Monday, April 29, 2013

పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక

"మనుషులకి ఒకరి గురించి ఒకరికి ఎందుకింత ఎక్కువగా తెలియడం? తెలుసుకునే దాకా ఆగలేకపోవడం, తెలుసుకున్నాకా ఓస్ ఇంతేకదా! అనో లేదా ఛీ! ఇంత నీచంగానా? అనో అనుకోవడం ఎందుకు?"
"కిటికీ బయటి వెన్నెల" అనే కథలో మాటలు ఇవి. నాకు ప్రియమైన రచయితల్లో ఒకరైన వాడ్రేవు వీరలక్ష్మిగారు రాసిన  ఈ కథ 'పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక'లోనిది.

ఏదైనా కథా సంకలనం తీసుకుంటే అందులో ఉన్న కథల్లో సగమే కథలు మనకు నచ్చుతుంటాయి. ఒకోసారి ఉన్నవాటిల్లో పావు వంతు కూడా నచ్చవు. పాటల సీడీలైనా అంతే. ఫలానావారి హిట్స్ అని సిడీ విడుదల చేస్తారు కానీ అందులో అసలైన హిట్స్ కొన్ని మిస్సయ్యాయి, లేదా అన్నీ మంచివి లేవు అనుకుంటాం కూడా. అన్ని నచ్చాయీ అంటే అది పుస్తకమయినా, సీడి అయినా అది అరుదైనదే. అలాంటి అరుదైన మంచి కథల పుస్తకమొకటి ఈమధ్యన చదివాను. ఇప్పటిదాకా నేను చదివిన కథా సంకలనాలన్నింటిలో నాకు బాగా నచ్చినది. మొదటి పదిహేను, పదహారు కథలదాకా చకచకా చదివేయగలము. ఆ తరువాత కథల్లోని మాండలీకాల వల్ల కాస్త సమయం ఎక్కువ పడుతుంది నెమ్మదిగా చదువుతాము కాబట్టి. 


'పాలపిట్ట ప్రత్యేక కథల సంచిక'లో మొత్తం 26 కథలు ఉన్నాయి. అన్నీ వేటికవే బావున్నాయి. ఒకో కథా మొదలుపెడితే అయ్యేదాకా పరిసరాలు మర్చిపోయేంతగా మనల్ని లీనం చేసుకోగల కథలు. అన్నీ వైవిధ్యభరితమైన కథాంశాలు. ఇంట్లోని చిన్న పిల్లల జగడాల దగ్గర నుండీ ఉద్యమాల వరకూ, జీవితంలో రకరకాల కోణాలను, పార్శ్వాలనూ స్పృశిస్తాయి ఈ కథలు. అన్ని కథల క్రిందన రచయితల సెల్ నంబర్లు ఇచ్చారు.

కథలు, కథా రచయితల పేర్లు : 

శాంతి పర్వం  -  ఏ.ఎన్.జగన్నథ శర్మ, 
వికృతి   - అట్టాడ అప్పల్నాయుడు, 
వైట్ బోర్డ్..  - జి.ఉమామహేశ్వర్, 
నిసర్గం  - కాశీభట్ల వేణుగోపాల్, 
కిటికీ బయటి వెన్నెల  - వాడ్రేవు వీరలక్ష్మి, 
బొమ్మలపెట్టె  - బి.మురళీధర్, 
చిరాగ్  -  మహమూద్, 
కప్పు కాఫీ - సలీం, 
నిర్ణయం -  సి.ఎస్.రాంబాబు, 
జలసేద్యం -  కాట్రగడ్డ దయానంద్, 
గాజు పెంకులు-దూదిపింజలు  -  డా. బి.వి.ఎన్.స్వామి, 
ఋతుసంహారం -  డా.వి.చంద్రశేఖరరావు,
వేమన్న గుర్రం -  డా. వి.ఆర్. రాసాని, 
విస్ఫోటనం  -  డా.ధేనువకొండ శ్రీరామమూర్తి, 
జింక డ్రామాలో మా ఏక్సను - ఎలికట్టె శంకర రావు, 
యజమాని - మధురాంతకం నరేంద్ర, 
రెండడుగుల నేల - పూడూరి రాజిరెడ్డి, 
ముసిలి - పద్దం అనసూయ, 
దాపటెద్దు - యెన్నం ఉపేందర్, 
సూదిగట్టు -  బి.పి.కరుణాకర్, 
ఒక శంకరం... ఒక శాంత - రామా చంద్రమౌళి, 
దేవుడు - నన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, 
నిత్య కల్లోలం - ముదిగంటి సుజాతారెడ్డి, 
ఏక్ ముసాఫిర్... దో రాస్తే! - స్కైబాబ, 
కంబస్థం బల్లెడ - నారాయణమూర్తి, 
పతాక సందేశం దాట్ల - దేవదానం రాజు. 


ఈ కథలన్నీ నాకు అన్నీ నచ్చాయి కానీ ఒకటి రెండు కథలు బానే ఉన్నాయి అనిపించాయి. కారణం ఆ కథలోని విషయం పట్ల నాకు ఆసక్తి లేకపోవటమే. విభిన్నమైన కథాంశాల కారణంగా మాత్రం అన్ని కథలూ అందరికీ నచ్చకపోవచ్చు. చాలా నచ్చిన కొన్ని కథల గురించి క్లుప్తంగా నాలుగు మాటలు రాస్తాను.

కిటికీ బయటి వెన్నెల 
మనుషుల్లో సాధారణంగా కనబడే క్యూరియాసిటీ ఎలా ఉంటుందో ఓ తేలికైన ఉదాహరణతో చెప్తారు వాడ్రేవు వీరలక్ష్మి గారు. ఈ కథ చదువుతున్నంత సేపు మా కిటికీ లోంచి కనిపించే ఎదురింటివాళ్ల గురించి నేను అనుకునేవే ఈవిడ రాస్తున్నారా అనిపించింది. నాకు బాగా నచ్చింది కథ.నిసర్గం:
స్త్రీ శరీరాన్ని మాత్రమే ప్రేమించటం కాదు ఆమె మనసుని కూడా అర్థం చేసుకున్నప్పుడే మాగవాడి ప్రేమ సంపూర్ణమవుతుంది అన్న సందేశాన్ని తెలిపే కథ నిసర్గం. తనదైన శైలిలో కాశీభట్ల వేణుగోపాల్ గారు రాసిన ఈ కథానిక మనసుని తడుతూ.. స్త్రీని అర్థంచేసుకోవాలంటే శరీరాన్నీ, మనసునీ విడదీసి చూడగలగాలనే ఆలోచనను మేల్కొలుపుతుంది. వైట్ బోర్డ్..  :
పిల్లలు రాసుకునే "వైట్ బోర్డ్" కొనటం, పిల్లల కొట్లాట, అది పరిష్కారమైన విధానం మనసుకి హత్తుకునేలా రాసారు ఉమామహేశ్వర్ గారు. ఏ గందరగోళాలూ లేని ఒక మంచి కథ చదివిన భావన మిగులుతుంది కథ చదివాకా.

బొమ్మలపెట్టె:
పల్లెల్లో, పట్నాల్లో పిల్లల పెంపకాల్లో కనబడే తేడాల్ని చెప్తూ, మన పెంపకాన్ని బట్టే పిల్లల మనస్తత్వం ఏర్పడుతుంది అని చెప్తారు బి.మురళీధర్ గారు.

ముసిలి: 
చిరాగ్:
ఈ రెండు కథలూ ఓ మరణంతో మొదలై, మరణించిన మనిషి యొక్క జ్ఞాపకాల చూట్టూ తిరుగుతాయి.

జింక డ్రామాలో మా ఏక్సను:
ఆద్యంతం నవ్వు తెప్పించే ఈ చిన్న కథ స్టేజి మీద వేసిన రాములోరి నాటకం ఎలా నవ్వులపాలైందో వివరిస్తుంది.

కప్పు కాఫీ:
కప్పు ఎలా ఉందనేది కాదు, అందులోని కాఫీ ఎలా ఉందనేది ముఖ్యం.. అంటూ రుచికరమైన కాఫీలాంటి జీవితాన్ని ఆస్వాదించటమెలాగో తండ్రికి నేర్పుతుంది ఓ కూతురు.

జలసేద్యం:
పౌరోహిత్యం మానుకుని రొయ్యల పెంపకం మొదలుపెట్టిన మాధవకి ఎదురైన కష్టనష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపెడుతుండీ కథ.

యజమాని :
మధురాంతకం నరేంద్రగారు  రాసిన ఈ కథ గురించి జంపాల చౌదరి గారు ఈ వ్యాసం చివర్లో రాసారు. (http://pustakam.net/?p=13885) రచయిత అనుమతితో వారు ఇచ్చిన ఈ కథానిక లింక్ కూడా అక్కడ చూడవచ్చు.

దేవుడు:
అందరితో దేవయ్యా అని పిలిపించుకునే వాసుదేవయ్య ఊరోళ్లందరికీ దేవుడేలా అయ్యాడో ఈ కథ చెప్తుంది.

ఏక్ ముసాఫిర్... దో రాస్తే!
ఉద్యోగమా.. ఉద్యమమా.. అనే ఊగిసలాటలోంచి బయటపడిన సమీర్ చివరకు ఏం నిర్ణయం తీసుకున్నాడో ఈ కథలో చదవచ్చు. ఈ పెనుగులాటలో సమీర్ పడే మానసిక క్షోభ మన కళ్ళెదుట నిలబడుతుంది.

***

క్రిందటేడు విశాలాంధ్రలో యాదృచ్ఛికంగా కొన్న ఈ పుస్తకం నాకెంతో సంతృప్తినీ, ఎన్నోఆలోచనలనీ ఇచ్చింది. కొత్త విషయాలను తెలిపింది. మార్చి2011లో మొదటి ప్రచురణ పొందిన ఈ పుస్తకం వెల ఎనభై రూపాయిలు.