Wednesday, December 24, 2014

ఒకే ఒక్క చంద్రుడు..


ఏమిటో ఏం రాయాలో నిన్నట్నుండీ తోచట్లేదు.. కానీ రాయాలి.. అయ్యో.. మన బాలచందర్ కదా.. అని! "మన" ఏమిటి? అసలు ఒక సినీ నటుడు, ఓ సినీ దర్శకుడు, ఒక రచయిత, ఈ నటి, ఓ గాయకుడు.. వీళ్ళంతా మనకు అసలు ఎందుకు ప్రియమైనవాళ్లయిపోతారు? వాళ్ళకీ మనకీ ఏమిటి స్నేహం? ఏం బంధుత్వం? ఏమిటి సాన్నిహిత్యం? ఏనాటి బంధమిది? మన ఆలోచనలకు, అభిప్రాయాలకూ, అభిరుచులకూ దగ్గరగా ఉండే సినిమాలు, పాటలూ, రచనలూ మనకు నచ్చుతాయి కాబట్టి అవి తయారుచేసినవారు, రాసినవారు, తెరపై చిత్రించినవారు మనకు పరిచయం లేనివారైనా మనకి దగ్గరైపోతారు. అందుకే స్నేహబాంధవ్యాలు లేకపోయినా మనకు ఆత్మీయులు వీళ్ళంతా. 

వారం క్రితం "క్రిటికల్ కండీషన్లో దర్శకుడు బాలచందర్.." అని వార్త చదివిననాడు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నా కూడా లోపలెక్కడో గుబులు.. ఇలాంటి వార్త ఎప్పుడో వస్తుందని..! మరణం అనివార్యం.. ఎప్పటికైనా ఇలాంటి వార్తలు వినక తప్పదు. వారికి సంపూర్ణమయిన జీవితం, పేరు ప్రఖ్యాతలు.. ఉన్నాయి. ఇటువంటి మరణాన్ని గురించి మనం బాధపడకూడదు. కాకపోతే ఇటువంటి గొప్ప దర్శకుడు ఇక మళ్ళీ పుట్టడు. ఏ కళాకారుడైనా ఇదే సత్యం. ఎవరి క్షేత్రంలో వారిదొక ప్రత్యేకమైన స్థానం. భగవంతుడు వారికిచ్చిన ప్రతిభని సమంగా ఉపయోగించుకుని, కొన్ని అద్భుతాలను సృష్టించి, వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అభిమానుల గుండెల్లో పదిలపరుచుకుని కనుమరుగైపోతారు. జన్మ సార్థకం చేసుకుంటారు. అటువంటి ప్రతి కళాకారుడూ ధన్యుడే. బాలచందర్ కూడా ధన్యుడు!! తెలుగువారు కాకపోయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదికాలాలు నిలిచిపోయేలాంటి సినిమాలు తీసి మనకు ప్రియమైన దర్శకుడిగా నిలిచిపోయారు.

అవార్డులు, బిరుదులూ, ప్రముఖ చిత్రాల జాబితాలూ నెట్లో ఎక్కడైనా దొరికేస్తాయి. ఈ దర్శకుడితో నాకున్న అనుబంధాన్ని మాత్రమే ఈ టపాలో రాయదలిచాను. బాలచందర్ అంటే మా ఇంట్లో మనిషి! మాకెవరికీ ఎక్కువ నచ్చని ట్రాజడీలు తీసినా అందరికీ ఇష్టమైన దర్శకుడు. 'బాలచందర్' అంటే నాకు ముందుగా గుర్తొచ్చేది గలగలమని సరిగమలు పలికే సరిత కంఠం. అసలు నాకెంత ఇష్టమో ఆ వాయిస్. ఆ గళంలో పలికే ప్రతి భావం అద్భుతమే. ఇంకా బాలచందర్ అంటే కమలహాసన్, రజనీకాంత్, ఏసుదాస్, జయప్రద, గీత, ప్రకాష్ రాజ్.. మొదలైన నటులు, ఆ తర్వాత టివీలో ప్రసారమైన "గుప్పెడు మనసు", "ప్రేమి" సీరియల్స్. ఈ టివి సీరియల్స్ రెండూ ప్రతి ఎపిసోడ్ మర్చిపోకుండా, మిస్సవకుండా ప్రతి ఫ్రేమ్ ఎంతో శ్రధ్ధగా చూసిన రోజులు గుర్తుకొస్తాయి.


ఇంకా.. బాలచందర్ అంటే స్త్రీలు.. వారి పట్ల గౌరవం..! ఆయన తీసిన ఏ సినిమా చూసినా స్త్రీలపై గౌరవం పెరుగుతుంది తప్ప స్త్రీని ఒక వ్యాపారాత్మక సాధనం లాగ, ఒక విలాస వస్తువులాగ చూడాలనే ఆలోచనే రాదు. అంతటి గొప్ప కథలు వారివి. అసలవి కథలు కాదు. కల్పనలు కావు. జీవితాలు! నిజమైన జీవితాలు.. సంఘర్షణలు.. సమకాలీన సమాజానికి ప్రతిరూపాలు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, ఇళ్ళల్లో వారెదుర్కొనే ఇబ్బందులు, తరతరాలుగా మూగబోయిన వారి కంఠాలు, వ్యధలు.. బాలచందర్ చిత్రాల్లో కనబడతాయి. నిరుద్యోగం, నీటి కొరత మొదలుకొని మద్యపానం వరకూ సమాజంలోని ఎన్నో సమస్యలను తనదైన కళాత్మకమైన శైలిలో తెరకెక్కించారు బాలచందర్.

అయితే ఈయనతో నాకొక్కటే పేచీ ఉండేది.. క్లైమాక్స్. సినిమా అంతా అద్భుతంగా తీసి చివరికి విషాదాంతం చేసేస్తారు. జీవితాన్ని దగ్గరగా చూపించాలంటే వీషాదాంతమే ఎందుకుండాలనేది నా వాదం. ఈ ప్రశ్న వారిని ఎవరైనా ఏదో ఒక ఇంటర్వ్యూ లోనో అడిగే ఉంటారు. "మరో చరిత్ర" సినిమా క్లైమాక్స్ లో అమ్మానాన్న బయటకు వచ్చేసారుట విషాదాంతం చూడలేక. నా చిన్నప్పుడు చూసిన "కోకిలమ్మ" సినిమా అయితే మళ్ళీ రెండోసారి చూసే సాహసం చెయ్యలేదెప్పుడూ! "గుప్పెడు మనసు" సినిమాలో ధైర్యంగా బిడ్డను కన్న సరిత(పాత్ర పేరు గుర్తులేదు) పిరికిగా ఆత్మహత్య చేసుకోవడం అస్సలు నచ్చదు నాకు. "సింధుభైరవి"లో సుహాసినిలా ఎక్కడికో వెళ్పోయినట్లు చూపించి ఉండచ్చు కదా! "ఆడవాళ్ళు మీకు జోహార్లు" సినిమా అంతా చాలా బావుండి, చివరి పదినిమిషాలు కథ మాత్రం చెత్తగా అయిపోయిందనిపిస్తుంది. రాణి పాత్రను చంపివెయ్యటం నాకస్సలు నచ్చలేదు. తగినంత కారణమూ కనిపించదు. మంటల్లో ఉన్న ఇద్దరు మనుషులని రక్షించిన డైరెక్టరు మరో మనిషిని కూడా రక్షించచ్చు కదా..అనవసరంగా చంపేసారు. ఆ రెండో ఆడమనిషితో హత్య చేయించేసి ఆమెనూ జైలు పాలు చేసేస్తారు డైరెక్టర్ గారు:( "డాన్స్ మాష్టర్" తమిళ్ సాంగ్స్ వినీ వినీ, తెలుగు డబ్బింగ్ మూవీ రిలీజ్ రోజే వెళ్పోయాం చూడ్డానికి.. అది విషాదాంతం. ఇదేమిటి ఇలా అని బాధపడిపోయాం. టాక్ చూసో ఏమో.. రిలీజైన కొన్నాళ్ళలో మళ్ళీ కథ సుఖాంతం చేసిన క్లైమాక్స్ పార్ట్ సినిమాకి ఏడ్ చేసారు. అప్పుడు సూపర్ హిట్ అయిపోయిందా సిన్మా :) 


నాకు బాగా ఇష్టమైన సినిమాలు చాలావరకూ బాలచందర్ తీసినవే. ఇది కథ కాదు,  గుప్పెడు మనసు, ఆకలిరాజ్యం, కోకిలమ్మ, రుద్రవీణ, డాన్స్ మాష్టర్ థియేటర్లో చూసాను. 47 రోజులు, తూర్పు పడమర, అంతులేని కథ, మరో చరిత్ర, సంబరాల రాంబాబు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, కల్కి మొదలైనవి, ఆయన తీసిన కొన్ని ఇతర భాషా చిత్రాలు టివీలో వచ్చినప్పుడు చూసా. 


ఒక చిత్రమేమిటంటే "సింధుభైరవి" సినిమా ఇష్టమైనదే కానీ ఇంతదాకా చూడలేదు నేను. ఆ చిత్రం తాలూకూ డైలాగ్స్ ఉన్న ఆడియో కేసెట్ ఉండేది మా ఇంట్లో. అదే కొన్ని వందలసార్లు విని ఉంటాను. ఉదయ్ కిరణ్ తో తీసిన అబధ్ధం చిత్రం సీడీ కొనుక్కున్నా కానీ అది నచ్చలేదు నాకు. ప్రతి దర్శకుడికీ ఒక పీక్ పిరియడ్ ఉంటుందేమో.. అది దాటిపోయాకా తీసిన సినిమాలు ఎందుకో ఆకట్టుకోలేవు. "తన్నీర్ తన్నీర్" లో అనుకుంటా ఎలక్షన్స్ టైం లో ఒక చెట్టుకి మొదట ఒక పచ్చ జండా ఉంటుంది. తర్వాత ఒకొక్కటి చప్పున అన్ని రంగుల జండాలూ ఆ చెట్టుకి కట్టినట్లు చూపిస్తారు. ఎలక్షన్స్ అయిపోయాకా మళ్ళీ చెట్టు ఖాళీ అయిపోతుంది.(అలా అనే గుర్తు) వాళ్ల పరిస్థితి మళ్ళీ యధాస్థితికి వచ్చేసిందని సింబాలిక్ గా చూపిస్తారు. ఇలాంటి సింబాలిక్ సీన్స్ బాలచందర్ సినిమాల్లో బోలెడు దొరుకుతాయి. "ఇది కథ కాదు" సినిమాలో చిరంజీవి,జయసుధ డైలాగ్ సీన్స్ మధ్యన తల ఊపుతూ ఉన్న బొమ్మ ఒకటి చూపెడుతూ ఉంటారు మధ్య మధ్య. ఇలా చెప్పుకుపోతే వాల్యూమ్స్ రాయచ్చు. బాలచందర్ అంటేనే ఒక పేద్ద సెపరేట్ సబ్జెక్ట్. ఎన్ని థీసీస్ లైనా ప్రెజెంట్ చేయచ్చు ఆయన సినిమాలపైన. 


బాలచందర్ చిత్రాల్లో సంగీతానికి పెద్ద పీట ఉంటుంది. వారి చిత్రాల్లో నాకు బాగా నచ్చే కొన్ని పాటలతో ఈ పోస్ట్ ముగిస్తాను... 


 "గుప్పెడు మనసు" లో మౌనమే నీ భాష..  'మరో చరిత్ర' నుండి..  కోకిలమ్మలో "పల్లవించవా నా గొంతులో.."  ఆకలిరాజ్యం నుండి "కన్నెపిల్లవని.."
   డాన్స్ మాష్టర్ లో "రేగుతున్నదొక రాగం.."  

 సింధు భైరవి నుంచి "పూమల వాడెనుగా.."  


 "స్వరములు ఏడైనా రాగాలెన్నో.." తూర్పూ పడమర నుండి..  
 ఇది కథ కాదు నుండి "తకధిమి తక.."  

 అంతు లేని కథ నుండి "దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి" :"ఆడవాళ్ళూ మీకు జోహార్లు" లో టైటిల్ సాంగ్ . నాకు చాలా నచ్చే పాటల్లో ఒకటి. ఆత్రేయ మాత్రమే రాయగలరు అలాంటి సాహిత్యం.  http://www.youtube.com/watch?v=tUULiZT3AbI  <--  యూ ట్యూబ్ movie లింక్లో "1:48:27" దగ్గర పాట మొదలౌతుంది. బాలు పాడిన అతి చక్కని పాటల్లో ఇది ఒకటన్నది నా అభిప్రాయం. 


 "అచ్చమిల్లై అచ్చమిల్లై" అని టివీలో చూశానొకసారి. అందులో పాట ఒకటి..  
 చివరిగా వన్ ఆఫ్ మై ఫేవొరేట్స్ "రుద్రవీణ"..! అందులో ప్రతి పాటా కంఠతా మా ఇంట్లో అందరికీ. అంతలా వినేవాళ్లం. ఆ మొత్తం పాటలున్న లింక్ ఇది: