్ గళంలో ! వింటూంటే మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఒక భజనగా పాడుకునే "భజగోవిందాన్ని" వేదాంతసారంగా పరిగణిస్తారు. ఈ సంసారం, ధనం, ప్రాపంచిక సుఖాలు అన్నింటిలోనూ ప్రశాంతత ఎందుకు పొందలేకపోతున్నాము? జీవితం ఎందుకు? జీవితపరమర్ధం ఏమిటి? సత్యమేమిటి? మొదలైన ప్రశ్నలకు అర్ధాన్ని చెప్పి, మనిషిలోని అంత:శక్తిని మేల్కొలిపి సత్యాన్వేషనకు పురిగొల్పుతుందీ భజగోవిందం.

"భజగోవిందం" సాహిత్యం pdf
ఇక్కడ
చూడవచ్చు.

యూ ట్యూబ్ లో దొరికిన ఆంగ్ల అర్ధంతో పాటూ ఉన్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగారి గళం క్రింద వినండి. అదే లింక్ లో క్రిందుగా
శంకరాచార్యులవారు దీనిని రచించిన సందర్భం కూడా వివరించబడి ఉంది.



పెంకుటిల్లు


శీర్షికను బట్టే ఏ పుస్తకాన్నైనా చదవాలనే అభిలాష కలుగుతుంది. రచయిత సమర్ధత కూడా శీర్షికను ఎన్నుకోవటంలోనే ఉంటుంది. "పెంకుటిల్లు" చదివాకా, నవలకు ఇదే సరైన పేరు అనిపిస్తుంది. ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి "పరిపరి పరిచయాలు" పుస్తకం చదువుతుంటే, అందులో 'అలనాటి ఆంధ్రాశరత్' అంటూ వారి మిత్రులైన "కొమ్మూరి వేణుగోపాలరావు" గారి గురించి రాసిన వ్యాసం చదివాను. వృత్తిరీత్యా డాక్టరైన వేణుగోపాలరావుగారి నవల గురించిన కబుర్లు, ఆయనతో తనకు గల స్నేహం, ఇతర రచనల గురించి శర్మగారు అందులో రాసారు. వ్యాసంలోని కొమ్మూరిగారు రచించిన నవలల పేర్లు చూసి, అందులో నేను చదివినది "హౌస్ సర్జన్" ఒక్కటే అనుకున్నాను. మెడిసిన్ చదివే రోజుల్లో, అంటే 17,18ఏళ్ళ వయసులోనే "పెంకుటిల్లు" అనే నవల రాసారనీ, అది ఎంతో కీర్తిని ఆర్జించిపెట్టిందని చదివాకా ఆ నవలపై ఆసక్తి కలిగింది. అంత చిన్న వయసులో ఆయన ఏ సబ్జక్ట్ పై రాసారో.... ఆ పుస్తకం కొనుక్కోవాలి అనుకున్నా.

మొన్నొక రోజు ఇంట్లో చదవటానికి కొన్ని పుస్తకాలు తీస్తూంటే "పెంకుటిల్లు" కనబడింది. ఆశ్చర్యపోయా. నేనెప్పుడు కొన్నానో కూడా గుర్తులేదు...సంతకం కూడా లేదు.(పుస్తకం కొనగానే ఫస్ట్ పేజీలో సంతకం, కొన్న తారీఖు రాయటం నాకు అలవాటు) ఓహో, పేరు ఆసక్తికరంగా ఉందని కొని ఉంటాను అనుకున్నాను. మొత్తం చదివేసాను. చదివి రెండువారాలు అవుతోంది. నవల గురించి రాయటానికి ఇప్పటికి కుదిరింది. టినేజ్ లో ప్రేమా, కలలు అంటూ కాక ఇటువంటి బరువు కధాంశాన్ని ఎన్నుకోవటం ప్రశంసనీయం.


అంత చిన్న వయసులో మనుషుల మనస్థత్వాలు, మనోభావాలు అంత క్షుణ్ణంగా వ్యక్తం చేయటం నిజంగా రచయిత గొప్పతనమే. కధలో పాత్రలైన చిదంబరం, శారదాంబ, రాధ, నారాయణ, ప్రకాశరావు, శకుంతల, వాసు, సుగుణ...మొదలైనవారి పాత్రల చిత్రీకరణ, వారి వారి మానసిక విశ్లేషణ, కధలో చూపెట్టిన దిగువ మధ్యతరగతి(lower middle class) జీవనవిధానం, కధను నడిపించిన తీరూ ఆకట్టుకుంటాయి. కథ చదువుతున్నంతసేపూ ఒక విశాలప్రదేశంలో ఓ పెంకుటిల్లు, ఆ పరిసరలు ఉన్న చిత్రం మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. కథలోని వాస్తవికత హృదయాన్ని ద్రవింపజేస్తుంది.

కథ లోకి వస్తే, అనగనగా ఒక పెంకుటిల్లు. ఆ ఇంట్లో చిదంబరం, శారదాంబ అనే దిగువ మధ్యతరగతి దంపతులు. నారాయణ, ప్రకాశరావు, అన్నపూర్ణ, రాధ, వాసు, ఛాయ వారి సంతానం. ఆ ఇంటిలోని వ్యక్తుల జీవితాలలో జరిగిన సంఘటనలు, వారి జీవితాలలో వచ్చిన సమస్యలు, వాటివల్ల ఆయా వ్యక్తుల్లో వచ్చిన మార్పులు ఏమిటీ అన్నది కథ. చిదంబరానికి పేకాటే ప్రాణం. ఆర్ధిక ఇబ్బందులు అతడి బాధ్యతారహిత ప్రవర్తనను ఏమీ మర్చలేకపోతాయి. కధనంలో శారదాంబ పాత్ర ఎక్కువ లేక పోయినా పిల్లలకోసం, ఆ ఇంటి క్షేమం కోసం ఆమె పడే తపన అడుగడుగునా కనబడుతుంది. పెద్దకొడుకైన నారాయణ ఉన్నత వ్యక్తిత్వం, కుటుంబాన్ని నడపటం కోసం పాటుపడే అతని నిస్వార్ధతత్వం ముగ్ధుల్ని చేస్తుంది. అనుకూలవతి అయిన అతని భార్య సుగుణ, ప్రకాశరావును ప్రేమించి పెళ్ళాడే శకుంతల, ఆదర్శవంతమైన కోడళ్ళు అనిపించుకుంటారు.


తండ్రి మరణంతో వ్యాకులపడిన శకుంతలను "సుఖంగా ఉన్నప్పుడు బ్రతకగలిగి, దు:ఖం వచ్చినప్పుడు బ్రతకలేకపోతే మానవుడు జన్మించటం ఎందుకు?" అని ఓదార్చే ప్రకాశరావు ధైర్యం, నిరాడంబర జీవనం, బాధను భరించే శక్తిలేక ఇంటి బాధ్యతల నుండి పారిపోవాలనుకునే అతని పిరికితనం, శకుంతలను అర్ధం చేసుకోలేని అమాయకత్వం, కులాంతర వివాహం చేసుకోవటానికి అతను చూపిన తెగువ...ఇవన్నీ అతడి వ్యక్తిత్వం లోని బలాన్నీ, బలహీనతల్నీ, మానసిక సంఘర్షణను చూపెడతాయి. పావలా కోసం, అర్ధరూపాయి కోసం(అరవైల్లో ఆ నాణేలకున్న విలువ ఎక్కువే మరి) చిన్నవాడైన వాసు పడే తపన, అతనికి జరిగిన ప్రమాదం కంటతడిపెట్టిస్తాయి.

నవలలో ప్రకాశరావు, శకుంతలల ప్రేమకధ ఎక్కువ భాగమే ఉంటుంది. శకుంతలలోని ఔదార్యం, కరుణ, ధైర్యం అబ్బురపరుస్తాయి. ప్రేమించానని వెంటబడి, విపత్కర పరిస్థితుల్లో రాధ చేయి పట్టుకోలేని ఆనందరావు లాంటి పిరికి ప్రేమికులు, శ్రీపతి లాంటి గోముఖ వ్యాఘ్రాలు వాస్తవానికి ప్రతీకలు. ఇక కథలో సంపూర్ణ స్త్రీగా కనబడే పాత్ర రాధ. అందం, అణుకువ, ఆలోచన, తెలివితేటలు, చక్కని వ్యక్తిత్వం అన్నీ ఉన్న రాధ పాత్ర మనల్ని ఆకర్షిస్తుంది. వయసు ప్రలోభాలకు లొంగని, దీనమైన కుటుంబ పరిస్థితుల వల్ల ఏమాత్రం దిగజారని ఆమె వ్యక్తిత్వం ఆ పాత్రను ఎంతో ఎత్తున నిలబెడతుంది. పెద్దన్నలోని నిస్వార్ధగుణాన్ని, చిన్నన్న లోని అభిమానాన్ని, వదినలిద్దరి మంచితనాన్ని అమె అర్ధం చేసుకుంటుంది. ప్రమాదానికి గురైన వాసుకు మనోబలాన్ని అందిస్తుంది. కుటుంబక్షేమం కోసం పరితపిస్తుంది.

అటువంటి రాధ పాత్రకు కథలో జరిగిన (రచయిత చేసిన) అన్యాయం మాత్రం నాకు మింగుడుపడలేదు. వాస్తవం అంత కఠినంగా ఉంటుందని చెప్పటానికా? ఆమెకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటే హృదయం బరువెక్కిపోతుంది. ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన అన్ని కోణాల్లోనూ అప్పట్లో చరిత్ర సృష్టించిన "పెంకుటిల్లు" గుర్తుంచుకోదగ్గ మంచి నవల అనిపించుకుంటుంది. కల్పనీకాలూ, మిథ్యాజగత్తులూ నిండినవి కాక యదార్ధానికి దగ్గరగా ఉండే కథలను మెచ్చే చదవరులకు ఈ నవల తప్పక నచ్చుతుందని నా అభిప్రాయం.

Thursday, September 16, 2010

BIG Paa


వచ్చింది....మళ్ళీ వచ్చింది...మళ్ళీ వచ్చింది. ఈసారి అతనికి కాక మరెవరికి? అతని కంటే ఘడెవ్వరు? అన్ని ప్రాంతీయ సినిమాల్లో ఎంతో మంది గొప్ప కళాకారులు ఉన్నారు. తప్పకుండా ఒప్పుకుని తీరాలి. కానీ యావత్ భారత దేశంలో 67ఏళ్ల వయసులో కూడా 'వాహ్! ఈ పాత్రను అతనొక్కడే చెయ్యగలడు' అనిపించాడు, నిరూపించాడు "పా" సినిమాతో. ఫిల్మ్ ఫేర్ వచ్చింది. ఇవాళ 2009 national awards లో best male actor award మరోసారి సాధించుకున్నాడు.


దేశంలో ఎన్నో రకాల అవార్డ్ లు ఇవాళ. ఎంతో మందికి ఎన్నో రకాల అవార్డ్ లు వస్తూంటాయి. కానీ ఈసారి ఇది ప్రత్యేకం ఎందుకంటే ఈ "ఆరో" పాత్ర అంతటి ప్రత్యేకం. వయసులో ఉన్న నటులు ఎన్ని రకాల పాత్రలైనా ప్రయోగాలు చేయవచ్చు...పోషించవచ్చు. కానీ వయసు మళ్ళిన వ్యక్తి అటువంటి చాలెంజింగ్ రోల్ ను ఈజీగా, సమర్ధవంతంగా చేయటం ఇక్కడి విశేషం.

గత డిసెంబర్లో అనుకుంటా "పా పాటల కబుర్ల"తో ఒక టపా రాసాను. ఈ సినిమా చూడాలని రిలీజ్ కు ముందు నుంచీ ఎంతో ఎదురుచూసాను...కుదరలేదు. ఒక ఆరు నెలల తరువాత సీడీ కొనుక్కుని చూడగలిగాను. అమితాబ్ ఎంత మంచి నటుడో నేను కొత్తగా చెప్పనక్కరలేదు. అందరికీ తెలిసున్నదే. కాని సినిమా చూసాకా నాకు అనిపించినది మాత్రం చెబుతాను...

మొదటిసారిగా అమితాబ్ సినిమాలో అమితాబ్ కనిపించడు. అది "పా" ద్వారా సాధ్యమైంది. సినిమాలో అమితాబ్ "ప్రోజేరియా" అనే అరుదైన జెనిటిక్ డిసాడర్ ఉన్న ఒక పిల్లవాడే మనకు కనిపిస్తాడు. ఒక పదమూడేళ్ళ కుర్రవాడుగా మాత్రమే కనిపిస్తాడు. విడిపోయిన తల్లిదండ్రులను కలిపాలని తాపత్రయపడే కొడుకుగా కనిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే, తన క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు ఒక జీనియస్ ఛైల్డ్ లా...అమ్మమ్మతో అల్లరి చేస్తున్నప్పుడు కొంటె మనవడుగా... తల్లితో ఉన్నప్పుడు ఒక వారిద్దరి అప్యాయానుబంధాన్ని చూపే అనురాగంలా...అముల్ తన తండ్రి అని తెలిసాకా తండ్రి ప్రేమ కోసం తహతహలాడే కొడుకుగా... తన చివరి క్షణాలు దగ్గరగా ఉన్నాయని తెలిసినప్పుడు ఓ గొప్ప
తాత్వికుడిగా... వివిధ కోణాల్లో కనిపిస్తాడు. అమితాబ్ ఇమేజ్ నూ, ఫాన్ ఫాలోయింగ్ నూ, స్టార్డం నూ మనం ఫీలవ్వము.

అది డైరక్టర్ ఆర్.బాలకృష్ణన్ ప్రతిభ, పి.సి.శ్రీరామ్ కెమేరా పనితనం, Stephen Dupuis ("Mrs. Doubtfire" సినిమాలో రోబిన్ విలియమ్స్ కు మేకప్ చేసినతను) మేకప్ వల్ల అనచ్చు. కానీ....కానీ ఈ పాత్ర కు అమితాబ్ తప్ప వేరెవారూ అంతటి న్యాయాన్ని చేసేవారు కాదేమో అనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అది తండ్రీ-కొడుకుల సినిమా అని ప్రచారమైతే చేసారు కాని సినిమా చూసాకా ఇది ఒక తల్లీ-కొడుకుల బంధం అనిపించకమానదు.

మీరేమన్నా అమితాబ్ పంఖనా? అని అడగవచ్చు ఎవరన్న....కాదు !! కానీ భారతదేశం లోని గొప్పనటులలో ఒకనిగా, ఒక అత్యుత్తమ అభినయ నైపుణ్యం ఉన్న వ్యక్తిగా అతనంటే అభిమానం. గౌరవం.


Hats off to BIG Paa and a Standing Ovation to Amitabh..!!

Wednesday, September 15, 2010

మొగుడు పెళ్ళాలు(1985) డైలాగులు విని నవ్వుకోండి...


హాస్య బ్రహ్మ జంధ్యాల గారి అద్భుత హాస్య చిత్రరాజాల్లో "మొగుడు పెళ్ళాలు" ఒకటి. సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్లో నవ్వుల పువ్వులు పూయిస్తుంది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. దాదాపు 15ఏళ్ళ క్రితం ఒకసారి టివీలో ప్రసారమైనప్పుడు (అప్పుడు కంప్యూటర్లు, యూట్యూబ్ లు, డివిడీలు తెలియని క్రితం ) నేను టేప్ రికార్డర్లో కొన్ని హాస్య సన్నివేశాలు రికార్డ్ చేసాను. ముఖ్యంగా నా ఫేవొరేట్ హాస్యనటి శ్రీలక్ష్మి గారి డైలాగులు, సుత్తి వీరభద్రరావు గారి కొత్తరకం తిట్ల ప్రయోగాలు కడుపుబ్బ నవ్విస్తాయి.






మా ఇంట్లో ఇప్పటికీ "లకసుమపినాకీ", "కీ", "చించినాహట్" లాంటి తికమక పదప్రయోగాలు, "మొజాయిక్ ఫ్లోర్ మీద ఆవలు వేసి కొత్తిమీర మొలవలేదని ఏడ్చే మొహం నువ్వూనూ.." లాంటి వాక్యాలూ వాడుకుంటూ ఉంటాము. ఆ డైలాగుల్ని మిత్రులందరూ విని మరోసారి మనసారా నవ్వుకోండి.

http://www.esnips.com/doc/eda4acce-ffe8-4bc2-88bf-4c3d39e9d13d/mogudu-pellaalu-సుత్శోర్ట్



Friday, September 10, 2010

వినాయకచవితి శుభాకాంక్షలు




బ్లాగ్మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.




గణనాయకాయ గణదైవతాయ
గణాధ్యక్షాయ ధీమహీ
గుణ శరీరాయ గుణ మండితాయ
గుణేశానాయ ధీమహీ
గుణాతీతాయ గుణాధీశాయ
గుణప్రవిష్ఠాయ ధీమహీ

ఏకదంతయ వక్రతుండాయ
గౌరీతనయాయ ధీమహీ
గజేశానాయ బాలచంద్రాయ
శ్రీ గణేశాయ ధీమహి {2}

గానచతురాయ గానప్రాణాయ గానంతరాత్మనే
గానోత్సుఖాయ గానమథాయ గానో సుఖమనసే
గురు పూజితాయ, గురు దైవతాయ, గురు కులస్థాయినే
గురు విక్రమాయ, గుల్హ ప్రవరాయ గుణవే గుణగురవే

గురుదైత్యకలేక్షేత్రే, గురు ధర్మ సదా రక్ధ్యాయ
గురుపుత్ర పారిత్రాత్రే గురు పాఖండ్ ఖండ్ఖకాయ
గీత సారాయ, గీత తత్వాయ గీతగోత్రాయ ధీమహీ
గూఢ గుల్ఫాయ, గంధ మట్టాయ
గోజయప్రదాయ ధీమహీ

గుణాతీతాయ గుణాధీషాయ
గుణప్రవిష్ఠాయ ధీమహీ
ఏకదంతయ వక్రతుండాయ
గౌరీతనయాయ ధీమహీ
గజేశానాయ బాలచంద్రాయ
శ్రీ గణేశాయ ధీమహి {2}
శ్రీ గణేశాయ ధీమహి శ్రీ గణేశాయ ధీమహి శ్రీ గణేశాయ ధీమహి




Wednesday, September 8, 2010

పోలాల అమావాస్య


శ్రావణమాసం చివరలో వచ్చే అమావాస్యను "పోలాలామావాస్య" అంటారు. ఆ రోజున "కంద" మొక్కకు పూజ చేయటం కొందరి ఆనవాయితీ. అమ్మవారిని పోలాంబ రూపంలో పూజించి పిల్లలు లేనివారు పిల్లల కోసం, పిల్లలు ఉన్నవారు పిల్లల క్షేమం కోరుతూ ఈ పూజ చేస్తారు. కంద మొక్కకు పూజ ఎందుకు చేస్తారంటే, కంద మొక్కకు ఎలాగైతే ఒక్క దుంప మట్టిలో వేసినా పక్కనుండి పిలకలు వేసి బోలెడు మొక్కలు పుడతాయో, అలానే పిల్లాపాపలతో ఇల్లు కళకళాలాడుతూ ఉండాలని అంతరార్ధం.

(ఒక్క దుంపలోంచి వచ్చి బోలెడు కంద పిలకలు)

తోరానికి పసుపుకొమ్ము కట్టి, ఒకటి అమ్మవారికి, ఒకటి పూజ చేసినవారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పసుపుకొమ్ము తోరాలు చేసి చేతికి కడతారు. గారెలు, బూరెలు, పులగం వండి నైవేద్యం పెట్టి అది రజకులకు ఇస్తారు. ఏ నైవేద్యం అయినా రజకులకు ఇస్తే కడుపు చలవ అని పెద్దలంటారు. పూజ ముగిసాకా చదివే కధలో... ప్రతిఏడూ బిడ్డను పోగొట్టుకుంటున్న ఒకావిడ, ఈ పూజ చేయటం వలన, అమ్మవారి దయతో చనిపోయిన బిడ్డలందరినీ తిరిగి ఎలా పొందగలిగిందో చెబుతారు.

ఇతర ప్రాంతాలవారు చాలా మంది తెలియదంటారు కానీ మా గోదావరి జిల్లాల్లో పోలాలమావాస్య, కంద పూజ తెలియనివారు తక్కువే. జులై,ఆగస్ట్ లలోనే మా అమ్మ కంద దుంప కొని మట్టిలో పాతిపెట్టేది. అది ఈ అమ్మావాస్య సమయానికి చక్కగా చుట్టురా పిలకలు వచ్చి బోలెడు మొక్కలు అయ్యేవి. వాటిల్లోంచి ఒక మంచి మొక్కను దుంపతో సహా తవ్వి ఇంట్లో దేవుడి మందిరం దగ్గర అమ్మ పూజ చేసేది. మొక్క ఇంట్లో పెట్టి పూజ చేయటం, పైగా ఆ పసుపుకొమ్ము తోరం కట్టుకుని స్కూలుకు వెళ్తే, అడిగినవారందరికీ కధంతా చెప్పటం చిన్నప్పుడు వింతగా ఉండేది మాకు.

చూడటానికి అందంగా ఉండే ఈ మొక్కను ఇలా ఇండోర్ ప్లాంట్లాగ కూడా వేసుకోవచ్చు.

Tuesday, September 7, 2010

భానుమతిగారి ప్రైవేట్ రికార్డ్ "పసిడి మెరుంగుల తళతళలు"


గాయని, నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, ప్రొడ్యూసర్, రచయిత, స్టూడియో ఓనర్ అయిన బహుముఖప్రజ్ఞాశాలి భానుమతీరామకృష్ణ గారి జయంతి ఈవేళ. ఈ సందర్భంగా ఆవిడ పాడిన ఒక ప్రైవేట్ రికార్డ్ "
పసిడి మెరుంగుల తళతళలు" ఈ టపాలో...

రేడియో రజనిగా ప్రసిధ్ధి పొందిన డా. బలాంత్రపు రజనీకాంతరావుగారు రచించి, స్వరపరిచిన పాట ఇది. ఆయనతో పాటుగా భానుమతి గొంతు కలిపి పాడిన పాట ఇది. 1948లో విజయవాడ రేడియోస్టేషన్ ప్రారంభించిన కొత్తలో ప్రతిరోజూ ప్రసారానికి ముందు ఈ
పాట వినిపించేవారు అని రజనిగారు తన తీపి జ్ఞాపకంగా ఇప్పటికీ చెప్పుకుంటారు.

తెలుగుతనం ఉట్టిపడే మధురమైన ఈ పాట నిజంగా తియ్యగానే ఉంటుంది.





భానుమతిగారు పాడిన సినిమాపాటల్లో, "మల్లీశ్వరి" చిత్రంలో నాకు ఇష్టమైన రెండు పాటలు " ఇక్కడ "