సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, July 11, 2014

షిర్డీ - భీమశంకర్




 
 


హాలిడేస్ అన్నీ అయిపోయాయి.. ఎక్కడికీ వెళ్ళలేదు.. స్కూళ్ళు మొదలయిపోయాయి.. మళ్ళీ నెలాఖరు వచ్చేస్తే పరీక్షలు వచ్చేస్తాయనీ, వీకెండ్ కనీసం షిర్డీ అయినా తీసుకువెళ్ళమని అయ్యగారి చెవిలో ఇల్లుకట్టేస్కుని మరీ పోరేసాం పిల్లా, నేనూ.  షిర్డీ కి టికెట్స్ బుక్ చేసానని అయ్యగారు ఫోన్ చెయ్యగానే ముందర నెట్ ఓపెన్ చేసి ఇంతకు ముందు చూడని నియరెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయని వెతికాను. కాస్త దూరమైనా వెళ్లదగిన ప్రాంతంగా "భీమశంకర్" కనిపించింది. సుమారు 180-200kms దూరం షిర్డీ నుండి. 200kms లోపూ అయితే ఒకపూటలో వెళ్ళిరావచ్చు. సో, ఈసారి బాబాగారి దర్శనం అయ్యాకా భీమశంకరానికి వెళ్దామని అని గాఠ్ఠిగా చెప్పేసి, గ్రీన్ సిగ్నల్ సంపాదించేసుకున్నా. ఈ జీవితకాలంలో వీలయినన్ని పుణ్యక్షేత్రాలే కాక వీలయినన్ని జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలూ చూడాలని నాకో బలమైన కోరిక ఉంది. ఇదివరకూ శిర్డీ వెళ్ళినప్పుడే నాసిక్-త్రయంబక్, మరోసారి ఘృష్ణేశ్వర్ వెళ్ళాం. ఇప్పుడు 'భీమశంకరం' కూడా జ్యోతిర్లింగం అని చదివాకా, చిన్న ప్రయాణమైనా ఈ ట్రిప్ లో మరో జ్యీతిర్లింగం చూసే అవకాశం వదులుకోవాలనిపించలేదు. అవసరమైతే సండే కూడా ప్రయాణం ఎక్స్టెండ్ చేసుకుందాం అని కూడా అనుకున్నాం.


రెండు రోజుల క్రితమే బుక్ చేసుకోవడం వల్ల క్రితం గురువారం సాయంత్రం ప్రయాణం సమయానికి RAC లోకి మాత్రమే వచ్చాయి టికెట్లు. లక్కీగా మా ఇంటివెనక రైల్వే షేషన్లో ఇప్పుడు వెళ్లాల్సిన రైలు ఆగుతుంది. ఎక్కి కూర్చున్నాం. సైడ్ లోయర్ సీట్లు రెండూ వచ్చాయి. చాల్లేమ్మని ముగ్గురం అందిమీదే కూచున్నాం. ఒక ఫ్యామిలీ వాళ్ళు వేరే బోగీలోకి వెళ్పోతూ అప్పర్ బెర్త్ ఒకటి ఇచ్చేసారు. ఇంకేముంది.. నన్ను పైకెక్కించేసి పిల్లా, వాళ్ళ నాన్నా క్రింద దాంట్లో ఎడ్జస్ట్ అయిపోయారు. హాయిగా కాసేపు పుస్తకం చదువుకున్నా. కాస్త నిద్రపట్టే సమయానికి క్రింద ఉన్న ఫ్యామిలీ తాలూకూ రెండేళ్ల పిల్లాడు పేచీలు మొదలెట్టాడు. పిల్లాడి కూడా ఉన్న నలుగురికీ, మాకూ కూడా చుక్కలు చూపించాడు ఆ పిల్లాడు చాలాసేపు. ఇహ ఆ రాత్రి నిద్ర లేదు :(

పొద్దున్నే నాగర్సోల్ లో దిగి షేరింగ్ జీప్ లో శిర్డీ చేరాం. జనం ఎక్కువగా ఉండరనే శుక్రవారం పెట్టుకున్నాం ప్రయాణం. త్వరగా ఫ్రెష్ అయి దర్శనానికి వెళ్ళాం. గంట అవ్వకుండానే చాలా చక్కని దర్శనం అయింది. క్యూలో వెళ్ళేప్పుడు మందిరంలోకి వెళ్ళగానే కుడివైపు లైన్ లోనే ఉంటే బాబాగారి ముందర వైపు ఉండే హాల్లోంచి బయటకు వెళ్ళచ్చు. ఎక్కువ సేపు దర్శనం అవుతుంది. అలా బాబాగారిని చూస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ బయటకు వచ్చేసాం. ఇక "భీమశంకరం" గురించి కనుక్కున్నాం. పూనా, ముంబై, ఔరంగాబాద్ల నుండి బస్సులు ఉంటాయిట. విడిగా ఇక్కడ్నుంచి వెళ్ళిరావడానికి పది గంటలు పడుతుందిట. పొద్దున్నే బయల్దేరితే సాయంత్రానికి రావచ్చు. షేరింగ్ టాక్సీలు, మనుషులు కూడా దొరుకుతాయి అని చెప్పారు. కానీ మాకు మర్నాడు సాయంత్రమే రిటర్న్ ట్రైన్. టైం సరిపోదు. ఇప్పుడే వెళ్తే రాత్రికి లేట్ అయినా వచ్చేసి రూమ్ లో పడుకోవచ్చు..అనుకున్నాం. మా ఒక్కళ్ళకే అంటే టాక్సీకి బాగా ఎక్కువే పడింది కానీ ఇంత షార్ట్ ట్రిప్ లో టైం వేస్ట్ అవకూడదని ఇంక భోం చేసేసి ఒంటిగంటన్నరకి భీమశంకరం బయల్దేరిపోయాం. బయట బోలెడు ఎండ. రాత్రి రైల్లో నిద్రలేదేమో కారులో ఏసీ ఉండటంతో హాయిగా ముగ్గురం నిద్రపోయాం. మూడున్నరకి అయ్యగారి ఆఫీసు ఫోన్లకి మెలకువ వచ్చింది. నాలుగున్నర దాకా ఎండగానే ఉంది. అప్పటి నుండీ తోవ కొండపైకెక్కడం మొదలయ్యింది.




సహ్యాద్రీ కొండల మధ్యలో.. అంటే ఏదో కొండల మధ్యలో గుడి ఉంటుందేమో అనుకున్నా కానీ మరీ పై పైకి పోతుంటే డౌటొచ్చి డ్రైవర్ని అడిగాం గుడి కొండ మీద ఉంటుందా? అని. కొండెక్కి మళ్ళీ కాస్త క్రిందకి మెట్లు దిగాలి అన్నాడతను. ఇంకా డ్రైవర్ ఏం చెప్పాడంటే, గుడి ఉన్న కొండ క్రింద ప్రదేశంలోనే బొంబాయి ఉందిట. మెట్ల దారి ఉందిట, కొందరు ట్రెక్కింగ్ కూడా చేస్తారుట.





ఈ డ్రైవర్ మరీ సైలెంట్ మనిషి. నాలుగు ప్రశ్నలు వేస్తే ఒక్క సమాధానమే ఇస్తున్నాడు. కానీ నెమ్మదస్తుడు. మంచివాడు. చాలా జాగ్రత్తగా, నేర్పుగా డ్రైవింగ్ చేసాడు. సరే ఇంక కొండ దారి పైపైకి పోతోంది. ఒకే కొండ కాకుండా కొన్ని కొండల సముదాయాలు అవన్నీ. సో పైకి వెళ్తూంటే క్రిందకి వెళ్పోయిన కొండలు, లోయలు, చెట్లు అన్నీ చాలా బాగున్నాయి చూడటానికి. హటాత్తుగా వాతావరణం మారిపోయింది. ఎండంతా పోయి మబ్బులు, చల్లగాలి, చినుకు మొదలైంది. కార్లో ఏసీ ఆపించేసి గ్లాస్ దించేసాం. చిరుజల్లు అలా విండో లోంచి మీద పడుతూ ఉంటే బావుంటుంది..:)


దారిలో గోనె గోంగళ్ళు కప్పుకుని మేకలు తోలుకెళ్ళే కాపర్లు, పొలం దున్నుకునే రైతులు కనబడ్డారు. ఆ కొండ ప్రాంతాన్నే వాలు ఎక్కువ లేని చోట్ల కాస్త కాస్త మేర చదును చేసేసి ఏవో పంటలు వేసేసారు. కొండల పైనుండి చూస్తే అక్కడక్కడ ఆకుపచ్చ తివాచీలు పరచినట్లు పచ్చని పంటలు. ఎంతో అందంగా ఉందా ప్రదేశం. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా కనబడింది దారిలో.


 ఐదయ్యేసరికీ వాతావరణం ఇంకా మారిపోయింది. తెలీకుండానే బాగా ఎత్తులోకి చేరిపోయాం. ఐదున్నర అవ్వకుండానే ఏడున్నరలా ఉంది చీకటి. చుట్టూరా దట్టంగా మబ్బులు.. రోడ్డుకిరుపక్కలా అడవిలో ఉన్నట్లు పెద్ద పెద్ద చెట్లు.. ఆ చెట్ల మధ్యన లీలగా కనబడుతున్న దారి. ఓ చోట దారి పక్కగా నిలబడి గోనె గొంగళి కప్పుకున్న ఒకతను అలాంటివే ప్లాస్టిక్ కవరలు అమ్ముతున్నాడు. గాలికి గొడుగులు ఎగిరిపోతాయని అక్కడందరూ ఇవే వాడతారుట. తల మీంచి కప్పేసుకుని అడుగున రెండు కొసలు కలిపి ముందువైపుకి ముడి వేసేసుకుంటున్నారు. సరదాగా ఉన్నాయని మేమూ కొన్నాం ఆ కవర్లు.

మధ్యలో ఒక చోట మాత్రం దిగకుండా ఉండలేకపోయాం. కొండదారి కాస్త పక్కగా మళ్ళి చెట్లు అవీ ఉన్నాయి. బోలెడు మబ్బులు ఉన్నాయక్కడ. దిగి అక్కడ మబ్బుల మధ్యన నిలబడి కారబ్బాయితో రెండు ఫోటోలు తీయించుకునేంతలో వర్షం పెద్దదయిపోయింది. గబగబా కార్లో కొచ్చేసాం. ఆగేందుకు టైం కూడా లేదు. మళ్ళీ గుడి చూసాకా, పైకి వచ్చినంత దూరం వెనక్కి క్రిందకి వెళ్ళాలి చీకట్లో అనుకునేసరికీ నాకు భయం వేసింది. కానీ ఆ వాతావరణం, ఆ చల్ల గాలి, మబ్బులు అసలు ఏవేవో లోకాల్లోకి తీస్కెళ్ళిపోయాయి మమ్మల్ని. భయం మర్చిపోయా.


గుడి వద్దకు చేరేసరికీ సాయంత్రం ఐదున్నర. నాలుగ్గంటల్లో తీస్కువచ్చాడు డ్రైవర్. అక్కడకి చేరేప్పటికీ వర్షం ఇంకా పెరిగిపోయింది. నాలుగడుగులు వేస్తే మెట్లదారిలో షెల్టర్ ఉంటుందని చెప్పారు. అందుకని ఇక ఆగకుండా గుడివైపు వెళ్పోయాం. ఇందాకా సరదాకి కొన్న ఆ ప్లాస్టిక్ కవర్లే మాకు గొడుగులయ్యాయి. షెల్టర్ ఉన్న మెట్లదాకా చేరేసరికీ తల మీద కవర్ వల్ల తల తప్ప మొత్తం తడిసిపోయాం. పిల్ల చలికి వణికిపోయింది. వర్షం వల్ల ఇంకా చీకటిగా అయిపోయింది. మెట్లకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు అడవిలాగ. ఆట్టే మెట్లు లేవు కానీ తిరుపతి మెట్లదారి గుర్తుకు వచ్చింది. మనుషులు తిరుగుతున్నారు కాబట్టి భయమెయ్యలేదు. గుడి దాకా వచ్చేసరికీ కాస్త చలి, వణుకు తగ్గాయి. ఇంత పైకి దారి పెట్టి మళ్ళీ క్రిందకి గుడి ఎందుకు కట్టారో అని డౌట్ వచ్చింది. అసలీ గుడి ఎవరు కట్టారో? వర్షం వల్ల చాలా కొట్లన్నీ మూసేసారు. స్థలపురాణం పుస్తకం ఎక్కడా కనబడ్లేదు. గుడి పదమూడవ శతాబ్దం నాటిదని వికీలో రాసారు. స్థల పురాణం అక్కడ చదవవచ్చు.
 
 

ఏడెనిమిది నిమిషాల్లో క్రింద గుడి వద్దకు చేరాం. వానవల్లో ఏమో ఎక్కువ జనం లేరు. ఆర్భాటం లేని చిన్న గుడి. నల్లరాతి కట్టడం. గర్భగుడిలోకి రానిస్తున్నారు. అన్ని జ్యోతిర్లింగాలయాలలో మల్లె శివలింగం వెనుక వైపుకి పెద్ద అద్దం ఉంది. గర్భగుడి బయట ఉన్న భక్తులకు శివలింగం,అలంకారాలూ కనబడేలాగ. లోపలికి వెళ్ళి స్వయంగా పూలు,బిల్వపత్రాలు అవీ మనం పెట్టుకునేందుకు అనుమతిస్తున్నారు. ఇదివరకూ కాశీలో, ఘృష్ణేశ్వర్ లో, త్రయంబకం లో కూడా ఇలాగే స్వయంగా శివలింగం వద్ద స్వయంగా అభిషేకం, పూజ చేసుకునే అవకాశం దొరికాయి మాకు. శ్రీశైలంలో మాత్రం కుదరలేదు. ఏ తోపుడూ హడావుడీ లేనందువల్ల కాసేపు అక్కడే గడిపి బయటకు వచ్చేసాం. గుడి కట్టిన రాతి మహిమో, గుడిలోపలి దేవుడి మహిమో తెలీదు కానీ కొన్ని గుళ్ళలో కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడా అలానే అనిపించింది. అన్ని గుళ్ళలో అప్పటికి వర్షం కాస్త నెమ్మళించింది. బయట నందీశ్వరుడు ఉన్న చోట పెద్ద గంట ఉంది. అది బాజీరావుపేష్వా అక్కడ పెట్టించారుట. పోర్చుగీస్ మీద తన విజయానికి గుర్తుగా ఇది + మరో నాలుగు పెద్ద గంటలు మరో నాలుగు శివాలయాల్లో పెట్టించాట్ట ఆయన. గంట మీద పదిహేడవ శతాబ్దపు సంవత్సరం కూడా రాసి ఉంది. చిన్న గుడిలా ఉండి "కమలజ" పేరుతో అమ్మవారు ఉన్నారు. పార్వతీదేవి రూపంట. గుడి వెనుక భీమా నది ప్రవహించేదిట. వర్షం వల్ల, సమయాభావం వల్ల ఇక చుట్టుపక్కల తిరిగి ఓ మారు పరిశీలించే అవకాశం లేకపోయింది. ఓ పక్కగా పొడుగాటి గోపురమున్న గుడి క్రిందన శనీశ్వరుడి విగ్రహం కూడా ఉంది. ఇందాకా వర్షమని ఫోటోలు తియ్యడానికి లేకపోయింది. ఇప్పుడు బయటకు వస్తూంటే కాసిని తీసాను.


ఆ పెద్ద పెద్ద చెట్లు, కనుచూపుమేరలో మనిషి కనబడకుండా అలుముకున్న మబ్బులు, గాలికి కదిలే ఆకుల అలగలలు తప్ప మరే ఇతర సందడి లేని నిశ్శబ్దంలో ఎక్కువ ఎత్తులేని తేలికపాటి మెట్లు ఎక్కుతుంటే అసలు మనసు తేలికైపోయి ఎంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పడం కష్టం. సమయం ఉంటే అడవిలాగ కనబడుతున్నా ఆ చెట్లమధ్యన కాసేపు తిరగాలనిపించింది. ఎంత బాగుందో కదా..అని క్షణక్షణం అనుకుంటూనే ఉన్నాం నడుస్తున్నంత మేరా!


ఈలోపూ పక్కగా ఉన్న చిన్న కొట్లో ఆవిరిపై ఉడకపెట్టిన మొక్కజొన్నకండెలు అమ్ముతున్నారు. గబగబా కొనుక్కుని లాగించేసాం. ఆ చలిలో వెచ్చవెచ్చగా ఉన్న ఆ మొక్కజొన్న రుచి అమృతంలా తోచింది.


మరో పక్క కొట్లో అల్లం టీ పెడుతుంటే అది కొనుక్కుని తాగాం. ఆ కొట్టబ్బాయిని అడిగాను..ఈ గుడి ఎవరు కట్టారో తెలుసా? అని. ఏమో తెలీదు కానీ ఛత్రపతి శివాజీ పూజలు చేయడానికి ఇక్కడికి వచ్చేవారుట అన్నాడు. ఆ టీ కొట్లో శివాజీ ఏనుగు మీద ఉంటే చుట్టూరా బోలెడు మంది జనం ఉన్న పెద్ద పెయింటింగ్ ఒకటి ఉంది. ఇంకానేమో శంకరాచార్యులవారు వచ్చి ఇది జ్యోతిర్లింగ క్షేత్రమని నిర్ధారణ చేసాకా ఎక్కువ జనం దర్శనానికి రావడం మొదలయ్యిందని అతను చెప్పాడు.
 

కారుదాకా నడుస్తున్నామా చూట్టూరా మంచు కాదు మబ్బులే. అసలు రోడ్డు కనబడట్లే. మబ్బుల్లో నడుస్తున్నామని భలే సంబరపడిపోయాం. వర్షాలు మొదలయిన ఆరునెలల పాటు అక్కడ వాతావరణం రోజూ ఇలానే ఉంటుందని ఇందాకా టీ కొట్టబ్బాయి చెప్పాడు. ఎప్పుడూ ఇలాంటి అందమైన ప్రదేశంలో ఉండగలిగే వీళ్ళెంత అదృష్టవంతులో అనిపించింది. అంత అందమైన ప్రకృతిని వదలలేక వదలలేక వదిలి..
మళ్ళీ భవసాగరాలలో ఈదడానికి మనసుని రీఛార్జ్ అయ్యిందని తృప్తి పడుతూ.. కారెక్కాం. బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి నాలుగ్గంటలు ఎలా.. అనుకుంటుంటే డ్రైవర్ హాట్ బ్లోయర్ ఆన్ చేసాడు. వెచ్చటి గాలి తగిలే సరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. పిల్ల కూడా కాస్త కుదుటపడింది. మనసులోనే అతగాడ్ని పదికాలాలు చల్లగా ఉండు నాయినా అని దీవించేసాను. తిరుగుదారిలో మళ్ళీ కొండ దిగే సమయానికి మళ్ళీ మునుపున్న వాతావరణం వెలుతురు వచ్చేసాయి. ఆ మబ్బులు, మసకచీకటి అన్నీ మాయమైపోయాయి. ఎత్తు దిగిపోయాం కదా! కానీ ఏదో కొత్త ప్రపంచంలోంచి బయటకు వచ్చినట్లయి.. అదంతా కలా నిజమా? అని ఆశ్చర్యం వేసింది. దారిలో ఎందుకైనా మంచిదని పిల్లకి పేరాసెట్మాల్ సిరప్ కొన్నాం. ఇందాకా వచ్చేప్పుడు ఏసీ చల్లదనానికి ఎలా నిద్రపోయామో అలా ఇప్పుడు వెచ్చదనానికి మళ్ళీ అలానే నిద్రపోయాం. ఆరున్నరకి బయల్దేరి సరిగ్గా నాలుగ్గంటల్లో శిర్డీ వచ్చేసాం. పగలు పూట వెళ్తే అక్కడ కాసేపు గడిపి బాగా ఎంజాయ్ చేయచ్చనిపించింది నాకు.


శనివారం పొద్దున్నే మళ్ళీ ఓసారి బాబాగారి దర్శనం చేసుకున్నాం. మేం బయటకు వచ్చేసమయానికి రష్ పెరిగిపోయింది. వీకెండ్ రష్! కొత్తగా మొదలెట్టినట్లున్నారు దర్శనాల క్యూలో లడ్డూ ప్రసాదం పంచుతున్నారు సంస్థానం వాళ్ళు. ఫ్రెష్ గా బాగున్నాయి లడ్డూస్! ఇంక భోం చేసి, కాస్తంత షాపింగ్ చేసేసి, రూంకొచ్చి కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ రైలెక్కడానికి బయల్దేరిపోయాం. టికెట్ల పొజిషన్ చూస్తే మళ్ళీ RAC ! అబ్బా ఇరుక్కుని వెళ్లలేం.. థార్డ్ ఏసి లో దొరుకుతాయేమో చూడమన్నా అయ్యగారిని. స్లీపర్ క్లాస్ కన్ఫర్మ్ అవ్వడం కష్టం కానీ థార్డ్ ఏసి లో ఉన్నాయని మూడు సీట్లు ఇచ్చేసారు టిసిగారు. నెట్లో చూస్తే అన్నీ క్లాసులూ ఫుల్.. ఇప్పుడెలా దొరికాయి.. అనే సందేహాలన్నీ పక్కనెట్టేసి.. ఆహా బాబాగారి దయ అనుకుంటూ చల్లగా ఏసీలో పడుకుని రిలాక్స్ అయిపోయాం. చిన్నప్పుడు ఎన్ని వందలసార్లు రైళ్ళలో తిరిగాము.. ఇప్పుడేమిటో అంత బాధ! ఏమైనా ఓపికలుండగానే తిరగాలనుకున్న నాలుగు ఉళ్ళూ తిరిగెయ్యాలి. తర్వాతర్వాత వెళ్లడం కుదిరినా ముక్కుతూ ములుగుతూ ఏం తిరుగుతాం.. అనిపించింది. ఇదివరకూ ఓసారి నేనన్నమాటలే నాకు గుర్తుకొచ్చాయి.. సుఖం ఎలా ఉంటుందో తెలీనప్పుడు ఎన్ని కష్టాలైనా పడగలం. ఒక్కసారి సుఖాలకి అలవాటుపడ్డాకా.. మళ్ళీ కష్టపడాలంటే మహా బాధగా ఉంటుంది!

 


12 comments:

A Homemaker's Utopia said...

బావున్నాయండీ ప్రయాణం కబుర్లు..ఆ మొక్క జొన్న పొత్తులు భలేగా ఉన్నాయి :)

Manasa Chamarthi said...

ఓహ్! భలే, జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని వచ్చారా! అదృష్టవంతులు :)). ఆ ఒక్కటీ తప్ప ఆ చుట్టుపక్కలవన్నీ చూశాన్నేను;)
అసలూ -- ఈ ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే ఫెయిల్ అవ్వడమూ - ఆఖరు నిముషాల్లో రైల్వే వాళ్ళకో, ప్రైవేటు బస్సుల వాళ్ళకో ఎక్కువ డబ్బులు గుమ్మరించేస్తే మహ భేషుగ్గానూ అవ్వడం రివాజైపోయిందండీ. :)
మొక్కజొన్న పొత్తులు బాగున్నాయ్! మొట్టమొదటి భీంశంకర్ ఫొటో చూస్తే రెక్కలు కట్టుకుని వెళ్ళి అక్కడ వాలాలనిపించింది. Keep travelling, keep writing. :D

SD said...

Did you confirm if what you visited was BhimShankar? Just asking...

http://en.wikipedia.org/wiki/Jyotirlinga

Anonymous said...

చాలా బావున్నాయండీ, ఆఫోటోలు. ముఖ్యంగా పొగమంచు కమ్మేసినట్టు ఉన్నవి. మధ్యలో మొక్కజొన్న కండెలు.. :-)

Dantuluri Kishore Varma said...

ఫోటోలు, రైటప్ చాలా బాగున్నాయి తృష్ణగారు.

విన్నకోట నరసింహా రావు said...

మీ యాత్రా విశేషాలు, వర్ణన, ముఖ్యంగా సీనరీల ఫొటోలు బాగున్నాయి. ఒక సందేహం - షిర్డీ నుంచి భీమశంకరం వెళ్ళటానికి "షేరింగ్ టాక్సీలు, మనుషులు కూడా దొరుకుతాయి అని చెప్పారు" అని వ్రాసారు. ఆ వాక్యంలో ఏదో మిస్సింగ్ అనిస్తోంది.

Indira said...

Chaalaa baavundi mee prayaanam.okkariju aagi kolhapur chooseyyaalsindi.sakthipeetha darsanam koodaa ayyedi.

తృష్ణ said...

@DG : ఈ టపాలో రాసినది భీమశంకర జ్యోతిర్లింగం ఉన్న గుడి గురించేనండి.Thanks for the visit.

తృష్ణ said...

@nagini: Thank you :)
@mansaa:టికెట్లు ఉన్నా తత్కాల్ టికెట్లు కోంటాం కదా అని సీట్స్ లేవని చూపిస్తున్నారేమో అని ఓ అనుమానం కూడా! నా కాళ్లకి చక్రాలు, జేబులు బరువుగా ఉండిఉంటే ఈపాటికి దేశమంతా చూసేద్దును :-)

తృష్ణ said...

@srikanth:అది పొగమంచు కాదండి..అవీ మబ్బులు..మబ్బులు :)thank you.
@Dantuluri Kishore varma: టపా నచ్చినందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

@విన్నకోట నరసింహారావు: మిస్సింగ్ ఏం లేదండి. షేరింగ్ టాక్సీలు, మనుషులు కలిపేసానంతే. మనకు ఇంకో ఫ్యామిలీ కలిస్తే టాక్సీ ఫెయిర్ షేర్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. ధన్యవాదాలు.
@ఇందిర: సండే కూడా ఉందామనుకున్నాం కానీ మళ్ళి వచ్చాకా మండే మార్నింగ్ వెంఠనే పరుగులు పెట్టాలని, రెస్ట్ తీసుకోవడానికి ఉండదని అలా ఫిక్స్ చేసామండీ. అయినా టికెట్స్ దొరికితే ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం కానీ దొరకలే :(
thank you :)

వేణూశ్రీకాంత్ said...

పోస్టూ ఫోటోలు రెండూ చాలా బాగున్నాయండీ... :)