
చిన్నప్పుడు నాన్న ఊరెళ్తే మా అమ్మ అసలు కూరే వండేది కదు. ఏదో క్యాబేజీ పప్పుకూరో, ఆనపకాయ పప్పుకూరో గిన్నెడు (పెసరపప్పు బద్దల్లా కూరతో పాటుగా ఉడకపెట్టి చేస్తారు) వండేసి రెండుపూటలూ ఇదే తినేయండి అనేది. 'అప్పడాలు కూడా వేయించకుండా పప్పుకూర చేసేసి తినేయమంటే మేం తినేయాలా? నాన్న ఊరెళ్తే మాకు కూర వండవా?' అని మేం దెబ్బలాడేసేవాళ్ళం అమ్మతో. కానీ ఇప్పుడో.. అయ్యగారు ఊరెళ్తే అన్నంలోకి కూర, నార చేసుకోకుండా ఏదో పచ్చడి వేసుకుని తినేసే అమ్మ, అమ్మమ్మల రోజులా ఇవి...?? నేనయితే అలా తినలేను బాబు...
ఇప్పుడూ, మనమెంత పతివ్రతా ఇస్త్రీలమయినా అయ్యగారు ఊరెళ్తే "నీవు లేక వీణా పలుకలేనన్నదీ.." అని పాటంటే ఏదో పాడేసుకుంటాం కానీ అన్నమయితే పచ్చడితోనో, పప్పుకూర తోనో తినలేం కదా. అందులోనూ ఫ్రెష్ గా మొన్న సంతలో కొన్న బీరకాయలూ, కాలీప్లవర్ ఫ్రిజ్ లో నవనవలాడుతుంటే..! ఈ బీరకాయలు, కాలీఫ్లవర్ శ్రీవారస్సలు తినని కూరల లిస్ట్ లో మొదటివి, నాకెంతో ఇష్టమైన కూరల్లో కూడా మొదటివే...:((( అందువలన చేత అయ్యగారు ఆఫీసుపనిమీద ఊరు వెళ్ళినప్పుడల్లా అంతవరకు తినలేని నాకు పరమ ప్రియమైన కూరలన్నీ వండుకుని సుభ్భరంగా తినేస్తూ ఉంటానన్నమాట.
మొన్న తనలా వెళ్ళగానే చక్కగా ఫ్రిజ్ లోంచి బీరకాయలు తీసి, తరిగి మగ్గించేసి, మరో పొయ్యిమీద ఉల్లిపాయలు, కడిగి తరిగిన మెంతికూర వేయించేసి, రెండూ కలిపేసి ఉప్పు, కారం, కాస్తంత పప్పు కారం వేసేసి ఫైనల్ మగ్గింగ్ అవుతుండగా, మరో పొయ్యిమీద రెండు సజ్జ రొట్టెలు చేసేసుకుని హాయిగా రెండు కలిపి ఆస్వాదిస్తూ తినేసానన్నమాట.

నిన్న పొద్దున్న పాపను స్కూలుకి పంపాకా, నాకు పరమ ఇష్టమైన మ్యాగీ వండేసుకుని పెండింగ్ ఉన్న బ్లాగులన్నీ చూసేస్తూ మొత్తం తినేసా. నాకు "అమెరికన్ చౌప్సీ" కావాలి అంటే నా కోసం హోటలుకొస్తారు గానీ తనసలు నూడుల్స్, మ్యాగీ మొదలైనవాటి వాసనే చూడరు మరి. ఇక నిన్న మధ్యాన్నం రాత్రికి కూడా సరిపోయేలా చక్కగా కాలీఫ్లవర్, కేరెట్, ఉల్లిపాయ వేసేసుకుని కూర చేసేసుకున్నా. కాలీఫ్లవర్ రోజూతినమన్నా ఇష్టమే నాకు .

ఇంక నిన్న రాత్రి సగ్గుబియ్యం నానబెట్టుకుని, ఇవాళ పొద్దున్న సగ్గుబియ్యం ఉప్మా చేసేసుకుని హాయిగా తినేసా.

ఇవాళ రాత్రికి చపాతిలోకి బీరకాయ పచ్చడి చేసేసుకున్నానా. రేపటికేమో ఓట్స్ అట్లు చేయటానికి పదార్ధాలన్నీ నానబెట్టా. బాగా వస్తే "రుచి" బ్లాగ్లో రెసిపీ రాస్తాను. ఇంకా ఎల్లుండిలోపూ తోటకూర పులుసు వండుకోవాలి, మెంతికూర పచ్చడి చేసుకోవాలి, కేప్సికం కూర చేసుకోవాలి, ఆనపకాయ పచ్చడి చేసుకోవాలి, దొండకాయలు కాయపడంగా వండుకోవాలి....ప్చ్...మిగిలిన రెండు పూటలలో ఇన్నింటిని ఎలా వండుకోవాలో ఏమిటో....:(((




24 comments:
"దొండకాయలు కాయపడంగా వండుకోవాలి"
బజ్జు భాషలో చెప్పాలంటే ఈ లైన్ కి సూపర్ లైక్ :)
మిగిలిన వాటి విషయంలో నేనూ తృష్ణుడి గారి జట్టే :)))))
:) క్యూట్. బాగా రాశారు.
:))
హహ్హహ్హా.. అయ్యవారు ఊర్లో లేనప్పుడు విందు భోజనాలన్నమాట! బాగుంది మీ వంటల ముచ్చట.. :)
ఇంతకీ ఆ బీరకాయ కూరేదో వెరైటీగా కనిపిస్తోంది.. రెసిపీ రాసి పెట్టండి రుచి లో.. అలాగే సగ్గుబియ్యం ఉప్మా కూడా తెలీదు నాకు.. అది కూడా చెప్పెయ్యండి ప్లీజ్.. :)
:):):):):)
తృష్ణ గారూ..అలా రహస్యాలన్నీ చెప్పేస్తే ఎలా..
చిన్నప్పటినుంచి అన్నీ తినడం అలవాటు చెయ్యకపోతే ఇలాగే వుంటుంది తంటా.మా ఇంట్లో కూడా ఇదే సమస్య.కాస్త నా పాట సంగతి గుర్తుంచుకోండీ!
హహహహ...సుపర్...మీరూ నాలాగే :)))
మీకు చాలా ఓపికండీ......నిజంగానే అన్నీ వండేసుకుని తిన్నారా??:)
హహహ బాగుంది ఇంకో రెండు రోజులు అక్కడే ఉండండి నాకు ఇక్కడ ముఖ్యమయిన పనులు చాలా ఉన్నాయి అని ఒక దూరవాణి పెట్టండి మీ శ్రీవారికి! (సరదాకి)
ఓట్స్ అట్లు మొన్న నేను వేసాను బాగా వచ్చాయి. మీవి కూడా బాగా వచ్చి అందులో పెడితే చూస్తా!
మీరూ నాలాంటి.. అదే నేనూ మీలాంటి పతివ్రతా ఇస్త్రీయేనన్నమాట!! :) దొండకాయలు కాయ పళంగా.... అబ్బబ్బబ్బా.. ఎందుకండీ గుర్తు చేస్తారు!? ఇప్పటికిప్పుడు ఎక్కడికి ప్రయాణం కట్టించాలి ఇంటాయన్ని?
ante annanantaaru kaani ila secrets anni cheppesthe mana sthree lokaniki entha kashtam cheppandi.
ఆఖరి లైన్ లో మీ ఆదరాబాదర కష్టం చదివి ఫక్కున నవ్వొచ్చి ఇది రాస్తున్నా. ఎందుకంటే నేనూ సేం షేం. అరటికాయ వేపుడు, వరిపిండి ఉప్మా, మీరు చెప్పినసాగో కిచిడి........అయ్యగారు యాక్ అనేవన్నీ మనకి యమ్మి యమ్మి. వెనకటికి ఒకామెని ఏమి వంటమ్మా అని అడిగితే ఆ( ఏముందీ ఇంట్లో ఓ దుంప పడుంది దాన్ని వేచేసి, చారులో ఇంత పప్పేసి , మజ్జిగలో ఇంత పోపు పడేసాను మా ఇంటాయన ఊరేళ్ళారు కదమ్మా అందట. మెనూ బాగుంది కదా.
తోటకూర పులుసు వండుకోవాలి, మెంతికూర పచ్చడి చేసుకోవాలి, కేప్సికం కూర చేసుకోవాలి, ఆనపకాయ పచ్చడి చేసుకోవాలి, దొండకాయలు కాయపడంగా వండుకోవాలి..
ఇవన్నీ ఎలా చేయడం ?
నూడుల్స్, సేమియా ఉప్మా నా ఫేవరెట్స్ కానీ ఇద్దరూ తినరు.
మీరెంత బరువుంటారు ? బాగా వంట చేసేవాళ్ళు బాగా లావుగా ఉంటారు సామాన్యంగా !!
ఊరికే అడిగా !!
నాకు వంట చేయటం కంటే అవి తిని నేను లావయిపోతానేమో అని దిగులుతో సగం వంట అంటే ఇష్టం ఉండదు.
ఆహా సూపర్ పోస్ట్ అండీ. ఆ దొండకాయలు కాయపడంగా చేసుకుంటే మాత్రం నాకు కూడా పంపండి.
ఇక కాలిఫ్లవర్ రోజు తినమన్న నేను కూడ రెడీ నే.
ఏవిటో తృష్ణగారూఉ.....ఈ మగవాళ్ళందరూ ఇంతేనా? అసలెందుకు వీళ్ళకి క్యాలిఫ్లవర్,క్యాబేజి,క్యారెట్,మెంతికూర,బీట్రూట్ లాంటి పదార్ధాలు గిట్టవెందుకో!! అబ్బబ్బా! మా ఇంట్లో క్యాలిఫ్లవర్ అంటే చాలు....'అబ్బా....ఇందూ ఈ రోజెందుకో ఆకలెయ్యట్లేదు....ఈరోజుకి నువ్వు తినేసేయ్' అంటారు మా చందు :))))))) హ్మ్! అందరి ఇళ్ళలో ఇదే గోల అన్నమాట!
మీ వంటలు,ఫొటోలు బాగున్నాయండీ :)
దొండకాయలు కాయపడం అంటే ఎలా చేస్తారండీ?
@ఇందుగారు:
>>>ఈ మగవాళ్ళందరూ ఇంతేనా? అసలెందుకు వీళ్ళకి క్యాలిఫ్లవర్,క్యాబేజి,క్యారెట్,మెంతికూర,బీట్రూట్ లాంటి పదార్ధాలు గిట్టవెందుకో!! అబ్బబ్బా!
గిట్టకగాదండీ, విరక్తిచెందీ. మీరు ఎంతవరకు హాస్టళ్ళల్లో, బెంగళూరేతర ఆఫీసు క్యాంటీనులలో తిన్నారో తెలీదుగానీ వాటిల్లో చేసేవి ఆలూ-గోబీ-క్యాబేజీ-క్యారెట్-పన్నీర్-మట్టర్ కాంబినేషన్లే. కొన్నేళ్ళ బ్యాచిలర్ నరకయాతన. పెళ్ళైయ్యాక ఇంట్లోనూ అవే అంటే ఎలాగండీ పాపం :-)
తృష్ణ గారూ.. ఏమని చెప్పాలో తెలీట్లేదు. నాకు ఈర్ష్య కలుగుతోంది. మా అయ్యవారు విజిటింగ్ ప్రొఫెసరు. కాబట్టి ఫ్రీడం విషయంలో నేను కూడా ఫుల్ ఎంజాయ్ ! కాపోతే..మిగతావి మీరర్ధం చేసుకోవాలి. ఇంత మంచి వంటలు చేసిపెట్టే భార్య దొరకడం ఎంత అదృష్టమో కదా తృష్ణుడు గారిది ?! అసలివన్నీ ఎప్పుడైనా రుచి చూపించేరా మీ వారికి ?
@శంకర్: ఒక వాక్యానికి :)) మరొ వాక్యానికి..:(((
ధన్యవాదాలు.
@కృష్ణప్రియ: థాంక్యూ..
@రాజేష్ మారాం: ధన్యవాదాలు.
@మధుర: ఊళ్ళొ ఉన్నా కూడా విండులకేం తక్కువలేదులే మధురా. ఇది సరదాకే !! రెసిపీలు తప్పకుండా రాస్తా...
ధన్యవాదాలు.
@సుభ: :)) ధన్యవాదాలు.
@ఇందిర: అవునండి.
పాట గురించి కనుక్కుని చెప్తానండి. ధన్యవాదాలు.
@ఆ.సౌమ్య: బహుశా చాలామంది ఇలానేనేమో...
ధన్యవాదాలు.
@రసజ్ఞ :అమ్మో ఇదే ఎక్కువ ఇంకో రెండు రోజులా...ఇక ఏం తినాలనిలేదు వచ్చేయమంటా..:))
ఓట్స్ అట్లు నాకూ బానే వచ్చాయండి .రెసిపీ పెట్టాలి..
ధన్యవాదాలు.
@పద్మార్పిత: బ్రతికినన్ని రోజులు బ్రతుకుతామటండి...:)
వీలయినన్ని వండుకోవటమే..ధన్యవాదాలు.
@కొత్తావకాయ: పోనీ నేనే ఓ రెండు దొండకాయలు పంపిస్తాలెండీ..:)
ధన్యవాదాలు.
@గీత_యశస్వి: కొత్తవేమీ కావండి..జగమెరిగిన రహస్యాలే ఇవి..:)
ధన్యవాదాలు.
@కిరణ్మయి: :))) ధన్యవాదాలు.
@నీహారిక: నేను రాసిన బీరకాయ,మెంతికూర,తోటకూర మొదలైనవన్నీ బరువు పెంచే కూరలు కావండీ...అయినా మితంగా తిన్నంతకాలం ఏది తిన్నా ఇబ్బంది ఉండదు.
ధన్యవాదాలు.
@కల్లూరి శైలబాల: సేమ్ లైక్స్ అన్నమాట. వెరి నైస్..:))
ధన్యవాదాలు.
@ఇందు: అంతే ఇందూ..అంతే..!!
ధన్యవాదాలు.
@జేబి - JB : రెండు మూడు రకాలుగా చేయచ్చు. రుచి లో చెప్తాలెండి.
మీరు చెప్పిన పాయింట్ కూడా ఆలోచించదగినదే...
ధన్యవాదాలు.
@సుజాత: అన్నీ తినకపోయినా ఏ విధంగా చేస్తే తింటారో కనిపెట్టి మరీ వండటమేనండీ... చేసేవన్నీ చాలావరకూ తింటారు తను.
ధన్యవాదాలు.
Post a Comment