సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, December 19, 2012

ఈ సంవత్సరం కొన్న పుస్తకాల కబుర్లు



ఉన్నవి చాలు ఇక కొత్తవి ఎందుకని పుస్తకాలు కొనటం మానేసి, సంసార సాగరంలో పడ్డాకా ఖాళీ దొరక్క సినిమాలు చూడ్డం మానేసి ఏళ్ళు గడిచాయి. అయితే బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టాకా మళ్ళీ ఈ రెండు అభిరుచులకీ సమయం కేటాయించటం మొదలయ్యింది. ప్రస్తుతానికి ఈ టపాలో పుస్తకాల గురించి చెప్తానేం.. బ్లాగుల్లో అక్కడా అక్కడా రకరకాల పుస్తకాల గురించి చదువుతుంటే మళ్ళీ విజయవాడ పుస్తకప్రదర్శన రోజులూ, మొదలుపెట్టింది మొదలు ప్రతి ఏడూ విడువకుండా వెళ్లటం అన్నీ గుర్తొచ్చి... మళ్ళీ పుస్తకాలు కొనాలనే కోరిక బయల్దేరింది. బుర్రలో ఆలోచన పుట్టిందే మొదలు పుస్తకాల షాపులవెంట పడి తిరగటం మళ్ళీ అలవాటైపోయింది. చిన్నప్పటి నుండీ ఎవరు ఎప్పుడు బహుమతిగా డబ్బులు ఇచ్చినా దాచుకుని, వాటిని పుస్తకాల మీద ఖర్చుపెట్టడం నాకు అలవాటు. ఇప్పటికీ అదే అలవాటు. ఇప్పుడు పెద్దయ్యాం కాబట్టి బహుమతులు కూడా కాస్త బరువుగానే ఉంటున్నాయి నే కొనే పుస్తకాలకు మల్లే..:)

క్రిందటేడు పుస్తక ప్రదర్శనలో పెద్ద పెట్టున పుస్తకాలు కొన్నాననే చెప్పాలి. క్రింద ఫోటొలోవి మొదటి విడతలో కొన్నవి. చివర్లో మరోసారి వెళ్ళినప్పుడు మరికాసిని అంటే ఓ ఐదారు పుస్తకాలు కొన్నా. వాటికి ఫోటో తియ్యనేలేదు :( వాటిల్లో ఓ పది పుస్తకాలు చదివి ఉంటాను. మిగిలినవి అలానే ఉన్నాయి..




ఆ తర్వత ఓసారి మార్చిలొనొ ఏప్రిల్ లోనో విశాలాంధ్రలో క్రింద ఫోటోలో పుస్తకాలు కొన్నా..



అవి సగమన్నా చదవకుండా మళ్ళీ ఎవరికోసమో పుస్తకాలు కొనటానికి వెళ్ళి అప్పుడు మరో పదో ఎన్నో తీసుకున్నా. ఓసారి ఏదో గిఫ్ట్ కొందామని Landmarkకి వెళ్ళి అక్కడ "త్రీ ఫర్ టూ" ఆఫర్ నడుస్తోందని మూడు కాక మూడు కాక మరో రెండు కలిపి ఐదు బుక్స్ కొనేసా. వాటిల్లో ఓ మూడు చదివా. 





మా అమ్మావాళ్ళింటి ముందరే కోటి వెళ్ళే బస్సులు ఆగుతాయి. కోటికి గంట ప్రయాణమైనా అక్కడికి వెళ్తే ఈజీగా కోటీ వెళ్ళొచ్చని నాకు సంబరం. ఓసారి ఇంటికెళ్ళినప్పుడు ఏం తోచక కోటీ వెళ్ళొస్తానని బయల్దేరి మళ్ళీ కొన్ని పుస్తకాలు వెంటేసుకొచ్చా. ఇల్లు మారేప్పుడు అట్టపెట్టిలోకెళ్ళిన ఈ కొత్త పుస్తకాలన్నీ ఇంకా వాటిల్లోనే ఉన్నాయి. మళ్ళీ ఇల్లు మరినప్పుడే అవి బయటకు వస్తాయి. అన్ని పేర్లు గుర్తులేవు కానీ కొన్ని పేర్లు గుర్తున్నాయి.. గోదావరి కథలు, ఓహెన్రీ కథలకి తెలుగు అనువాదం, సోమరాజు సుశీల గారి దీపశిఖ, కొత్తగా ప్రచురించిన రవీంద్రుడి కథలు, రవీంద్రుడి నవలలకు తెలుగు అనువాదాలు కొన్ని..  

ఆ తర్వాత ఇటీవలే మావారు ఎవరికోసమో పుస్తకం కొనటానికి వెళ్తూ పొరపాటున నన్ను కూడా నవోదయాకు తీసుకువెళ్ళారు. అప్పటికే నన్ను గుర్తుపట్టడం వచ్చేసిన షాపులో ఆయన "మేడం ఇవొచ్చాయి.. అవొచ్చాయి.." అని నాతో ఓ సహస్రం బిల్లు కట్టించేసుకున్నారు. అగ్రహారం కథలు, ఏకాంత కోకిల, వాడ్రేవు వీరలక్ష్మి గారి మా ఊళ్ళో వాన, ఒరియా కథల పుస్తకం ఉల్లంఘన, మొదలైనవి కొన్నా.  అప్పుడే నవోదయా ఆయన చెప్పారు పుస్తకప్రదర్శన డిసెంబర్ పధ్నాలుగు నుండీ అని. ఎందుకు సామీ ఈవిడకు చెప్తారు...అని పాపం మావారు అదోలా చూసారు నన్ను :))




ఇక ఈ ఏడు పుస్తక ప్రదర్శన కబుర్లు:

డిసెంబరు వచ్చింది.. ఈ ఏడు పుస్తక ప్రదర్శన కూడా వచ్చింది. కాకపోతే ఇప్పుడున్న ఇల్లు ఊరికి చాలా దూరం. ఎలా వెళ్ళాలా అని మధనపడుతుంటే క్రితం వారాంతంలో అమ్మావాళ్ళింటికి వెళ్ళాల్సిన పని వచ్చింది. ఐసరబజ్జా దొరికింది ఛాన్స్ అని అయ్యగారిని గోకటం మొదలెట్టా..:) పాపం సరేనని మొన్నాదివారం  తీస్కెళ్ళారు. పన్నెండింటికి వాళ్ళు ప్రదర్శన ప్రారంభించగానే దూరేసాం లోపలికి. 


గేట్లో న్యూ రిలీజెస్ అని రాసిన పేర్లు చదువుతూంటే మావారు ఎవరినో చూసి నవ్వుతు చెయ్యి ఊపటం గమనించి ఎవరా అని చూస్తే ఎవరో చైనీస్ అమ్మాయి చేతిలో ల్యాప్టాప్ పట్టుకుని చూసుకుంటోంది. నేను పెళ్ళిపుస్తకంలో దివ్యవాణిలా మొహం పెట్టాను. "ఆ అమ్మాయి తన ల్యాపి లోంచి నీకు ఫోటో తీస్తోంది..అందుకే నవ్వుతూ చెయ్యి ఊపాను" అన్నారు తను. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని చూసా.. అప్పుడా అమ్మాయి కూడా నవ్వుతు నాకు చెయ్యి ఊపి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత చూసాం లోపల "Falun Dafa"  అనే సెల్ఫ్ కల్టివేషన్ ప్రాక్టీస్ తాలుకూ స్టాల్ ఉంది. అందులో బోలెడుమంది చైనీస్ అమ్మాయిలు సీరియస్గా మెడిటేషన్ చేసేస్తున్నారు. ఈ 'కల్టివేషన్ ప్రాక్టీస్' వివరాలు కూడా ఆలోచింపజేసేవిగానే ఉన్నాయి. ఆ వెబ్సైట్లో వివరాలు చదవాలి.


పైన రాసినట్లు ఈ ఏడాదంతా పుస్తకాలు కొంటూనే ఉన్నా కాబట్టి కొత్తగా కొనాల్సినవి చాలా తక్కువగా కనబడ్డాయి. అయినా పుస్తకాల కొనుగొలుకు అంతం ఎక్కడ? కనబడ్డవేవో కొన్నాను.. క్రితం ఏడు కొనలేకపోయిన "Living with the Himalayan Masters"కి తెలుగు సేత దొరికింది. అమ్మకు గిఫ్ట్ ఇద్దామని వి.ఎస్.ఆర్ మూర్తి గారి "ప్రస్థానమ్" కొన్నాను.




నవోదయా షాపాయన హలో మేడమని పలకరిస్తే ఆ స్టాల్లో దూరి మృణాళినిగారు తెలుగులోకి అనువదించిన "గుల్జార్ కథలు", నా దగ్గర లేని శరత్ నవల "చంద్రనాథ్", ఎప్పటి నుంచో కొందామనుకున్న "స్వేచ్ఛ", పిలకా గణపతి శాస్త్రి గారి "ప్రాచీనగాథాలహరి" కొన్నా. తర్వాత ఓ చోట కొన్ని ఆరోగ్య సంబంధిత పుస్తకాలూ తీస్కున్నా. వీటిలో "చిరుధాన్యాల" గురించిన చిన్న పుస్తకం బావుంది.





"హాసం" పత్రికలో తనికెళ్ల భరణి గారివి "ఎందరో మహానుభావులు" పేరుతో వ్యాసలు వచ్చేవి. అవి చదివాకే నాకు ఆయనపై మరింత గౌరవాభిమానాలు పెరిగాయి. ఆ ఆర్టికల్ కట్టింగ్స్ అన్నీ దాచుకున్నా కూడా. ఆ సంకలనం కనబడగానే తీసేస్కున్నా. తర్వాత అమ్మ బైండింగ్ చేయించి దాచిన పత్రికల్లోని నవలలో "ఉదాత్త చరితులు" అన్న పేరు బాగా గుర్తు నాకు. ఈ నవల ఆ బైండింగ్స్ లోనిదే అనిపించి అది కూడా కొన్నా.



స్కూల్లో ఉండగా నా ఫ్రెండ్ ఒకమ్మాయి ఇంగ్లీష్ నవలలు బాగా చదివేది. స్కూల్ బస్సులో రోజూ వెళ్ళేప్పుడు వెచ్చేప్పుడు బస్సులోకూడా చదువుతూ ఉండేది. అలా ఓసారి తను "రూట్స్" అనే నవల చదివింది. చాలా గొప్ప నవల చదువు అని అప్పుడప్పుడు కథ చెప్పేది. అప్పట్లో నాకు పుస్తక పఠనం పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఆ తర్వాత చాలా సార్లు "రూట్స్" కొనాలనుకున్నా కానీ కొననేలేదు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండు మూడేళ్ల నుండీ రూట్స్ కి తెలుగు అనువాదం చూస్తున్నా కానీ కొనలేదు. అందుకని ఈసారి తెలుగు అనువాదం "ఏడు తరాలు" కొన్నా.



Oxford University Press వాళ్ల స్టాల్లో పిల్లలకి మంచి పుస్తకాలు దొరుకుతాయి. క్రితం ఏడాది కొన్న మేథమేటిక్స్ వర్క్బుక్స్ మా పాపకి చాలా పనికివచ్చాయి. అందుకని ఈసారి కూడా ఇంగ్లీష్ + మేథ్స్ బుక్స్ కొన్ని తీసుకున్నాము. వాటితో పాటు లోపల సీడిలు కూడా ఉన్నాయి. ఇవి కాక పిల్ల కోసమని మరికొన్ని కొన్నా నేను. "ఫన్నీ కార్టూన్ ఏనిమల్స్" అనే పుస్తకంలో పెన్సిల్ స్కెచెస్ బాగా నచ్చి, పిల్లతో పాటు నేను వేద్దామని కొన్నా :) క్రింద ఫోటోలో బుక్స్ లో "పారిపోయిన బఠాణీ" అనే పిల్లల నవల మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది. చిన్నప్పుడు బోలెడన్ని సార్లు అదే కథ చదివేదాన్ని నేను. కథ గుర్తుండి ఎప్పుడూ పాపకి చెప్తూంటాను కానీ అసలు పుస్తకం ఇంట్లో కనబడట్లేదు. ఒక చోట పిల్లలపుస్తకాల మధ్యన "పారిపోయిన బఠాణీ" కనబడగానే పట్టలేని ఆనందం కలిగింది.




పుస్తక ప్రదర్శనలో ఏదో ఒక పోస్టర్ కొనటం చిన్నప్పటి నుండీ నాకు అలవాటు. ఒక చోట త్రీడీ పోస్టర్స్ అమ్ముతున్నారు. రాథాకృష్ణులది ఒకటి కొన్నా. క్రింద ఉన్న మూడు ఫోటోలూ ఒకే పోస్టర్ వి.





ఇంకా కొత్తగా నాకు పింగళి గారి పాటలపై రామారావుగారు రాసిన రెండవ భాగం కనబడింది. మొదటిది ఎప్పుడో వచ్చింది. ఈ రెండూ మాత్రం కొనాల్సిన జాబితాలో ఉన్నాయి..:) ఎప్పుడో తర్వాతన్నా తీసుకోవచ్చు కదా అని ఊరుకున్నా.


ఇంకా.. పాత ఇంగ్లీష్ నవలలు ఏభైకి, అరవైకి రెండు చోట్ల అమ్ముతున్నారు. మంచివి ఎన్నుకుని టైమ్ పాస్ కీ, ప్రయాణాల్లో చదవటానికి కొనుక్కోవచ్చు. పిల్లల పుస్తకాలు కూడా ఓల్డ్ స్టాక్ అనుకుంటా తక్కువ ధరకి అమ్ముతున్నారు. అవి కూడా కొన్ని కొంటే,  ఇంటికి పిల్లలెవరైనా వస్తే ఇవ్వటానికి పనికివస్తాయి అనిపించింది.

చివరాఖరుగా పుస్తకాల షాపువాళ్ళిచ్చిన తాలుకూ రంగురంగుల క్లాత్ కవర్లు..బిల్లులు, ప్రదర్శన టికెట్లు :-)



14 comments:

kasi said...

అబ్బో చాలా పుస్తకాలు కొన్నారండి.
ఇన్ని పుస్తకాలు చదవడానికి టైం అక్కడున్తుందండి బాబు.
ఈ మధ్యనే ఒక పుస్తకం చదివాను "అమ్మ ఒడిలోకి పయనం " అని..ఇంగ్లీష పేరు journey to home అనుకుంటా, చాలా బాగుంది ఒక అమెరికన శ్రీ కృష్ణుడు భక్తుడిగా మారడం.మీకు ఉపయోగపడచ్చేమో .
నాకో సందేహం, ఒక పుస్తకం కొనేటప్పుడు రచయిత పేరు చూసి కొంటారా ? లేక ముందు ఓ రెండు పేజిలు చదివి కొంటారా ?

Indian Minerva said...

మీరు మాట్లాడుతున్నది బెంగుళూరు పుస్తక ప్రదర్శన గురించా? నేను మిస్సయ్యాను వా(.... :'(

madhusudana gupta.t said...

mam
great collection
if possible pls give detailed discription of all u r books in a separate blog post
may be useful to people like me to buy

తృష్ణ said...

@కాశీ గారూ, తెలీని పుస్తకాలు సాధరణంగా కొననండి నేను. రచయిత బాగా తెలిసినవారైతే పుస్తకం పేరు తెలియకపోయినా కంటెంట్ చూసి తీసుకుంటాను. మిత్రులెవరన్నా చెప్పినవి, వాటి గురించి ఎక్కడన్నా పేపర్లోనో, మాగజైన్స్ లోనో చదివితే, నెట్లోనొ ,బ్లాగుల్లోనో చదివితే కొంటానండి.
Thanks for the visit.

@ఇండియన్ మినర్వా గారూ, నేను హైదరాబాద్ లో జరుగుతున్న పుస్తక ప్రదర్శన గురించి చెప్తున్నానండి.మీకు వీలైతే ఇక్కడికి వచ్చి చూడండి..
Thanks for the visit.

ధాత్రి said...

పెద్ద లైబ్రరినే ఉంది మీ ఇంట్లో..:)
వచ్చేయ్యాలి మీ ఇంటికి.:)
ఎప్పటివరకూ ఉందండీ ప్రదర్శన??
అంటే చివరి తేది ఎప్పుడు??

A Homemaker's Utopia said...

తృష్ణ గారు,అబ్బ ఎన్ని పుస్తకాలో...మీ కలెక్షన్ నిజం గా సూపర్ అండీ..:-)Happy reading..:-)

తృష్ణ said...

@madhusudana gupta.t:can't promise,but i'll try..
Thanks for the visit.

@dhaatri:sure..Welcome :)
Book fair is from 14th to 25th dec.
http://hyderabadbookfair.com/
thanks for the visit.

@nagini gaarU, wish i could read all the books in this year :)
thanks for the visit.

Unknown said...

మీరు పుస్తకాభిమానిలా ఉన్నారు. నా కొక చిన్న సహాయం కావాలి, చేసిపెడతారు అనుకుంటా, రావూరి భరద్వాజ గారి ఉదతమ్మ ఉపదేశం అనె కథల సంపుటి కోసం గత 5 సంవత్సరాలనుండి ప్రత్నిస్తున్నాను కాని దొరకలేదు. మీ దగ్గర ఆ వివరాలు ఎమైన ఉంటే నాకు తెలియచేయగలరు. కనీసం పబ్లిషర్స్ చిరునామా ఉన్నా సరే. నా మెయిల్ ఐ డి syamasundaram2010@yahoo.com
అన్యదా భావించక సహాయం చేయగలరు

vikki said...

దూర ప్రాంతాలలో ఉన్నవారికి

ప్రతి రోజు పుస్తక ప్రదర్శన కోసం

visit
www.logili.com

జ్యోతిర్మయి said...

లైబ్రరీకి వెళ్ళే కంటే మీ ఇంటికొస్తేనే ఎక్కువ పుస్తకాలు దొరికేట్లున్నాయి.

Padmarpita said...

మీ కలెక్షన్ సూపర్..

sharma said...

మీరు చెప్పిన కొన్ని బుక్స్ వాటి వివరాలు చాల బాగున్నయి. నేను కొనాలి అనుకొంటున్న. ఇప్పటికె 3 సార్లు వెళ్ళా. బిల్లు 2000 ఇయ్యింది. నేను కూడ మీలాగే, చాలా పుస్తకాలు కొన్నా ఈ బుక్ ఫెయిర్ లొ. పుస్తకం చదవడం లొ ఉన్న సుఖం దేనిలొను రాదు..

--శర్మ

Anonymous said...

అబ్బో...చాలా పుస్తకాలు కొనేసారు. ముందివన్నీ పూర్తి చేసి కొత్తవి కొనండి ( ఈలోగా నేను మిమ్మల్ని దాటేద్దామని)

తృష్ణ said...

@syam sundaram: i too don't know about this book, but will surely find out and let you know.
thanks for the visit.

@jyotirmayi gaaru, @padmarpita gaaru, @sharma gaaru, @lalita gaaru, thanks you all for the comments.