సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, May 29, 2014

మాయా మోహము మానదిది..



ఆ మధ్యన నాన్నగారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ సీడీ ఇచ్చారు. ఏంకర్/జర్నలిస్ట్ 'స్వప్న సుందరి' పాడిన క్లాసికల్ ఫ్యూజన్ ఆల్బం అది. భావయామి సీడీలో ఏడు అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి. ఫ్యూజన్ మిక్స్ చేసిన స్వరకర్త ప్రాణం కమలాకర్ గారు(వాన, ప్రాణం చిత్ర సంగీత దర్శకులు). వీరు మంచి ప్లూటిస్ట్ కూడా. ప్రముఖ వేణుగాన విద్వాంసులు శ్రీ శ్రీనివాసన్ గారి వద్ద వేణుగానమభ్యసించారు. ఎంతో చక్కగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ ఫ్యూజన్ స్వరాలను సమకూర్చారు కమలాకర్ గారు. స్వప్న కూడా అంతే చక్కగా ఆలపించారు కీర్తనలను. 


ఈ సీడీలో నాకు బాగా నచ్చినది రెండ వ కీర్తన "మాయా మోహము". సీడీలో ఉన్న ఈ కీర్తన తాలూకూ ఒరిజినల్ ట్యూన్ అందించినది శ్రీ మల్లాది సూరిబాబు గారు. "జోగ్ రాగ్" లో అనుకుంటా చేసారు. మల్లాది సూరిబాబు గారి ఏ ట్యూన్ అయినా ఎంత బావుంటుందో అంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది. శాస్త్రీయ సంగీతం బాగా వచ్చినవాళ్ళు తప్ప మామూలు గాయకులు ఆ గమకాలను పలకలేరు. శాస్త్రీయ సంగీతం మీద ఉన్న అభిమానంతో స్వప్న ఆల్ ద వే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళి వస్తూ కొన్నాళ్ళు సూరిబాబు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. అందువల్ల నాకీ కీర్తన విOటూంటే సూరిబాబు మావయ్యగారు పాడుతున్నట్లే ఉంది.




 

పూర్తి సాహిత్యం:


మాయా మోహము మానదిది
శ్రీ అచ్యుత నీ చిత్తమే కలది
((మాయా మోహము ))

౧చ: ఎంత వెలుగునకు అంతే చీకటి
ఎంత సంపదకు అంత ఆపద
అంతటనౌషధమపథ్యమును సరి
వింతే మిగిలెను వేసటే కలది
((మాయా మోహము))

౨చ: మొలచిన దేహము ముదియుటకును సరి
తలచిన దైవము తనలోనే
ఇలలో శ్రీవేంకటేశ నీ కరుణ
గలిగిన మాకెల్ల ఘనతే కలది
((మాయా మోహము))

౩చ: చేసిన కూలికి జీతమునకు సరి
పూసిన కర్మ భోగము సరి
వాసుల జన్మము వడి మరణము సరి
ఆశల మిగిలిన తలపే కలది
((మాయా మోహము))

***   ***   ***


సంగీత దర్శకులు, ఫ్లూటిస్ట్ 'కమలాకర్' గారి స్వప్న చేసిన ఇంటర్వ్యూ: 




Wednesday, May 28, 2014

ఐదేళ్ల పయనం...






ఇవాళ్టికి ఐదేళ్ళు పూర్తవుతుంది నే బ్లాగ్ మొదలుపెట్టి..! 100, 200, 300 అని బ్లాగ్ పోస్ట్లు లెఖ్ఖపెట్టుకుంటుంటాను కానీ బ్లాగ్ పుట్టినరోజు నేనెప్పుడూ చేసుకోలేదు ఈ ఐదేళ్లలో. చాలా పెద్ద పోస్ట్ రాసాను ఇందాకట్నుండీ కూచుని.. కానీ ఎందుకో అనిపించింది...ఎందుకు ఇవన్నీ రాయడం... నేనేమిటో తెలిసినవాళ్ళు... నన్ను అర్థం చేసుకున్నవాళ్ళు నా రాతలని అభిమానంతో చదువుతూనే ఉంటారు. అర్థం చేసుకోనివాళ్లకు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా ఎలానూ అర్థం చేసుకోరు.. అనిపించి మొత్తం డిలీట్ చేసేసా :-)


నన్ను ప్రోత్సహిస్తూ, నా బ్లాగ్ కబుర్లన్నీ ఓపిగ్గా వింటూ, తోచిన సలహాలిస్తూ సహకరిస్తున్న శ్రీవారికి బ్లాగ్ముఖంగా బోళెడు థాంక్యూలు. మొదట్లో చదివేవారు కాదు కానీ ఇప్పుడు నా ప్రతి పోస్ట్ కీ ఫస్ట్ రీడర్ తనే. ఏవైనా మార్పులు కూడా చెప్తూంటారు. ఇక ఇప్పుడు ఏం చేసినా, ఏం రాసినా తనకి చూపించడం, తన సలహా తీసుకోవడం అలవాటైపోయాయి నాకు. ఇంకా నేను బ్లాగింగ్ చేస్తుండటానికి కారణం తనే. నే మానేస్తానన్న ప్రతిసారీ ఎన్నో ఉదాహరణలూ, సలహాలూ చెప్పి నాకు ధైర్యాన్ని ఇస్తారు. "తృష్ణ" గా నాకొక ఉనికి ఏర్పడి, నా ఈ బ్లాగ్ పయనంలో విజయాలేమైనా చూసానూ అంటే..అన్నీ తన వల్లే! తన ప్రోత్సాహం వల్లే! 


ఎవరి జీవితంలో అయినా ఐదేళ్ళంటే చాలా విలువైన సమయం.. ఈ సందర్భంగా.. ఈ ఐదేళ్ల పయనంలో నా వెంట ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన నా బ్లాగ్ రీడర్స్ కీ, ఇంకా బ్లాగ్మిత్రులందరికీ మరోసారి మన:పూర్వక ధన్యవాదాలు. 

 

Tuesday, May 27, 2014

రామా లాలీ మేఘశ్యామా లాలీ..


ఒక మధురమైన జోల పాట..
చిన్నప్పుడు మా కోసం అమ్మ పాడేది... 
ఇప్పుడు మా మేనకోడలి కోసం పాడుతోంది.. 
భద్రాచల రామదాసు రచన ఇది... 
క్రింద వీడియోలో పాడినది: సింధు సుచేతన్

 

సాహిత్యం :

రామా లాలీ మేఘశ్యామా లాలీ 
తామరస నయన దశరధ తనయ లాలి (౨) 
చ: అచ్చ వదన ఆటలాడి అలసినావు రా
బొజ్జలో పాలు అరుగుదాక నిదుర పోవురా 
 ((రామా లాలీ..)) 
చ: జోల పాడి జో కొట్టితే ఆలకించేవు 
చాలించి మరి ఊరకుంటే సంజ్ఞ చేసేవు 
((రామా లాలీ..)) 
చ: అద్దాల తొట్టిలోన అమరి వున్నావు  
ముద్దు పాప ఉన్నాడంటే మురిసేవు 
((రామా లాలీ..))
చ: ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతు రా 
ఇంతుల చేతుల కాకాలకు ఎంతో కందేవు
((రామా లాలీ..))

Monday, May 26, 2014

మూలింటామె


నామిని ‘మూలింటామె’ నవల చదివాకా బాపూ రాసిన ఉత్తరం చదివిన తర్వాత బజార్లో కెళ్ళినప్పుడు ముందరా పుస్తకం కొని తెచ్చుకున్నా. అంతకు ముందు 2000లో పబ్లిష్ అయిన నామిని గారి సంకలనం "అమ్మకి జేజే" మాత్రమే చదివాను. 'అమ్మ' గురించి బాపురమణలు, బాలు, బాలమురళిగార్లు..మొదలైన ఒక 17మంది ప్రముఖులతో చెప్పించి, దాన్ని ఆంధ్రజ్యోతి వీక్లీ లో అచ్చువేసి, తరువాత వాటన్నింటినీ అమ్మకి జేజే పొందుపరిచారాయన. ఇవన్నీ వేరే వాళ్ళ వ్యాసలే తప్ప ఆయన రచన కాదు. సో, ఇప్పటిదాకా విలక్షణమైన ఆయన రచనాశైలిని గురించి విన్నా కానీ వీరి రచనలేమీ చదవలేదనే చెప్పాలి. అందువల్ల మొదట వారి రాయలసీమ మాండలీకం చదవడం నాకు పరీక్షగా మారింది.  మామూలుగా ఓ వంద పేజీల పుస్తకం గంట-రెండుగంటల్లో చదివేస్తాను నేను. అలాంటిది ఎంతో నెమ్మదిగా చదివితే తప్ప అసలు మొదట పది పదిహేను పేజీలు నాకు అర్థం కాలేదు :( కానీ ఒక్కసారి కథలో లీనమైన తర్వాత ఇంక భాష పెద్ద సమస్యగా అనిపించలేదు నాకు. అంతటి పట్టు ఆ కథలో ఉంది. అసలా కథకు ఆ మాండలీకమే సగం ప్రాణం అని కూడా అర్థమైంది. కవర్ డిజైన్ కూడా వైవిధ్యంగా బాగుంది.


’మూలింటామె ’ పుస్తకం అమ్మావాళ్ళింటికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నా. ఆ రాత్రి ఒంటిగంట దాకా చదివి పెట్టిన పుస్తకం అక్కడే తలగడ క్రింద మరిచిపోయి ఇంటికి వచ్చేసా. అంతదూరం మళ్ళీ ఇప్పట్లో వెళ్ళనని కొరియర్లో వెయ్యమన్నా. మధ్యలో వీకెండ్ వచ్చి ఆ కొరియర్ నాకు అందటానికి నాలుగైదు రోజులు పట్టింది. ఈలోపూ నాకు ఆ కథపైనే ధ్యాస.. ఏమై ఉంటుంది.. నారాయుడు మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడా? కొనామె సంగతి ఏమౌతుందో? అయ్యో మూలింటామె..ఎలా ఉందో..?  అసలు కొరియర్ మిస్సయిపోతే మళ్ళీ పుస్తకం కొనుక్కోవాలేమో.. అని ఇవే ఆలోచనలు. ఆఖరికి పుస్తకం ఓ సాయంత్రం కొరియర్లో వచ్చింది మొత్తానికి. గభాలున పనులన్నీ పూర్తి చేసేసుకుని పుస్తకం పట్టుకుని కూచున్నా. పూర్తయ్యాకా కథ గురించీ, పాత్రల గురించీ చాలా రాయాలని అనుకున్నా కానీ మాటలు రావట్లే...  ఒక గొప్ప ట్రాజెడీ చదివిన తరువాత కలిగే అనుభూతి మిగిలింది. చెప్పాలంటే there's a feeling of Catharsis.. అని కూడా అనచ్చేమో! మానవ సంబంధాల గురించీ, మనిషి నైజం గురించీ, మనసు లోతుల గురించీ గొప్ప అవగాహన ఉన్న వ్యక్తిగా నామిని గారిని గుర్తించాను నేను.


ఒక మనిషి ఏదన్నా తప్పు చేస్తే, మిగతావారు ఆ తప్పుకి కారణాలు వెతకరు. వెనకేసుకు రారు. ఎదుటి మనిషి దృష్టికోణం లోంచి ఆ తప్పు చెయ్యడానికి వాడి వెనుక ఉన్న పరిస్థితులేమిటని అంచనా వేసే ప్రయత్నం అసలే చెయ్యరు. పొరపాటున ఒక్క పొరపాటు దొర్లటం ఆలస్యం.. వీడెప్పుడు పొరపాటు చేస్తాడా అని కాచుక్కూర్చున్న జనం.. ఇన్నాళ్ళకు దొరికాడు కదా అన్నట్లు కాకుల్లా పొడిచేస్తారు. అనాల్సిన మాటలు, అనకూడని మాటలూ, నిఘంటువుల్లో పదాలు వెతొక్కొచ్చి మరీ కడిగిపారేస్తారు. జనాలకూ గొర్రెల మందకూ పెద్ద తేడా లేదు. మొదట నిలబడ్డవాడు ఏది చేస్తే వెనకున్నవాళ్ళు అదే చేస్తారు. జనంలో ఉన్న ఈ బలహీనతను పట్టుకున్నారు నామిని. "మూలింటామె" కథలో జనాలలో, సమాజంలో ఉన్న ఈ బలహీనతను ఎత్తి చూపారు నామిని.


చదువురాని ముసలి అవ్వ మూలింటామె. ఆమె పేరు కుంచమమ్మ. కుంచమమ్మ కూతురు మొగిలమ్మ. కొడుకు నారాయణ సామి నాయుడు. మొగిలమ్మ కూతురు రూపావొతి. మనవరాలిని కొడుక్కిచ్చి సంబంధం కలుపుకుంటుంది కుంచమమ్మ. రూపావొతికి ఇద్దరు బిడ్డలు. ఊళ్ళో ఒక మూలన వాళ్ల అడ్డాపిల్లుండటం వల్ల వాళ్ళూ "మూలింటోళ్ళు" గా పిలవబడుతుంటారు. ఆడ్డాపింట్లోని ముగ్గురాడవాళ్ళూ మొదుటామె, నడిపామె, కొనమ్మిగా పిలవబడుతుంటారు. హటాత్తుగా కొనమ్మి ఇల్లు వదిలి వెళ్పోవడంతో కథ మొదలౌతుంది. కాసేపటికి ఆమె కళాయోడితో తిరప్తి కి పోయిందని తెలిసి ఊరూవాడా ఇంటి ముంగిట్లో పోగవుతారు. మూలింటోళ్ళ బాగుని ఓర్వలేనివాళ్ళంతా అవకాశం దొరగ్గానే నానారకాల మాటలు మొదలొడతారు. ముఖ్యంగా రంజకం, మొలకమ్మ మొదలైనవాళ్లయితే ఇక దొరికినప్పుడల్లా మాటల తూటాలు పేలుస్తూ మూలింటోళ్ళకు ఊపిరిసలపనివ్వరు. మొదటామె కు మనవరాలంటే పంచప్రాణాలు. చివరిదాకా కొనామె పైనే ప్రాణాలు ఉంచుకుని తిరిగివస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తుందా ముసలి ప్రాణం. కొనామె తిరిగిరాకపోవడం కూడా లోపల్లోపల ఆనందమే ఆమెకు. మనవరాలెంత అభిమానవంతురాలో అని లోలోపల మురుస్తుంది. బీమారం నుండి వచ్చిన తన అక్క పోరు, ఊరోళ్ళ బలవంతం మీద కొడుక్కి మరొక పెళ్ళి చెయ్యక తప్పదు. అయితే, కోడలుగా ఇంటికొచ్చిన పందొసంత తో మాట్లాడదు. కోడలు చేతి చేతి గంజినీళ్ళు కూడా ముట్టదామె. అంత పట్టుదల మూలింటామెది. మనవరాలి స్థానాన్ని బలవంతంగా ఆక్రమించుకుందని బాధ, కోపం ఒక పక్క ఉండగానే పందొసంత చేసే పనులు ఇంకా చిత్రహింసకు గురిచేస్తాయి ఆమెని. పందొసంత ఇచ్చే అప్పులకూ, చేసే సహాయాలకూ ఆశపడే ఊళ్ళోవాళ్ళంతా ఆమె పబ్లిగ్గా చేసే తప్పులను ఉపేక్షిస్తూ, జీవితంలో ఒకే ఒక్క తప్పు చేసిన ఉత్తమురాలైన మనవరాలిని పదేపదే దెప్పిపొడవడం సహించలేకపోతుంది మొదటామె.


"మూలింటామె" నవల సమకాలీన సమాజానికొక దర్పణమనిపిస్తుంది నాకు. నారాయణ రెండవ భార్యగా వచ్చిన పందొసంత గురించి చదువుతూంటే కోపం, అసహ్యం, ఆశ్చర్యం, సంభ్రమం లాంటి భావాలన్నీ కట్టగట్టుకుని బుర్రలో నాట్యమాడేస్తాయి. అవును మరి ఇవాళ్టిరోజున బలమున్నవాడిదే పై చేయి. తప్పు చేసినా సరే. ఇవాళ ప్రపంచం ఎలా ఉందో, సగనికి పైగా మనుషులు ఎలా ఉన్నారో వాళ్ళందరికీ సింబాలిక్ గా ఈ ప్రాత్రను సృష్టించారేమో నామిని అనిపించింది. ఈర్ష్య, అసూయ మొదలైన హేయ గుణాలకు ప్రతీకలు రంజకం, మొలకమ్మ, రంగబిళ్ల మొదలైన పాత్రలైతే, ఇంకా లోకంలో అక్కడక్కడా మిగిలున్న మంచీ,మానవత్వాలకు ప్రతీక చీమంతమ్మ పాత్ర. లోకంలో దుర్బలులైనవారికీ, భయస్తులకీ ప్రతీక మొదుటామె. ఈ ముసలి అవ్వ పాత్ర నాకు ఎంతగా నచ్చిందో చెప్పలేను. ఆమెలో ఆమె చెప్పుకునే స్వగతాలూ, మాటలూ, ఇతరుల ప్రశ్నలకు మనసులోనే చెప్పుకునే సమాధానాలూ చదివి తీరాల్సిందే. మనవరాలి పోటోను ఎదన బెట్టుకుని తెల్లార్లూ మొదుటామె చెప్పుకునే మాటలు విని గుండెలు ఎంత నీరౌతాయో, ఆమెతో చీమంతమ్మ అన్న మాటలు విన్నాకా "ఈ మాత్రం గుండెల్నిండికీ గాలి బీల్చుకోని ఎన్ని జాములైంది మూలింటామెకి!" అన్న వాక్యాలు చదివి మనసు అంత కుదుటపడుతుంది పాఠకులకు.


మొదుటామె వ్యక్తిత్వం, ఆమె జీవితం, ఆమె ముగింపు అన్నీ చదివాకా మొదట్లో చెప్పినట్లు మనసులో ఏదో ప్రక్షాళన జరిగిన భావన కలుగుతుంది. "నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతేగాని, మియాం మియాం అంటూ నీ కాళ్ల కాడా నా కళ్ల కాడా చూట్టుకలాడే పిల్లిని చంపలేదే!" అన్న ఆమె మాటలు పుస్తకం మూసేసిన తర్వాత కూడా చెవుల్లో వినబడుతూ ఉంటాయి. మనవరాలిని అర్థం చేసుకుని క్షమించగలిగిన అంతటి విశాల హృదయం ఎంతో ఎత్తులో ఉండే విద్యావంతుల్లో కూడా కనబడదు. మనసున్న ప్రతి మనిషి మనసునీ తప్పక తాకే కథ ఇది.


Saturday, May 24, 2014

అక్కినేని కోసమే 'మనం'


ఈ సినిమా చూడాలనుకోవడానికి ఏకైక కారణం నాగేశ్వర్రావ్. మరొక్కసారి స్క్రీన్ మీదైనా సజీవంగా నాగేశ్వరావ్ ని చూడాలన్న కోరిక. ఆ కోరిక తీరింది. తెరపై డైలాగులు చెప్తూ, నవ్వుతూ చూస్తున్న అక్కినేనిని చూస్తుంటే మనసులో ఏమూలో ఉండిపోయిన బాధకి కాస్త ఉపశమనం కలిగింది. ఈ ఒక్క ఆనందం కోసం "మనం" చూడచ్చు. 


చిత్ర కథ అద్భుతమైనదేమీ కాదు. మామూలు తెలుగు సినిమాలలోలాగనే అవాస్తవికంగానే ఉంది. కానీ అటువంటి కథని దర్శకుడు ప్రేక్షకులను ఆకట్టుకునేలా నడిపించిన తీరు ప్రశంసనీయం. మొదటి భాగం కాస్త స్లో గా నడిచింది. రెండవ భాగంలో జరగాల్సిన కథ ఎక్కువగా  ఉండటం వల్ల సెకెండ్ హాఫ్ బాగుంది. నాగేశ్వరరావు ఉన్న ప్రతి సన్నివేశాన్నీ రెండూ కళ్ళూ చాలవన్నంత ఇదిగా, ఆత్రంగా చూశాను నేనైతే. మరి మళ్ళీ ఇంకెప్పుడూ కనపడ్డు కదా :(


నాగార్జున చాలా స్మార్ట్ గా ఉన్నాడు. కొడుకుతో డాన్స్ చేస్తూంటే, కొడుకు కన్నా తండ్రే బాగున్నాడు అనిపించింది. శ్రియా బాగా చేసింది. ముఖ్యంగా ఫ్ల్యాష్ బ్యాక్ సీన్స్ లో. ఈ అమ్మాయి కళ్ళు నాకు చాలా నచ్చుతాయి. సమంత కూడా తన వంతు న్యాయం చేసింది. ఎటొచ్చీ నాగచైతన్య పాత్ర గురించే ఆశ్చర్యం వేసింది. అందరి పాత్రలకీ కాస్తో కూస్తో వెయిటేజీ ఉంది కానీ అతని పాత్ర ఎటూ కాకుండా అయినట్లనిపించింది. గత జన్మలో నాగార్జున తండ్రి అన్న ఒక్క పాయింట్ తప్పించి అతని పాత్రలో చిన్న ప్రత్యేకత కూడా లేకపోవడం వల్ల ఆ పాత్రకు అస్సలు వెయిటేజ్ లేకుండా పోయింది. ఎయిర్ హోస్టస్, మహిళా పోలీస్ తో సహా ఆడవాళ్లందర్నీ అలా చూడ్డం నాకసలు నచ్చలేదు. పైగా ఆరోగ్యానికి హానికరం అని చూపెడుతూనే గ్లాసులకి గ్లాసులు తాగేసినట్లు చూపించడం..ప్చ్!!  కానీ తాత, తండ్రి, కొడుకూ ముగ్గురూ ఉన్న సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. థియేటర్లో అంతా కూడా కేకలూ, చప్పట్లు. ANR ఆ వయసులో, అనారోగ్యంతో కూడా అంత ఉత్సాహంగా డైలాగ్స్ చెప్పడం అబ్బురమనిపించింది. నాగేశ్వరావ్ లోని ఆ 'డేడికేటెడ్ ఆర్టిస్ట్' నే నేను ప్రేమించేది. ముగ్గురి పేర్లు అలా మిక్స్ చేసి పెట్టడం బాగుంది.

అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్యసంగీతం బాగుంది. ముఖ్యంగా నాగేశ్వరరావు ఉన్న సీన్స్ లో పియానో, హార్మోనికా, వయోలిన్స్ కలిపి చేసిన ఒక స్పెషల్ musical bit రిపీటవుతూంటుంది. ఆ థీం మ్యూజిక్ బాగుంది. దాన్నే సినిమా భాషలో 'రికరింగ్ రిథిమ్' లేదా 'Leitmotif' అంటారు.


వెకిలి హాస్యం లేదు. గాల్లో ఎగిరే ఫైటింగ్స్ లేవు. అందుకే సినిమా అయిపోయాకా మనసుకి హాయిగా అనిపించింది. అంతా అంటున్నట్లుగా 'ఫీల్ గుడ్ మూవీ' అన్నమాట. నేను చాలా ఎక్కువగా ఆశించడం వల్లనేమో ఇంకా బాగుండి ఉండచ్చు అనిపించింది కానీ బాలేదని మాత్రం అనిపించలేదు. అక్కినేని అభిమానులు, నాగార్జున అభిమానులూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక చివర్లో వచ్చిన షాట్ సూపర్. తాత, తండ్రి, ఇద్దరు మనవలు..మొత్తం నలుగురూ నిలబడిన షాట్. 


చివరలో కనబడ్డ అఖిల్ గురించి ఓ మాట... కుర్రాడు చాకులా ఉన్నాడు! ముఖ్యంగా వాయిస్ చాలా బాగుంది. భవిష్యత్తులో ఓ మంచి హీరోని చూడబోతున్నామన్న ఆశ కలిగింది. 


अब के हम बिछड़े तो..




గజల్ రారాజు మెహదీ హసన్ గజల్స్ లో ఇదొకటి చాలా బావుంటుంది. అసలా సాహిత్యం ఎంత గొప్పగా ఉంటుందో!

तू खुदा है, न मेरा इश्क फरिश्तों जैसा
दोनों इंसान हैं तो क्यों इतने हिजाबों में मिले..!


"अब के हम बिछड़े तो शायद कभी ख़्वाबों में मिले
जिस तरह सूखे हुए फूल किताबों में मिले.."
మొదట ఈ పల్లవిని నేను "జుబేదా" సినిమాలో విన్నా. చివరలో కరిష్మా అంటుందీ వాక్యాలు.. అప్పుడవి బావున్నాయని రాసి పెట్టుకున్నా. తర్వాత ఇది మెహదీ హసన్ గజల్ అని తెలిసింది. కవి శ్రీకాంతశర్మ గారు ఓసారి నాన్నగారి ప్రోగ్రాం(నిశ్శబ్దం గమ్యం) కోసం ఈ గజల్ పల్లవిని ఇలా తెలుగీకరించారు ..

"ఇపుడు విడితే ఏమిలే కలిసేము రేపటి కలలల్లో
పుస్తకములో వాడిపోయిన పూలు మిగిలిన తీరుగా.. 
ఇపుడు విడితే ఏమిలే..."

ఎంత బాగుందో కదా! 
ఏదో చిత్రంలో వాడుకున్నారు కూడా ఈ గజల్ ను. ఇదే పాట గజల్ గాయని ఇక్బాల్ బానో పాడినది కూడా ఉంది కానీ మెహదీ హసన్ స్వరంలో ఉన్న మేజిక్ వేరే కదా.

 

 గజల్: अब के हम बिछड़े तो
పాడినది, స్వరపరిచినది: मेहदी हसन
సాహిత్యం: अहमद फ़राज़

 अब के हम बिछड़े तो शायद कभी ख़्वाबों में मिले
जिस तरह सूखे हुए फूल किताबों में मिले

ढूँढ उजड़े हुए लोगों में वफ़ा के मोती
ये खजाने तुझे मुमकिन है खराबों में मिले
((अब के हम बिछड़े))

तू खुदा है न मेरा इश्क फरिश्तों जैसा
दोनों इंसान हैं तो क्यों इतने हिजाबों में मिले
((अब के हम बिछड़े))

ग़म-ए-दुनियां भी ग़म-ए-यार में शामिल करलो
नशा बहता है शराबों में तो शराबों में मिले
((अब के हम बिछड़े))

अब न वॊ मैं हूँ  न  तू  है  न वो माज़ी है फ़राज़
जैसे तुम साये तमन्ना के सराबों में मिले
((अब के हम बिछड़े))

***     ***     ***
కొన్నేళ్ళ క్రితం 'టివిఎస్ సారెగమ' లో మహమ్మద్ వకీల్ అనే అబ్బాయి ఈ గజల్ పాడాడు. ఆ లింక్ కూడా యూట్యూబ్ లో దొరికింది. చిన్నవాడైనా అతని గొంతు ఎంత బావుంటుందో చెప్పలేను. ఆసక్తి ఉన్నవాళ్ళు అతడు పాడిన గజల్ క్రింద లింక్ల్ వినండి..
https://www.youtube.com/watch?v=52tUWl7PcH0

Thursday, May 15, 2014

పాట వెంట పయనం: అల్లరి పాటలు…!




'సారంగ' పత్రికలో వెలువడుతున్న "పాట వెంట పయనం " లో ఈసారి నేపథ్యం 'అల్లరి పాటలు'..!

link:
http://wp.me/p3amQG-2E4




Monday, May 5, 2014

Monpura




బ్లాగుల్లో ఈమధ్యన మిస్సయిన కొన్ని పాత టపాలు తిరగేస్తూంటే సామాన్య గారి 'అమయ' బ్లాగ్లో ఒక పాట కనబడింది. అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉన్న ఆ పాట తాలూకూ సినిమా వివరాలను గూగులించాను. అది "Monpura" అనే బంగ్లా సినిమాలోదనీ, ఆ చిత్రం బాంగ్లా సినీచరిత్రలో కొత్త రికార్డును సృష్టించిందనీ తెలిసింది. చిత్రకథ ఈ మామూలు ప్రేమకథ + విషాదాంతం కూడానూ :( కానీ తన మొదటి సినిమాను దర్శకుడు సృజనాత్మకంగా చిత్రీకరించిన తీరు ప్రశంసనీయం. వందరోజులు ఆడిన ఈ చిత్రం ఐదు జాతీయ పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. "మోన్పురా" దక్షిణ బాంగ్లాదేశ్ లో ఉన్న ఒక అందమైన ద్వీపం. ఈ ప్రాంతం తాలూకూ ఒక జాలరి కుమార్తె విషాదాంత ప్రేమకథే "Monpura" చిత్రకథ.


ఈ చిత్రంలో మొదటగా, ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఫోటోగ్రఫీ, సీనిక్ బ్యూటీ గురించి. చిత్రంలోని పల్లె వాతావరణం, రమణీయమైన ప్రకృతి దృశ్యాలూ ఆనందపరుస్తాయి. యూట్యూబ్ లో మొత్తం చిత్రం ఉంది. కొన్ని సన్నివేశాల్లో అసలు బ్యాక్గ్రౌండ్ దృశ్యాలూ, ఆ ఏంగిల్స్ చాలా బాగున్నాయి. నాయిక కూడా బావుంది. ’సినిమాటోగ్రాఫర్ కమ్రుల్ హసన్ ఖస్రు’ పనితనాన్ని తప్పక అభినందించాలి. తర్వాత సంగీతం. గ్రామీణ చిత్రకథ కాబట్టి సంగీతం కూడా నేచురల్ గా అనిపించాలని బాంగ్లా ఫోక్ మ్యూజిక్ ఆధారంగా తయారుచేసారుట. ఇక ఈ చిత్రంలో పాటల్ని చూసేద్దామా? మొదటిది సామాన్య గారు బ్లాగ్ లో పెట్టినది. చివరిలో ఉన్న ట్రాజిక్ సాంగ్ మినహా మిగతా నాలుగూ కూడా ఇక్కడ లింక్స్ ఇస్తున్నాను. సుందరమైన ప్రకృతినీ, అందమైన చిత్రీకరణనూ చూసి మీరూ ఆనందించండి..


Jao Pakhi Bolo Tare  


 Nithua Pathare  


 Amar Sonar Moyna Pakhi  
 
 Age jodi Jantam


youtube link for the movie:
https://www.youtube.com/watch?v=-R8FmC2v6Uo 



Friday, May 2, 2014

"తెలుగు వెలుగు" పత్రికలో నా 'రుచి..'





మే నెల తెలుగు వెలుగు పత్రికలో నా కుక్కరీ బ్లాగ్ "రుచి...thetemptation "గురించి "అంతర్జాలంలో అమ్మ చేతి వంట" అనే ఆర్టికల్ లో చోటు దొరికింది. ఆర్టికల్ లో నా బ్లాగుని చేర్చిన మధురకు, 'తెలుగు వెలుగు' పత్రిక వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.






Thursday, May 1, 2014

నవలానాయకులు -5




మే నెల "కౌముది"లో ఈ నెల నవలానాయకుడు "అణ్ణామలై". ప్రముఖ తమిళ రచయిత ఆఖిలన్ రాసిన "చిత్తిరపావై"('చిత్రంలోని సుందరి' అని అర్ధం)1975లో ప్రతిష్ఠాత్మకమైన భారతీయ జ్ఞానపీఠ్ అవార్డుని అందుకుంది. ఆ నవలను తెలుగులోకి "చిత్రసుందరి" పేరుతో శ్రీ మధురాంతకం రాజారాం అనువదించారు. "చిత్రసుందరి" కథానాయకుడు అణ్ణామలై గురించి క్రింద లింక్ లో చదవచ్చు:

http://www.koumudi.net/Monthly/2014/may/may_2014_navalaa_nayakulu.pdf