సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, November 11, 2014

కోటి దీపోత్సవం





నాగయ్య గారి 'త్యాగయ్య' సిన్మాలో ఆయన "ఎందరో మహానుభావులు.." పాడాకా, ఆ సభలో ఒకరు "బ్రహ్మానందాన్ని కలిగించారు త్యాగయ్య గారూ.." అంటారు. అలాక నిన్న అనుకోకుండా మాకు బ్రహ్మానందాన్ని కలిగించారు మా గేటేడ్ కమ్యూనిటీ మిత్రులొకరు. నగరంలో ఎన్.టి.ఆర్. గార్డెన్స్ లో పదిహేనురోజులుగా జరుగుతున్న భక్తి టివీ వారి "కోటి దీపోత్సవం" వి.ఐ.పి పాసులు ఇచ్చారు. మొన్న(ఆదివారం) వాళ్ళు వెళ్తూ వెళ్తూ మమ్మల్నీ తీసుకువెళ్దాం అనుకున్నారుట గానీ మావారి ఫోన్ లైన్ దొరక్క వాళ్ళు వెళ్ళివచ్చేసారుట. అదే మాకు మంచిదయింది. నిన్న కార్తీక సోమవారం నాడు వెళ్ళే అవకాశం దొరికింది. పైగా నిన్నటి మూడవ కార్తీకసోమవారం శివరాత్రితో సమానమట +  కోటిదీపోత్సవం ఆఖరిరోజు కూడానూ. 


మాకు కేబుల్ టివీ లేదని; భక్తి టివీ రెగులర్ ప్రేక్షకురాలైన మా అత్తగారు ఫోన్లో మాకు ఈ కార్యక్రమం తాలూకూ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. జనం బాగా ఉంటారు అని మేము వెళ్ళాలని అనుకోలేదు. వి.ఐ.పి పాస్ అన్నాకా కాస్త దగ్గరగా కూచోవచ్చు కదా అని రెడీ అయ్యాం. ఆఖరిరోజ్ని లేటవుతుందేమో.. మా పాప అంతసేపు కూచుంటుందో లేదో అని భయపడ్డాం కానీ పాపం బానే కూర్చుంది. ఐదింటికి బయల్దేరితే ఆరున్నరకి వెళ్ళాం అక్కడికి. అప్పటికి ఎక్కువ జనం ఇంకా రాలేదు గనుక ముందర్లోనే కూర్చోగలిగాము. గ్రౌండ్ అంతా కార్పెట్లు వేసేసి అందర్నీ క్రిందనే కూచోపెట్టారు. స్టేజ్ మీద వేసిన సెట్ కైలాసం సెట్, అలంకారం బాగున్నాయ్. గ్రౌండ్ లో అక్కడక్కడా శివలింగాలూ, శివుని విగ్రహాలు, పువ్వులతో అలంకరించిన గణేశ, అమ్మవారి ఆకృతులు.. వాటి అంచునే అమర్చిన దీపాలు.. మధ్య మధ్య గుండ్రని స్టాండ్ లలో అమర్చిన ప్రమిదలు.. అరేంజ్మెంట్స్ చాలా బావున్నాయి. చివరి రోజవడం వల్ల బాగా జనం బాగా ఉన్నారు. ఇలాంటి గేదరింగ్స్ కంట్రోల్ చెయ్యడమనేది మాత్రం చాలా కష్టతరమైన సంగతి. 


ప్రమిదల్లో పొయ్యడానికి నూనె బాటిల్స్ పంచారు. జనాలు పదేసి ప్రమిదల్లో ఒక్కళ్ళే  నూనె పోసేయ్యడం.. దీపాలు వెలిగించేప్పుడు కూడా ఒక్కళ్ళే పదేసి దీపాలు వెలిగించెయ్యడం.. కొంచెం నచ్చలా నాకు.:( 
ఎలాగోలా మేమూ ప్రమిదలో నునె పోసి.. చివర్లో తలో దీపం వెలిగించాము.






కార్యక్రమాలు మొదలయ్యాయి. పాటలు, నృత్యాలు అయ్యాకా జొన్నవిత్తుల గారు శివుని గురించీ, కార్తీక దీపాల విశిష్టత గురించీ చెప్పారు. తర్వాత స్టేజీ పైన అందంగా అలంకరించిన మండపంలో "పార్వతీ కల్యాణం" జరిగింది. జరిపించిన పురోహితుడు గారు ఉత్సాహవంతంగా బాగా మట్లాడారు. అది జరుగుతుండగా జనాల మధ్యలో ప్రతిష్టించి ఉన్న శివలింగానికి పెద్దలు అభిషేకాలు చేసారు. కల్యాణం జరిగిన తరువాత శివపార్వతీ విగ్రహాలను జనాల మధ్యకు ఊరేగింపుకు తెచ్చారు. అప్పుడు వెనకాల  
"పౌర్ణమి" చిత్రంలో "భరత వేదముగ" పాట లో లిరిక్స్ రాకుండా మిక్స్ చేసిన మ్యూజిక్ వేసారు. పెద్ద పెద్ద స్పీకర్స్ లో ఆ పాటలోని ఢమరుకనాదాలు, గంటలు, హర హర మహాదేవ నినాదాలు అందరినీ భక్తిసముద్రంలో ముంచేసాయి. నాక్కూడా చాలా ఆవేశం కలిగేసింది ఆ కాసేపు :) 




తర్వాత నిన్న మరొక విశేషం కూడా ఉందిట. "సంకష్టహర చతుర్థి". కాబట్టి గణేశ పూజ కూడా చేసారు. ఆ తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన పదకొండు మఠాల పీఠాధిపతులను స్టేజ్ మీదకి ఆసీనులను చేసారు. వారిలో ముగ్గురు పీఠాధిపతులు తమ సందేశాలను క్లుప్తంగా అందించారు. అవన్నీ ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. హంపీ విరూపాక్షపీఠం నుండి వచ్చిన విరూపాక్షసదానంద స్వామి వారు హంపీ విరూపాక్షుడి గురించి, దీపాలు వెలిగించడం ఎంత మంచిదో చెప్పారు. ఉడుపి నుండి వచ్చిన విశ్వేశ్వర తీర్థ స్వామి వారు హిందీలో మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం జరగడం భాగ్యనగరం యొక్క భాగ్యం అన్నారు. బాగా మాట్లాడారు ఆయన. 




తర్వాత, కార్యక్రమానికి వచ్చిన తమిళ్నాడు గవర్నర్ రోశయ్య గారు చిన్న సందేశాన్ని అందించారు. అప్పుడు, శ్రీపురం బంగారు ఆలయం నుండి వచ్చిన శ్రీలక్ష్మీ అమ్మవారికి  పుష్పయాగం చేసారు. అన్ని రకాల పూలతో పూజ చేయబడి, అందంగా మెరిసిపోతున్న బంగారు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళూ చాలలేదంటే నమ్మాల్సిందే! కార్యక్రమంలో చివరగా దీపోత్సవం మొదలైంది. స్టేడియంలో  లైట్లన్నీ ఆపేసారు. ఇందాకటి మాదిరి ఒక్కరే పదేసి ,ఇంకా ఎక్కువ దీపాలు వెలిగించెయ్యడం. కొందరు వత్తులు తెచ్చుకుని ఆ ప్రమిదల్లో వేసి వెల్గించేస్తున్నారు. మైకులో కార్యకర్తలేమో ఏ చీర కొంగుకి దీపాలు తగలకుండా చూడండీ , 365వత్తులు ప్రమిదల్లో వెయ్యకండి.. దీపాలు ఎక్కువ మంట వెలిగితే ప్రమాదం అని చాలాసార్లు జనాలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు పాపం! బంగారు అమ్మవారిని తీసుకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా దగ్గరగా చూడడానికి కాస్త తోపులాట అయ్యింది. చక్కగా ఇందాకా పూజ చూశారు కదా ఇంకేం కావాలసలు?! 


ఇక ప్రసాదాల వరకూ ఆగలేదు మేము. జనాలందరూ లేచి తిరిగేస్తున్నారు...  జాగ్రత్తగా బయటపడ్డాము. ఏదేమైనా ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన "నరేంద్ర చౌదరి"గారు అభినందనీయులు. ఇందరిని ఒక చోట కూర్చడం, ఎరేంజ్మెంట్స్ చేయడం..అన్నీ కూడా అంత సులువైన పనులేమీ కాదు. ఒక గొప్ప సంకల్పం ఇది. ఏ అవాంతరం కలగకుండా మొత్తానికి పదిహేనురోజుల కార్యక్రమాలూ దిగ్విజయంగా జరిగాయి. ఖచ్చితంగా అంతా ఈశ్వరుడి దయ! 



మొత్తమ్మీద..కార్తీకమాసంలో శివమహాపురాణం  చదివిన ఆనందంతో పాటూ, ఇవాళ నిజంగా కైలాసానికి వెళ్లామా.. అనిపించేలాంటి గొప్ప అనుభూతిని హృదయాంతరాళలో నిలుపుకుని, ఒక పర్వదినాన కోటి దీపార్చనలో పాల్గొన్నామన్న తృప్తితో బ్రహ్మానందభరితులమై ఇంటి మొఖం పట్టాము.



హర హర మహాదేవ! 


మరికొన్ని ఫోటోలు ఇక్కడ...
http://lookingwiththeheart.blogspot.com/2014/11/blog-post.html

7 comments:

Unknown said...

i am attended on 9thday.. wonderfull program.
http://www.youtube.com/watch?v=si3DgdIkfuI
http://www.youtube.com/watch?v=SoJqHc9TOgU

in 1st and 2 nd part they sung few songs which are very good

తృష్ణ said...

@rani mukku: Thanks for the links.
అవును..ఆ రోజు చాలా బావుందని అన్నారు. ఓ డాన్స్ లో మాకు తెలిసిన వాళ్ల పిల్లలు కూడా ఉన్నారండీ..

లక్ష్మీ'స్ మయూఖ said...

త్రుష్ణగారు చాలా అద్రుష్టవంతులండి మీరు. రోజూ భక్తి చానెల్లో చూస్తూనే ఎంతో మైమరచిపోతున్నాము మేము. మీరు ప్రత్యక్షంగా హాజరై ఆ కైలాస గిరిలో జరిగిన కార్యక్రమాలను వీక్షించటం ఎంతో అద్రుష్టంగా చెప్పుకోవాలి.మీరు చెప్పినవన్నీ మేమూ టివిలో గమనిస్తూనే వున్నాము.ఎలాగైనా పదిహేను రోజులపాటు పండుగలా జరిపించిన నరేంద్ర చౌదరిగారు ఎంతైనా అభినందనీయులు.

aparnagiri said...

Trishna garu, I think you might have mistaken chaurtdasi for chaturdhi. Please verify. Enjoyed your post as always.

Aparna

తృష్ణ said...

@swarajya lakhmi mallampalli: అవునండి టివీలో అన్నీ చూపించారుట. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

@aparnagiri:సరిచేసానండి.. ధన్యవాదాలు.

లక్ష్మీ'స్ మయూఖ said...

తృష్ణ గారూ, ముందు మీరు క్షమించాలి. ఎందుకంటే నేను సంగీత ప్రియలో వ్రాయాల్సినా అభ్యర్దన ఇక్కడ పోస్టు చేస్తున్నందుకు. మీరు ఈ మద్య సంగీత ప్రియలో పోస్టులు పెట్టడం లేదు. ఇందులో విజయవాడ ఆ కేంద్రంలో 80సం లలో హైదరాబాద్ కేంద్రం నుండి బాలత్రిపురసుందరి గారని ఒక లలిత సంగీత గాయని ఉండేవారు. వారు పాడిన 'వెళ్ళిపోతొందో వెళ్ళిపోతొందో అనసూర్య రవ్వ కారోడంబిడా అనే పాట,ఓలమ్మో ఓరినయనో వాన గాలి వస్తొందే రాజమ్మ అనే పాటలొచ్చేవి. ఆ అల్ల్బుంలోనే, ఆమే పాడిన ఇంకా చాల పాటలుండేవి. నేను అవి రేడియోలో విని నేర్చుకుని పాడుతూవుంటే మా పెద్ద అన్నయ్య మళ్ళీ మళ్ళీఅడిగి పాడించుకునేవారు. మా ఇంటి ఓనరు ఆంటీ గారు కూడా. అవి ఇపుడు దోరుకుతాయేమోనని చాలా చోట్ల వెతికినా దొరకలేదు. మీ దగ్గర ఏమైనా వుంటే దయచేసి మరోలా అనుకోకుండా పోస్టు చేయగలరు. దన్యవాదాలు.

తృష్ణ said...

@స్వరాజ్య లక్ష్మి గారూ, ఎక్కడ రాసినా పర్వాలేదండి.. కానీ నా వద్ద ఆ పాటలేమీ లేవండీ :(