సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label పాటలు-మాతృకలు. Show all posts
Showing posts with label పాటలు-మాతృకలు. Show all posts

Sunday, October 12, 2014

Veesum Kaatrukku..


"ఉల్లాసం" అని ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వచ్చింది. అజిత్, విక్రమ్, మహేశ్వరి.. ఇంకా రఘువరన్, బాలు కూడా ముఖ్యపాత్రల్లో నటించారు. "ఉల్లాసం" పేరుతోనే తెలుగులోకి డబ్బింగ్ చేసారు. అందులో రెండు మూడు పాటలు బావుంటాయి. కార్తీక్ రాజా నే సంగీతం. అన్నింటిలోకీ "Veesum Kaatrukku " అని ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాటొకటి నచ్చేది నాకు. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ కూడా బావుంటుంది. ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఎక్కడో విన్నట్టు అనిపించేది. ఓ రోజు నాన్న కేసేట్లలో వెతికి ఈ పాట అసలు మాతృక కనిపెట్టాను. ఉల్లాసం సినిమా రాక ముందు "Pocahontas" అనే యేనిమేషన్ ఫిల్మ్ ఒకటి వచ్చింది. నాకు బాగా నచ్చే యేనిమేషన్స్ లో ఒకటి అది. ఇందులో "Can you paint with all the Colors of the Wind" అనే పాటకు అకాడమీ అవార్డ్ వచ్చింది. చాలా బావుంటుందా పాట . ఇది కాక అందులో "Listen With Your Heart.. you will understand " అనే మరో పాట ఉంది. ఈ పాట పల్లవి, పల్లవి ముందర వచ్చే వేణువాదన tune ఆ పాటలోనిదే. ముందర తమిళ్ సాంగ్ వినేసి, తర్వాత క్రింద ఉన్న ఇంగ్లీష్ సాంగ్ కూడా వినండి.. తెలుస్తుంది మీకు.





Pocahontas - Listen With Your Heart  


ఈ సిన్మాలో ఇంకా Yaro yar yaro... , Muthae muthamma పాటలు బావుంటాయి.


Friday, June 6, 2014

రంగోబోతీ...రంగోబోతీ..




ఎందుకనో ఇందాకా "రంగోబోతీ... రంగోబోతీ.." పాట గుర్తుకు వచ్చింది. నెట్ల్ వెతుక్కుని చూసాను.. చదువుకునే రోజుల్లో ఎక్కువగా విన్న ఆర్.పి పాటలు.. మధురమైన ఉష గొంతు.. ఆ సినిమాలూ అన్నీ గుర్తుకువచ్చి.. కాసేపు ఎక్కడికో...వెళ్పోయా :-) 

ఒక పెక్యూలియర్ వాయిస్ ఆర్.పి.ది. నాకయితే బాగా నచ్చేది. "రంగోబోతీ.." ఓ ఒరియా జానపద గీతమని విన్నాం కానీ అప్పట్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక ఒరిజినల్ ఎప్పుడూ వినలేదు. ఇందాకా అది కూడా వెతుక్కుని విన్నాను.. బావుంది..అచ్చంగా అదే ట్యూన్. రీనిక్స్ లో ఏమీ మార్చలేదు. 


 ఆ ఒరిజినల్ ఒరియా జానపదం.. 

 


క్రింద ఉన్నది "శ్రీరామ్" సినిమా కోసం పట్నాయక్ చేసిన రీమిక్స్. ఈ సినిమాలో 'బాంబే జయశ్రీ' పాడిన 'తియతీయని కలలను కనడమే తెలుసు' పాట కూడా చాలా బావుంటుంది.


song: రంగోబోతీ..
singers: పట్నాయక్,  ఉష

 

Wednesday, March 12, 2014

ఎపుడూ నీకు నే తెలుపనిది..




బ్లాగ్లోకం నాకిచ్చిన  అతితక్కువ స్నేహితుల్లో ఒకరు విజయజ్యోతిగారు. "మహెక్" పేరుతో అదివరకూ రాసిన బ్లాగ్ నే మళ్ళీ ఇప్పుడు "కదంబం" గా మార్చారు. ఈమధ్యన ఆ బ్లాగ్ లో పాటలు, ప్రశ్నలు చూసి డౌట్ వచ్చి "మీరేనా?" అనిడిగితే ఔనన్నారు :) తెలుగు,హిందీ పాటలు, సాహిత్యం విషయంలో మా అభిప్రాయాలు చాలా వరకు బాగా కలుస్తాయి. ఇందాకా ఆ బ్లాగ్లో నే మిస్సయిన టపాలన్నీ చదువుతుంటే "సొంతం" చిత్రంలో పాట కనబడింది. ఆ మధ్యనొకసారి ఆ పాట గురించి రాద్దామని లింక్స్ అవీ దాచి ఉంచాను గానీ బధ్ధకిస్తూ వచ్చాను... ఇప్పుడు ఆవిడ పోస్ట్ చూశాకా రాయాలనిపించి రాస్తున్నా..


"సొంతం" సినిమా నే చూడలేదు కానీ " తెలుసునా తెలుసునా.." పాట + "ఎపుడూ నీకు నే తెలపనిది"  రెండు పాటలూ చాలా బావుంటాయి. 'దేవీ శ్రీ ప్రసాద్' బెస్ట్ సాంగ్స్ లో తప్పకుండా చేర్చుకోవాల్సిన పాటలు. రెండవ పాటకు male version, female version రెండూ ఉన్నాయి. రెండింటికి ఒక్కొక్క చెరణమే ఉంటాయి. ఈ పాట సందర్భం తెలీదు కానీ ట్యూన్ వింటుంటే అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంత అర్ద్రంగా ఉంటుంది. ఆ గొప్పతనం 'సిరివెన్నెల' సాహిత్యానిది కూడానూ! రెండూ చరణాల సాహిత్యాన్ని రాస్తున్నా..


పాట: "ఎపుడూ నీకు నే తెలుపనిది.."
చిత్రం: సొంతం(2003)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
పాడినది: సుమంగళి

సాహిత్యం: 

ఎపుడూ నీకు నే తెలుపనిది 
ఇకపై ఎవరికీ తెలియనిది 
మనసే మోయగలదా జీవితా౦త౦
వెతికే తీరమే రాన౦ది 
బతికే దారినే మూసి౦ది 
రగిలే నిన్నలేనా నాకు సొ౦త౦
సమయ౦ చేదుగా నవ్వి౦ది 
హృదయ౦ బాధగా చూసి౦ది 
నిజమే నీడగా మారి౦ది 

1చ: గు౦డెలో ఆశనే తెలుపనే లేదు నా మౌన౦
చూపులో భాషనీ చదవనే లేదు నీ స్నేహ౦
తలపులో నువ్వు కొలువున్నా కలుసుకోలేను ఎదురున్నా
తెలిసి ఈ తప్పు చేస్తున్నా అడగవే ఒక్క సారైనా
నేస్తమా నీ పరిచయ౦
కల కరిగి౦చేటి కన్నీటి వానే కాదా
(http://www.youtube.com/watch?v=UxmU5Ia2gOw)


2చ: జ్ఞాపక౦ సాక్షిగా పలకరి౦చావు ప్రతిచోటా
జీవిత౦ నీవని గురుతు చేసావు ప్రతిపూటా
ఒ౦టిగా బతకలేన౦టూ వె౦ట తరిమావు ఇన్నాళ్ళూ
మెలకువే రాని కలగంటూ గడపమన్నావు నూరేళ్ళూ
ప్రియతమా నీ పరిమళ౦ ఒక ఊహేగాని ఊపిరిగా సొ౦త౦ కాదా
(పాడినది: మల్లిఖార్జున్ -
https://www.youtube.com/watch?v=xUTSNzW95g0)



ఇదే ట్యూన్ ను దేవీ శ్రీ ప్రసాద్ తాను సంగీతాన్ని అందించిన మరొక తమిళ్ సినిమాలో వాడుకున్నారు. జ్యోతిక, సూర్య నటించిన "మాయావి" అనే చిత్రంలో. తమిళ్ వర్షన్ ఎలా ఉంటుందో అని యూట్యూబ్ లో వెతుక్కుని చూస్తే.. ఇంకా కడుపులోచి దు:ఖం తన్నుకు వచ్చేసింది. 

song: Kadavul thandha 
Movie: మాయావి(2005) 
Lyrics:  Palani Bharathi
Music director: Devi Sri Prasad
Singers: S.P.B Charan, Kalpana

http://www.youtube.com/watch?v=OsW3pWOJJ1k


 


 Tamil సాహిత్యం చాలా బాగుంది. అర్థాన్ని క్రింద బ్లాగ్ లో చదవండి: http://tamilthathuvarasigan.wordpress.com/2012/07/13/maayavi-kadavul-thandha-azhagiya-vazhvu/





Wednesday, July 17, 2013

'SAWAAR LOON'





ఇటీవల విడుదలైన "లుటేరా" సినిమాలో 'SAWAAR LOON' పాట నాకు బాగా నచ్చింది. గాయని మోనాలి ఠాకుర్ కూడా బాగా పాడింది. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది, పాటల రచయిత అమితాబ్ భట్టాచార్య ల కాంబినేషన్ బాగా కుదిరినట్లుంది. వీరిద్దరి జోడీలో వచ్చిన పాటలన్ని బాగుంటున్నాయి. క్రింద లింక్ లో ఆ పాట చూడచ్చు: 

 

 SAWAAR LOON పాట విన్నప్పుడల్లా ఏదో పాత పాట అనిపించేది. ఈ  పాట పల్లవి + ఇంటర్ల్యూడ్స్ చివర్న వచ్చే 'టింగ్..టి..టింగ్..టి..టింగ్' అనే బెల్స్ దేవనంద్ పాట "మై జిందగి కా సాథ్ నిభాతా చలా గయా" పాటలో ఉంటాయి..అలాంటివి. ఆలోచించగా.. చించగా.. చివరికి అసలు మూలం ఏమిటో తట్టింది.. ఈపాట "పరఖ్" సినిమాలోని "మిలా హై కిసీ కా ఝుంకా" పాటని గుర్తు చేసింది..కాపీ అనను కానీ inspiration అయి ఉండచ్చు.  మీకూ అనిపించిందేమో చెప్పండి... 





Friday, February 8, 2013

Jagjit Singh's "तुम नह़ी.. ग़म नह़ी.."





కంప్యూటర్ తెరవగానే గూగులమ్మ సుప్రసిధ్ధ గజల్ గాయకుడు, సంగీతకారుడు, గీత రచయిత జగ్జీత్ సింగ్ జయంతి అని చూపించింది..! మరి ఇవాళ జగ్జీత్ పాడిన మంచి గజల్ వినేయాలి కదా.. వినేద్దామా.. 

ముందుగా చిన్న కథ: 

అనగనగనగా "మంచుపల్లకీ" అని 1982 లో వంశీ తీసిన ఒక సినిమా ఉంది కదా..అందులో "మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం.. మెరిసినా కురిసినా..కరుగులే జీవనం..." అని జానకి గారు అద్భుతంగా పాడేసిన పాట ఉంది కదా.. పాట ఇక్కడ వినవచ్చు: http://www.raaga.com/player4/id=193388&mode=100&rand=0.06678686570376158 

"మంచుపల్లకీ"  సినిమా "palaivana solai(1981)" అనే తమిళ సినిమా రీమేక్ అని వంశీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పాట తమిల్ సినిమా లోంచి అదే ట్యూన్ తో దిగుమతి అయిపోయింది. తమిళంలో సంగీతం చేసినది "శంకర్ గణేష్".  పాడినది "వాణి జయరాం".
ఆ పాట ఇక్కడ వినవచ్చు: http://www.raaga.com/player4/id=314831&mode=100&rand=0.9681079862639308

ఇదే సినిమాని మళ్ళీ 2009 లో తమిళ్ లోనే రీమేక్ చేసారు. అప్పుడు పాడినది ప్రముఖ హిందీ చిత్ర నేపధ్యగాయని "సాధనా సర్గం". కానీ అసలు ఈ పాట బాణీకి జగ్జీత్ సింగ్ పాడిన ఒక గజల్ ఆధారం. అదే ఇవాళ మనం తలుచుకోబోతున్న అద్భుతమైన గజల్.. "तुम नह़ी.. ग़म नह़ी.. शराब नह़ी..ऎसी तन्हाई का जवाब नह़ी  " అంటే 
"నువ్వు లేవు.. బాధా లేదు.. మధువూ లేదు.. 
  ఇలాంటి ఏకాంతానికి తిరుగే లేదు.." అని అర్థం.

నాకిష్టమైన సంతూర్ వాదన ఇందులో ఎంత బావుంటుందో చెప్పలేను !!

 

Singer: jagjit singh
Lyrics: Sayeed rahi

Lyrics:

तुम नह़ी.. ग़म नह़ी.. शराब नह़ी..

ऎसी तन्हाई का जवाब नह़ी  

गाहे-गाहे इसे पढ़ा कीजे
दिल से बेहतर कोई किताब नह़ी  

जाने किस किस की मौत आई है
आज रुख पे कोई नक़ाब नह़ी  

वोह करम उँगलियों पे गिनते है
द.. नि.. रि.. सा ..रि.. म.. प.. ध..नि.. सा.. ध.. नि.. प.. ग..
जुल्म का जिनकी कोई हिसाब नह़ी


ఈ గజల్ లో ప్ర్రతి చరణం ఆహా అనిపిస్తుంది.. రెండో చరణంలో "ఇవాళ ఆమె ముఖానికి ముసుగు లేదు.. ఎంతమందిని చావు వరించనుందో..." అంటాడు కవి! దానికి కనెక్టింగ్ మూడో చరణం .. "నిత్యం ఘాతకాలను చేసే వాళ్ళు(అమ్మాయిలు) చేసే మంచిపనులను వేళ్లపై లెఖ్ఖ పెట్టచ్చు.. " అంటే "ఈ అమ్మాయిలు వాళ్ల చూపులతో, చేష్టలతో చేసే ఘాతకాలకు అంతే లేదు.. అందుకే వీళ్ళు(ఈ అమ్మాయిలు) చేసే మంచి పనులను వేళ్లపై లెఖ్ఖపెట్టచ్చు.." అని అర్థం .

Monday, April 11, 2011

"మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు.." పాట మాతృక




ఈ మధ్యన టివీలో "గోలీమార్" సినిమా వస్తుంటే చూసాను. రెండు పాటలు నచ్చాయి. మొదటిది "గుండెల్లో ఏదో సడి..".మ్యూజిక్ చాలా బాగుంది. స్టార్టింగ్లో గిటార్, ఇంటర్లూడ్ బిట్స్ ,సాహిత్యం అన్నీ కూడా బాగా కుదిరాయి కానీ కనీసం మేల్ వాయిస్ అయినా చక్రికి బదులు వేరెవరినైనా పెట్టి ఉంటే ఇంకా బాగుండేది పాట అనిపిస్తుంది విన్నప్పుడల్లా. ఇక రెండో పాట "మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు". ఇది సినిమా చూస్తున్నప్పుడు వినగానే ఇదేదో కాపీ పాటండీ అన్నాను శ్రీవారితో. కానీ అసలు పాట ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. ట్యూన్ ఒక్కటీ హమ్ చేస్తూ కూడా చాలా సార్లు ప్రయత్నించాను కానీ గుర్తు రాలేదు.




ఈ పాట డౌన్లోడ్ చెద్దామని లింక్ వెతుకుతూంటే యూట్యూబ్లో అసలు పాట దొరికింది. 1999 లో వచ్చిన "మన్"(అమీర్ ఖాన్, మనీషా కొయిరాలా) సినిమాలో "నషా ఏ ప్యార్ కా నషా" పాట. ఎప్పటి పాటో..బావుంటుంది విందాం మళ్ళీ... అని ఈ హిందీ పాట కోసం వెతుకుతూంటే అది కూడా కాపీ అని, అసలు మాతృక 1980ల్లోని Toto Cutugna పాట "L'Italiano" అని తెలిసింది. ఈ మూడూ కలిపి ఉన్న ఒక లింక్ దొరికింది. నాకులా తెలియనివాళ్ళు ఉంటే ఈ అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ పాటను చూసేయండి...(ఒరిజినల్ లోంచికాపీ, కాపీ లోంచి మరోటి కాబట్టి అలా రాసానన్నమాట..:))




తెలుగులో చక్రి స్వరపరిచిన ఈ పాటను యువగాయని గీతా మాధురి పాడారు.'ఉదిత్ నారాయణ్' హిందీలో పాడిన ఈ పాటకు 'సంజీవ్ దర్శన్' స్వరాలను అందించారు.




ఇక తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్లు ఈ పాటల వేటలో నాకు మరో గొప్ప కాపీ పాటల లింక్ దొరికింది. దాని   గురించి తృష్ణ బ్లాగ్లో చూడండి.

Thursday, January 6, 2011

"ఎగిరిపోతే ఎంత బావుంటుందీ..." పాట మాతృక

మన పాత తెలుగు సినిమా పాటల్లో మారువేషాలు ధరించిన పాశ్చాత్య బాణీలు ఎన్నో ఉన్నాయి...అయితే అలనాటి తెలుగు సినీసంగీత దర్శకులు ఒరిజినల్ ట్యూన్స్ తయారు చెయ్యటం లో సిద్ధహస్తులు కాబట్టి ఈ పాశ్చాత్య బాణీల నుంచి తగినంతవరకే ఇన్స్పిరేషన్ పొందేవారు. కొద్ది ఉదాహరణలు చూడండి :


ప్రేమించి చూడులో "అది ఒక ఇదిలే" పాట "Bésame Mucho" అనే Spanish song నుంచి ఇస్పైర్ అయ్యింది.

ఇద్దరు మిత్రులు లో "హలో హలో ఓ అమ్మాయి" పాట "Ya Mustafa", అనే famous Egyptian song నుంచి,

చిట్టి చెల్లెలు లో "ఈ రేయి తీయనిది" పాట "love is blue" song music నుంచీ,

ఆత్మీయులు సినిమాలో "మదిలో వీణలు మ్రోగే" పాట ముందరి ఆలాపన Cliff richards పాడిన "ever green trees" -నుంచి ఇన్స్పైర్ అయ్యింది.

ఇలా పాశ్చాత్య బాణీల నుంచే కాక కొన్ని హిందీ పాటల నుంచి తెలుగుకు, తెలుగు పాటల నుంచీ హిందీ పాటలకూ కూడా ఎగుమతి అయిన బాణీలు ఉన్నాయి. పాత పాటలు వింటూంటే మరెన్నో పాటలు గుర్తుకు వస్తూంటాయి. అలానే ఈ మధ్యన ఒక కొత్త తెలుగు పాటకు మాతృక కనుక్కున్నా నేను. క్లారినేట్ మీద వాయించిన సిని గీతాల కేసెట్ వింటూంటే ఈ పాట వచ్చింది. ఇదేదో తెలుసున్న పాటలా ఉందే అని మళ్ళీ వెనక్కి తిప్పి వినే సరికీ అసలు పాట గుర్తువచ్చింది. అదేమిటంతే "వేదం" చిత్రానికి కీరవాణి గారు స్వరపరిచిన "ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..". ఈ పాట పల్లవి మటుక్కే ఇన్పైర్ అయ్యింది. మీరూ ఓ సారి వినేయండి ఇక్కడ:http://ww.smashits.com/music/artists/play/songs/9769/t-g-m-parvez-mehdi-toot-jaye-na-bharam/80755/RESHMI-SALWAR-KURTA-JALI-KA-INSTRUMENTAL.html

ఈ పాట "రేష్మీ సల్వార్ కుర్తా జాలీ కా.." అని "నయా దౌర్" సినిమా లోది. ఇక్కడ ఉన్న లింక్ ఆ పాటకు క్లారినేట్ మీద "మాష్టర్ ఇబ్రహిం" వాయించారు. ఈ పాట పల్లవి వినగానే మీకు "ఎగిరిపోతే.." పాట గురువచ్చేస్తుంది.