సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, January 6, 2013

జంటగా చూసితీరాల్సిన "మిథునం" !





పదిహేనేళ్ళ క్రితం రాయబడిన ఒక కథ.. కథాజగత్తునే ఒక్క ఊపు ఊపింది. ఎంతోమంది సాహితీప్రియుల ఆత్మీయతనీ, ఆదరణనీ, అభిమానాన్ని సంపాదించుకుంది. నాటక రూపంలో రేడియోలోనూ, రంగస్థలం పైనా చోటు సంపాదించుకుంది. ఆంగ్లానువాదం అయి మళయాళ చలనచిత్రంగా  కూడా రూపుదిద్దుకుంది. బాపూ అందమైన చేతివ్రాతలో దస్తూరీ తిలకమై నిలిచింది. ఎందరో సాహితీమిత్రుల శుభకార్యాల్లో, శుభ సందర్భాల్లో వారివారి బంధుమిత్రులకు అందించే అపురూపమైన కానుకైపోయింది కూడా. అటువంటి బహుళప్రాచుర్యం పొందిన కథను తెరపైకెక్కించే ప్రయోగం చేసారు శ్రీ తనికెళ్ల భరణి గారు. 


ఒక భాష నుండి మరో భాషకు చేసే సాహిత్యానువాదాన్ని అనువాదం అనరు.. "ప్రతిసృష్టి" అంటారు. అసలు రచనలోని సారన్ని మార్చకుండానే తనదైన శైలిలో ఎంతో నేర్పుతో అనువదిస్తాడు అనువాదకుడు. అందువల్ల అది "ప్రతిసృష్టి" అవుతుంది. ఆ విధంగా "మిథునం" సినిమా కూడా భరణి గారి ప్రతిసృష్టి అని చెప్పాలి. కాలానుగుణంగా ఉండటానికి శ్రీరమణ గారి కథ కు కాసిన్ని మార్పులు చేసినా కూడా అసలు కథలోని సారానికి ఏమాత్రం లోటు రానీయలేదు ఆయన. జీవితపు బరువు బాధ్యతలు దింపుకున్న ఓ వృధ్ధ జంట, పల్లెటూరిలోని తమ సొంత ఇంటిలో చివరి రోజులు గడపటం ప్రధాన సారాంశం. వాళ్ల వానప్రస్థం అన్నమాట. ఒక జంట అన్యోన్యంగా ఉంటే ఎలా ఉంటుందో అక్షరరూపంలో చూపెట్టారు శ్రీరమణ గారు. అది దృశ్యరూపంలో ఇంకెంత బావుంటుందో కన్నులపండుగగా చూపెట్టారు భరణి గారు.



ఈ కథను సినిమాగా తీస్తున్నారనగానే నన్ను భయపెట్టినవి రెండే విషయాలు. ఒకటి నటీనటులు, రెండోది ఇల్లు. ఆ పాత్రలు ఎవరు చేస్తారో..ఎలా చేస్తారో అనీ;  అసలలాంటి తోట, పెరడు ఉన్న ఇల్లు దొరుకుతుందా అనీనూ! కానీ బాలూ, లక్ష్మి ఇద్దరూ కూడా తమ పరిధుల్లో ఎక్కడా కూడా వారి నిజరూపాల్లో కనబడక, కథలోలాగ ఎనభైల వయసులో లేకపోయినా, కేవలం అప్పదాసు,బుచ్చిలక్ష్మి లాగానే కనబడటం దర్శకుడి ప్రతిభే ! ఇంక అలాంటి తోట, పెరడు, చెట్లు, పాదులు అన్నీ ఉన్న ఇల్లెక్కడ దొరుకుతుందా అని బెంగపెట్టుకున్నాను నేను. అలాంటిది శ్రీకాకుళంలో దొరికిందిట.. ప్రొడ్యూసర్ ఇల్లేనట అని తెలిసి ఆనందించినదాని కంటే సినిమాలో ఆ ఇల్లు చూశాకా ఇంకా ఎక్కువ సంబరపడ్డాను. "ఆ ఇంట్లో నా కూతురి పెళ్ళి చేసాను. సినిమాకి డబ్బులు రాకపోతే ఇంకో కూతురు పెళ్ళి చేసాననుకుంటాను.." అన్నారట ప్రొడ్యూసర్. అలాంటి పెరడు, చెట్లు, ఇల్లే ఉంటే అప్పదాసేమిటి, ప్రపంచాన్ని వదిలేసి నేనే అక్కడ ఉండిపోతాను..:) ఎన్ని లక్షలు, కోట్లు సంపాదించినా అటువంటి ప్రశాంతమైన జీవితం గడపగలమా?





సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరోటుంది.. ఫోటోగ్రఫీ. భరణి గారి అన్నగారి కుమారుడే ఫోటోగ్రఫీ చేసాడుట. యూనిట్ అంతా కూడా అంతకు ముందు భరణితో పనిచేసిఉన్నవారవటం తనకు ఉపయోగపడిందని ఓ ఇంటర్వ్యులో భరణి చెప్పారు. మొదటి చిత్రమే ప్రయోగాత్మకంగా, రెండే పాత్రలతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నడిపించగలగటం ఎంతో సాహసం. దర్శకత్వంలో కొద్దిపాటి లోటుపట్లు కనబడినా చెప్పదలిచిన విషయాన్ని సమర్థవంతంగానే తెలియజేసారు భరణి. సినిమాలో నాకు బాగా నచ్చినది రేడియో ! పొద్దున్న 'శుభోదయం' నుంచీ రాత్రి 'జైహింద్' అనేదాకా రేడియో కార్యక్రమాల టైం ప్రకారం తమ పనులు కూడా చేసుకునేవాళ్ళు అదివరకూ రేడియో శ్రోతలు. మళ్ళీ ఆ సిగ్నేచర్ ట్యూన్స్ వింటుంటే పాతరోజులు గుర్తుకువచ్చాయి..


అమెరికా పిల్లల కబుర్లు వచ్చినప్పుడు హాలులో నవ్వులు, చివర్లో నిట్టూర్పులూ, ముక్కు చీదిన బరబరలు.. ప్రేక్షకులు ఎంతగా లినమయ్యారో చెప్పాయి. మేం కూడా సినిమా అయ్యాకా కాసేపు అలా కూచుండిపోయాం. బయటకు వచ్చాక కూడా చాలా సేపు మట్లాడుకోలేకపోయాం..! మనసు భారం చేసేసావయ్యా భరణీ అని బాధగా మూల్గినా, అదే సత్యం కదా అని గ్రహించుకుని.. నెమ్మదిగా తేరుకున్నాను. అయితే హాలులో నెంబరింగ్ లేకపోవటం, అతితక్కువ హాల్సు లో విడుదల చేయటం, శనివారం అయినా హాలు నిండకపోవటం కలుక్కుమనిపించాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి ఎదుగుతారో.. ఎప్పటికి చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతుందో.. అన్న ప్రశ్నలు ఇంకా వెంటాడుతున్నాయి నన్ను. 



మూలకథలో లేని మార్పులు చేసినా కూడా వృధ్ధజంట అన్యోన్యత, చిలిపి తగదాలు, పరస్పరాఅనురాగం చూసి నేటి తరం జంటలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది సినిమాలో అనుకున్నా.. అందుకే నాకనిపించింది ఏమిటంటే ప్రతి జంటా జంటగా చూసితీరాల్సిన చిత్రం "మిథునం" అని !





10 comments:

శ్రీలలిత said...

సినిమాని బాగా సమీక్షించారు. నాకు కూడా చాలా నచ్చిందీ సినిమా...

Indira said...

డియర్ తృష్ణా,ఇప్పుడే మీ మిధునం రివ్యూ చదివాను.భరణి గారు ఈ కధ లేని,కధనం మాత్రమే వున్న సబ్జక్ట్ ని సినిమాకి ఎన్నుకోవటం,అందునా ప్రత్యేకించి మిధునంపాఠకుల వూహాజగత్తు కి చిత్రరుపం ఇవ్వాలనుకోవటం నిజంగా చాలా సాహసమే.నటవర్గం నుంచి ఎన్నోసందేహాలతో ఈ సినిమా కి వెళ్ళాం.కృత్తిమంగా కత్తిరించి పెంచే తోటలకన్నా సహజంగా అల్లిబిల్లిగా అల్లుకున్న ఇలాంటి పెరడే జీవకళతో వుంటుంది.ఈ సినిమాలో ప్రతిదీ మనదే!రేడియో మాత్రమే కాదు,ఆ ఇత్తడి గిన్నెలు,రాచిప్పలో పులుసు,ఇనప గరిటలో తిరగమోతలూ,పాత అటకలు అన్నీ అచ్చంగా మనవే.నిజానికి మంచి తోడు నీడా కావలసింది ఆ వయస్సులోనే అనిపిస్తుంది.భార్యాభర్తలు ఒకరికొకరు,తర్వాతనే పిల్లలు,మిగతా ప్రపంచమూనూ.నాకు మాత్రం సినిమా బావుందనుకోవడానికి మరి కొన్ని కారణాలున్నాయ్.ధియేటర్ కి మేం వెల్లినరోజు హౌస్ ఫుల్. ఆరోజు వీల్ చెయిర్ లో మామ్మల్ని తాతయ్యలని తీసుకొచ్చారు కొంతమంది.80,85 వాస్సువాళ్ళు వున్నారు.మాయింట్లో ఇలాంటికుర్చీ వుండేది,ఆగిన్నెలు అచ్చమ్మాయింటోవే లాటి మాటలు గుస గుసగా వినబడుతూనే వున్నాయ్.మాపక్కన కూర్చున్నవారికి ఇది కధగా వచ్చినదని తెలియదు.మేం గర్వంగా చెప్పాం అదేదో మేమే రాసినట్టు!!!తరువాతి షోకి ఎంతోమంది రేడియో వారు వెయిట్ చేస్తూ కనబడ్డారు.ఒకరు ఆస్ట్రెలియా నుంచి ఫ్లయిట్ దిగి నేరుగా సినిమాకి వచ్చారుట!ఆఫీస్ పనిమాద వచ్చి వెంటనే వెళ్ళిపోవాలన్నారు.భరణిగారికి ఇదే తొలిసినిమా కాదుకదా.గ్రహణం,సిరా కూడా దర్శకత్వం ఆయనవే కదా!!ఇంకెంతో రాయాలని వుంది.సినిమా నాకెంతో బాగుంది. ఆఖరుగా ఒకచిన్నమాట నేను గర్వంగా తలుచుకోవడానికి,శ్రీ రమణ మా బంగారం లాంటి తెనాలి వారెట!!!

Saahitya Abhimaani said...

"మొదటి చిత్రమే ప్రయోగాత్మకంగా..."

భరణి గారు మునుపు ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు "సిరా". ఆయన, ఝాన్సీ నటించారు. ఆ సినిమా ఆయనకు, ఆ సినిమాకు అవార్డ్ ఇచ్చినవాళ్ళకు తప్ప మరెవరికీ అర్ధం అవలేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి భరణి గారు ఈ సినిమా తీస్తున్నారంటె, కొంత బెంబేలెత్తినమాట నిజమైనా, ఇంతటి అధ్భుతమైన కథను భరణి మటుకు ఏమి చేయగలడులే అన్న భరోసా కొంత ఉన్నది. మీ సమీక్ష చదివిన తరువాత, ఆ భరోసా ఊరికే పోలేదు అనిపించింది. కాని, రాధాకుమారి గారు ఉండగా, రావి కొండలరావుగారుతో ఈ సినిమా తీసి ఉంటే చాలా అద్భుతంగా ఉండి ఉండేది. వయస్సురిత్యా కూడా బాగా నప్పేది. వాళ్ళు నిజ జీవితంలో కూడా భార్యాభర్తలే. లక్ష్మి బాలు కలిసి ఒక టి వి ధారా వాహికలో (ఇప్పటి ఇనుప రేకులు వగైరాలు లేనప్పుడు) అద్భుతంగా నటించారు. ఆ ధారావాహికలో వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి, ఈ సినిమాకు వాళ్ళను తీసుకుని ఉండిఉండవచ్చు.

నేను ఈ సినిమా ఇంకా చూడలేకపోయాను. కాని, ఇద్దరూ నిష్ణాతులైన పాత తరం నటులైతే ఎలా ఉండేదో మరి. మొదట శంకరాభరణంలోలాగ కొత్త నటుణ్ణి (అప్ప దాసుగా) తీసుకువస్తారని అనుకున్నాను. బాలు అనంగానే (దేవస్థానం నిరాశ నుంచి ఇంకా తేరుకోలేక) కొంత దిగులు వేసింది. సినిమా చూస్తేనే కాని ఈ దిగులు విషయం నాకు నేనుగా తేల్చుకోలేనేమో.

ఏమయినా తెలుగులో ఒక సాహిత్య మణిపూసను సినిమాగా తీసినందుకు ఆ నిర్మాతకు అభినందనలు. ఏదో ఒక చెత్త తొడలు కొట్టె సినిమా, రైళ్ళను వెనక్కు పంపే హీరోలతో ఒక చెత్తకారి సినిమా ఆయా హీరోల అభిమానులనబడే మంద(ల) కోసం కాకుండా, చక్కటి సినిమా తీసిన ఆ నిర్మాతవంటి మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు మరొక ఐదారుగురు ఉంటే చాలు, మన తెలుగు సినిమాకు పట్టిన గ్రహణం వీడే అవకాశం ఉన్నది.

తృష్ణ said...

@శ్రీలలితగారూ, ధన్యవాదాలు.

@ఇందిర గారూ, ఫోటోలో బాలూ కుర్చునే కుర్చీలాంటిదే మా తాతగారికి ఉండేది. నాకెంత ఇష్టమో ఆ కుర్చీ. పిల్లలందరం అందులో కూచోటానికి పోటీలు పడేవాళ్ళం చిన్నప్పుడు. ఇత్తడి గిన్నెలు,రాచ్చిప్పలూ గురించి రాస్తే బోలెడు రాయాలండి..నాకీ టాపా చాలదు.. :) ఇత్తడి గిన్నెలు, ఇత్తడి కేన్లు, రాచ్చిప్పలూ అయితే మా నాన్నమ్మగారి కాలానివి ఎన్నిరకాల సైజుల్లో ఉన్నాయో ఇప్పటికీ! కొన్ని నే తెచ్చి దాచుకున్నా కూడా:)
భార్యాభర్తల గురించి మీరన్నది నుజం. ముందర వాళ్ళిద్దరే, తర్వాతే ఎవరన్నా! అది కూడా మీరన్నట్లు ఏళ్ళు గడిచాకా, అమ్మానాన్నల కన్నా ఎక్కువ కాలం దంపతులిద్దరే కలిసిఉన్నాకా, ఒకరిగురించి ఒకరికి బాగా తెలిసాకా పెరిగే ప్రేమలో ఎంతో స్నేహం, ఆత్మీయత ఉంటాయి.అప్పుడే ఒకరికొకరు కావాల్సినది.
"గ్రహణం" శర్మగారబ్బాయి మోహనకృష్ణదండి. "సిరా" భరణిగారిదే కానీ అది లఘు చిత్రం(షార్ట్ ఫిల్మ్) కదాండి. మెయిన్ స్ట్రీం సినిమా అయితే ఇదే మొదటిది అని చెప్పాలి. అందుకే సిరా గురించి రాయలేదు.
ధన్యవాదాలు.

తృష్ణ said...

శివరామప్రసాద్ గారూ, "సిరా" లఘు చిత్రం కదండి. 'సిరా' కాక మరో రెండు షార్ట్ ఫిల్స్ కూడా తీసారు ఆయన. నేనింతవరకు చూడలేదు కానీ క్రితం ఏడాది విజయవాడ బుక్ ఫెస్టివల్లో "ఆట కదరా శివ" తో పాటూ ఈ shortfilms సెట్ లాగ అమ్ముతూంటే నాన్నగారు తెప్పించుకున్నారు. కానీ అవి ఒక నిమిషం, రెండు నిమిషాల ప్రయోగాత్మక చిత్రాలు. ఫుల్ లెంత్ కమర్షియల్ సినిమా అనగా 'ఫీచర్ ఫిల్మ్' లెఖ్ఖలోకే ఈ సినిమా వస్తుంది కాబట్టి ఇదే మొదటి సినిమా అని రాసానండి.
ఇక నటీనటుల విషయంలో నేను అలానే అనుకున్నా కానీ సినిమా చూశాకా నా అనుమానాలన్నీ వీగిపోయాయి. మరెవరన్నా అయితే ఇంకెలాగుoడేదో కానీ వీళ్ళిద్దరితో బాలేదని మాత్రం ఖచ్చితంగా అనలేము.. సిన్మా చూసాకా :)

మిగతా కమర్షియల్ సినిమాల పోటీకి తట్టుకోలేకపోవచ్చు కానీ మీరన్నట్లు ఒక మంచి చిత్రంగా 'మిథునం' ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఇటువంటి సినిమాలను మనం తప్పక చూడాలి..ప్రోత్సహించాలి.
ధన్యవాదాలు.

R Satyakiran said...

Hats off to శ్రీ రమణ గారు. వారి హాస్య రచనలు చిన్నప్పటి నుంచి తెలిసినా, ఈ పుస్తకం ఇంట్లో ఉన్నా, కొన్ని portions అమ్మా వాళ్లు చదివగా విని ఆనందించినా, reading మీద అంత interest లేక పోవడంతో బద్దకించి మొత్తం ఎప్పుడూ చదవలేదు. అలా వింటున్నప్పుడు మా తాతయ్య వాళ్ళు లా అనిపించే వారు.(కొందరు తాతయ్యల విశేషాలు పెద్దవాళ్ళ ద్వారా విని ఉండటంవల్ల)


Thanks to భరణి గారు. నాలాంటి బద్దక-ఇష్టులకు చాలా సహాయం చేసారు. హాయిగా సినిమా హల్లో కూచుంటే పుస్తకం చూపించేసారు
సినిమా చూసాక అబ్బ అప్పదాసులా ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. కొన్ని సందర్భాలలో "నేను అప్పదాసుని!" అని సరదాగా మా Mrs తో అంటుంటాను. "నేను (బుచ్చి)లక్ష్మి లా అన్నేసి వంటలు చెయ్యలా?" అంటుంది. (of course తనూ fast గానూ రుచిగానూ చేస్తుంది)
పూవులేరి తేవె చెలి పాట మీ blog ద్వారానే పరిచయం అయ్యింది. అద్భుతంగా ఉంటుంది. దేశ్ రాగ్ కదా!. ఆ పాటని సినిమాలో వాడుకున్న తీరు బాగుంది.

జనవరి 1st న భరణి గారు శ్రీ రమణ గారు తో TV లో ఇంటర్వ్యూ వచ్చింది. చాల enjoy చేస్తూ చూసాం. అవార్డ్స్ గురించి టాపిక్ వస్తే, భరణి గారు అన్నారు, "తెలుగు సినిమా కి అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని వస్తాను. ఆ వేదికమీద పంచె కట్టుకుని తెలుగులో మాట్లాడతాను" అని. ఇది తప్పకుండా జరగాలని మనసారా కోరుకుంటున్నాం.

తృష్ణ said...

@R Satyakiran: తెలుగు సినిమాకు, ఈ సినిమాకూ అంతర్జాతీయ గుర్తింపు రావాలని నేనూ కోరుకుంటున్నాను. మంచి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు..:)

వేణూశ్రీకాంత్ said...

సమీక్ష చాలా బాగా రాశారు తృష్ణగారు. ఈ టపాకి వివరంగా మిత్రులు రాసిన వ్యాఖ్యలు కూడా అంతే బాగున్నాయ్... ఈ సినిమా చూసే అదృష్టానికి నేనింకా నోచుకోలేదు, మా ఊరిలో విడుదలవుతుందనే ఆశాలేదు. డివిడి ఎపుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నాను.

రాజేశ్వరి అచ్యుత్ said...

nijamga chala aadarimpa badutunna chitram idi.chitraga unna idi nijam. maa vizagulo chalamandi chusaaru. bharanigariki jejelu.

తృష్ణ said...

@Rajeswari Achyut: thanks for the visit rajeswari gaaru.