సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, August 28, 2011

ఉరుమి






క్రితంవారం చేసిన పొరపాటు ఈవారం చెయ్యలేదు. దీని బదులు మరోటి చూసి బుక్కయిపోయాం. ఈసారి ఈ సినిమా చూసినవాళ్ళను అడిగి అడిగి వెళ్ళాం సినిమాకి. ట్రాఫిక్లో చిక్కుకు లేటయ్యేసరికీ షో మొదలైపోతుందని కంగారు నాకు. పేరు పడకముందు నుంచీ తెర పడేదాకా చూడకపోతే అసలు సినిమా చూసినట్లే ఉండదు. సరే గుమ్మంలోకి అడుగుపెట్టేసరికీ సిన్మా పేరు పడేసరికీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా.






డైరెక్టరే సినిమాటోగ్రాఫర్ అయితే ఇంక చెప్పేదేముంది..కళ్ళకు పండగే. కాబట్టి ఈ సినిమా ముందుగా కళ్ళకు పండుగ. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన సినిమాల్లో హిందీలో తీసిన "అశోకా" తప్ప మరేమో చూడలేదు నేను. అప్పట్లో ఆ సినిమా కూడా బాగా నచ్చింది నాకు.షారుఖ్,కరీనా ఇద్దరూ చాలా బాగా చేసారు. ఆ సిన్మా పాటలయితే ఇప్పటికీ వింటూంటా. అంతిష్టం. "ఉరుమి" సినిమా చూస్తూంటే ఇది స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ కానందుకు బెంగ వేసింది. డబ్బింగ్ అయినా మరీ అలా అనిపించనందుకు ఆనందం వేసింది. ముఖ్య పాత్రధారుల నటన ముచ్చట గొలిపింది. మరీ ముఖ్యంగా హీరో పాత్రధారి పృధ్వీరాజ్ పై అభిమానం కొండంత పెరిగిపోయింది. "శివపురం" సిన్మాలో వేసినతననుకుంటాను. మరెక్కడా చూసిన గుర్తు లేదు. అబ్బ..హీరో అంటే ఇలా ఉండాలి అనిపించింది. చాలాసార్లు అతని నటన మృగరాజు సింహాన్ని గుర్తుకుతెచ్చింది. జుట్టు వెనక్కు వెళ్ళేలా తల విదిల్చినప్పుడు రాజసం, నాయకుడుగా ఠీవీ, గంభీరమైన చూపులు ఆకట్టుకున్నాయి. ఇతన్ని హీరోగా పెట్టి చందమామ, బాలమిత్రల్లోని మంచి మంచి రాజుల కథలను సినిమాలు తీసేస్తే భలే ఉంటుంది అనిపించింది. ఈ సినిమా నిర్మాత అవతారమే కాక ఒక పాట పాడి గాయకుడి అవతారం కూడా ఎత్తాడితను.

అంతమంది పెద్ద పెద్ద నటీమణులను ఎందుకు పెట్టారో అని మాత్రం అనిపించింది. 'విద్యాబాలన్' కు రెండు మూడు సీన్స్ ఉన్నయి కానీ 'తబ్బు 'కు ఒక పాటలో మినహా పాత్రే లేదు. పైగా ఎప్పటి నిన్నే పెళ్ళాడాతాలోని తబ్బు..వయసు మీరిపోయింది..అనిపించింది. విద్యా కు పాట అనవసరం. సీరియస్ కథ నడుస్తూండగా ఎందుకు పెట్టారో తెలీలేదు. పైగా పాటలేమీ మళ్ళీ మళ్ళీ వినేలా లేనందువల్ల, డబ్బింగ్ అయినందువల్ల వినసొంపుగా లేవు. ఒక్క హీరో హీరోయిన్ల మధ్య పాట మాత్రం కాస్త బావుంది. మొదటిసారి జనీలియాను ఒక రీజనబుల్ రోల్ లో చూసాననిపించింది. కత్తి యుధ్ధాలు అవీ చాలా శ్రధ్ధగా చేసేసింది. 'నిత్యా మీనన్' ఓపినింగ్ సిన్ లో భయపడేలా కనబడింది కానీ తర్వాతి సినిమాలో బావుంది ముద్దుగా. ఈ అమ్మాయి ఏ మాత్రం లావయినా కెరీర్ దెబ్బతింటుంది. చిరక్కల్ రాజుగారి దగ్గర పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ కనబడ్డ జంటలో అమ్మాయి కూడా రంగు తక్కువైయినా బావుంది. వాన, వాతావరణం, పచ్చదనం అన్నీ కథకు అనుగుణంగా నప్పేసాయి. ఈ తరహా సినిమాకు ముఖ్యమైన సౌండ్ ఎఫెక్ట్స్, నేపథ్యసంగీతం చాలా బావున్నాయి.





ఈ సినిమాలో నచ్చనిదేదైనా ఉంటే అది ప్రభుదేవా. అందులోనూ 'నిత్య' పక్కన అస్సలు సరిపోలా. నటన బాగుంది కానీ ఆ పాత్రలో మరెవరైనా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇంకా యుధ్ధాలకోసం తీసుకొచ్చిన గుర్రాలకు పాపం దెబ్బలు తగులుతాయే అనిపించింది. మొత్తమ్మీద బాగుంది కానీ ఇంకా బాగుండొచ్చేమో అనిపించింది. హిస్టరీ స్టూడెంట్ ను కాబట్టి నాకు పౌరాణికాలు, చారిత్రాత్మకాలూ బాగా నచ్చేస్తాయి. అసలు నేను కూడా ఏ రాజులకాలంలోనో ఎప్పుడో పుట్టే ఉంటాను అనిపిస్తూంటుంది నాకు. సినిమా చూసి వస్తూంటే కూడా ఆ ఆడవి, గుర్రాలు కళ్ళ ముందే కదులుతూ ఉన్నాయి. ఒక మంచి ఫీల్ ఉంది సినిమాలో. తెలుగులో కూడా ఎవరైనా పూర్తి నిడివి చారిత్రాత్మక చిత్రాన్ని తీయకూడదా అని మరీ మరీ అనిపించింది. రొటీన్ కు భిన్నంగా చూడాలనుకునేవారికి బాగా నచ్చుతుంది ఈ సినిమా.

8 comments:

అనిర్విన్ said...

తృష్ణగారు, ఇది తెలుగులోకి డబ్ చేసారా? నేను ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మళయాళం సినిమా చూసానండి. టైటిల్ ఏంటండీ తెలుగులో? ఉరుమి అనే పెట్టేసారా?

SHANKAR.S said...

వా:((((((( ఇది కూడా చూసేశారా. నేనెప్పుడు చూస్తానో ఏంటో.

"హిస్టరీ స్టూడెంట్ ను కాబట్టి నాకు పౌరాణికాలు, చారిత్రాత్మకాలూ బాగా నచ్చేస్తాయి."
నాకు పాత కోటలు, ప్రాచీన కట్టడాలు చూడటం భలే ఇష్టమండీ. ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. గతాన్ని వర్తమానంలో చూస్తున్నట్టు ఉంటుంది.

ఇందు said...

చాలాచాలాబాగుంది మీ రివ్యు. తప్పక ఈ సినిమా చూడాలి అనిపించేలా :)

తృష్ణ said...

@అనిర్విన్: అవునండీ తెలుగులో "ఉరుమి" అనే పెట్టారు.

@శంకర్.ఎస్: యాదృచ్ఛికంగా పలు యాత్రా స్థలాల్లో నేను ఎక్కువగా చూసినవి కూడా రకరకాల కోటలు,మ్యూజియంలూ నండీ..నాకు చరిత్ర అంటే మహా ఇష్టం. ఇంటర్లో,డిగ్రీలో కూడా లిటీరేచర్ లో కన్నా హిస్టరీలో నాకు బాగా ఎక్కువ మార్కులు వచ్చాయి..:)
ధన్యవాదాలు.

@ఇందు:తప్పక చూడండీ. మీకు తప్పక నచ్చుతుండని నా అభిప్రాయం. సినిమా చూడగానే నా అభిప్రాయాలు ఇవీ అని రాయాలనిపించి రాయటం ఇందూ...నచ్చినందుకు థాంక్స్.

MURALI said...

నేను హిస్టరీ స్టూడెంట్‌ని కాదు అయినా నాకు పౌరాణికాలు, చారిత్రాత్మకాలూ బాగా నచ్చుతాయి. రూమ్‌లో ఎప్పుడూ టివిలో అవే చూస్తుంటే మా రూమ్మేట్స్ తిట్టుకుంటారు.

Indira said...

డియర్ తృష్ణ,మీ రివ్యు చాలా బాగుంది.చారిత్రకమైన ప్రధాన్యత గలిగిన ప్రదెశాల లొ తిరుగుతున్నప్పుడు కలిగే అనుభూతే వేరు.హంపి వెళ్ళినప్పుడు క్రృష్ణదేవరాయల భువనవిజయం అంటూ ఒక ఎతైన దిబ్బని చూడల్సి వచినప్పుడు ఎంత దుఖం వఛ్ఛిందొ.

ఇందు said...

అవును తృష్ణగారూ...రొటీన్ సినిమాలు చూసిచూసి విసుగేసింది.నాకు ఈ రాజులు,కత్తులు,యుధ్ధాలు ఇష్టమే :) చూడాలి ఎలాగైనాసరే! :)

తృష్ణ said...

@MURALI:అవునాండీ..బావుంది. ఎవరు తిట్టుకున్నా మన ఇష్టాలు మనవే కదా..:)
ధన్యవాదాలు.

@ఇందిర: అచ్చంగా అంతేనండీ.పేపర్లో ఒక ఆర్టికల్ చదివిన తరువాత ఈ మధ్యనే విజయనగర సామ్రాజ్యం గురించిన ఒక పుస్తకం కొన్నానండీ..నాకు భలే నచ్చింది.
ధన్యవాదాలు.


@ఇందు: ..:) thank you.