సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, September 11, 2018

This is Raagam 24x7 DTH..

 
 
"This is Raagam 24x7 DTH - Indian Classical Music Channel" అంటూ పలుమార్లు వినబడే ప్రకటనతో సాగే ఒక రేడియో ఛానల్ "రాగం". 2016, జనవరి26న మొదలైంది ఈ ఛానల్. ఇది ఒక 'AIR Mobile App'. Android, iOS , ఇంకా Windows లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
ఈ ఛానల్ లో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఇరవై నాలుగు గంటలూ కేవలం శాస్త్రీయ సంగీతం మాత్రమే వస్తుంది. సంగీతప్రియులకు ఇది ఒక మ్యూజికల్ ఫీస్ట్ అనే చెప్పాలి. కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలతో పాటూ వాద్య సంగీతం కూడా ఇందులో ప్రసారమవుతుంది. 
 
ఫోన్ లోనో, లేప్టాప్ లోనో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కని శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. పొద్దున్నే భక్తి సంగీతం, భజన్స్ వేస్తారు. తర్వాత వీణ, సితార్, వేణువు, జల తరంగిణి, సంతూర్ మొదలైన వాద్య సంగీత కచేరీలు వస్తాయి.

 
వీణ కచేరీ వింటుంటే ఏదో గంధర్వ లోకంలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. సంతూర్ వాదన వింటూంటే వర్షంలో తడుస్తున్నట్లు, జల తరంగిణి వింటుంటే ఉత్సాహంగానూ ఉంటుంది. సితార్ వాదన వింటూంటే మనసు ఆనందంతో నిండిపోతుంది. మా ఇంట్లో ఇదివరకటి ఎఫ్.ఎం ల స్థానంలో నిరంతరం ఇదే మోగుతూ ఉంటుంది ఇప్పుడు. మనసు ఏ రకమైన స్థితిలో ఉన్నా ఆహ్లాదకరమైన సాంగత్యాన్ని శాస్త్రీయ సంగీతం తప్ప మరేమి ఇవ్వగలదు?

ఈ కచేరీలలో ఎక్కువగా బాగా పేరున్న సంగీత విద్వాంసుల పాత రికార్డింగ్స్ ఎప్పటివో కూడా వేస్తూ ఉంటారు. అన్ని రేడియో స్టేషన్స్ వారి రికార్డింగ్స్ ఇందులో వంతులవారీగా ప్రసారమవుతూ ఉంటాయి.

మధ్య మధ్య కొన్ని ప్రత్యేకమైన సంగీత రూపకాలు, సంగీత విద్వాంసులతో ఇంటర్వ్యూలు కూడా ప్రసారమవుతూ ఉంటాయి. మనకు తెలియని ఎందరో గొప్ప కళాకారులు ఈ ఇంటర్వ్యూల ద్వారా మనకు పరిచయమౌతారు. ఏ భాష వారి అనౌన్స్మెంట్ వాళ్ళు ఇస్తారు. తర్వాత ఆ అనౌన్స్మెంట్ లకు ఆంగ్లంలో అనువాదం కూడా వస్తుంది. మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే ఇంత చక్కని ఛానల్ ని తయారు చేసిన All India Radio వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
 

ఇదివరకూ దాదాపు పదిహేనేళ్ల క్రితం ఇలా రకరకాల సంగీతాలు వచ్చే రేడియో ఒకటి ఉండేది. క్లాసికల్, రాక్,జాజ్, వెస్టర్న్, పాత హిందీ పాటలు ఇలా రకరకాలు ఉండేవి. దానికి ఒక ప్రత్యేకమైన ఏంటన్నా కొనుక్కుంటే ఆ ప్రసారాలు వచ్చేవి. అందులో కూడా నిరంతరం శాస్త్రీయ సంగీతం వచ్చే ఛానల్ ఉండేది కానీ అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు. నెలకో, ఆర్నెల్లకో పేమెంట్ ఉండి, ఏంటన్నా కూడా ఉండాల్సివచ్చేది ఆ రేడియోకి. ఇప్పుడా అవసరం లేదు. అన్ని యాప్స్ లాగ మొబైల్ లో డౌన్లోడ్ చేసేసుకుంటే, రాగంతో పాటూ మరో పది పదిహేను భాషల AIR వారి రేడియో ఛానల్స్ ఈ యాప్ లో ఉన్నాయి. 
 
 
 

 
 
 
 
 
 
ఈ యాప్ గురించి తెలియని సంగీతప్రియులు ఈ సదుపాయం ఉపయోగించుకుంటారని ఇక్కడ రాస్తున్నాను.

 

Monday, September 10, 2018

C/O కంచరపాలెం - Brilliance in pieces

 

చిన్నప్పటి మాల్గుడి డేస్, స్వామీ సిరీస్ లు మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ లో చూసినప్పుడు , కాలంలో వచ్చిన దమ్ లగాకే హైసా మొదలైన చిత్రాలు చూసినప్పుడు మన తెలుగు చిత్రాల్లో ఇలాంటి వైవిధ్యత ఎప్పటికి వస్తుందో అని చాలా సార్లు అనిపించేది. కానీ ఇటీవల మన తెలుగు చిత్రాలు కొన్నింటిని చూస్తున్నప్పుడు, ఆశ నిజమౌతోందే అని ఆనందాశ్చర్యాలు కలుగుతున్నాయి. అనుకోకుండా నిన్న చూసిన c/o కంచరపాలం’ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇన్నాళ్లకు మరో కొత్త ఒరవడి తెలుగు చిత్రాల్లోకి ప్రవేశించింది అన్న ఆనందం కలిగింది. చిత్ర దర్శకుడు మహా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు "తెలుగు చిత్రాలను కూడా అంతర్జాతీయ స్థాయిలో రకరకాల భాషల ప్రేక్షకులు సబ్ టైటిల్స్ తో చూసే రోజులు రావాలి."



జీవన సారాన్నంతటినీ నింపుకున్న టైటిల్స్ లో వచ్చిన "ఏమి జన్మము, ఏమి జీవనము " తత్వం రాసినది "బ్రేట్రాయి సామి దేవుడా" రచించిన శ్రీ ఎడ్ల రామదాసు గారే అని తెలిసి చాలా గొప్పగా అనిపించింది. ఎంతో అద్భుతంగా ఉందా పాట. మరుగున పడిపోయిన గొప్ప సంగీత కళాకారులు ఎందరున్నారో అనిపించింది
.
చిత్రంలోని అన్ని పాటలు ఉన్న లింక్ ఇది
-
https://www.youtube.com/watch?v=EptptaouHMg


టైటిల్స్ లో శ్రీ ఎడ్ల రామదాసు గారి " ఏమి జన్మము", సినిమా ఓపెనింగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ చివరి ఐదు నిమిషాలు కూడా అలానే అద్భుతంగా ఉంది. కానీ మధ్య మధ్యలో మాత్రం గొంతు లోంచి కిందకి దిగని చిన్న చిన్న రాళ్ళు కొన్ని పూర్తిగా కడుపు నింపుకోనియ్యలేదు. సినిమా అనేది చాలా పవర్ ఫుల్ మీడియా. అన్నం తినడం, నిద్ర పోవడం లాంటి ప్రాథమిక అవసరాలను సైతం మరచి సినిమా చూడ్డం కోసం పాటుపడే తత్వం ఉన్నవారం మన ప్రేక్షకులందరమూ! తెరపై ఏది చూస్తే అది చేసెయ్యాలనిపించేంత ఆకర్షణాశక్తి సినిమాది. గతంలో తెలుపు-నలుపు చిత్రాల రోజుల్లో ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలన్నా, ఏదన్నా మంచిని చాటి చెప్పాలన్నా, ఒక అన్యాయాన్ని ఎదిరించాలన్నా సినిమాని మాధ్యమంగా ఎన్నుకునేవారు చాలా మంది పెద్దలు. ఉద్దేశాలు పని చేసేవి కూడా. ఇంత గొప్పగా సినిమా ని తీసి, ఇలాంటివి చూపెట్టడం బాలేదనిపించింది నాకు. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. నా సొంత బ్లాగ్ కాబట్టి నా ఘోషని నిస్సందేహంగా ఇందులో రాసుకుంటున్నాను.


చిత్రం సాంకేతికంగా ఎంతో అద్భుతంగా ఉంది. నేపథ్య సంగీతం, పాటలు రెండూ పరమాద్భుతంగా ఉన్నాయి. కథను, పాత్రలను ఎన్నుకున్న విధానం, ఆర్టిస్టు లు అందరూ ఎలా చిత్రానికి ఎంపికయ్యారో కూడా వారి మాటల్లోనే థ్రిల్లింగ్ గా యుట్యూబ్ లో విన్నాం. ఎంతో కష్టపడి తీసారు. వారి కష్టానికి తగ్గ ఫలితంగా అన్నట్లు మంచి పబ్లిసిటీ కూడా లభించింది. కానీ నా గొంతులో దిగని కొన్ని రాళ్లను గురించి మాత్రం రాయాలనిపించి మొదలుపెట్టాను
.

1)
స్కూలు పిల్లలతో ప్రేమ అనేది చాలా బాధాకరంగా అనిపించింది. అసలే ఈకాలంలో చుట్టూరా ఉన్న సెల్ ఫోన్లూ, టివీలు, యూట్యూబులతో చాలామంది పిలల్లు దారితప్పుతున్నారు. వాటికి తోడు సినిమాల్లో టినేజీ ప్రేమకథలనే భరించలేకపోతుంటే, కొన్ని సినిమాల్లో లాగనే ఇందులో కూడా స్కూలు పిల్లలతో కూడా ప్రేమకథ చూపెట్టడం నాకైతే ఎంత మాత్రం నచ్చలేదు
.

2)
స్వాతంత్రదినోత్సవం నాడు దేశభక్తి గీతాలు పాడకుండా అలాంటి సినిమాపాటలు పాడతారా? అదీ ప్రభుత్వ పాఠశాలలో? ఏమో నేనెప్పూడూ వినలేదు. సీన్ లో లెంపకాయ కొట్టిన పాప తండ్రికి సీట్లోంచి లేచి షేక్ హ్యాండ్ ఇవ్వాలనిపించింది
.

3)
లెఖ్ఖ లేనన్ని మందు తాగే సన్నివేశాలు. అలాంటి ఒక్క సన్నివేశం కూడా లేకుండా నేటివిటీ ఉన్న బోలెడు గొప్ప సినిమాలు ఇదివరకూ తీసారు కదా.







4)మరో ముఖ్యమైన తప్పు వినాయకుడి విగ్రహంపై చిన్నపిల్లాడు రాళ్ళు విసిరి పాడుచెయ్యడం
.
ముఫ్ఫై అడుగులు ఎత్తున్న విగ్రహంపై రాళ్ళు విసిరడమే ఒక పొరపాటు. అసలు చిన్నపిల్లాడికి అంత ఎత్తుకు రాయి విసరడం చేత కాదుఇక, ఒకవేళ విసిరినట్లు చూపినా, అది విగ్రహాన్ని నష్టపరచినట్లు చూపకుండా ఉండాల్సింది. దేశంలో ఇన్ని కోట్లమంది పూజించే ఒక దేవుడి విగ్రహాన్ని రాళ్ళు పెట్టి కొట్టి నష్టపరిచినట్లు చూపడం భగవంతుడిని అవమానించినట్లే కదా?
 
 
 
 


బాపుగారి జోక్ లాగ అవకతవక కంగాళీ సినిమాలు చాలా ఉంటాయి. కానీ రాళ్ల మధ్యన వజ్రం ఒకటి దొరికినప్పుడు ఆనందించేలోపే వజ్రంలో చిన్న బీట కనిపిస్తే, దాని మెరుపు తగ్గకపోవచ్చు కానీ దాని విలువ తరిగిపోతుందిగా!!


మా నాన్నగారు తను చేసిన ప్రతి కొత్త ప్రోగ్రామ్ ని పేద్ద సౌండ్ పెట్టుకుని పదే పదే రోజూ కొన్నాళ్ల పాటు వినేవారు. ఏమిటో అన్నిసార్లు ఎలా వింటారో అనుకునేదాన్ని. చిత్రదర్శకుడు మహా ఒక ఇంటర్వ్యూలో చిత్రాన్ని రెండువేలసార్లు చూసుకుని ఉంటాను అంటుంటే అనిపించింది.. ఎవరి సృష్టి వారికి ఆనందం. తల్లి అప్పుడే పుట్టిన తన పిల్లలను పదే పదే చూసుకుని మురిసిపోయినట్లు, ఫీల్డ్ లోని ఆర్టిస్ట్ కైనా అంతేనని అనిపించింది. దర్శకుడి కష్టానికి తగ్గట్లుగా భగవంతుడు మంచి ప్రొడ్యూసర్ ని కూడా సమకూర్చాడు. చిత్రంలో ఒక కీలకమైన పాత్రని పోషించి తనలోని నటనా ప్రతిభను కూడా చూపెట్టారు అమెరికన్ డాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారు. గడ్డం- సలీమా ప్రేమకథే కాస్తంత కర్చీఫుకి పని చెప్పింది కూడా.

ప్రేక్షకులు ఉత్సాహంగా చిత్రాన్ని ఆదరించి, యువ దర్శకుడికి మరిన్ని అవకాశాలు వచ్చి, /మా బెజవాడ అబ్బాయి లోపాలు లేని మరిన్ని అద్భుతమైన సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 
 








 
 
 
 
 

 

Thursday, May 10, 2018

'మహానటి'ని చూసాకా...



కొన్ని సినిమాలు చాలా బావుంటాయి. చూసేసి ఇంటికి రాగానే ఎవరికైనా చాలా చెప్పాలనిపిస్తుంది. కానీ కొన్ని సినిమాలు చూశాకా అసలేమీ మాట్లాడాలనిపించదు. అలా మౌనంగా చాలా సేపు ఉండిపోవాలనిపిస్తుంది.


పునర్జన్మలు, ఋణాలు, పాపాలు, కర్మలు... ఇలా మనం ఎన్ని కబుర్లు విన్నా, ఎంత విద్యని సంపాదించినా, ఎంత తెలివైనవారైనా మనిషిగా పుట్టాకా ఎప్పుడో అప్పుడు అజ్ఞానానికి లొంగిపోయి, జీవితమనే మాయాజాలంలో ఇరుక్కుపోయి, ఇదే శాశ్వతమనుకుని అల్లకల్లోలంగా జీవించేస్తుండగా.. కొన్ని సంఘటనల ద్వారానో, ఎవరో మనుషుల ద్వారానో ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లు కళ్ళ ముందుకు జీవితసత్యాన్ని అవిష్కరింపజేస్తాడు దేవుడు. ఇదిరా బాబూ జీవితమంటే.. ఇక్కడ నుండి నువ్వు కట్టుకుపోయేదేమీ లేదు. ఈ సత్యాన్ని గుర్తించు అని. సత్యాన్ని చూపెట్టే అలాంటి కొన్ని మెరుపుల్లో ఒక మెరుపు ఈ సినిమా!

 
ఇలాంటి సినిమా చూసినప్పుడు కధేమిటి? నటీనటులెవరు? టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? అన్న ప్రశ్నలు స్ఫురించవు. అలాంటి ఒక జీవితాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలో అర్థమౌతుంది. నా వాళ్లు నా వాళ్ళు అని నమ్మినవాళ్ళు ఎంతటి వెన్నుపోటు పొడవగలరో; సుఖంగా ఉన్నప్పుడు చుట్టూ చేరిన వాళ్ళు కష్టం వచ్చినప్పుడు ఎలా మాయమైపోతారో, బాగున్నావా అని కాదు కదా అసలు బ్రతికున్నావా లేదా అని కూడా అడగరని; ముక్కలైన హృదయం శరీరంలో రోగాన్ని మాత్రమే పెంచుతుందని జీవితంలో మోసపోయినవారికీ, ఎదురుదెబ్బలు తిన్నవాళ్ళకే కదా బాగా తెలిసేది.

తెలివిగా ఉండి, అంతటి ప్రతిభ ఉండి, ధైర్యం ఉండి, అంతటి తెగింపు ఉండి కూడా ఒకే ఒక తప్పటడుగు వల్ల సర్వం కోల్పోయిన ఆ మహామనీషి, మహానటి ఏం సాధించింది  అంటే...
"స్మృతి మాత్రమే కదా చివరికి మిగిలేది..." అని పాటలో చెప్పినట్లు.. లక్షల హృదయాల్లో ఒక కమ్మని కలగా, ఒక మధురమైన స్వప్నంలా, ఒక తియ్యని జ్ఞాపకంగా మిగిలిపోయింది..!

 
సావిత్రి పాత్రను అసలు ఎవరూ తెరపై పోషించలేరు అనే చాలామందికి కలిగిన అనుమానాన్ని కీర్తి సురేష్ మటుమాయం చెయ్యడం వెనుక ముఖ్యంగా ముగ్గురి కృషి ఉంది అనిపించింది నాకు. దర్శకుడు, నటి, ఆమెకు మేకప్ చేసిన మేకప్ మాన్. ఈ ముగ్గురి సమిష్టి కృషికి ఈ పాత్ర ఈమే చెయ్యాలని దైవ సంకల్పం కూడా తోడైంది అని కూడా అనిపించింది చిత్రాన్ని చూస్తూంటే. ముఖ్యంగా విరామం తరువాత కొన్ని సన్నివేశాల్లో నిజంగా సావిత్రిగారే మళ్ళీ కనిపిస్తున్నట్లు అనిపించింది.

 

ఇంతకన్న మరేమీ రాయాలని లేదు..  హేట్సాఫ్ టు ద డైరెక్టర్!

 
 

Monday, March 26, 2018

నీదీ నాదీ ఒకే కథ



"హృదయమెంత తపిస్తే... బతుకు విలువ తెలిసింది. 
గుండెనెంత మథిస్తే... కన్నీటి విలువ తెలిసింది. 

చీకటసలే లేకుంటే... వెన్నెలకేం విలువుంది. 
నిన్న ముగిసిపోయాక... నేటి విలువ తెలిసింది"

చాలా రోజులకి ఒక అద్భుతమైన చిత్రాన్ని చూసానన్న ఆనందంతో కుర్చీలోంచి లేవబోతూంటే స్క్రోలింగ్ టైటిల్స్ తో పాటూ మొదలైన ఈ పాట మళ్ళీ కూర్చోపెట్టేసింది.. అప్పటికే తుడిచి తుడిచి చెమ్మగిల్లి ఉన్న కళ్ళు మరోసారి మసకబారాయి.

పాలలో బియ్యం ఉడికాకా, నేతిలో ఎర్రగా వేగిన పెసరపప్పు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి, సమ పాళ్లలో తగినంత తీపి వేసి వండిన చక్కని చక్రపొంగలిలో.. చివరిలో చిటికెడు పచ్చకర్పురం వేస్తే ఎంత అద్భుతమైన రుచి వస్తుందో - అలా ఉంది సినిమా చివర్లో వచ్చిన ఈ కవితా గానం - like a tasty topping on an already delicious cake - మనసుని ఎంతగానో కదిలించింది !!

చాలా వరకు మన సినిమాల్లో..
1) ఒక హీరో ఉండుట. అతడొక హీరోయిన్ ని చూచుట. ఆమెను ఒప్పించుట కొరకు అష్టకష్టాలు పడుట.
2) ఒక హీరో ఉండుట. అతడికి ఆల్రెడీ ఒక హీరోయిన్ పరిచయం ఉండుట. వారి ప్రేమను గెలిపించుకునేందుకు అష్టకష్టాలు పడుట.
3) ఒక హీరో ఉండుట. హీరోయిన్ కాదందని, లేదా విధి విడదీసిందనో జీవితాన్ని నాశనం చేసుకొనుట.
4) ఒక హీరో ఉండుట. అతగాడికి కనబడ్డ అమ్మాయి మాత్రమే ప్రపంచంలోకెల్లా అద్భుతమైన సౌందర్యరాశి అయి ఉండుట. ఆమె కోసం ఏం చెయ్యడానికైనా సిధ్ధమయిపోయి, రకరకాల విలన్లతో రకరకాల యుధ్ధాలు చేయిట.
సినిమా అంటే 90% ఇవే కథలు. వీటిల్లో కొన్ని అంటే 10% సినిమాలు పాటల వల్లో, కథనం వలనో మనం ఇంప్రెస్ అయి బావుందనుకుంటాం. కానీ అసలు ఇవి తప్ప వేరే కథాంశాలే దొరకవా? జీవితం అంటే అబ్బాయి, అమ్మాయి కలుసుకోవడమో, లేక తప్పనిసరిగా ఎవరినో ఒకరిని ప్రేమించి తీరాలి అనో చూసేవాళ్లకి బోధించే విధంగా ఎందుకిలాంటి సినిమాలు తీస్తున్నారు అని ఎన్నోసార్లు అనుకుంటూంటాను. ఈమధ్యకాలంలో కాస్తంత మార్పు వచ్చి డిఫరెంట్ మూవీస్ వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు (అంటే భారీ తారాగణం, బడ్జెట్ లు లేనివి) విభిన్నమైన ఇతివృత్తాలతో బావుంటున్నాయి. కానీ కమర్షియల్ ఎలిమెంట్ నుండి తప్పించుకోలేకపోతున్నాయి. ఓ ఫైట్, లేదా బలవంతంగా కథలో దూర్చిన ఐటెమ్ సాంగ్ లేకుండా సినిమా రావట్లేదు. ఇంకా ముఖ్యంగా "స్మోకింగ్ & డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టూ హెల్త్" అంటూనే సిగరెట్టు, మందు సిన్లు లేకుండా అసలు సినిమా ఉండట్లేదు. ఒక తండ్రి పాత్రధారి కొడుకుతో పాటూ తాగడం లాంటి దురదృష్టకరమైన సన్నివేశాలు కూడా కొన్ని సినిమాల్లో చూస్తున్నాం. ఇదేమిటని ఎవరినైనా ప్రశ్నిస్తే ఇవాళ సో కాల్డ్ ఫ్యాషనబుల్, కల్చర్డ్ సొసైటీలో ఇదొక క్యాజువల్ విషయం అని కొట్టిపారేస్తున్నారు. కానీ ఇలా చూపించడం అనేది యువత పై ఎటువంటి దుష్ప్రభావాన్ని కలిగిస్తోందో ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇలాంటి కమర్షియల్ మొహమాటాలు లేకుండా చాలా మామూలుగా, నిజాయితీగా ఉన్న సినిమా "నీదీ నాదీ ఒకే కథ". 

పరీక్షలతో, పోటీ ప్రపంచంతో పోరాడుతూ స్కూళ్ళలో , కాలేజీల్లో నలిగిపోతున్న విద్యార్థులకు, వారిని స్టేటస్, పెద్ద ఉద్యోగాలు, డబ్బు సంపాదన పేరిట పోటీల చట్రంలో ఇరికించేస్తున్న తల్లిదండ్రులకు ఈ సినిమా పెద్ద కనువిప్పు. జీవితం అంటే ఉద్యోగం, డబ్బు సంపాదన కాదు... సంతోషంగా జీవించడం అని చెప్పే ఒక్క సినిమా ఇన్నాళ్లకు వచ్చిందని చాలా సంతోషం కలిగింది. ఇటువంటి ఇతివృత్తాన్ని ఎన్నుకున్నందుకు, దానిని న్యాయంగా చిత్రీకరించినందుకు దర్శకుడికి హేట్సాఫ్ ! 

నాకు బాగా నచ్చిన మరో అంశం ఏమిటంటే, అంతటి సంఘర్షణతో మనసుతో యుధ్ధం చేస్తున్నా, హీరో పాత్ర ఎటువంటి చెడు అలవాట్ల వైపుకీ వెళ్లకపోవడం. తండ్రి 'చావరాదా..' అని తిట్టినా కూడా ఆత్మహత్య లాంటి పిరికి ప్రయత్నాలు చెయ్యకపోవడం. సినిమా హీరోలో  హీరోయిజం చూసి , మనలో లేనిదాన్ని ,కావాలనుకునేదాన్ని హీమాన్ లాంటి హీరోలని చూసి హీరో పట్ల ఎడ్మిరేషన్ పెంచుకుంటాం మనం. కానీ ఎప్పుడైతే మనలో ఉండే బలహీనతలనీ, పిరికితనాన్నీ, పొరపాట్లనీ ఒక హీరోలో చూస్తామో, అప్పుడు మనతో పోల్చుకుంటాం. ఇతనూ మన తోడి వాడే అన్న ఆత్మీయత పెరుగుతుంది. శ్రీ విష్ణు గత సినిమా(మెంటల్ మదిలో) లోనూ , ఈ సినిమా లోనూ కూడా అదే తరహా - సామాన్య మధ్య తరగతి కుర్రాడి పాత్ర - పోషించడం వల్ల, కమర్షియల్ ఇమేజ్ కు భిన్నంగా ఉండడం వల్ల నటుడిగా అతను ప్రేక్షకులని బాగా మెప్పించగలిగాడు. తండ్రి ని ఎలాగైనా కన్విన్స్ చెయ్యాలని, తన పాయింట్ ఆఫ్ వ్యూ ని తండ్రికి అర్థం అయ్యేలా చెయ్యాలని సాగర్ పడిన తాపత్రయాన్ని ఎంతో కన్విన్సింగ్ గా చూపెట్టగలిగాడు. అమేజింగ్ టాలెంట్! కొందరు మంచి నటుల్లా కమర్షియల్ సినిమాల ఉచ్చులో పడకుండా ఉంటే తెలుగు సినిమాల్లో మరో మంచి నటుడు మిగులుతాడు.

ఈ చిత్రంలో నేపథ్య సంగీతం కూడా కథకు అనుకూలంగా ఉండి, సన్నివేశం తాలుకూ ఫీల్ ని ఇంకా ఎలివేట్ చేసింది. సాగర్ ఇంట్లోంచి వెళ్ళిపోయే దృశ్యంలో ఏ సంభాషణా అవసరం లేకుండా నేపథ్య సంగీతం తో సన్నివేశాన్ని పండించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఏ ఒక్క సన్నివేశం లోనూ కొత్త దర్శకుడు అనిపించలేదు. ఎంతో అనుభవజ్ఞుడైన దర్శకుడి చిత్రం చూసినట్లే అనిపించింది. పాత నలుపు-తెలుపు సినిమాల్లో రమణారెడ్డి తరువాత నెల్లూరు యాసను అంతే చక్కగా ఈ సినిమాలోనే విన్నాననిపించింది. సాగర్ తల్లి, తండి, చెల్లి, హీరోయిన్ లే కాక చిన్న చిన్న పాత్రధారులందరూ ఎవరికి వారే మెప్పించారు. 

రియలిస్టిక్ గా ఉన్నా కూడా నాకు నచ్చని ఒకే ఒక సన్నివేశం ఏమిటంటే, హీరో చెల్లెలిని కాలితో తన్ని లేపడం. చాలా ఇళ్ళల్లో అలానే జరుగుతుంది కానీ తెరపై చూపెట్టేప్పుడు అదంత సమంజసం కాదని నాకు అనిపించింది. వయసులోకి వచ్చిన తోడపుట్టినవారిని లేదా కూతురిని ఒక స్త్రీగా గౌరవించాలి. ఎక్కడపడితే అక్కడ తన్నకూడదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. 

వేణు ఊడుగుల గారు ఇంకెన్నో మంచి, ఉపయోగకరమైన సినిమాలు తీయాలని, తద్వారా యువత ఆలోచనల్లో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దేశజనాభాలో ఎక్కువ శాతం యువతే ఉన్నారు. వారు సరైన మార్గంలో నడిస్తే కుటుంబాలు బావుంటాయి. సమాజం బాగుపడుతుంది. తెలుగు ప్రేక్షకులం ఇటువంటి చిత్రాలను ప్రోత్సహిస్తే, మరిన్ని మంచి సినిమాలు మన తెలుగు తెరకు అందించేందుకు దర్శకులకు బలాన్ని అందించినవాళ్ళమౌతాము.