Tuesday, February 28, 2012

'Love ఫెయిల్యూర్' బావుంది

ఆనందం... నిన్నంతా..! డబ్బింగ్ సినిమాల హవా ఎక్కువగా ఉన్న సమయంలో, మొత్తానికి ఒక స్ట్రైట్ తెలుగు సినిమా, "తారలు" కాని నటులతో, కొత్తదనంతో ముందుకొచ్చిందని. వచ్చి ఆకట్టుకుందని.

కొత్త దర్శకుడైన "బాలాజీ మోహన్" మొదటి ప్రయత్నంతోనే విజయాన్ని సాధించాడు. " Kadhalil Sodhapuvadhu Eppadi”  పేరుతో అతను తీసిన ఒక తమిళ లఘు చిత్రం చూసి, ఇదే సినిమాని తెలుగు,తమిళ భాషల్లో వెండితెరపైకి ఎక్కించమని సిధ్ధార్ధ ప్రోత్సాహించటంతో ఈ సినిమా తయారయిందని ఎక్కడో చదివాను. మొదటి భాగం చూస్తూంటే ఈ సినిమా లక్ష్యం "విద్యార్ధులు" మాత్రమేనేమో. ఈమధ్యన వస్తున్న అన్ని సినిమాల్లాగా ఈ సినిమా రెండవభాగం కూడా బోర్ కొడుతుందేమో అని భయపడ్డాను. కానీ మామూలుగా అనిపించిన మొదటి భాగం కన్నా, విరామం తర్వాత సినిమా అప్పుడే అయిపోయిందా అనుకునేంత ఆసక్తికరంగా, ఉత్సాహవంతంగా గడిచిపోయింది. నాకు బాగా నచ్చినది ఈ రెండవ భాగమే.

ఇద్దరు కాలేజీ విద్యార్ధులు, వారి మధ్యన ప్రేమ. చాలా మాములు పాత కథాంశం. కానీ ఇద్దరి ప్రేమికులు విడిపోవటం దగ్గర నుంచీ మొదలై, మళ్ళీ చివరికి వారు కలిసేదాకా ఏo జరిగింది అన్నది వైవిధ్యంగా చిత్రికరించాడు దర్శకుడు. కథనంలో కొత్తదనం ఆకట్టుకుంది. విద్యార్ధి దశలో వారిలో ఉండే అపోహలు, కలలు, వెర్రి వ్యామోహాలు, స్నేహితుల తప్పుడు సలహాలు, పర్యవసానాలు, అపార్ధాలు మొదలైనవన్నీ చాలా చక్కగా చూపించారు సినిమాలో. అన్ని సినిమాల్లో ఒకే రకమైన హాస్యాన్ని, హాస్యనటుల్నీ చూసీ చూసీ విసుగెత్తిన నాకు కామెడి ట్రాక్ విడిగా పెట్టకుండా కథలోనే అంతర్లీనంగా హాస్యం చొప్పించటం నచ్చింది.నటినటులందరూ బాగా చేసారు. సిద్ధార్థ నటనకు వంక పెట్టలేం కానీ అతని మొహంలో మునుపటి తాజాదనం లేదు. కృష్ణ అయినా, శోభన్ బాబు అయినా మరెవరయినా వయసుపెరిగి, శారీరకమార్పులు వచ్చినా మన మునుపటి హీరోల మొహాలు చాలా ఆకర్షణీయంగా ఉండేవి. ఇప్పటి హీరోలయినా, హీరోయిన్లయినా పది సినిమాలు అవ్వగానే మొహాల్లో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇది ఎందువల్లో తెలీదు కానీ ఈ ముఖం లోని మార్పు వారి నటనను కప్పేస్తుంది. కేరళ సుందరి "అమలాపాల్" మాత్రం చక్కని నటనతో ఆకట్టుకుంది. చూడటానికి బాలీవుడ్ నటి "Deepika Padukone" చెల్లెలేమో అనేలా ఉంది. ముఖ్యంగా కళ్ళు ఆకర్షణీయంగా ఉన్నాయి. అమాయకమైన మొహం అదనపు ఆకర్షణ. ముందు ముందు ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతానికి వృధ్ధిలోకి వచ్చేలాగే కనబడింది. మధ్యతరగతి అమ్మాయిగా చూపించటానికి అతిగా అలంకరణలు లేకుండా, మొత్తం సినిమాలో జుట్టు కూడా విరబొయ్యకుండా "జడ"తోనే చూపించటం నాకు బాగా నచ్చింది. అది కూడా నాకు బాగా ఇష్టమైన ఫ్రెంచ్ ప్లేట్ తో !హీరోయిన్ తల్లిగా టివీ ఆర్టిస్ట్ సురేఖ బాగా నటించినా, ఇంత చిన్న వయసులో తల్లి పాత్రలు పోషించాల్సిన అవసరమేమిటీ అనిపించింది. ఒక పాత్రలో ఫిక్స్ ఐతే ఇక అదే మూసలో పడేస్తారు కదా వెండితెర మీద. అందుకని. సురేష్ ను కూడా తండ్రి పాత్రలో నేను చూట్టం ఇదే మొదటిసారి. (ఇంతకు ముందు ఎక్కడైనా వేసాడేమో తెలీదు మరి) సన్నగా, ఆకర్షణీయంగా ఉండే అతడిలో వయసు తెచ్చిన మార్పులు చూడాటానికి కాస్త ఇబ్బందే అయ్యింది. ఎల్లకాలం మనుషులు ఒకేలా ఉండరు కదా..! కానీ హీరోయిన్ తల్లిదండ్రులుగా వీరిద్దరి మధ్య నడిచే కథను చాలా విలక్షణంగా చూపెట్టారు. ఒక సందర్భంలో సురేష్ కూతురుతో చెప్పే "ఫర్ ఈచ్ అదర్ అని ఉండరు. నచ్చిన మనిషికి అనుగుణంగా మనం మారటం, మనకు అనుకూలంగా వాళ్లు మారటం... ఇలా ఒకరికోసం ఒకరు మారటమే మేడ్ ఫర్ ఈచ్ అదర్ " అని చెప్తాడు.( సరిగ్గా ఇవే మాటలు కాదు కానీ ఇదే అర్ధం). ఈ డైలాగ్ ఈ సినిమా ఇచ్చే మెసేజ్ అనిపించింది. ఇలాంటిదే "మిస్టర్ ఫర్ఫెక్ట్"  సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది "ప్రేమంటే ఇద్దరు కలిసి కూర్చుని మంచి కాఫీ తాగటం కాదు... ఇద్దరు కలిసి ఒక మంచి కాఫీ తయారు చేసుకోవటం" అని.

సిధ్ధార్థ తల్లిదండ్రులు, వారి పాత్రల్ని చిత్రించిన విధానం బాగున్నాయి. తల్లిదండ్రుల మధ్యన ప్రేమాభిమానాలు, ద్వేషాలు-కొట్లాటలు పిల్లల వ్యక్తిత్వాలను ఎలా ప్రభావితం చేస్తాయి? అన్నది హీరో హీరోయిన్ పాత్రల ద్వారా చూపించారు. తల్లిదండ్రులు విడిపోవాలనుకున్నా, కలవాలనుకున్నా పిల్లల భావాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పిన తీరు బావుంది. తల్లి తమ విడాకుల ప్రసక్తి తెచ్చినప్పుడు పార్వతి(హీరోయిన్) చెప్పిన డైలగులు అందుకు నిదర్శనం. హీరో ఫ్రెండ్స్ తో పాటూ యానాం వెళ్లినప్పుడు, అక్కడ ఓ స్నేహితుడు పెళ్లాడబోయే అమ్మాయి పాత్ర బాగుంది. సొంతమో కాదో కానీ ఆ అమ్మాయి వాయిస్ భలే ఉంది.

తమన్ సంగీతం బానే ఉంది. తెలుగు కన్నా తమిళ్ పాటలు బాగున్నాయని హాల్లో కురాళ్ళు అనుకుంటున్నారు. సినిమాలో హీరో సిధ్ధార్థ రెండు పాటలు కూడా పాడాడు. నాకు మాత్రం కార్తీక్ పాడిన "ఇంతెజారే..." పాట చాలా నచ్చేసింది. కార్తీక్ తన పాటతో మళ్ళీ మాయ చేసేసాడు !! శ్రీమణి రాసిన సాహిత్యం కూడా బావుంది.
వాల్ పోస్టర్ మీద డల్ గా కూర్చున్న సిధ్ధార్ధ ను చూసి, ఏడుపు సినిమానేమో అనుకున్నా. ఈ సినిమాకి "Love ఫెయిల్యూర్ - ఇది tragedy కాదు" అని టాగ్ లైన్ పెట్టల్సిందేమో...:)) మొత్తం మీద ఒక బరువైన కథాంశాన్ని తేలికైన పధ్ధతిలో, సంతోషకరమైన ముగింపుతో నడిపించిన తీరు ప్రశంసనీయం. కొత్త దర్శకుడికే ఈ సక్సెస్ క్రెడిట్ దక్కుతుంది.


12 comments:

వేణూ శ్రీకాంత్ said...

చక్కని సమీక్ష తృష్ణగారు... నాకు కూడా ఈ సినిమా నచ్చింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, రెండుగంటల నిడివి, పాటలు ఒక ఫార్మాట్ లో కాక అవసరం మేరకు ఒక చరణంతో సరిపెట్టడం నచ్చింది.

ఇందు said...

అదరగొట్తేసారు తృష్ణా :) భలే రాసారు. చాలారోజులకి నేను రాద్దమనుకున్న పోస్ట్ మీరు రాసారు! హ్హహ్హా!! నాకు చాలాచాలా నచ్చింది...ముఖ్యంగా ఆ అమ్మాయి జడ, చక్కని డ్రస్సులు నాకు తెగ నచ్చేసాయి :)

కొత్తావకాయ said...

బాగా రాసారు తృష్ణ గారూ! సురేష్, సురేఖావాణి ఎపిసోడ్ లో "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" సినిమాలో లాగ పెద్ద పెద్ద డయిలాగులు లేకఫోవడం బాగా నచ్చింది. తండ్రి మీది కోల్పోయిన నమ్మకం వలన హీరోయిన్ హీరో ని హింస పెట్టకుండా సింపుల్గా ప్రేమించడం ఇంకా హాయిగా ఉంది. ముఖ్యంగా మంచుకొండల్లోనో, స్విజ్జర్లాండ్ వీధుల్లోనో డ్యుయెట్ లేకపోవడం మరీ నచ్చింది. :)

జ్యోతిర్మయి said...

తృష్ణ గారూ మాకో వారా౦తానికి మంచి చిత్రాన్ని సూచించారు. ధన్యవాదాలు.

'Padmarpita' said...

చాలా చక్కగా ఉందండి చిత్రం పై మీ సమీక్ష...Thanks for sharing.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

రివ్యూ బాగా రాశారు. చదువుతుంటే చూడాలనిపిస్తుంది; ఎప్పుడు చూస్తానో ఏంటో.

మనసు పలికే said...

బయట టాక్ విని, ఈ సినిమా జోలికి వెళ్ళకూడదేమో అనుకున్నా తృష్ణ గారూ. కానీ మీరు బాగుందని చెప్పడంతో సినిమా బాగుంటుందన్న నమ్మకం కుదిరింది:) ఇక చూసెయ్యాలి ఎలాగైనా.

రాజ్ కుమార్ said...

మీ రివ్యూ తో 99% ఏకీభవిస్తున్నా.. తృష్ణ గారూ..
అన్ని పాయింట్స్ కవర్ చేశారు.. తమన్ తన రొటీన్ స్టైల్ కి భిన్నం గా చేశాడు. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా సూపర్ గా ఉందీ.

1% ఏమిటంటే.. నాకు ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగా నచ్చేసింది.. ;) ఈ మధ్య కాలం లో మళ్ళీ చూసెయ్యొచ్చు అనిపించిన సినిమా ఏకైక తెలుగు సినిమా

Balu said...

తృష్ణగారూ! మీ సమీక్ష చాలా బాగుంది. ఇక నుంచి మీ బ్లాగ్ లో పాటలు వినడంతోపాటు సమీక్షలు కూడా చదవవచ్చన్నమాట. మీ ప్రయత్నాన్ని కొనసాగించండి.

తృష్ణ said...

@venu srikanth,
@indu,
@kottaavakaaya,
@jyOtirmayi,
Thank you for the comments.

తృష్ణ said...

@padmarpita,
@avineni bhaskar,
@manasu palike,
thanks for the comments.

తృష్ణ said...

@raaj,
@balu,
Thank you for the comments.