సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, January 23, 2014

ఆత్మబంధువైన బాటసారి..


హ్మ్!!!!! 
ఏం రాయమంటావు నాగేశ్వర్రావ్! చెప్పు... 

నిన్న పొద్దున్న లేవగానే అలవాటుగా రేడియో పెట్టేసరికీ నీ గురించిన వార్త!! ఈసారి ఎంతమందికని ఫోన్లు చెయ్యను? అమ్మానాన్నలకా? పిన్నికా? పెద్దమ్మకా? మావయ్యకా? అందరికీ నువ్వంటే ఎంత ఆరాధనో నీకు తెలీనిదా? పదిపదిహేను రోజుల క్రితం అనుకుంటా నీకు బాగోలేదనీ..వార్తల్లో చెప్పారనీ అమ్మనాన్న కంగారు పడిపోతే వాళ్లకి పేద్ద పుడ్డింగ్ లా .. "చక్కని జీవితాన్ని గడిపాడు. పిల్లల అభివృధ్ధి చూశాడు. తృప్తిగా జీవితాన్ని గడిపాను అని గర్వంగా చెప్పుకున్నాడు. నాగేశ్వర్రావ్ గురించి బెంగెందుకర్రా..." అంటూ ధైర్యం చెప్పాను. నిన్న కూడా రేడియోలో వినగానే ఇంకా నిద్రలేవని అమ్మని లేపేసి "వార్తలు విని కంగారడకండి..జాగ్రత్త.." అని చెప్పానే గానీ ఆ తర్వాత మాత్రం నెట్, రేడియో అన్నీ ఆపేసి రోజంతా ఐదారు ఫోన్లు చేసి అమ్మ బుర్ర తినేసాను. ఎందుకేమిటీ? నువ్వేమైనా పరాయివాడినా.. మా ఇంట్లో మనిషివి కదూ...


అసలు మావయ్యకి ఫోన్ చెయ్యాలని ఎన్నిసార్లు ఫోన్ దాకా వెళ్లి.. ఆపేసానో! ఏం మాట్లాడాలో తెలీక. అసలు మా పిల్లలందరికీ మావయ్యంటే నువ్వే కనబడతాడు. నీ మేనరిజంస్ అన్నీ జీర్ణించేసుకుని చేయి తిప్పడం, మాట్టాడ్డం మాత్రమే కాక నీ ఆలోచనలని కూడా తనవి చేసేసుకున్న మహాభిమాని కదూ మా మావయ్య! ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చి నిన్ను కలిసాడు.. ఎన్ని ఆల్బమ్స్, ఎన్ని ఫోటోలు, ఎన్ని పేపర్ కట్టింగ్స్.. అన్నీ నీవే! మావయ్యావాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా నీతోనూ, కృష్ణంరాజుతో తీయించుకున్న ఫోటోలు, నీకు రాసిన ఉత్తరాల కాపీలు, వాటి జవాబులు.. ఒకటేమిటి అన్నీ నీ కబుర్లే. ట్రన్స్ఫర్ల వల్ల మావయ్య తిరగని జిల్లా లేదు. వాళ్ళున్నఊరు దగ్గరలో నీ షూటింగ్ ఉందంటే పరిగెత్తుకు వచ్చేసేవాడు కదా మా మావయ్య. 'సీతారామయ్యగారి మనవరాలు' షూటింగ్ అప్పుడు ఒక్క ఉదుటనలో ఎడ్లబండి ఎక్కేసావని.. 'ఈ వయసులో కూడా ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నాడనుకున్నారూ..' అని ఎంత సంబరంగా చెప్పాడో మాకు. 'గాండీవం' సినిమాలో "గోరువంక వాలగానే గోపురానికీ" పాట చూసొచ్చి ఎంత చక్కగా స్టేప్పులేసాడో చూడండి చూడండి..అని సిన్మా చూపించేసాడు మాకు. మరి ఆస్కార్ కమిటీ వాళ్లకి నీ ప్రతిభ గురించి చెప్తూ సుదీర్ఘమైన నలభై పేజీల ఉత్తరం రాసి, వాళ్ల నుండి వచ్చిన జవాబు కాపీ కూడా నీకు పంపాడు కదా! అంత వీరాభిమానికి కాబట్టే నీకులాగ గట్టివాడైపోయాడు మావయ్య. 


ఇంక మావయ్యకు తోడుగా నాన్న కూడా నీ పుస్తకాలు, సీడీలు ఎన్ని కొన్నారనీ! చిన్నప్పుడూ "ఎందుకు నాన్నా నీకంతిష్టం నాగేశ్రావ్..?" అనడిగితే నాన్న ఒకటే చెప్పారు.. "కేవలం హీరోయిక్ రోల్స్ నే కాక వైవిధ్యభరితమైన ఎన్నో పాత్రలు వేసాడు. కష్టపడి పైకొచ్చాడు. శ్రమ విలువ తెలిసినవాడు. మనిషిగా ఎదిగినవాడు. అందుకే నాకిష్టం" అని! టివీలో నువ్వా మధ్యన 'గుర్తుకొస్తున్నాయి..' అంటూ చెప్పిన కార్యక్రమం సిరీస్ తాలూకూ సీడీల సెట్ మొత్తం కొనేసారు కదా! అమ్మ మాత్రం తక్కువ తిందా? మేం స్కుల్లో ఉన్నప్పుడు ఊళ్ళోకొచ్చిన నీ సినిమాలన్నీ ఆదివారాలు మార్నింగ్ షోలకి తీసుకువెళ్ళి మరీ చూపించలేదూ! సందు చివరన ఉండే 'విజయటాకీస్' లో, ఇంకా 'దుర్గాకళామందిర్' లో కీలుగుర్రం, ముగ్గురు మరాఠీలు, తెనాలి రామకృష్ణ, పరమానందయ్య శిష్యుల కథ, మూగమనసులు, గుండమ్మ కథ, గోవుల గోపన్న, మిస్సమ్మ, ప్రేమించి చూడు, నవరాత్రి, డాక్టర్ చక్రవర్తి, దొంగ రాముడు, సువర్ణసుందరి, తోడికోడళ్ళు, అందాల రాముడు... ఎన్ని చూపించిందో.. లైలామజ్ను, దేవదాసు మాత్రం ట్రేజడీలు.. మీకొద్దులే అని చూపెట్టలే! 



ఆ పైన పెట్టినది రాబోయే కొత్త సినిమాలోది..నీ ఫోటోనే! అయినా ఇప్పుడంత తొందరేమొచ్చిందనీ? మొన్ననే కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు.. ఆ ధైర్యంతోనే కదా హాయిగా కూర్చున్నాం అందరమూ! ఎంతమంది టాటా చెప్పేసినా అయ్యో..అనో, వయసయిపోయిందనో సరిపెట్టేసుకున్నా కానీ నీ గురించి ఎందుకనో అలా అనుకోలేకపోతున్నాను... ఎందుకంటావ్??? నాగేశ్వర్రావ్ అంటే ఎవర్ గ్రీన్..ఎప్పుడూ యంగ్ మ్యానే నాకు. అయినా నిన్ను నటుడిగా నేనసలెప్పుడు చూసానని? నాకు నువ్వు నటుడిగా కంటే ఓ నాగేశ్వర్రావ్ గానే ఎక్కువ అభిమానం. నీ క్రమశిక్షణ, వ్యక్తిగా నువ్వు ఎదిగిన తీరు, నేర్చుకున్న పాఠాలు.. ఎన్ని చెప్పావు.. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎవరికైనా ఎంత ఉపయోగపడతాయవి! ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త, శ్రధ్ధ చూపెట్టేవాడివో ఎన్ని ఇంటర్వ్యూల్లో విన్నానో.. ! ఇవాళ తెలుగుజాతి ఒక గొప్ప నటుడినే కాదు.. ఒక మహామనిషిని కూడా కోల్పోయింది... అందుకే.. ఆ బాధతోనే ఏం రాయాలో తెలీలేదు నిన్నంతా... 


నెట్లో ప్రశాంతంగా నిద్రోతున్న నీ ఫోటో చూడకపోతే ఇవాళ కూడా ఏమీ రాసేదాన్ని కాదేమో... అయినా నువ్వెక్కడికి వెళ్లావని.. మా మనసుల్లో, నీ సినిమా సీడీల్లో, నీ పుస్తకాల్లో, నీ మాటల్లో.. ఇంకా చెప్పాలంటే ఈ సినీరంగం ఉన్నంతవరకూ నువ్వు సజీవమే...! అవును కదూ... 




2 comments:

A Homemaker's Utopia said...

Great tribute to a great man..Thanks for posting Trushna Ji.

తృష్ణ said...

@nagini: thanks for the visit.