సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, January 4, 2013

పాటల డైరీలు..




8th క్లాస్ లో నేనూ, తమ్ముడు స్కూల్ మారాం. ఆ స్కూల్ పెద్దది. ప్రతి సబ్జెక్ట్ కీ ఒకో టీచర్ వచ్చేవారు. మ్యూజిక్ క్లాస్ ఉండేది. ఆ టీచర్ ఎవరంటే ప్రసిధ్ధ గాయని వింజమూరి లక్ష్మి గారి చెల్లెలు వింజమూరి సరస్వతిగారు. ఆవిడ రేడియోలో పాడటానికి వస్తూండేవారు. కొత్త పిల్లల పరిచయాల్లో నేను ఫలానా అని తెలిసి " ఏదీ ఓ పాట పాడు.." అని ఆడిగేసి నన్ను స్కూల్ 'choir group'లో పడేసారావిడ. అలా ఆవిడ పుణ్యమా అని నాలోని గాయని నిద్రలేచిందన్నమాట :) ఇక ధైర్యంగా క్లాసులో అడగంగానే పాడటం అప్పటి నుంచీ మొదలైంది. 


క్లాసులో మ్యూజిక్ టీచర్ నేర్పే దేశభక్తి గీతాలూ, లలితగీతాలే కాక  సినిమాపాటలు కూడా అడిగేవారు. పాట పాడాలి అంటే నాకు సాహిత్యం చేతిలో ఉండాల్సిందే. ఇప్పటికీ అదే అలవాటు. అందుకని రేడియోలోనో, కేసెట్ లోనో వినే పాటల్లో నచ్చినవి రాసుకుని, దాచుకునే అలవాటు అప్పటినుండి మొదలైంది. ఇప్పుడు ఏ పాట కావాలన్నా చాలావరకూ ఇంటర్నెట్లో దొరుకుతుంది కానీ చిన్నప్పుడు వెతుక్కుని, రాసుకుని దాచుకోవటమే మర్గం.


డైరీల పిచ్చి కాబట్టి పాటలు రాయటం కూడా డైరీల్లో రాసుకునేదాన్ని. తెలుగు, హిందీ ఒకటి, ఇంగ్లీషు ఇలా మూడు భాషల పాటలకి మూడు డైరీలు. ఈ డైరీల్లో పాటలు నింపటం ఒక సరదా పని. కేసేట్లో ఉన్న పాట ఎలా అయిన వెనక్కి తిప్పి తిప్పి  రాయచ్చు కానీ రేడియోలో వచ్చేపాట రాసుకోవటమే కష్టమైన పని. ఏదో ఒక కాయితం మీద గజిబిజిగా రాసేసుకుని తర్వాత ఖాళీలు పూరించుకుంటూ డైరీలో రాసుకునేదాన్ని. అలా రేడియోలో "మన్ చాహే గీత్" లోనో, "భూలే బిస్రే గీత్" లోనో విని  రాసుకున్న పాటలు చాలా ఉన్నాయి. కానీ అలా రాసుకోవటం భలే సరదాగా ఉండేది. ఏదో ముక్క, లేదా ఒకే చరణమో వినటం..ఆ విన్నది బావుందని రాసేసుకోవటం. కొన్నయితే ఇప్పటిదాకా మళ్ళీ వినటానికి దొరకనేలేదు నాకు. కొన్ని పల్లవులు మటుకు రాసుకుని తర్వాత ఇంట్లో నాన్న కేసెట్లలో ఆ పాట ఎక్కడ ఉందో వెతుక్కోవటం చేసేదాన్ని. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అలానే దొరికేవి నాకు. కొన్ని పాత సినిమాపాటల పుస్తకాల్లో దొరికేవి. నాన్నవాళ్ల చిన్నప్పుడు సినిమాహాలు దగ్గర అమ్మేవారుట సినిమాల తాలుకు పాటలపుస్తకాలు. అవన్నీ అమ్మ జాగ్రత్తగా బైండ్ చేయించి దాచింది.






వీటిల్లో సినిమాపాటలే కాక ఆ సినిమా తాలూకూ కథ క్లుప్తంగా రాసి ఉండేది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు కూడా పెద్ద లిస్ట్ ఉండేది వెనకాల అట్ట మీద. ఎన్నో పాత సినిమాల కథలు, పాటల వివరాలు ఆ పుస్తకాల్లో నాకు దొరికేవి. ఇవి తెలుగు హిందీ రెండు భాషల సినిమాలవీ ఉండేవి. చిన్నప్పుడు శెలవు రోజున ఈ పుస్తకాలను తిరగెయ్యటం నాకో పెద్ద కాలక్షేపంగా ఉండేది. ఈ పుస్తకాల్లో నే వెతికే పాటలు ఉన్నా కూడా నచ్చినపాట స్వదస్తూరీతో డైరీలో రాసుకోవటమే ఇష్టంగా ఉండేది నాకు. అలా డైరీల్లో పాటలసాహిత్యం రాసుకోవటం ఓ చక్కని అనుభూతి.


స్కూల్లో, కాలేజీలో వెతుక్కుని వెతుక్కుని రాసుకున్న నచ్చిన పాటల డైరీలు ఇవే... (ఈ ఫోటొల్లోవన్నీ ఇదివరకెప్పుడో పదిహేను ఇరవై ఏళ్ల క్రితం రాసుకున్నవి)






ఇప్పుడు రాసే అలవాటు తప్పి రాత కాస్త మారి ఇలా ఉంది.. క్రింద ఫోటోలోది ఇవాళే రాసినది.




 పైన డైరీలో రాసిన తెలుగు పాట తిలక్ గారి "అమృతం కురిసిన రాత్రి" లో "సంధ్య" అనే కవిత. ఆ పుస్తకంలో కొన్నింటికి వారి మేనల్లుడు ఈ.ఎస్.మూర్తి గారు పాతిక ముఫ్ఫైఏళ్లక్రితం ట్యూన్ కట్టారు.(రేడియో ప్రోగ్రాం కోసం) వాటిల్లో ఒకటే ఈ పాట. చాలా బావుంటుంది. "గగనమొక రేకు" పాటని క్రింద లింక్ లో యూట్యూబ్ లో వినవచ్చు:
http://www.youtube.com/watch?v=1E2kYLnz0VI




10 comments:

sarma said...

నలభై ఏళ్ళుగా రాసిన డయరీలు రెండేళ్ళ కితం దాచడానికి చోటులేక, విసుగెత్తి, నీళ్ళపొయ్యిలో, రోజూ చదువుతూ, పరశురామ ప్రీతి చేసేను, చేతులారా. ఇప్పుడు విచారిస్తున్నా.

తృష్ణ said...

@శర్మ గారూ, నాకు ఓ ఇరవై ఏళ్ల నుండీ రాయటం అలవాటండి. పాత డైరీలు నేనూ అలానే పాడేస్తానండి.. ఎన్నేళ్లని దాస్తాము..:) ఇవి పాటలు రాసినవి కదా అందుకని దాచుకున్నా.
thanks for the visit.

Indira said...

డైరీలు పారేయటమా!!!నేను 7వ తరగతినుంచీ మా తెలుగు టీచరుగారి ప్రొద్బలంతో డైరీలు రాయటం మొదలు పెట్టాను.దాదాపు మా చిన్నది పుట్టేవరకు రాశాను.అప్పుదప్పుడు తీసి చదువుతుంటే తమాషాగా అనిపిస్తుంది.ఎవరికంటా కనపడకుండా దాచటం కొంచెం కష్టమేమో గానీ పారేయాలన్న అలోచనే రాలేదు నాకు.అలాగే మంచి పాటల సాహిత్యాన్ని ఇస్తూ వుండండి తృష్ణా.

జ్యోతిర్మయి said...

తృష్ణ గారు జీవితామంతా మనసుకు నచ్చిన దార్లంట నడచిన మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుందండి. నిండైన జీవితానికి నిలువెత్తు దర్పణం మీరు.

Sagar Reddy said...

అలా మీరు వ్రాసిన డైరీలు దాచటం చాలా మంచి పని
మరలా ఇప్పుడు చదివినప్పుడు పాత జ్ణాపకాలు గిలిగింతలు పెడతాయి కదా!!

పాత చిత్రాల పాటల పుస్తకాలు దాఛటం ఎంతో గొప్పపని
నాకు పాటల పుస్తకాలంటే ప్రాణం
ఇలాంటి అద్భుత పుస్తకాలు అందించగలరా!!!(ఆశతో....)
ధన్యవాదములు

తృష్ణ said...

@ఇందిర గారూ, ఓ పదేళ్ళు దాచాకా,దాచి ఏం చేస్తాం అనిపించిందండి... రిఫరెన్స్ కోసం ఉంటాయని ఓ ఐదేళ్లదాకా ఉంచి, ఆ తర్వాత చింపి పడేస్తూంటాను నేను :)
అలాగేనండి. ప్రయత్నిస్తాను..ధన్యవాదాలు.

@జ్యోతిర్మయి: ధన్యురాలిని..! సరే అలానే అనుకోండి.. అలా అనుకుని తృప్తిపడతాను..:)
ధన్యవాదాలు.

తృష్ణ said...

@సాగర్ రెడ్డి గారూ, అవునండి.. ఎప్పుడేప్పుడో ఎంత కష్టపడి వెతికినవో గుర్తొచ్చి అపురూపంగా అనిపిస్తాయి.

పాటల పుస్తకాల కబుర్లు రాయటానికి ప్రయత్నిస్తానండి.. ధన్యవాదాలు.

santosh said...

మధుర జ్ఞాపకాలు మన తీపి గుర్తులు,చేదు అనుభవాలు మరియు చిలిపి చేష్టలు మరచి పోరానివి. అందుకనే ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు.పాత బంగారంకి విలువ ఎక్కువ. డైరీ మన వేకిత్వం గురించి తెలుపుతుంది. మనిషి కి కావలసింది త్రుఫ్తి.

జయ said...

మంచి తీపి గుర్తులు తృష్ణా. చిన్నప్పుడు సిన్మాల కెల్తే పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు. అక్కడే కొనుక్కునే వాళ్ళం. క్రమంగా ఈ పద్ధతి మరుగైంది. కాకపోతే నేనేవీ దాచుకోలేదు. హేవిటో!!!

తృష్ణ said...

@santosh: అవును.. మధుర జ్ఞాపకమేనండి.. ధన్యవాదాలు.
@జయ: పోనీలేండీ..ఎన్నని దాచుకుంటాం..:-) ధన్యవాదాలు.