సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, January 27, 2012

Horti Expo 2012


ఎప్పుడెప్పుడా అని ప్రతి ఏడూ ఎదురు చూసే రోజు నిన్న వచ్చింది. ఊళ్ళో హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ మొదలయ్యింది. ప్రతి జనవరి చివరి వారంలో మూడు నాలుగుగురోజులు నగరంలో జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పూలమొక్కలు, కాయగూరలు, రకరకాల చెట్లూ, బోన్సాయ్ మొక్కలూ, ఎరువులూ, మొక్కల కుండీలు, వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు మొదలైనవి ప్రదర్శనకూ, అమ్మకానికి పెడతారు. ఎప్పుడు మొదలుపెట్టారో తెలీదు కానీ నేను మొదటిసారి తొమ్మిది,పదేళ్ల క్రితం అనుకుంటా Hitex Exhibition Centre లో ఈ హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ చూసాను. అప్పుడు కేవలం మొక్కలు మాత్రమే ప్రదర్శనకూ, అమ్మకానికి ఉండేవి.

పువ్వులు..పువ్వులు..పువ్వులు... 
రంగురంగుల పువ్వులు.. గులాబీలు..చామంతులు...మందారాలు...
రకరకాల ఆకులు... చుట్టూరా పచ్చదనం...
రకరకాల cactus లు, crotons, రంగురంగుల orchids..మత్తెక్కించే లిల్లీ పూలూ...
ఇంకా...గుబులంతా పోగొట్టి కబుర్లాడేవి..
నవ్వులు పూయించేవీ.. ఆహా అనిపించేవీ...
మైమరపించే పువ్వులు...అన్నీ చూసి మైమరచిపోయాను..!!





ఇప్పుడు మూడేళ్ళనుంచీ మిస్సవకుండా ఈ ప్రదర్శనకు వెళ్తున్నాను. ప్రదర్శన లోనూ చాలా మార్పులు వచ్చేసాయి. తినుబండారాల స్టాల్, ఓ పుస్తకాల స్టాల్,  ఓ ఐస్క్రీం స్టాల్.. ఇలా కొత్త కొత్తవి ఇందులో కలిసాయి. ఇంకా నయం natural flower colours తో డిజైన్ చేసిన బట్టలు అంటూ ఓ బట్టల కొట్టు కూడా పెట్టారు కాదు అనుకున్నా..! ఈసారి ప్రదర్శన కన్నా నిరుడు ఇంకాస్త బావుంది అనిపించింది. "ఫ్లవర్ ఎరేంజ్మెంట్" కి ప్రత్యేకం ఓ స్టాల్ ఉండేది. ఈసారి ఉండి కానీ చాలా చిన్నది. నాలుగైదు రకాలకన్నా ఎక్కువ లేవు. పైగా అన్నీ రొటీన్ గా ఉన్నాయి. ఏదేమైనా చుట్టూరా రకరకాల పువ్వులు, పచ్చదనం కాస్తంత ఉన్నా మనసుకు ఆహ్లాదం, చికాకుల్లోంచి కాస్తంత మైమరుపు పుష్కలంగా దొరుకుతాయి. అలా చూసుకుంటే ఈసారి కూడా ఆ ఆనందం నాకు దక్కింది.




ఈసారి బోన్సాయి విభాగంలో అందరి దృష్టినీ ఆకర్షించింది ఈ బుజ్జి చింత చెట్టు



క్రితం ఏడాది ఇలాంటి ఆర్టిఫీషియల్ పువ్వుల ఫోటోలు ఇక్కడ పెట్టాను.




 కూరగాయమొక్కలు పెంచే రకరకాల విధానాలు కూడా చూపెట్టారు ఇలా:




ప్రదర్శనలొ నాకు అస్సలు నచ్చనిది ఈ పూల మొక్కలను మోసే కూలీలు. ఆడవాళ్ళు కూడా బుట్ట కావాలా అని తిరుగుతు ఉంటారు పాపం. జనాలు శుబ్భరంగా మొక్కలు కొనేసుకుని ప్రదర్శన అంతా ఇలా వెనక్కాల తలలపై మొక్కలు మోసే కూలీలతొ తిరగటం నాకెందుకో నచ్చదు...పాపం అనిపిస్తుంది.







ఈసారి ఎక్కువ కూరగాయల మొక్కలకు ఫోటోలు తీశాను. రకరకాల కూరగాయమొక్కలను ఇంట్లో ఎలా పెంచుకోవచ్చునో చూపిస్తూ పెట్టిన స్టాల్స్ చాలా బాగున్నాయి. 





ఎండిపొయిన చెట్టు కొమ్మల్లో బుజ్జి బుజ్జి మొక్కలు ఎలా పెంచారో చూడండి...







అన్నింటికన్నా నచ్చిన మొక్క ఇది. క్రితం సారి ప్రదర్శనలోఇదే పేద్ద చెట్టు పెట్టారు .

ఈసారి ఎక్కువ కూరగాయల మొక్కలకు ఫోటోలు తీశాను. వీటిని చూస్తే నాకు కాకినాడలో చిన్నప్పుడు చూసిన "ఫలపుష్పప్రదర్శనే" గుర్తుకు వస్తుంది.







సజ్జలు



ఈ Expo లో జనాలను ఆకర్షిస్తున్న మరొక స్టాల్ "అరోవా" అనే హెర్బల్ టీ స్టాల్. ఈ హెర్బల్ టీ బాలాజీ ఆయుర్వేదిక్ ఫార్మసీ వాళ్లదిట. పాలు,పంచదార ,కెఫిన్,టీ ఆకులు లేకుండా కేవలం సొంఠి, మిరియాలు, పిప్పలి, జీరక, ధనియాలు,లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క, వాము, కుంకుమపువ్వు మొదలైనవాటితో ఈ హెర్బల్ టీ తయారు చేసారుట. నిమ్మరసం, తేనె కలిపి వేడి వేడిగా స్టాల్ వాళ్లు ఇచ్చిన ఈ టీ(Rs.5/-) నాక్కుడా బాగా నచ్చింది.



ఇంతకీ ఏమీ కొననేలేదు నిన్న. మళ్ళీ వెళ్ళాలి కొనటానికి...!!

క్రితం ఏడాది హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ ఫోటోలు:

Wednesday, January 25, 2012

వంశవృక్షం - వెండితెర నవల



ప్రఖ్యాత కన్నడ రచయిత డా. ఎస్.ఎల్.భైరప్ప గారికి 1966 లో కన్నడ సాహిత్య అకాడమీ బహుమతి తెచ్చిన నవల "వంశవృక్ష". ఈ నవల ఆధారంగా అదే పేరుతో తీసిన కన్నడ చిత్రానికి జాతీయ బహుమతి (దర్శకత్వానికి) కూడా లభించింది. ఈ చిత్రాన్ని తెలుగులో బాపు-రమణలు "వంశవృక్షం(1980)" పేరుతో రీమేక్ చేసారు. సంభాషణలు, సినీ అనుకరణ, ముళ్ళపూడి. నవలీకరణ చేసినది శ్రీరమణగారు.ఇది బాపూ సినిమా అని తెలీనివారు, విశ్వనాథ్ సినిమా ఏమో అనుకునేలా ఉంటుందీ సినిమా కథ. 'శంకరాభరణం' తరువాత మరో గుర్తుండిపోయే పాత్రలో జె.వి.సోమయాజులు ఇందులో కనిపిస్తారు. కె.వి.మహాదేవన్ గారు అందించిన బాణిల్లో "వంశీకృష్ణ.. యదు వంశీకృష్ణా..." పాట చాలా బావుంటుంది.


ఈ సినిమా బాగా చిన్నప్పుడు హాల్లో చూసిన గుర్తు మాత్రమే ఉంది. బయట సీడి కూడా దొరకలేదు కానీ శ్రీరమణగారు నవలీకరించిన పుస్తకం మా ఇంట్లో ఉండేది. అది అప్పుడప్పుడు చదువుతూ ఉండేదాన్ని. ఇటీవలే ఈ వెండితెరనవల చాన్నాళ్ళకు దొరికింది. గొల్లపూడిగారి ’సాయంకాలమైంది’ చదివినప్పుడు నాకు ఈ సినిమానే గుర్తు వచ్చింది. బాపూ గారి "తూర్పువెళ్ళే రైలు" సినిమాలో నటించిన నటి జ్యోతి ఈ సినిమాలో నాయిక. బాపూ ఇతర చిత్రనాయికల్లాగనే ఈ చిత్రంలో బాపూబొమ్మ అయిపోతుందీ అమ్మాయి. మొదట్లో కాసేపు కలవారింటి కోడలుగా నగలన్నీ పెట్టుకుని కన్నులకింపుగా కనబడుతుంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.


ఈ చిత్ర కథ చాలా భారమైనదనే చెప్పాలి. గోదారొడ్డున ఉన్న తిరుమలపురం గ్రామంలో వంశప్రతిష్ట, పరువు,గౌరవం కల కుటుంబం శ్రీనివాసాచార్యుల వారిది. ఆయన ఏకైక కుమారుడు మాధవాచార్యులు. అతని భార్య సరస్వతి. వారి ముద్దుల కుమారుడు నామకరణమహోత్సవంతో కథ ప్రారంభం అవుతుంది. ఆనందకరమైన సరస్వతి జీవితంలో అనుకోని విధంగా చీకట్లు అలముకుంటాయి. మాధవాచర్యులను గోదారి తనలో కలిపేసుకుంటుంది. 'బిడ్డ బాధ్యత చూసుకుంటే చలదూ... ' అన్న అందరి మాటలూ తోసివేసి, ప్రొఫెసర్ పార్థసారథి గారి ప్రోద్బలంతో కోడలిని గోదారి ఆవలి వడ్డున ఉన్న కాలేజీలో చేరుస్తారు శ్రీనివాసాచార్యులవారు. అక్కడ ప్రొఫెసర్ గారి తమ్ముడు, ఇంగ్లీషు లెక్చరర్ అయిన శేషుతో పరిచయం ఏర్పడుతుంది. వారిద్దరి స్నేహం బలపడుతుంది.




మొదట ఒప్పుకోకపొయినా శేషు తెచ్చిన వివాహ ప్రస్థావనను తోసేయలేకపోతుంది సరస్వతి. పెద్ద మనసున్న అత్తమామలంటే అమెకెంతో గౌరవం. తన సమస్యను ఉత్తరంలో రాసి మామగారి వద్ద పెడుతుంది ఆమె. వంశప్రతిష్ట అంటే ప్రాణం పెట్టే శ్రీనివాసాచర్యులు గారు సరస్వతితో చెప్పిన మాటలకు ఆమె తలవంచుతుంది. కానీ శేషుని వదిలి ఉండలేనని తెలుసుకుని, ఇంట్లో చెప్పకుండా అతడిని వివాహం చేసుకుంటుంది. అయితే బిడ్డనూ కూడా ఆమె వదుకోలేకపోతుంది. శేషు భార్యగా తన బిడ్డ కోసం శ్రీనివాసాచార్యుల గడప ఎక్కుతుంది సరస్వతి. అదే రోజు మొదటి భర్త అబ్దీకం జరుగుతూండటం యాదృచ్ఛికం. సరస్వతిని దుయ్యబుడుతున్న అందరినీ శాంతపరిచి ఆమెతో ఉచితానుచితాలు మట్లాడి నిర్ణయం ఆమెకే వదిలేస్తారు శ్రీనివాసాచార్యులవారు. మామగారి మాటలను కాదనలేక బిడ్డను వదిలి ఒంటరిగా వెళ్ళిపోతుంది సరస్వతి. అయితే పిల్లవాడి తాలూకూ బెంగ, అశాంతి ఆమెను జీవితాంతం వెంటాడి ఆమెను కృశింపజేస్తాయి.





ఉపకథ గా ప్రొఫెసర్ పార్థసారధి,  డాక్టరేట్ చేస్తూ ఆయనకు సహాయ పడుతున్న కరుణ; ఆయన రాస్తున్న భారతీయ తత్వశాస్త్రం పై థీసీస్ , వారిద్దరి వివాహం ఎన్నో ఆలోచనలను కదిలిస్తాయి. సినిమా మొదట్లో పార్థసారధి భార్య నాంచారి, కొడుక్కు తలంటు పొయ్యటానికి అతని వెనకాల పరిగేట్టే సీన్ నవ్వుతెప్పిస్తుంది. అది నాకిప్పటికి లీలగా గుర్తుంది. తరువాత ఆయన చివరి దశలో భార్య వద్దకు వచ్చి క్షమాపణ అడిగే దృశ్యం కూడా మర్చిపోలేము.






పెరిగి పెద్దయిన మనవడికి ఒకరోజు బృందావనంవారి  వంశవృక్షాన్ని చూపెడుతున్న సమయంలో తన తండ్రిగారు రాసిపెట్టిన ఒక లేఖ శ్రీనివాసాచార్యుల కళ్ళబడుతుంది. నిప్పులాంటి ఓ నిజం ఒక్కసారిగా ఆయనలో అలజడిని రేపుతుంది. ఈ నేపధ్యంలో వచ్చే పాటలోని సి.నారాయణరెడ్డి గారి సాహిత్యం బావుంటుంది..

ఏది వంశం? ఏది గోత్రం? ఏది పరమార్ధం?
ఏది బీజం? ఏది క్షేత్రం? ఏది పురుషార్థం?
ఏది పాపం? ఏది పుణ్యం? ఏది గీటార్థం?
మత్స్యమై కూర్మమై - వరాహమై నరసింహమై
బ్రాహ్మణాకృతి వామనుండై - క్షత్రియాకృతి రాముడై
యదుకులమ్మున కృష్ణుడై - ఇన్ని అవతారములు దాల్చిన
ఆదిదేవుని వంశమేదీ వర్ణమేదీ - గోత్రమేదీ సూత్రమేదీ?

ఆ నిజం ఏమిటి? సరస్వతి జీవితం చివరికి ఏమైంది? తల్లి పనిచేస్తున్న కాలేజీలోనే ఇంటర్లో చేరిన ఆమె కొడుకు కృష్ణకు తల్లి ఎవరో తెలిసిందా? అన్నది మిగిలిన కథ. ఈ మొత్తం కథలో ప్రభావవంతమైన పాత్ర బృందావనం శ్రీనివాసాచార్యులవారిదే. ఆలోచింపజేసే ఎన్నో ప్రశ్నలు పుస్తకం మూసాకా కూడా మనల్ని వెంటాడతాయి. ఈ కథకు  సినిమాను శ్రీరమణగారు నవలీకరించిన తీరు బాగుంటుంది.





"వంశవృక్షం" సినిమా పాటలు క్రింద లింక్ లో వినవచ్చు:
http://www.raaga.com/channels/telugu/album/A0002467.html

డౌన్లోడ్ కోసం:
http://www.telugusongsfree.com/2011/08/vamsa-vruksham-1980-telugu-movie-audio-mp3-songs.html 

Rahul sharma's "Destination's.."



సంగీత వాయిద్యాల్లో నాకు చాలా ఇష్టమైనది సంతూర్. సంతూర్ వాదన విన్నప్పుడల్లా నాకు వానచినుకులు తుంపరలు తుంపరలుగా ఆకుల మీద పడుతున్నట్లుగా ఉంటుంది. సంతూర్ మీద ప్రేమతో ఓసారి రాహుల్ శర్మ(pt. శివ కుమార్ శర్మ కుమారుడు)  "Time Traveler" కేసెట్ రిలీజైన కొత్తల్లో కొనుక్కున్నా. అందులో "DESTINATION'S " నాకు చాలా ఇష్టం. అది అనుకోకుండా ఇవాళ యూట్యూబ్ లో దొరికింది.

ఇందులో 53 నిమిషాల దగ్గర వచ్చే బిట్ through out వస్తూ ఉంటుంది. ఆ బిట్ నాకు చాలా ఇష్టం.
టం ట - టం ట - టం ట - టం ట - టం టం టం...
మీరూ వినేయండి...




ఈ కేసెట్ లోని అన్ని ట్యూన్స్ ఇక్కడ వినవచ్చు:
http://ww.smashits.com/time-traveler/songs-5698.html




Friday, January 20, 2012

कैसा है इश्क ..


రాహత్ ఫతే అలీ ఖాన్ పాడిన ఒక పాట అదివరకు ఒకటి టపాలో పెట్టాను.. నిన్న మరో మంచి పాట ఓ ఎఫ్.ఎం లో విన్నాను. "మేరె బ్రదర్ కి దుల్హన్' సినిమా లోది పాట. సాహిత్యం సంగీతం రెండు బాగున్నాయి. రాహత్ గళం కుడా సరిగ్గా సరిపోయింది పాటకి.

song : iShq  risk
Film: Mere Brother Ki Dulhan
Singer: Rahat Fateh Ali Khan
Music : Sohail Sen
Lyricist: Irshad Kamil




lyrics :

कोई बोले दरिया है...कैसा, कैसा है इश्क
कोई माने सेहरा है...कैसा, कैसा है इश्क
कोई बोले दरिया है...कैसा, कैसा है इश्क
कोई माने सेहरा है...कैसा, कैसा है इश्क

कोई सोने सा तोले रे, कोई माटी सा बोले रे
कोई बोले के चांदी का है छुरा
होता ऐसे ये मौके पे, रोका जाए ना रोके से
अच्छा होता है, होता है ये बुरा
कैसा ये इश्क है, अजब सा रिस्क है..
कैसा ये इश्क है, अजब सा रिस्क है..
अजब सा रिस्क है......

कैसा इश्क है...(3)

मुश्किलों मे ये डाले, जो भी चाहे करा ले,
बदले ये दिलों के फैसले.
मन का मौजी, इश्क तो जी
अलबेली सी राहों पे ले चले.. (2)

कोई पीछे ना आगे है
फिर भी जाने क्यूँ भागे है
मारा इश्के का, इश्के का दिल मेरा..दिल मेरा..

इसके उसके ये हिस्से मे, तेरे मेरे ये किस्से मे
मौला सीखे बिन सीखे बिन दे सिखा.
कैसा ये इश्क है, अजब सा रिस्क है..
कैसा ये इश्क है, अजब सा रिस्क है..



नैना लागे तो जागे, बिना डोरी या धागे
बंधते है दो नैना ख्वाब से.
ना अता हो, ना पता हो
कोरे नैनो मे कोई आ बसे..(2)
इसका उसका ना इसका है
जाने कितना है, किसका है
कैसी भासा मे, भासा मे है लिखा

इसके उसके ये हिस्से मे, तेरे मेरे ये किस्से मे
मौला सीखे बिन सीखे बिन दे सिखा.
कैसा ये इश्क है, अजब सा रिस्क है..
कैसा ये इश्क है, अजब सा रिस्क है..


Thursday, January 19, 2012

వటపత్ర శాయికీ వరహాల లాలి



మధురమైన పి.సుశీల గాత్రానికి అద్భుతమైన నారాయణరెడ్డి గారి సాహిత్యం జోడై అమృతాన్ని తలపిస్తే, ఇళయరాజా అందించిన స్వరాలు వెన్నెలలు కురిపిస్తాయి...!

ఈ పాటలో "కరిరాజముఖునికి గిరితనయ లలి.." వాక్యం నాకు చాలా నచ్చుతుంది. అలానే "త్యాగయ్య లాలి..." అనేప్పుడు సుశీల పలికించే గమకం బావుంటుంది. ఇక పాట మొత్తంలో రాధిక ముఖంలో కనబరిచే హావభావాలకి హేట్స్ ఆఫ్..అనాలనిపిస్తుంది.

స్వాతిముత్యం చిత్రం నుంచి నాకెంతో ఇష్టమైన పాట...



సాహిత్యం:

లాలి లాలి లాలి లాలి (2)
ప: వటపత్ర శాయికీ వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికీ...(2) ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి ((ప))

1చ: కల్యాణరామునికి కౌసల్య లాలి(2)
యదువంశవిభునికి యశోద లాలి(2)
కరిరాజముఖునికీ...(2) గిరితనయ లాలి
పరమాంశభవునికి పరమత్మ లాలి ((ప))

జోజో.. జోజో.. జో...(2)

2చ: అలమేలుపతికి అన్నమయ్య లాలి(2)
కోదండరామునికి గోపయ్య లాలి(2)
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి(2)
ఆగమనుతునికి త్యాగయ్య లాలి ((ప))

Wednesday, January 18, 2012

REVOLUTION 2020



నవంబర్లో అనుకుంటా ఒక కొలీగ్ ట్రైన్లో తను చదివేసాకా, ఈ పుస్తకం చదవమని ఇచ్చారని ఇంటికి తెచ్చారు శ్రీవారు. తను చదివి మెచ్చేసుకున్నారు కానీ నాకు ఆ పుస్తకం తెరవవటానికి మరో నెల పట్టింది. కథ మంచి సస్పెన్స్ లో ఉన్నా కూడా రోజుకు పాతిక పేజీలకన్నా చదవటం కుదరకపోతూంటే భలే కోపం వచ్చేసేది. డిసెంబర్ చివరివారంలో కాలికి దెబ్బ తగలటంతో 'జరిగేవన్నీ మంచికనీ...' అని పాడేకుంటూ సగమ్ చదివిన పుస్తకాన్ని ఒక్క రోజులో పూర్తి చేసేసి హమ్మయ్య ! అని ఊపిరితీసేసుకున్నా. ఉత్కంఠతతో నన్ను అసాంతం చదివించిన ఆ పుస్తకమే ఈ "REVOLUTION 2020".




రచయిత గురించి:
 చేతన్ భగత్. దేశంమొత్తమ్మీద ఇప్పుడీ పేరు ఒక సంచలనం. ఐదే నవలలు. ప్రతి నవలకూ వెల్లువలా ప్రసంశలు. రెండు నవలలు సినిమాలుగా మారగా, అందులో ఒకటి("3 Idiots") అనూహ్యమైన విజయాన్ని చూసింది. మరో రెండు నవలలు సినిమాలుగా మారుతూ నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడీ లేటేస్ట్ నవల "REVOLUTION 2020" మార్కెట్లోని బెస్ట్ సెల్లర్స్ లో ఒకటి. ఇంతకు ముందు "3 Idiots" రిలీజ్ అయినప్పుడు నేను ఇతని పేరు విన్నాను. మొదటి నాలుగు నవలలు నేను చదవలేదు. అనుకోకుండా ఈ ఒక్క పుస్తకం చదవటం జరిగింది. ఇతను ఇంత పాపులర్ అవ్వటానికి కారణం తెలుసుకోవాలని ఆసక్తిగా ఈ పుస్తకం చదివాను. యువతను గురించీ, కొన్ని సమకాలీన సమస్యలను గురించీ ఇతను రాస్తాడని అర్ధమైంది. చేతన్ భగత్ టార్గెట్ 'యువత' అనిపించింది! అతని ఉద్దేశాలు, ఆంతర్యాలూ ఏవైనా రచనా శైలి ఆకట్టుకునేలా ఉంది. నవలను మొదలుపెట్టింది మొదలు చివరిదాకా వదలాలనిపించకపోవటం, మధ్యలో ఆపాల్సివచ్చినప్పుడూ..మళ్ళీ ఎప్పుడు చదువుతామా అనే తపన కలగటం...ఇవే ఏ రచనలోనైనా ముఖ్యంగా ఉండాల్సినవి. అవే ఆ రచయితకు విజయసోపానాలు. అది చేతన్ సాధించాడు.
ఈ కథలో ఏముంది?

మొదట ఇది ఒక సాధారణ ప్రేమ కథ అనుకున్నాను. కానీ ఇది వివిధ అంశాలను, సమకాలీన సమస్యలనూ కలిపిన ఒక విభిన్నమయిన కథ అని అర్ధమైంది. యువకుల కలలు-ఆశలు, యువకుల ఆశయాలు, చదువులు, నిరుద్యోగం, ప్రేమ, వివాహం మొదలైన అంశాలే కాక సమాజంలో అడుగడుగునా లంచగొండితనం ఎలా పాతుకుపోయిందో కూడా కళ్ళకి కట్టినట్లు చూపుతుందీ నవల. మరోపక్క ఒక నిస్సహాయ ప్రేమికుడి సున్నితమైన ప్రేమ, ఆనందం, ఒంటరితనం, నిరుత్సహం, వేదన మొదలైన అనేక పర్శ్వాలనూ మనసుకు హత్తుకునేలా చిత్రీకరించాడు రచయిత.


ఇది ఒక ముక్కోణ ప్రేమకథ. కథాస్థలం ప్రాచీన ప్రఖ్యాత పట్టణం "వారణాసి". ఉత్తమ రచనకు కావాల్సినవంటూ Aristotle ప్రతిపాదించిన three unities (unity of time, place and action) ఈ  నవలలో బాగా కుదిరాయి . తన ఆశయాలను నిజం చేసుకోవాలనీ, దేశం కోసం ఏదేదో చెయ్యాలనీ ఆశ పడే యువకుడు రాఘవ్. తన తెలివితేటల్ని ఒక ఉద్యమానికి, మార్పుకీ నాందిగా వాడుకునే వారణాసి పౌరుడు అతను. తన అపజయాన్నే పునాదిగా చేసుకుని వేళ్ళూరిన లంచగొండితనాన్ని నిచ్చెనగా చేసుకుని ఉన్నతశిఖరాలను అందుకుంటాడు గోపాల్. తన తెలివితేటల్ని అవినీతి బాటలో నడిపించి విజయాన్ని పొందుతాడు. బాల్యస్నేహితులైన వీరుద్దరూ ఒకరినే ప్రేమించటం కథలోని మెలిక. చివరికి అమ్మాయి ఎవరికి దక్కుతుందా అన్నది నవలలోని పతాక సన్నివేశం.


కథలో శక్తివంతమైన గోపాల్ పాత్ర ముందు రాఘవ్, ఆరతి ఇద్దరూ అతిథులే అనిపిస్తారు. చదువుతున్నంత సేపూ గోపాల్ తో మనం నవ్వుతాం, గోపాల్ తో మనం వేదన పడతాం, గోపాల్ తో పాటు కన్నీరు కారుస్తాం, గోపాల్ తో పాటూ మనమూ ప్రేమిస్తాం...! అతని బాట అవినీతితో నిండినదైనా, స్వచ్ఛమైన అతని ప్రేమ మన మనసుల్ని తాకుతుంది. నిస్వార్ధమైన అతని త్యాగం 'అయ్యో..' అనిపిస్తుంది...! స్వచ్ఛత నిండిన అతని ప్రేమ మనల్ని స్పర్శిస్తుంది. 'చివరికి ఇలా చేసాడేం... ఆమెను తనదాన్ని చేసేసుకోవచ్చు కదా...' అనే స్వార్ధపూరిత ఆలోచన పాఠకులకు కలిగేలా చెయ్యటంలో రచయిత సమర్థవంతమయ్యాడు.

కథలో మధ్య మధ్య రచయిత అమ్మాయిల స్వభావాల గురించి చెప్పే వాక్యాలు సరదాగా ఉంటాయి. ఒక చారిత్రాత్మక పట్టణంలో జరిగిన అందమైన ముక్కోణ ప్రేమ కథను గోపాల్ కళ్ళతో చూడటానికి.. అతని సున్నితమైన భావాలను స్పర్శించటానికీ పుస్తకం చదవచ్చు !

నచ్చనిది:

నాటకీయత ఎక్కువైందేమో అనిపిస్తుంది కథ చివరలో. ముందర రాసిన నాలుగు నవలలూ సినిమా కథలుగా మారిపోవటం వల్ల ఈ కథ కూడా 'వెండితెర'ను దృష్టిలో పెట్టుకుని రాసాడా? అనిపిస్తుంది. రచయితకు జనాకర్షణ ఎక్కువైపోతే కథనంలో నాటకీయత ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉందేమో అన్న అనుమానం నన్ను వెంటాడింది.



Sunday, January 15, 2012