బజ్జు పోయి ప్లస్సు వచ్చే ఢాం ఢాం ఢాం...!!

Friday, December 16, 2011


'పొద్దున్నుంచీ నెట్ తెరవటం కుదరనేలేదు...' అనుకుంటూ నిన్న సాయంత్రం నెట్ కు కనక్ట్ అవ్వగానే కూడలిలో బజ్జు పోయిందీ...ఈ..ఈ....అని గోల పెడ్తూ లలితగారి టపా కనబడింది... ఏమయ్యిందా అని పరుగునవెళ్ళి చూస్తే ఇంకేముంది బజ్జు కాస్తా బజ్జుండిపోయింది. ఒక్కసారిగా గాలిదుమారం వచ్చి చెట్టుకొకరు పుట్టకొకరు విడిపోయినట్లు అనిపించింది. బజ్జు గూట్లో సొంత ఇళ్ళు కట్టుకుని దర్జాగా ఉంటుంటే వాటిని కూలగొట్టేసి ఇదిగో అక్కడ అపార్ట్మెంట్లు కట్టాం...పొండి అందుకో ఉండండి అని గూగుల్ ప్లస్సు లోకి తోలేసాడు గూగులోడు. ప్లస్సులో వెతికితే... మిత్రులందరూ హడావుడిగా కొత్త 'ప్లస్ అపార్ట్మెంట్ల' దగ్గర అటు ఇటూ పరుగులెడుతు కనబడ్డారు...హమ్మయ్యా అంతా ఇక్కడే ఉన్నారు పర్లేదు అని కాస్త ధైర్యం వచ్చింది.


ఇన్నాళ్ళు ఏవో టపా లింకులు పెట్టడం మినహా ప్లస్ ఎలా పనిచేస్తుందో పరీక్షించనే లేదు. ఏలాగో ఏమిటో అనుకుంటుంటే పాపం వేణూగారూ అవసరమైన సలహాలు, సూచనలతో ఓ టపా పెట్టారు. సరే, ఏ బజ్జూ లేనప్పుడు ప్లస్సే దిక్కు అనుకుని అలవాటుపడటానికి ప్రయత్నించటం తప్ప చేసేదేమీ లేదు. దేని విలువైనా అది దూరం అయితే గాని తెలీదంటారు...అలాగ ఇప్పుడు తెలుస్తోంది బజ్జు విలువ ! "బ్లాగ్ ఫ్రూట్ జూస్ లాంటిది, బజ్జు ఏరేటెడ్ డ్రింక్ లాంటిది...కలచ్చేపం బఠాణీ అంతే" అనుకున్నది నేనే...ఇవాళ "బజ్జెళ్ళిపోయింది చెల్లెలా..." అని పాడుకుంటున్నదీ నేనే.






సౌమ్యగారి కబుర్లు, భావుకత నిండిన 'మధుర' వాక్యాలు, వేణూ గారి పాటలు, ఏండీ ఇచ్చే లింకులు, శంకర్ గారి చమక్కులు, సుజాత గారి ప్రకటనలు, లలిత గారి పలకరింపులు, పద్మ గారి పాటలు, నిషీ గారి కబుర్లు,వరూధిని గారి వంటలు, హర్ష చేసే వంటింటి ప్రయోగాలూ....ఒకటేమిటీ అన్నీ చూసీ, చదివీ మనసు నిండా ఎన్నో ఆనందాలనీ, అనుభూతులను మూటగట్టుకుని దాచుకున్నాం అందరం. ఇవాళ పొద్దున్నుంచీ ఎన్నిసార్లు ప్లస్ తెరిచినా ఆ సందడే కనబడటం లేదు. నా స్ట్రీం లో రావట్లేదేమో అని విడివిడిగా వాళ్ల వాళ్ల ప్లస్ ల్లోకి వెళ్ళీ చూసా.. అక్కడా ఏమీ కనబడలే...రోజూ అన్నేసి కబుర్లు చెప్పుకునేవారంతా ఏమయిపోయారో తెలీలే...రోజూ చేసే సందడి, అల్లరి చేయకుండా మిత్రులందరూ ఇలా సైలెంట్ గా ఉండగలరా? లేక నాకు వాళ్ళ అల్లరి టపాలు కనబడటం లేదా అన్న అనుమానం కూడా వచ్చింది..





పొద్దున్నవ్వగానే ఓసారి...మధ్యాన్నం ఓసారి...సాయంత్రం ఓసారి... రాత్రి పడుకోబోయే ముందోసారి.... అలా బజ్జులోకి తొంగి చూసి అందరి కబుర్లు చదవనిదే రోజు గడిచినట్లు ఉండేదే కాదు. నిజానికి కుదిరినప్పుడు ఓ పాట, లేక బ్లాగ్ టపా తాలూకూ లింక్ పెట్టడం తప్ప నేను ఎక్కువగా బజ్జులు రాయనూ లేదు..ఎక్కడా ఏ బజ్జులోనూ ఏక్టివ్ గా వ్యాఖ్యలు రాసిందీ లేదు. అయినా రోజూ అందరి కబుర్లు చదువుతూ ఉండటం వల్ల అందరితో ఏదో తెలియని స్నేహబంధం ముడిపడిపోయింది. అసలు బజ్జుల్లోకి రాకపోయి ఉంటే అందరికీ అందరితో ఇంత స్నేహం కలిసేది కాదేమో...! ఇవాళ పొద్దున్నుంచీ ఎవరి కబుర్లూ కనబడకపోతే ఏమీ తోచనట్లుగా, పొద్దు గడవట్లేదు అనిపిస్తోంది...




అలా నిన్నటికి నిన్న హఠాత్తుగా ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చిన బజ్జు కు farewell చెప్పేసాం అందరం..! మరి గూగుల్ ప్లస్ లో ఆ ఉత్సాహం మళ్ళీ కనబడుతుందో లేదో వేచి చూడాల్సిందే...ఈ సందర్భంగా బజ్జు బజ్జుండిపోయిందని బాధపడుతున్న బజ్జుమిత్రులందరికీ ఒక మంచి కొటేషన్..
Don't be dismayed by good-byes. A farewell is necessary before you can meet again. And meeting again, after moments or lifetimes, is certain for those who are friends.
-- Richard Bach.



కాబట్టి friends, రండి రండి.. అందరం "బజ్జు పోయి ప్లస్సు వచ్చే ఢాం ఢాం ఢాం...!!" అని పాడేసి గోల చేద్దాం...అల్లరి చేద్దాం...మళ్ళీ..కబుర్లు చెప్పేసుకుందాం...మళ్ళీ....!!









16 comments:

సుజాత said...

ప్లస్ లో అందరం ఒకరికొకరు ఎదురు పడి "బజ్జు పోయింది" అని పలకరించుకున్నపుడు నాకు భలే నవ్వొచ్చింది తృష్ణా! భూకంపం వస్తోందని తెలిసి ఇళ్ళు ఖాళీ చేసి వీధిలో చేరిన అపార్ట్ మెంట్ వాసుల్లా కనిపించాం అందరమూనూ!

మొత్తానికి బజ్ ఒక మధురానుభూతే! హాయిగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం. నా లాంటి బ్లాగు బద్ధకిస్టులు బ్లాగు రాసినా రాయకపోయినా,బజ్జులో అప్పుడప్పుడూ తొంగి చూసి "హమ్మయ్య, అందరూ ఉన్నారర్రా" అని సంతోషించడానికి ఉండేది. ఇప్పుడూ ప్లస్సు ఉందనుకోండి. కానీ బజ్ ప్రత్యేకత బజ్ దే!

ప్చ్, మిస్ యూ బజ్!

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

నేను ఎప్పుడో బజ్ డిలీట్ చేసేశాను. మీరు మాత్రం గూగుల్‌వాళ్ళు డిలీట్ చేసేంత వరకు ఉంచారు. విద్యుత్ ఇంజిన్‌లు ఉండగా ఆవిరి ఇంజిన్లతో బండ్లు లాగినట్టు ఇంత కాలం మీరు బజ్‌లో పోస్ట్‌లు వ్రాస్తూ ఉన్నారు.

MURALI said...

పోయినోళ్ళందరూ మంచోళ్ళు, మిగిలినోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. కాబట్టి మనల్ని అర్ధాంతరంగా వదిలి వెళ్ళిన బజ్జు కోసం రెండు కన్నీళ్ళు కార్చి ప్లస్సులో ఓదార్చుకుందాం.

లత said...

ప్చ్ నేను బజ్ లోకి రావాలి రావాలి అనుకుంటూనే ఉన్నా,కుదరలేదు.కనీసం ప్లస్ లో అన్నా మీ అందరినీ కలవాలి తృష్ణగారూ

నీహారిక said...

బజ్జు అయితే వంటింట్లో నుండి టీవీ చూసినట్లు ఉంటుంది, ప్లస్సు అయితే హాల్ లో సోఫాలో కూర్చుని చూసే టీవీ లాంటిది. ఏదయినా ఒకటే !!!

బజ్జులకీ, ప్లస్సులకీ , బ్లాగులకీ అలవాటు చేసేసి అపుడు బాదుతారండీ, ఇకమీదట బ్లాగులూ ఉచితంగా ఉండకపోవచ్చు. డబ్బు కట్టి వాడుకోమనొచ్చు, అందుకే అంతా పకడ్బందీ గా ఉండాలని ప్రయత్నిస్తున్నారు.

ఇకమీదట ప్రతి అడ్డమైన చెత్త పోస్టులూ,హార్మోనియం గోలలూ లేకుండా ఎంచక్కా నాణ్యమైన పోస్టులూ, రాక్ స్టార్ లాగా వీనులవిందైన సంగీతాలు వినవచ్చు !!!

Padmavalli said...

తృష్ణా... బజ్జు పోయిన బాధ బాగా వర్ణించారు. పోలికలు కూడా బాగున్నాయి. అయితే నాకు గత మూడు నెలలుగా బజ్జు లేకపోవటం అలవాటయి, ఇప్పుడు అంత అనిపించడం లేదు కానీ, ఉంటే గనక నేను ఇంతకన్నా ఎక్కువే బాధ పడిపోయి ఉండేదాన్ని. బహుశా మాసికాలు గట్రా కూడా చేసుండేదాన్నేమో.

సరే గాని, నేను మీ మీద అలిగాను పొండి. :-(

Srikanth M said...

వా వా.. తొండి. మీరు నమ్ముతారో నమ్మరో. నేనుకూడా అక్షరం పొల్లుపోకుండా ఇదే పేరుతో పోస్టేద్దామనుకున్నా. అంతే కాదు,2011 లో చాలా సార్లు మనం RIP చెప్పాల్సి వచ్చింది.(చాలా మంది సినిమావాల్లు చనిపోయారు కదా), ఇప్పుడు బజ్జుకు కూడా RIP చెప్పబోతున్నాం, కాబట్టి 2011, డిసెంబరు 31 రాత్రి పన్నెండు గంటలకు 2012 Happy New Year అనికాకుండా 2011 RIP అని చెప్పేద్దామని చెప్పాలనుకున్నా.. ఏంటో ఇలా మీరు పోస్టేసేశారు.

kallurisailabala said...

తృష్ణ గారు మీరు చెప్పింది అక్షరాల నిజ్జం. ఎంతోమంది స్నేహితులు అయ్యారు.ఒక రోజు ఎవరో అన్నారు బజ్జు బజ్జుంటుంది అని అంతే బోలెడు దిగులుగా అనిపించింది.
గూగుల్ వాడు తీసేసేదాక ఎందుకు అప్పుడు ఆ బాధ తట్టుకోవడం కష్టం అని ముందే డిలీట్ చేసేసాను. అప్పటినుంచి మిమ్మల్ని అంతా మిస్ అవడం అలవాటు అయ్యిపోయి ఇప్పుడు ఒక్కసారి అంత బాధగా అనిపించడం లేదు.
ఇక ప్లస్ కూడా ఎప్పటికో అప్పటికి అలాగే చేస్తాడేమో అనిపించి అక్కడ లేకుండా ఇలా మిమ్మల్ని బ్లాగుల్లో పలకరిస్తున్న.
ఎలా చూసిన బజ్జ్ కళ ప్లస్ కి రావడం లేదు.
ఆ లోటు ఎప్పటికి అంతేనేమో??

SHANKAR.S said...

ఏం ప్లస్సో ఏంటో ఎంచక్కా మాయాబజార్ లాంటి బజ్జు సినిమా చూస్తుంటే లాక్కొచ్చి అరవ సినిమా ఆడుతున్న హాల్లో పడేసినట్టు ఉంది. వా:(((((((((((((

తృష్ణ said...

@సుజాత: నిజమేనండి....బజ్జు ప్రత్యేకత బజ్జు దే !

@ప్రవీణ్ శర్మ: ఎన్ని కొత్త విద్యూత్ ఇంజన్లు వచ్చినా బొగ్గు బండి అందం,ఆనందం...ఆ తీఏ వేరండి...అదే బజ్జుకి కూడా వర్తిస్తుంది !

@MURALI : అంతే అంతేనండి..:)

తృష్ణ said...

@లత: ఇప్పుడు రండి పోనీ...better late than never...:))

@నీహారిక: ఏమో అలా కూడా చేస్తారేమో గూగుల్ వాళ్ళు...

@పద్మవల్లి: మీరు లక్కీ ! ముందుగానే తప్పించేసుకున్నరీబాధ నుండి..:))
అలక దేనికండీ బాబూ...? చెప్పేయండీ..తీర్చేస్తాను...:))

తృష్ణ said...

@శ్రీకాంత్.ఎం: :))) దాందేముంది...మీరు కూడా వేసేయండి పోస్ట్ !

@శైలబాల: ఓణీ అందం డ్రస్సుకు వస్తుందా? ఇదీ అలానేనండీ...:))
ఎప్పుడో పీకేస్తాదని ఇప్పటినుంచీ రాకపోతే ఎలా? రండీ రండి...కబుర్లు చెప్పుకుందాం !

@శంకర్: మీ ఉపమానం సూపర్...తిరుగులేదు..!!

ఆ.సౌమ్య said...

వా ఆ వా ఆ వా ఆ...ఇంతకన్నా నేనేమీ చెప్పలేనండీ...దుఃఖం ముంచుకొచ్చేస్తోంది....బజ్జు పోయిన దగ్గరనుండీ కనీరుమున్నీరుగా విలపిస్తున్నా...వా ఆ వా ఆ :((

తృష్ణ said...

@ఆ.సౌమ్య: నిజమేకానీ...ఏం పర్లేదు..రండి ప్లస్సులో కబుర్లాడేసుకుందాం...:))

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

ఇది డీజిల్ బండి నుంచి తీసిన వీడియో: http://videos.teluguwebmedia.in/in-dense-forests-near-lelligumma-orissa
బొగ్గు బండి నుంచి ఇంత థ్రిల్ ఉంటుందంటారా? బొగ్గు బండి అడవిలో వెళ్తోంటే ఈ నెమ్మది బండి అడవి ఎప్పుడు దాటుతుందా అనిపిస్తుంది కదా. మీరు ఏమైనా అనుకోండి. నాకు బజ్ బొగ్గు బండిలా పాతది అనిపించి నా బజ్‌ని ఎప్పుడో డిలీట్ చేసేశాను.

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

Old is gold అని మీరు అనుకుంటారేమో కానీ నేను అనుకోను. పాతదనంలో ఉన్న ఆనందం వేరు అనుకుంటే బజ్ దాక ఎందుకు కానీ తూలికని సిరాలో ముంచి దానితో వ్రాయొచ్చు.