సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, June 5, 2012

Oats Oats...


ఈమధ్య అన్ని సూపర్మార్కెట్ల లో, చాలా మంది ఇళ్ళల్లో కనబడుతున్న Oatsను చూస్తుంటే "అంతా ఓట్స్ మయం..జగమంతా ఓట్స్ మయం..." అని పాడాలనిపిస్తూ ఉంటుంది నాకు. నా కాలేజీ చదివే రోజుల్లో చపాతీలే ఆరోగ్యకరం అని అంతా చపాతీల్లోకి దిగారు. రెండో పూట భోజనం మానేసి చాలా మంది చపాతీలు చేసుకునేవారు. అప్పట్లో రోటీ మేకర్లు విరివిగా అమ్ముడుపోయాయి. నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన హీరోయినయిపోయింది చపాతీ. ఆ ప్లేస్ ని ఇప్పుడు ఓట్స్ భర్తీ చేసింది. ఇవి నిజంగా ఉపయోగకరమే కానీ మార్కెట్లో వస్తున్న రకరకాల ఓట్స్ చూస్తూంటే జనాలకి ఏ పిచ్చి పడితే పిచ్చే అన్నట్లుగా ఉంది పరిస్థితి.


మొదట్లో క్వేకర్స్ ఓట్స్ మాత్రం దొరికేవి. ఇప్పుడు ఐదారు రకాల ఓట్స్ పేకెట్లు బజార్లో లభ్యమౌతున్నాయి. కొన్ని కంపెనీలవాళ్ళు ఓట్స్ రెసీపీలు ఏకంగా వాళ్ల వెబ్సైట్స్ లో పెట్టేసారు. క్రింద ఉన్న "సఫోలా" వాళ్ల లింక్ లో ఏ వంటకం తాలూకూ బొమ్మపై క్లిక్ చెస్తే ఆ రెసిపీ నిమిషంలో మనకు కనబడుతుంది.
http://www.saffolalife.com/saffola-oats/do-more-with-saffola-natural-oats

క్రింద ఉన్న క్వేకర్స్ ఓట్స్ వాళ్ల లింక్లో ఏకంగా ఓట్స్ రెసిపిల పి.డిఎఫ్.ని డౌలోడ్ కి పెట్టేసారు.
http://www.quakeroats.com/cooking-and-recipes.aspx

కొన్ని ఓట్స్ పేకెట్లతో పాటూ రెసిపీ బుక్స్ ఉచితంగా అందజేస్తున్నారు. ఆ పుస్తకాల్లో అదీ ఇదీ అని లేదు.. ఇడ్లీ దగ్గర నుండీ లడ్డూ వరకూ అన్నీ ఓట్స్ తో చేసేస్కోండి..సింపుల్ అంటాడు. రెగులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు నేను ఓట్స్ ఉప్మా తింటూంటాను. ఎవరికి తెలీకుండా కాస్త ఓట్స్ దోశల పిండిలో, చపాతి పిండిలో కలిపేస్తూ ఉంటాను..:) సరదాగా ఈ రెసిపి బుక్స్ లోంచి ఏవైనా ట్రై చెయ్యనా అంటే "తల్లీ, నీ ఓట్స్ కీ నీకూ ఓ దణ్ణం..నన్నొదిలెయ్..ఏం పెట్టినా తింటా ఈ ఓట్స్ తప్ప " అంటారు శ్రీవారు.



ఇప్పుడు చిన్న చిన్న 20gms ఓట్స్ పేకెట్లు వస్తున్నాయి. పొద్దున్నే పాలల్లో కలుపుకునేవీ, లేదా ఇన్స్టెంట్ ఉప్మా చేసుకునేవీ. వీటిలో కూడా రకరకాల ప్లేవర్లు. మసాలా, వెజిటబుల్, చిల్లీపెప్పర్ మొదలైన ఇన్స్ టెంట్ ఉప్మా రకాలు నాకంతగా నచ్చలేదు కానీ పాలల్లో కలుపుకునే పోరిడ్జ్ మిక్స్ లు నాకు బాగా నచ్చాయి. వాటిల్లో కేసర్, ఏపిల్ కిస్మిస్, స్ట్రాబెర్రీ ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. పొద్దున్నే టీ, కాఫీ లేదా టిఫిన్ లేటయితే ఆకలి వేయకుండా ఈ చిన్నపేకెట్ అర గ్లాసుడు పాలల్లో వేసుకుని తినేయచ్చు. కాస్త ఆకలి ఆగుతుంది. ఆ వేసుకునే అరగ్లాసుడూ డైట్ పాలు అయితే ఇంకా మంచిది.


 
ఏదైనా నచ్చితే మనం తింటే పర్వాలేదు. కానీ ఇంట్లో అందరూ అదే తినాలంటే కష్టం కదా. మా కజిన్ వాళ్ల ఆఫీసులో బాసుగారికి బొజ్జెక్కువైందని వాళ్ళావిడ ఇంట్లో అందరికీ ఓట్స్ మాత్రమే టిఫిన్ పెడుతుందిట. సాయంత్రం కూడా ఓట్స్ టిఫినేట. ఆయన ఇంట్లో విధేయంగా ఓట్స్ తినేసొచ్చి, ఆఫీసులో ఎవరు దొరికితే వాళ్ళని అలా సమోసా తినొద్దాం వస్తావా? అని తీస్కెళ్ళి బయట దొరికిన నానారకాలూ తినేసి, తినిపించేసి వచ్చేస్తుంటాడుట. సాయంత్రం వాళ్ళావిడకు ఫోన్ చేసి "డార్లింగ్ బోలెడు ఆకలివేసేస్తోందిరా... పొద్దున్న నువ్వు పెట్టిన టిఫినే.. ఇంకేమీ తిన్లేదు.." అంటాడుట. పాపం వాళ్ళావిడ నమ్మేస్తూ ఉంటుందిట. మా కజిన్ కలిసినప్పుడల్లా ఆ బాసు గురించి చెప్పనూ నవ్వనూ..:) నెయ్యి వాడకం కూడా మాననివారు సైతం పాలల్లో ఓట్స్, మజ్జిగలో ఓట్స్ వేసుకుని తాగేయ్యటం ఆశ్చర్యకరమైనా ఇది ఖచ్చితంగా ఓట్స్ వ్యాపారస్తుల ప్రకటనాఫలితమే.


ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ ఓట్స్ ఆరోగ్యానికి మంచివే. ఓట్స్ తింటే సన్నబడటం నిజమే కావచ్చు కానీ ఓట్స్ మాత్రమే శరీరాన్ని ఆరోగ్యమయం చేసేస్తాయన్నది కేవలం భ్రమ. వ్యాపార చిట్కా అంటే. ఆహార నియమాలతో పాటూ శరీరానికి వ్యాయామం కూడా అవసరమన్న సంగతి ఓట్స్ ని అమ్మేవాళ్ళూ, వాటిని నమ్ముకున్నవాళ్ళు మరిచిపోతున్నారేమో !!








7 comments:

కృష్ణప్రియ said...

100% with you on this!

వేణూశ్రీకాంత్ said...

బాగా చెప్పారు.. అంతా వ్యాపారమయం..

A Homemaker's Utopia said...

నిజమే తృష్ణ గారు...:-) అయినా ఈ ఆడ్స్ కాదు కానీ ఇడ్లీ కంటే ఆరోగ్య కరమైన టిఫిన్ ఏముంది చెప్పండి ? అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇలాంటి వి అవసరార్థం ఆదుకునేవి గా ఉన్నాయి..మా బాబు కి ఓట్స్ ఇష్టమే గానీ మా వారు అస్సలు తినరు...:-)

జ్యోతి said...

నాక్కూడా అస్సలు నచ్చవు ఈ ఓట్స్ . కానీ ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయా ? ఐతే ట్రై చెయ్యచ్చేమో. మాకు ఇక్కడ అన్నీ తీపి వరైటీసే, యాక్ :(
ఓట్స్ తింటే మాత్రం చాలా సేపు ఆకలి వేయదు, దానివల్ల మనం లంచ్ కొంచెం తక్కువ తింటామేమో.

జలతారు వెన్నెల said...

ఈ మధ్యనే ఈ oats తినడం మొదలుపెట్టాము... ఒక రకంగా నాకైతే punishment అండి.
ఇండియా లో కూడా ఈ oats mania ఉందన్న మాట!!

తృష్ణ said...

@కృష్ణప్రియ: :) ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: అంతేనండి.
ధన్యవాదాలు.
@నాగిని గారూ, మీరన్నది నిజమే కానీ పబ్లిసిటీ మితిమీరితే తట్టుకోవటం కష్టమే కదా. మా ఇంట్లో నేనొక్కదాన్నేనండి ఓట్స్ తినేది..:)
ధన్యవాదాలు.

తృష్ణ said...

@మహెక్: నాకు ఓట్స్ ఇష్టమ్ లేకపోవటం లేదండి. మరీ ఇడ్లి నుంచీ పాయసమ్ దాకా అన్నీ ఓట్స్ తోనే అని ఏడ్స్ లో వినీ వినీ విస్గొచ్చేస్తోంది. రేడియోలో తెగ వేస్తున్నారు ఆఏడ్స్.
టెన్ రూపీస్ ఇన్స్టెంట్ పేక్స్ ఈ మధ్యన బాగా మార్కెట్లోకి వచ్చాయండీ. ట్రై చేయండి..:)
ధన్యవాదాలు.

@జలతారువెన్నెల: కష్టంగా ఉన్నా తింటున్నారా? గ్రేటండి. ఇక్కడ ఎవరిని కదిపినా ఓట్స్ గోలేనండీ.
ధన్యవాదాలు.