సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, November 19, 2012

షిర్డి - ఘృష్ణేశ్వర్ - ఎల్లోరా -1





క్రితం వారాంతంలో అప్పటికప్పుడు అనుకుని తత్కాల్ లో టికెట్లు కొనుక్కుని శిర్డి  బయల్దేరాం. Waiting లేకుండా టికెట్స్ కన్ఫార్మ్డ్ టికెట్లు దొరకటం అదృష్టం. రిటర్న్ టికెట్లు వీలుపడవు కాబట్టి తీసుకోలేదు. ఏదో ఓ బస్సులో దీపావళి రోజుకన్నా వచ్చేద్దాం అననుకున్నాం. మనకు దసరా శెలవుల్లాగ మహారాష్ట్ర లో దీపావళికి శెలవులు ఉంటాయి. అందువల్ల శిర్డీలో జనం ఎక్కువగా ఉంటారేమో పిల్ల ఇబ్బంది పెట్టడం ఎందుకని దాన్ని అమ్మ దగ్గర ఉంచి బయల్దేరాం.

ట్రైన్ లో మా ఎదురుగా ఒక తల్లీ,తండ్రీ, ఆరేళ్ళ పిల్లాడు కూర్చున్నారు. ఆ పిల్లాడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ప్రతిదానికీ ఒకటే నస, సణుగుడు, పేచీ. రాత్రి నిద్రలో కూడా మెలుకువ వచ్చేసింది వాడి పేచీకి. ఆ తల్లీదండ్రీ సముదాయిస్తూ నచ్చజెప్తున్నారే తప్ప కేకలేయకపోవటం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. మాకూ ఒక్కతే పిల్ల. గారమే. కానీ మరీ ఇంత నెత్తికెక్కించుకోము. ఏం పెంపకాలో ఏమిటో ! ఇక అవతలవైపు విండో సీట్ దగ్గర ఇద్దరు+ఇద్దరు ఓ సన్న ఫ్యామిలీ. అంటే నలుగురూ ఒకేలా సన్నగా అంటే సన్నగా ఉన్నారు. ఆ తల్లి మాత్రం ఇంత గొంతేసుకుని దిగేదాకా ఆపకుండా బడాబడా వాగుతూనే ఉంది. అందరూ నిద్రోతున్నారనన్నా లేకుండా పొద్దున్నే నాలుగింటికే లేచి కూచుని పేద్ద గొంతుతో కూతురితో కబుర్లాట్టం మొదలెట్టింది. ఇక నేనూ లేచి మొహం కడిగి రాత్రి ఆపిన పుస్తకం చదువుకుంటూ పడుకున్నా.(పైనవాళ్ళు లేచేదాకా కూచోవటానికి ఉండదు కదా:))





నాగర్సోల్ లో దిగి శిర్డీ చేరి, ఎప్పుడూ దిగే హోటల్లో దిగి, తయారై, టిఫిన్ తిని సాయిమందిరం క్యూలో నిలబడేసరికీ ఎనిమిదిన్నర. ఆశ్చర్యంగా జనం ఎక్కువగా లేరు, క్యూ కూడా ఫాస్ట్ గా కదులుతోంది. తొమ్మిదింపావుకల్లా చక్కటి, ప్రశాంతమైన దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. అంత త్వరగా, పైగా కావాల్సినంత సేపు బాబాను చూసుకునే దర్శనం చాలా ఏళ్ల తరువాత దొరికిందనే చెప్పాలి. ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అలాంటి దర్శనం దొరికింది. అప్పుడు ఇలా క్యూ సిస్టం లేదు. బాబావిగ్రహానికి ఫోటోలు కూడా తీసుకోనిచ్చేవారు. ద్వారకామాయి లో కూడా బాబా కూచునే రాయిని చేత్తో ముట్టుకోనిచ్చేవారు. తిరుపతిలోలాగా ఇంత జనప్రవాహం అప్పుడు లేదు మరి. బయటకు వచ్చేసి విభూతి పొట్లాలు కూడా నాలుగైదుసార్లు మళ్ళీ మళ్ళీ క్యూలో వెళ్ళి తీసుకుని బయటకు వచ్చేసాం.


ఘృష్ణేశ్వర్ :



 తత్కాల్ టికెట్లు దొరికాకా ఇంటికొచ్చి నేను చేసిన మొదటి పని శిర్డీ చుట్టుపక్కల ఇదివరకూ చూడని ప్రదేశాలు ఏమున్నాయని నెట్లో వెతకటం. ఎలాగైనా ఈసారి "ఘృష్ణేశ్వర్" వెళ్ళాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఏ మూడో అయిపోతుందనుకున్న దర్శనం త్వరగా అయిపోయేసరికీ మర్నాడు వెళ్దాం అనుకున్న "ఘృష్ణేశ్వర్"కు అదే రోజు బయల్దేరాం. లక్కీగా అది పేకేజ్ ట్రిప్ అయ్యింది. ఎల్లోరా గుహలు, అహ్మదాబాద్ చుట్టుపక్కల కూడా చూపించి రాత్రికి మళ్ళీ శిర్డిలో దింపేస్తానన్నాడు. దేవగిరి పర్వత శ్రేణుల్లో ఉన్న పన్నెండవ జ్యోతిర్లింగ క్షేత్రమే "ఘృష్ణేశ్వర్‌". ఔరంగాబాద్ నుండి ముఫ్ఫై కిలోమీటర్ల దూరం. శిర్డీ నుండి వేన్ లో రెండు గంటలు పట్టింది మాకు. మాతో పాటు మరో నాలుగు కుటుంబాలవాళ్ళు వచ్చారు.

దేవాలయ నిర్మాణం అంతా త్రయంబకం గుడి నిర్మాణాన్ని పోలి ఉంది. కాకపోతే అది నల్ల రాయితో చేస్తే ఘృష్ణేశ్వరాలయానికి ఎరుపు రంగు రాయిని వాడారు. విశాలమైన ప్రాంగణం. గర్భగుడి బాగా క్రిందుగా ఉంది. లోపల నల్లని పెద్ద శివలింగం. గర్భగుడి బయట మండపంలో నల్లని పెద్ద నందీశ్వరుడి విగ్రహం ఉంది. మగవారు చొక్కా తీసివేసి లోపలికి వెళ్లాలి. లోపల జ్యోతిర్లింగాన్ని మనం స్వయంగా పువ్వులతో, బిల్వాలతో పుజించుకోవచ్చు.  గుడి బయట ఆవుపాలు అమ్ముతున్నారు. అవి తెచ్చుకుని మనమే అభిషేకం కూడా చేసుకోవచ్చు. హడావుడి, జనసందోహం లేని ఆ ప్రశాంత వాతావరణం మాకు బాగా నచ్చింది. ఆవుపాలు తెచ్చుకుని అభిషేకం చేసుకుని, పువ్వులతో, బిల్వాలతో తృప్తిగా అర్చించుకుని బయటకు వచ్చాం. నాలుగైదేళ్ల క్రితం కాశీలో కూడా ఇలానే పాలతో అభిషేకం చేసుకున్నాం. మధ్యలో శ్రీశైలం, త్రయంబకం వెళ్ళినా స్వయంగా అభిషేకించుకునే అవకాశం దొరకలేదు. ఈ గుడి నిర్మాణం చాలా పాతదే కానీ పధ్ధెనిమిదవ శతాబ్దంలో పునర్నిర్మాణం జరిగిందిట.



ఆలయానికి సంబంధించి రెండు మూడు కథలు స్థలపురాణంలో ఉన్నాయి. అందులో ఒకటేమిటంటే ఒక బ్రాహ్మణుడి మొదటి భార్యకు సంతానం లేకపోతే ఆమె భర్తను బ్రతిమాలి తన చెల్లెలితో వివాహం జరిపించిందట. అయితే పోనుపోనూ అక్కాచెల్లెళ్ల మధ్యన ఈర్ష్యాసూయలు తలెత్తాయిట. ఈర్ష్య వల్ల చిన్న భార్యకు పుట్టిన కుమారుడిని పెద్దభార్య హతమార్చి, చెరువులో పారవేసిందిట. అంతదు:ఖంలో కూడా శివభక్తుర్తాలైన బ్రాహ్మణుడి చిన్నభార్య రోజూలానే చెరువు గట్టుకెళ్ళి నూరు శివలింగాలను చేసి పూజించి నదిలో విసర్జించి వెనక్కు తిరిగేసరికీ కొడుకు సజీవుడై కనబడ్డాడుట. అప్పుడామెకు శివుడు ప్రత్యక్ష్యమై కనబడగా తన అక్క పాపాన్ని క్షమించమని, తన భక్తికి ప్రసన్నుడైతే గనుక అక్కడ వెలవమని ప్రార్థించిందిట. అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా అక్కడ వెలసాడుట. సాక్షాత్తూ బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగం అని ఒక కథ ఉంది. కథ ఏదైనా జ్యోతిర్లింగం మహిమాన్వితమైనది. భక్తితో అర్చించవలసినది.

ఎల్లోరా గుహలో శివలింగం

8 comments:

ధాత్రి said...

ఘృష్నేశ్వర్ ప్రసాదం చాలా బాగుంటుంది కదా.
మొత్తం 36 ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి కదా అన్నీ చూసారా?
ఫోటోలు బాగున్నాయి తృష్ణ గారు

సుభ/subha said...

యాత్రా విశేషాలు బాగున్నాయండీ.. మీరెప్పుడూ ఫోటోలు ఎక్కువగా పెడతారు.. ఈ సారి తక్కువగా ఉన్నాయనుకుంటాను.

తృష్ణ said...

@ధాత్రి గారూ, ఇది 1 అని వేసా కదా..ఇంకా రాస్తాను..చూడండి మరి..:)
ధన్యవాదాలు.

@సుభ గారూ, ఫోటో బ్లాగ్లో పెడదామని ఇక్కడ ఎక్కువ పెట్టలేదండి. ఇవాళ పెడతానక్కడ :)
ధన్యవాదాలు.

వేణూశ్రీకాంత్ said...

విశేషాలు బాగున్నాయండీ.. మిగిలిన భాగాలకోసం ఎదురు చూస్తున్నా.

తృష్ణ said...

thanks for the visit venu gaaru.

రాధిక(నాని ) said...

బాగా చెప్పారు.మేము షిరిడి కే వెళ్ళాము అందుకే ఏమి చూడటం కుదరలేదు.

Unknown said...

telugu lo yatra visheshalu bagunai..

nenu na family (total 13 members )sankranthi ki shirdi tour veltunam..

akkadi chuttu pakkali visheshalani teliyacheyandi ...please ( cudavalasina places names )

velunte meru vellina pakage details ( like oparetor phone numbers + fare vantivi )chppandi ..

devagiri_p@rediffmail.com

తృష్ణ said...

@రాధిక గారూ, నెక్స్ట్ టైం ట్రై చేయండి..
ధన్యవాదాలు.

@ప్రతాప్ రెడ్డి గారు,firstly thanks for the visit. (మరెవరికైనా కూడా ఉపయోగపడుతుందని ఇక్కడే రాస్తున్నానండి)
మేము చాలా ఏళ్ల నుండీ శిర్డి వెళ్తున్నా శిరిడీ చుట్టుపక్కల ప్రదేశాలు గత ఏడాది నుండే చూస్తున్నామండీ. గత ఏడాది నాసిక్,త్రయంబకం వెళ్ళాము. ఈసారి ఘృష్ణేశ్వర్, ఎల్లోరా వెళ్లాం. రెండూ కూడా రెండుగంటల్లో వెళ్ళి రావచ్చు. ఈ ప్రదేశాలకి మేం ముందుగా ఏ బుకింగ్ చేసుకోలేదండి. అప్పటికప్పుడు వెళ్పోయాం అంతే. శిరిడి లో గుడి వీధిలోనే షేరింగ్ కార్లు,వేన్లు ఉంటాయి. డ్రైవర్లు ఫలానా ఊరు వస్తారా అని గట్టిగా అరుస్తూ, అడుగుతూ ఉంటారు. మీకున్న వ్యవధిని బట్టి, షేరింగ్ లో వెళ్లగలిగే ఆసక్తి ఉంటే అప్పటికప్పుడే మీరు రేట్ అదీ బేరమాడుకుని వెళ్ళిరావచ్చు.

క్రింద లింక్స్ లో మీకు మరిన్ని యాత్రా స్థలాల వివరాలు దొరుకుతాయి:

శిరిడికి దగ్గర్లో ఉన్న ప్రఖ్యాత యాత్రాస్థలాలు - వివరాలు:
http://www.mustseeindia.com/places-around-shirdi/popular

శిరిడికి దగ్గర్లో ఉన్నా అంతగా ప్రఖ్యాత లేని ప్రాంతాలు - వివరాలు:
http://www.mustseeindia.com/places-around-shirdi/unexplored