Friday, March 9, 2012

తెలుగు పద్యాలా ? బాబోయ్!


తాజాగా మొదలైన ఈయేటి 'విద్యుత్ కోత' రోజూవారీ పనులకు చాలా ఆటంకాలను కలిగిస్తున్నా, ఒక మంచి పని మాత్రం జరుగుతోంది. ఈ విద్యుత్ కోత డిసెంబర్ పుస్తక ప్రదర్శనలో కొన్న చదవాల్సిన పుస్తకాల జాబితాను తగ్గిస్తోంది...:) ఈ బృహత్కార్యంలో భాగంగా నిన్న చదివిన ఒకానొక మంచి పుస్తకం ఇంద్రగంటి శ్రీనివాసశాస్త్రి గారు రాసిన "తెలుగు పద్యాలా ? బాబోయ్ !".


అప్పుడప్పుడు నాన్న వినే "రంగస్థల పద్యాలు", శ్రీవారు వెతికి వెతికి కొనుక్కున్న గజేంద్రమోక్షం, రుక్మిణీకల్యాణం పద్యాలు వింటూ ఉన్నా, చిన్నప్పుడు స్కూల్లో తెలుగు పద్యం అప్పజెప్పలేకపోయినందుకు మా తెలుగు మాష్టారి బెత్తం దెబ్బ తిన్నప్పటి నుంచీ నాకు తెలుగు పద్యాలంటే భయం. తెలుగు పద్యాలంటే నిజంగానే బాబోయ్... అంటూ ఆమడ దూరం పరిగెట్టే నాలాంటివాళ్లకోసమే ఈ పుస్తకం రాసారేమో అనిపించింది. "తెలుగు వచ్చినా, తెలుగు పద్యాల జొలికి పోనివాళ్లకు, వాటిలో మజా చూపించటమే నా ఉద్దేశం....నేను తెలుగులో పద్య సాహిత్యం చదవలేదు. ఆ సాహిత్యపు సముద్రపు లోతులకెళ్ళే సామర్ధ్యం, అదృష్టం మనలో చాలమందికి లభించవు." అంటారు శ్రీనివాసశాస్త్రి గారు తన 'ముందు మాట'లో.


తాను చిన్ననాటి నుంచీ విన్న, చదివిన, నచ్చిన తెలుగు పద్యాలను ఇందులో పోందుపరిచాననీ, అందువల్ల చాలామంది ప్రసిధ్ధ కవుల పద్యాలు ఇందులో కనబడవు అని చెప్తారు శ్రీనివాసశాస్త్రి గారు. ఈ పుస్తకంలో బొమ్మలు ప్రముఖ కార్టూనిస్ట్ 'రాగతి పండరి'గారు.


డభ్భై ఏడు పేజీలు మాత్రమే ఉన్న ఈ చిన్ని పుస్తకం నాకు తెలుగు పద్యాల గురించి ఎన్నో తెలియని సంగతులు చెప్పింది. ఈ పుస్తకంలో పేరుపొందిన వేమన పద్యాలు, సుమతి శతకాలు, నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాధుడు నుంచీ గరికపాటి నరసింహారావు గారి వరకు ఎందరో ప్రముఖులు చెప్పిన ఉత్తమమైన తియ్యని తెలుగు పద్యాలు, వాటి అర్ధం చదువుతూంటే నిజంగానే పద్యసాహిత్యం గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది నాకు. నాకెంతో ఆనందాన్ని ఇచ్చిన ఈ పుస్తకంలోని కొన్ని పద్యాల గురించి రాసి తీరాలనే సరదా ప్రయత్నం ఈ టపా..


1) "మృత్యుంజయ శతకం"లో మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి గారు రాసిన ఒక పద్యం:


మెడ నాగన్నకు నొక్కటే బుసబుసల్, మేనన్ సగంబైన యా
విడతో నీకెపుడొక్కటే గుసగుసల్, వీక్షించి ఈ చంద మె
క్కడ లేనట్టుగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్, నీచెవిన్
పడుటేలాగునో మామొరల్ తెలియ దప్పా మాకు మృత్యుంజయా !

2) "పారిజాతాపహరణం" లో నంది తిమ్మన రాసిన ఈ పద్యం చెప్తూ "సత్యభామ కృష్ణుడ్ని తన్నిందా? లేక తోసిందా అన్నది స్పష్టంగా చెప్పక, చదివేవాళ్లకొదిలేసి తమాషా చేసాడు తిమ్మన" అంటారు శ్రీనివాసశాస్త్రిగారు. ఈ కావ్యం తిమ్మన ఎందుకు రాసాడో కారణం కూడా చెప్పారు.

జలజాతాసన వాసవాది సురపుజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధ కన్నతండ్రి శిర మచ్చో వామపదంబునన్
తొలగం ద్రోచె లతాంగి, యట్లయగు, నాథుల్ నేరముల్ సేయ, బే
రలుకం చెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే.


3) పదహారవ శతాబ్దపు కవి నంది తిమ్మన కు "ముక్కు తిమ్మన" అని పేరు తెచ్చిన పద్యం:

నానాసూన వితాన వాసనల నానందించు సారంగమే
లానన్నొల్లదటంచు గంధఫలి, బల్ కానన్ తపంబంది, యో
షానాసాకృతిబూని సర్వసుమన్నస్సౌరభ్య సంవాసియై
పూనెన్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్

పై పద్యానికి అర్ధం ఇదిట -- తుమ్మెద తనపై వాలట్లేదని సంపెంగ కోపంతో అడవిలో తపస్సు చేసిందిట. తప:ఫలంగా అందమైన అమ్మాయి ముక్కుగా అవతరించిందట. అప్పుడు రెండువైపులా తుమ్మెదలు బారులు కట్టాయట. అంటే తుమ్మెదలు అమ్మాయి కళ్ళుట. ఈ పద్యాన్ని అష్టదిగ్గజాల్లో ఒకరైన భట్టుమూర్తి డబ్బిచ్చి మరీ కొనుక్కుని, తన "వసు చరిత్ర"లో ఎక్కించాడుట.

4) కృష్ణదేవరాయలవారి అష్టదిగ్గజాల్లో ప్రముఖుడైన అల్లసాని పెద్దన మంచిరచనకు ఏ వాతావరణం కావాలో చెప్తూ ఇలా వర్ణించాడుట:

నిరుపహతి స్థలంబు, రమణీప్రియ దూతిక తెచ్చి ఇచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయల మంచ మొప్పుత
ప్పొరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖిక పాఠకోత్తముల్
దొరికిన కాక యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే !5) ఓర్వలేనివాళ్ల ఈసడింపులకు గుర్రం జాషువా గారి జవాబుట:

గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయచేత న
న్నెవిధి దూరినన్ నను వరించిన శారద లేచిపోవునే?
యివ్వసుధాస్థలిన్ పొడమరే రసలుబ్ధులు? గంటమూనెదన్
రవ్వలు రాల్చెదన్ గరగరల్ పచరించెద నాంధ్రవాణికిన్

వారిదే మరోటి:

రాజుమాణించె, నొక తార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగన మొక్కె
రాజు జీవించె రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు


6) తాను "ఆముక్తమాల్యద" తెలుగులో ఎందుకు రాసాడో చెప్తు శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన పద్యం:

తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ
ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స.


7) శాశ్వత సత్యాలనిపించే కొన్ని సుమతీ శతకాలు:

** అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమిని వేల్పు, మొహరమున తా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయు, కదరా సుమతి !

** తలనిండ విషము ఫణికిని
వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్
తలతోక యనక ఉండును
ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ !

* ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పింపక, తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ !8) చిన్నప్పుడు చదివినవే అయినా మరోసారి చదివాకా ఆహా... అద్భుతమనిపించిన కొన్ని వేమన పద్యాలు:

** చాకి కోక లుదికి చీకాకుపడ జేసి
మైల దీసి లెస్సమడిచినట్లు
బుధ్ధి చెప్పువాడు గుద్దితే నేమయా
విశ్వదాభిరామ వినురవేమ

** చెప్పులోని రాయి,చెవిలోన జోరీగ
కంటిలోని నలుసు, కాలిముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినురవేమ

** తప్పులెన్నువారు తండోపతండమ్ము
ఉర్వి జనుల కెల్ల నుండు తప్పు
తప్పులెన్ను వారు తమ తప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ

శతాబ్దాల క్రితపువైనా ఇవాళ్టికి కూడా అన్వయించుకోదగ్గ తాజాతనం ఈ వేమన పద్యాలది.


9) రచయిత, జర్నలిస్టు, రాజకీయవేత్త నార్ల వెంకటేశ్వరరావుగారు చెప్పిన ఈ వాస్తవం నాకు నచ్చింది:

గుడ్లగూబ పెద్ద గుడ్లున్న దైనను
సుంతయైన వెలుగు చూడలేదు
విద్యలున్న నేమి? విజ్ఞత లేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట.


10) గరికపాటి నరసింహారావు గారి "గూగ్లీ" :

ఘనులందరు మనవరని
అనుకొన్న అదొక్క తృప్తి అఖిలజనులకున్
మన వాడే ఘనుడౌ నెడ
మనమున భరియింపలేము మాయ యిదేమో ?పుస్తకంలో ఇంకా ఏమున్నాయంటే,

* తెలుగు భాషకు గర్వకరణమైన ఆష్టావధానాల గురించి,
* పోతన భాగవతంలో గజేంద్రమోక్షం లోని "సిరికిన్ చెప్పడు..." మొదలైన ప్రముఖ పద్యాలు,
* తిరుపతి వేంకట కవులు "పాండవోద్యోగం" నాటకానికి రాసిన మూడు ప్రముఖ పద్యాలు "బావా ఎప్పుడు వచ్చితీవు?" , "చెల్లియో చెల్లకో..", "జెండాపై కపిరాజు..."
* ఏనుగు లక్ష్మణ కవి, విశ్వనాథ మొదలైనవారి పద్యాలు, శ్రీశ్రీ, దేవులపల్లి వారి వచన కవిత్వం


చివరిగా చక్కటి గురజాడ అప్పారావుగారి పాటతో పుస్తకం ముగించటం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది.

"దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేలు తలపెట్టవోయ్ !

దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనాను ఒక మేలు
కూర్చి జనులకు చూపవోయ్

స్వంతలభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్

చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడవవలెనోయి,
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయి


అందమైన ఈ
తియ్యని తెలుగు పద్యాలన్నింటినీ చదవటమే కాక, కనీసం టైపు చేసుకునే పుణ్యమన్నా దొరికిందని మురిసిపోతున్నాను..!!


10 comments:

Padmavalli said...

మీ కరెంట్ కోత పుణ్యమా అని మాకు కూడా మంచి మంచి పద్యాలు, మీ ద్వారా చదువుకునే అవకాశం వచ్చింది. థాంక్ యు.

ఎప్పుడో పదో క్లాసు వరకు చదివి వదిలేసిన తెలుగు, ఇలా పద్యాలు అవీ చూసినపుడు ఒక్కసారి దిగులేస్తుంది, ఎందుకు వదిలేసానా అని. :-(

durvasudu said...

Mee punyaaniki nenu kooda murisipoyaa.

Sujata said...

చాలా బావుందండీ. మంచి పద్యాల పుస్తకం గురించి పరిచయం చేసారు. కొన్నాళ్ళ క్రితం ఈనాడు ఆదివారం అనుబంధం లో 'మంచి పద్యం' అని ఒక చిన్న బాక్స్ నడిపేవారు. అవన్నీ కూడా చాలా మంచి పద్యాలండీ. నాకూ తెలుగు చందస్సూ అవీ రావు. So, ఆ బాక్స్ ఐటం ని కూడా నేను చాలా ఎంజాయ్ చేసానండీ. ఈ పద్యం పుస్తకం కూడా బావుంది. థాంక్స్.

తృష్ణ said...

@పద్మవల్లి: :)
అవునండి..నాకూ అలానే అనిపిస్తుంది..
ధన్యవాదాలు.

@durvasudu: :)
ధన్యవాదాలు.

@sujata: నాక్కూడా ఛందస్సు అవి ఏమీ తెలీవండి.. ఇలా అర్ధాలు అవీ ఉన్న పుస్తకాల్లో పద్యాలు చదివి ఆనందించటమే...:) ఈనాడు లో పడినవాటి గురించి తెలీదు కానీ, ద్వా.నా.శస్త్రి గారి "మంచి పద్యాలు" అనే చిన్న పుస్తకం ఉంది నా దగ్గర. అది కూడా బావుంటుంది.
ధన్యవాదాలు.

ఉష said...

బాగుంది తృష్ణా, ఎప్పటిలానే విషయ స్పష్టత, కూతూహలం కలిగించే శైలి/శిల్పం. నేనూ ఈ మధ్యన పద్యాన్ని టీకా తాత్పర్యాలు లేకుండా నేనే శబ్దార్థాలు వెదుక్కుని ఆస్వాదించే పట్టు సాధనలో పడ్డాను. మీరెలాగు ఓ పెగ్గేశారు ;) ఎలాగూ మొదలుపెట్టిన వ్రతం మానకండే...ఈ మధువు మరీ మంచిది.

SHANKAR.S said...

మంచి మంచి పద్యాలు. వేడి వేడి పకోడీల్లా బావున్నాయి.

చిన్నప్పుడు చాటు పద్యాలు కలెక్ట్ చేసే హాబీ ఉండేది.ఓ రెండొందల పేజీల తెల్ల కాగితాల లాంగ్ నోట్ బుక్ నిండా పద్యాలు కలెక్ట్ చేశా. తెలుగు నిఘంటువులో అర్ధాలు వెతుక్కుంటూ వాటిని నెమరేయడం భలే ఉండేది :)

జాషువా రాజు-కవి మాకు ఎయిత్ లోనో నైన్త్ లోనో ఉండేదండీ. నాకు ఇంకా గుర్తే.

రాజు చేతి కట్టి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆతడేలగలుగు యావత్ప్రపంచంబు
ఈతడేలగలుగు ఇహము పరము

ఇలా సాగేది.ఇన్నేళ్ళయినా ఇంకా గుర్తుందంటే అప్పట్లో మా మేష్టారు అంత బాగా చెప్పారన్నమాట :)

నిజానికి ఇలా పుస్తకాల్లో చదివిన వాటికన్నా చిన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చోబెట్టి చెప్పిన పద్యాలే ఎక్కువకాలం గుర్తుంటాయేమో.

ఇంక తెలుగు పద్యాల విషయానికి వస్తే తెలుగు పద్యాలలో సూపర్ స్టార్ హోదా కలిగిన జండా పై కపిరాజు, అలుగుటయే యెరుంగని లాంటి తిరుపతి వెంకట కవుల పద్యాలు కూడా మెన్షన్ చేసి ఉండాల్సింది
.

డేవిడ్ said...

తృష్ణా గారు బాగుందండి మీరు పద్యాల గురించి పరిచయం చేయడం....మీ ద్వారా పద్యాల గురించి చదువుకునే అవకాశం వచ్చింది

తృష్ణ said...

@ఉష గారూ, మరిన్ని తీపి పద్యాల కోసం వెతుకుతానింక..:))
ధన్యవాదాలు.

@శంకర్: ఇప్పటి దాకా అంత బాగా గుర్తున్నందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి. తిరుపతి వెంకట కవుల పద్యాల గురించి చివర్లో మెన్షన్ చేసాను కానీ టపానిడివి ఎక్కువైందని ఇక ఆ పద్యాలు మొత్తం రాయలేదు.
ధన్యవాదాలు.

@డేవిడ్: ధన్యవాదాలు.

వంశీ పరుచూరి said...

తల్లీ నిన్ను దలంచి పుస్తకం రివ్యూ చదువుదామని వచ్చి ఇక్కడకి వచ్చాను .. అద్భుతమైన పద్యాలు
నేను ఎప్పటి నుండో వెతుకుతున్న ముక్కు తిమ్మన పద్యం దొరికింది .. మిగిలినవి కొన్ని తెలిసినా గరికపాటి వారి పద్యం అద్భుతం .. నిన్ననే ఇదే భావాన్ని మల్లా ప్రగడ వారు చెప్తుంటే పద్యం లో ఉంటే బాగుంటుంది అనుకున్నాను .. ఇలా దొరికేసింది... థాంక్స్ ఏ లాట్ .. నేను కాపీ చేసి దాచి పెట్టుకున్నానండీ థాంక్స్ ఎగైన్

తృష్ణ said...

@vamsi paruchuri: thanks for the visit..:-)