Saturday, April 26, 2014

'Queen' సినిమా... కొన్ని ఆలోచనలు..'బావుంది చూడమని' కొందరు మిత్రులు చెప్పాకా మొత్తానికి ఇవాళ ఈ సినిమా చూసాను. మొదటిసారి నేను కంగనా ని "గ్యాంగ్ స్టర్" సినిమాలో చూసాను. ఆ సినిమా బాగా నచ్చింది అనేకన్నా నన్ను బాగా కదిలించేసింది అనాలి. ఆ తర్వాత చాలా రోజులు పట్టింది ఆ కథ తాలూకూ బాధలోంచి బయట పడడానికి. ఆ తర్వాత మళ్ళీ మరో కంగనా సినిమా.. అది మధుర్ భండార్కర్ "ఫ్యాషన్"! అది కూడా చాలా నచ్చింది నాకు. ఈ రెండు సినిమాలూ చాలు కంగనా ఎంత ఫైన్ ఏక్ట్రస్సో తెలియడానికి. గాసిప్స్ & రూమర్స్ సంగతి ఎలా ఉన్నా, ఒక మంచి నటిగా గుర్తుంచుకోదగ్గ ఆర్టిస్ట్ కంగనా. ఇప్పుడు "క్వీన్" సినిమా దగ్గరికి వచ్చేస్తే ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ! మొత్తం కథంతా హీరోయిన్ భుజాలపైనే నడుస్తుంది. రాణీ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది కంగనా.


కథలో ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది. సన్నివేశాలు కాస్త స్లో గా ఉన్నా కథాబలం వల్ల చిత్రం నడిచిపోతుంది. ఈ కథ ద్వారా డైరెక్టర్ చెప్పదలుచుకున్న పాయింట్ చాలా నచ్చింది. అది ఏమిటంటే మనుషుల కన్నా జీవితం చాలా గొప్పది. ఎన్ని ఆటంకాలు వచ్చినా జీవితం ఆగిపోదు.. life goes on..! కొద్దిగా మనకొచ్చిన సమస్య లోంచి తల బయటకు పెట్టి జీవితాన్ని పరికించి, పరిశీలిస్తే చాలు! తిరిగి జీవించడానికి మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. మన జీవితంలోకి ఎందరో మనుషులు వస్తూంటారు.. వెళ్తూంటారు. కొందరు వెళ్పోయినప్పుడు మనం రియాక్ట్ అవ్వము కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలా ఎందుకు జరిగింది అని చాలా బాధపడతాము. చాలాకాలం నిలదొక్కుకోలేము కూడా. కానీ "when God closes one door, he'll open another" అన్నట్లు మరో దారి.. ముందరి కన్నా మంచి దారి భగవంతుడే మనకు చూపెడతాడు. ఈ సినిమా చివర్లో తనను కాదన్న పెళ్ళికొడుకు దగ్గరకొచ్చి ఉంగరం ఇచ్చేసి, మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పి వెళ్తుంది రాణి. ఆ సీన్ నాకు చాలా చాలా నచ్చింది. ఒకోసారి కొందరు మన జోవితంలోంచి వెళ్పోవడమే మంచిది. అప్పుడు కానీ మనం వాళ్లకి ఎంత అనవసరపు ప్రాముఖ్యతను ఇస్తున్నామో మనకు అర్థమవ్వదు.


చిత్రంలో పెళ్ళి తప్పిపోవడం ప్రధాన అంశం కానీ ఈ కథ నాకు చాలా మందిని గుర్తుచేసింది. ఆడ, మగ అని కాదు. ప్రేమ, పెళ్ళీ అని కాదు. అసలు ఏదో ఒక పరిచయం, అనుబంధం పేరుతో జోవితాల్లోకి ప్రవేశించి అర్థాంతరంగా మాయమైపోతుంటారు కొందరు. అలాంటివాళ్ళు గుర్తుకు వచ్చారు. కేవలం నా జీవితం అనే కాదు నా మిత్రులు, పరిచయస్థులు కొందరి జీవితాల్లో కూడా ఇలాంటివాళ్ళను చూశాను నేను. జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ ఇలానే ఉంటుందేమో అనుకుంటూంటాను నేను. మనం పట్టించుకోనంతవరకూ మనకెంతో విలువ ఇస్తారు. వెనక వెనకే ఉంటారు. కానీ ఒక్కసారి మనం పట్టించుకుని ప్రాముఖ్యతనిచ్చి నెత్తిన పెట్టుకున్నామా...అంతే! మనల్ని లోకువ కట్టేసి ఇగ్నోర్  చేసేయడం మొదలుపెడతారు. అంతకు ముందర చూపెట్టిన శ్రధ్ధ, ఆసక్తి ఏమౌతాయో తెలీదు. బహుశా వాళ్ల అవసరం తీరేదాకానో, మన వల్ల పొందాల్సిన సహాయమేదో అయ్యేదాకానో అలా బిహేవ్ చేస్తారేమో అనుకుంటాను నేను. లేదా వాళ్ళు కావాలనుకున్నది మన దగ్గర లభించదు, మన వల్ల వాళ్ల పనులు అవ్వవు అని అర్థమయ్యాకా ఇంక వదిలేస్తారు. కానీ అంతకు ముందు వాళ్ళు చూపెట్టిన శ్రధ్ధనీ, అభిమానాన్నీ చూసి మనం వాళ్ళకు అలవాటు పడిపోతాం. అవతలి వాళ్ళ నిర్లక్ష్యాన్ని భరించి, అధిగమించి, మళ్ళీ ఆ అలవాటు నుండి బయటపడడానికీ మన జీవితం మనం జీవించడానికీ ఎంతో సమయం పడుతుంది. దీనికంతటికీ ఎవర్నో ఏమీ అనలేము. మనమే దానికి బాధ్యులం. ఒక వ్యక్తికో, అభిమానానికో, అలవాటుకో బానిస అయిపోవడం మన బలహీనత. కానీ అందులోంచి బయటపడ్డాకా కానీ తెలీదు మనం కొందరికి ఎంత అనవసరపు ప్రాముఖ్యత ఇచ్చామో. అలాంటి ఒక బలహీనత లోంచే బయటపడుతుంది "క్వీన్" చిత్రనాయిక "రాణీ". సినిమాలో ఏ రకమైన సన్నివేశాలు చూపెట్టినా నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి తన బాధలోంచి బయటపడటం. 


ఈ చిత్రంలో ఓ పెళ్ళికొడుకు ఓ అమ్మాయి వెంట పడి, పెళ్ళి చేసుకొమ్మని బ్రతిమాలి, తీరా ఆమె ఒప్పుకుని అతడ్నే నమ్ముకుని, అతడికి అలవాటు పడిపోయి, పెళ్ళికి అన్ని సన్నాహాలూ పూర్తయ్యాకా హటాత్తుగా పెళ్ళి వద్దని వెళ్పోతాడు. కన్నీళ్ళతో ప్రాధేయపడినా వినడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి ప్రపంచమంతా తలక్రిందులైపోతుంది. కానీ బయట ప్రపంచంలోకి వెళ్ళి జీవితాన్ని చూశాకా ఆ అమ్మాయి రియలైజ్ అవుతుంది. తన దు:ఖం జీవితాన్ని తలక్రిందులు చేసేది కానే కాదని. మనుషుల చుట్టూ, అనుబంధాల చూట్టూ జీవితాన్ని ముడిపెట్టేసుకోవడం కన్నా జీవితాన్ని జీవించడంలో ఎంతో ఆనందం ఉందని తెలుసుకుంటుంది. ఆ అబ్బాయి వద్దన్నాడు కాబట్టే తను ఆ సంగతిని కనుక్కోగలిగింది. అందుకే చివర్లో థాంక్స్ చెప్తుంది. ఇదే సత్యాన్ని మనం చాలా సందర్భాలకు అన్వయించుకోవచ్చు. ఒక చెడు సంఘటన, చేదు అనుభవం మొత్తం జీవితాన్ని చీకటి చేసేయదు. ఆ క్షణంలోనే ఉండిపోతే తప్ప!! ఆ క్షణాన్ని దాటి ముందుకు వెళ్తే తెలుస్తుంది జీవితం ఎంత గొప్పదో.. మనకు ఎన్ని ఆనందాలను ఇవ్వగలదో! నేనూ ఇలాంటి ఎన్నో క్షణాలను దాటి ముందుకు నడిచాను కాబట్టే నాకు ఈ చిత్రం నచ్చింది. 


ఇవాళ్టిరోజున నేను మనుషులనూ, అనుబంధాలనూ, సిధ్ధాంతాలనూ.. ఏమీ నమ్మను. జీవితాన్ని మాత్రం నమ్ముతాను. జీవితం అందించే పాఠాలను నేర్చుకుంటాను.. మనుషుల కన్నా జీవితమే ఎక్కువ ఆనందాలను ఇవ్వగలదని నమ్ముతాను.. ఎందుకంటే నేను దాటిన చీకటి క్షణాల నుండి నేను జీవితాన్ని ప్రతిక్షణం జీవించడం నేర్చుకున్నాను కాబట్టి..!