Wednesday, August 24, 2011

సంగీతప్రియులకు తాయిలం - "స్వర్ణయుగ సంగీత దర్శకులు"తెలుగు పాటలపై అత్యంత ప్రేమ కలిగిన సంగీతప్రియులు ఏదైనా పాత పాట గురించో, ఫలానా పాట పాడిన గాయని గాయకుల గురించో, ఆ పాట తాలూకూ సంగీత దర్శకులెవరో తెలుసుకోవాలన్నా.. నాకు తెలిసీ అంతర్జాలంలో మనం మొదట వెతికేది "చిమటమ్యూజిక్.కాం"లోనే. ఆ వెబ్సైట్ అధినేత శ్రీ చిమట శ్రీనివాసరావు గారి ప్రోత్సాహంతో తయారై, చిమటమ్యూజిక్.కాం వారిచే పబ్లిష్ చేయబడిన పుస్తకమే "స్వర్ణయుగ సంగీత దర్శకులు". ఈ పుస్తకానికి అక్షర రూపాన్ని అందించింది, ఆ అక్షరాల వెనుక అవిరామ కృషి చేసినది శ్రీ పులగం చిన్నారాయణ గారు.


ఇంతకు పూర్వం 'హాసం ప్రచురణల' ద్వారా ప్రచురిచబడిన " జంధ్యామారుతం" రెండు భాగాలు, ఆ తర్వాత 75 మేటి చిత్రాల తెర వెనుక కబుర్లతో తయారైన వారి రెండవ పుస్తకం "ఆనాటి ఆనవాళ్ళు" 2009లో 'ఉత్తమ సినీ గ్రంధం'గా రాష్ట్ర ప్రభుత్వ 'నంది' అవార్డ్ ను అందుకుంది. ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జీవిత ప్రస్థానం "సినీ పూర్ణోదయం" తరువాత పులగం చిన్నారాయణ గారికి ఇది నాలుగవ పుస్తకం. ఈ పుస్తకం కోసం, పలువురు సంగీత దర్శకుల వివరాల కోసం చిన్నారాయణ గారు చేసిన కృషి, పడిన కష్టం ప్రతి పేజీ లోను కనబడుతుంది. అన్ని అపురూపమైన చిత్రాలను కలక్ట్ చేయటానికి ఎంత కష్టపడి ఉంటారో అనిపించింది ఆ ఫోటోలను చూస్తూంటే.

ఈ పుస్తకంలో ఏముంది?

సీనీసంగీతజగత్తులో గాన గంధర్వులు శ్రీ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యంగారికి అంకితమిచ్చిన ఈ పుస్తకంలో 1931-1981 వరకూ తెలుగు సినీపరిశ్రమను, తెలుగు పాటను అత్యంత ప్రభావితం చేసిన ఒక ముఫ్ఫై మంది సంగీత దర్శకుల గురించిన వివరాలు, వారి జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానం, వారి వృత్తిపరమైన ఒడిదొడుకులు, వారి తాలుకు కొన్ని అరుదైన ఫోటోలు, వారు స్వరాలందించిన కొన్ని చిత్రాల పేర్లు, వారు స్వరకల్పన చేసిన పాటల జాబితాలు...మొదలైన అపురూపమైన విశేషాలు ఉన్నాయి. ముందుగా డా.సి.నారాయణరెడ్డి గారు, రావు బాలసరస్వతిగారు, పి.సుశీల గారు, కీరవాణి గారు, కౌముది.నెట్ ఎడిటర్ శ్రీ కిరణ్ ప్రభ మొదలైన వారి సంతకాలతో కూడిన అభినందనలు ఉన్నాయి. వీరిలో మధురగయని జానకి గారి అభినందనలు లేకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా పుస్తకరూపానికి సహాయ సహకారాలు అందించిన మరికొందరు మిత్రుల అభినందనలు కూడా ఉన్నాయి. వారిలో మన బ్లాగ్మిత్రులు నిషిగంధ గారి శుభాకాంక్షలు కూడా ఉండటం మనకు ఆనందకరం.


ఇక పుస్తకంలో ప్రస్తావించబడిన ముఫ్ఫై మంది సంగీత దర్శకులు ఎవరంటే...
1. హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి
2. గాలి పెంచల నరసింహారావు
3. భీమవరపు నరసింహారావు
4.ఓగిరాల రామచంద్రరావు
5. సాలూరి రాజేశ్వరరావు
6. చిత్తూరు నాగయ్య
7. బాలాంత్రపు రజనీకాంతరావు
8. మాస్టర్ వేణు
9. సుసర్ల దక్షిణామూర్తి
10. సి.ఆర్.సుబ్బరామన్
11. ఘంటసాల
12. సాలూరి హనుమంతరావు
13. పెండ్యాల నాగేశ్వరరావు
14. ఆదినారాయణరావు
15. అశ్వత్ధామ
16. టి.వి.రాజు
17. ఎమ్మెస్ విశ్వనాథన్
18. తాతినేని చలపతిరావు
19. భానుమతి రామకృష్ణ
20. బి.గోపాలం
21 రమేష్ నాయుడు
22. రాజన్-నాగేంద్ర
23. కె.వి.మహదేవన్
24. ఎస్.పి.కోదండపాణి
25. జి.కె.వెంకటేశ్
26. సత్యం
27. జె.వి.రాఘవులు
28. చక్రవర్తి
29. ఇళయరాజా
30. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


తన పుస్తకాన్ని మనతో ఆసాంతం ఆసక్తికరంగా చదివించగల విభిన్నమైన శైలి పులగం చిన్నారాయణగారిది. ఏభైఏళ్ళ సినీప్రపంచపు సంగీతాన్ని గురించి, తెలుగు పాటల గురించీ, వాటి వెనుక ఉన్న సంగీత దర్శకుల తాలుకూ మనకు తెలియని జీవిత వీశేషాలను పొందుపరిచిన "స్వర్ణయుగ సంగీత దర్శకులు" పుస్తకం తెలుగు పాట పై అత్యంత అభిమానమున్న సంగీతప్రియులందరూ అపురూపంగా దాచుకోవాల్సిన తాయిలమే.


అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యమవుతున్న ఈ పుస్తకం వెల 500 రూపాయిలు.