సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, August 18, 2011

బంతినారు



బంతి మొక్కలకీ, నాకూ అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ప్రతి వర్షాకాలం జులై నెల చివరలోనో, ఆగష్టు మొదట్లోనో స్కూల్ నుంచి వచ్చేసరికి ఓ మగ్గు నీళ్ళలో పెట్టిఉంచిన రెండు మూడు "బంతినారు" కట్టలు దర్శనం ఇస్తూండేవి. ("బంతినారు" అంటే తెలియనివాళ్ళకు చిన్న వివరణ: బంతి పువ్వులు ఎండిపోయాకా వాటిని విడదీసి ఆ రేకులు మట్టిలో చల్లితే బంతి మొక్కలు వస్తాయి. మొక్కలు అమ్మేవాళ్ళు అలా బంతిమొక్కలు పెంచి, రెండంగుళాలు పెరిగాకా వాటిని తీసి కట్టగా కట్టి బజార్లో అమ్ముతారు. ఆ చిన్న చిన్న బంటి మొక్కలనే "బంతినారు" అంటారు. వాటిని ఒక క్రమంలో వేసుకుంటే మొక్కలు బాగా పెరిగి ఎక్కువ పువ్వులు పూస్తాయి.)


బాగా చిన్నప్పుడు అమ్మ నాటేసేది కానీ నాకు మొక్కలపై మమకారం పెరిగేకా ఆ బాధ్యత నేనే తీసుకునేదాన్ని. మగ్గులో బంతినారు చూడగానే గబగబ స్కూల్ డ్రెస్ మార్చేసుకుని, గునపం,బకెట్టులో నీళ్ళు తీసుకుని నాటడానికి బయల్దేరేదాన్ని. ఎంతెంత దూరంలో ఆ బుజ్జి బుజ్జి బంతి మొక్కలు పాతాలో అమ్మ చెప్తూంటే, ఆ ప్రకారం రెండు మూడు మొక్కలు కలిపి నాటేసేదాన్ని. రెండుమూడు మొక్కలు కలిపి ఎందుకంటే పొరపాటున ఒక మొక్క బ్రతక్కపోయినా రెండవది బ్రతుకుతుందన్నమాట. వాటికి చుట్టూ నీళ్ళు నిలవటానికి పళ్ళేంలాగ చేసి అన్నింటికీ నీళ్ళు పోసి మట్టిచేతులు కడిగేసుకోవాలన్నమాట. అప్పటికి తలలు వాల్చేసిన ఆ బుజ్జి మొక్కలు బ్రతుకుతాయో బ్రతకవొ అని నేను బెంగ పడుతుంటే, పొద్దున్నకి నిల్చుంటాయిలే అని అమ్మ ధైర్యం చెప్పేది. మర్నాడు పొద్దున్నే తలలు నిలబెట్టు నిలబడ్డ బంతి మొక్కలని చూస్తే భలే సంబరం వేసేది. అవి మొండి మొక్కలు. బ్రతకాలే గానీ ఇక చూసుకోవక్కర్లేదు. కాసిన్ని నీళ్ళు పోస్తే వాటి మానాన అవే పెరుగుతాయి.


ఒకోసారి పండగలకి గుమ్మానికి కట్టిన బంతి తోరణాలని జాగ్రత్తగా ఎండబెట్టి దాచేది అమ్మ. ఆగస్టు వస్తోందనగానే వాటిని మట్టిలో చల్లేసేది. నాలుగైదురోజుల్లోనే మొక్కలు వచ్చేసేవి. కాస్తంత పెరిగాకా, ఆ బంతినారు తీసేసి మళ్ళీ దూరం దూరంగా నాటేవాళ్ళం. కానీ ముద్ద పువ్వుల రెక్కలతో మొలిచిన మొక్కలకి రేక బంతిపువ్వులు పూసేవి ఒకోసారి. అందుకని విత్తనాలు వేసి మొలిపించినా, ఒక కట్ట అయినా బంతినారు కొనకుండా ఉండేది కాదు అమ్మ. అలా ఆగస్టులో వేసిన బంటి మొక్కలు సప్టెంబరు చివరికి పూలు పూసేసేవి. కొత్త సంవత్సరం వచ్చాకా మార్చి దాకా పూసేవి ఆ పూలు. ముద్ద బంతి రెండు మూడు రంగులు, రేక బంతి రెండు మూడు రంగులు, కారబ్బంతి(చిన్నగా తోపు రంగులో ఉంటాయే అవి) మొదలైనవి పెంచేవాళ్ళం మేము. నా పెళ్ళి అయ్యేదాకా ప్రతి ఆగష్టు నుంచి మార్చి దాకా క్రమం తప్పకుండా బంతి తోట ఉండేది మా ఇంటి ముందు. వాటి పక్కన రెండు మూడు రకాల చామంతులు. ఇవి కూడా ఈ అర్నెలలూ పూస్తాయి. ఈ మొక్కలన్నింటికీ కలిపి నేను గట్టి కర్రలు ఏరుకొచ్చి దడి కట్టేదాన్ని. అదో పెద్ద కార్యక్రమం. ఆ దడికి శంఖుతీగలను ప్రాకిస్తే స్ట్రాంగ్ గా గోడలా ఉండేది. తెలుపు, నీలం రంగుల్లో ఉన్న శంఖు పువ్వులు ఎంత బావుడేవో..

(పాత ఫోటోల్లో దొరికిన మా బంతి తోట)


మార్చి తరువాత బంతి మొక్కలు వాటంతట అవే ఎండిపోవటం మొదలు పెడతాయి. అప్పుడు వాటిని తీసేసి మళ్ళీ ఏవో వేరే మొక్కలు వేసుకునేవాళ్ళం. బంతి పువ్వులు పూసినన్నాళ్ళు ప్రతి బుధవారం అమ్మ వాటిని కోసి బంతి ఆకులే మధ్య మధ్య వేసి దండలు కట్టి అన్ని దేవుడు పటాలకూ వేసేది. అమ్మ చాలా బాగా మాలలు కడుతుంది .అదీ ఎడం చేత్తో. నాకు కుడి చేత్తో కూడా సరిగ్గా కట్టడం రాదు. నాకు రాని ఏకైక పని అది ఒక్కటే..:(( మొన్న శ్రావణ శుక్రవారం బోలెడు పువ్వులు కొనుక్కొచ్చి, ఏదో ఎమోషన్ లో మాల కడదామని తెగ ప్రయత్నించాను. నాలుగు పువ్వుకు కట్టగానే తయారైన వంకర టింకర మాల చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్న శ్రీవారిని చూసి ఇక కట్టడం ఆపేసా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలివైనవాళ్ళకి అర్ధమైపోతుంది కదా..:))

పెళ్ళైయాకా మళ్ళీ బంతిమొక్కలు పెంచటం కుదరనేలేదు. అమ్మ కూడా మానేసింది వేసే చోటు లేక. ఇన్నేళ్ళ తరువాత బజార్లో మొన్నొకరోజు బంతినారు కనపడింది. మట్టినేల లేదు ఏం పెంచుతానులే అనుకున్నా కానీ మనసొప్పలేదు... ఒక్క కట్ట కొన్నాను. రెండు మూడు కుండీల్లో అవే వేసాను. అన్నీ నిలబడ్డాయి. ఇక పువ్వుల కోసం ఎదురుచూపులు...






11 comments:

SHANKAR.S said...

ఫస్ట్ ఫోటో అదిరిందండీ. ఎక్కడిది ఆ బంతి తోట? చూడ ముచ్చటగా ఉంది.
సాధారణం గా ఎన్ని రోజులు పడుతుంది కుండీలలో మొక్కలకి పూలు రావడానికి?

sunita said...

toepu rangu anTae?

లత said...

మీ గార్డెనింగ్ కబుర్లు చూస్తుంటే అర్జెంట్ గా మీలాగ ఇండిపెండెంట్ హౌస్ లోకి మారిపోయి మొక్కలు పెంచెయ్యలనిపిస్తోందండీ

మనసు పలికే said...

వావ్.. తృష్ణ గారూ.. ముందుగా చాలా చాలా థ్యాంక్స్ (పే.....ద్ద బంతిపూల మాలతో) ఙ్ఞాపకాల దొంతర్లని నిద్ర లేపి నా చిన్న నాటి రోజులకి ఇట్టే తీస్కెళ్ళిపోయినందుకు. బంతి మొక్కలతో ఎన్నెన్ని ఙ్ఞాపకాలని. ఇంటి పెరడులో వేసే మొక్కలు వాటికి పూచే పూలు ఒకెత్తైతే, మా బాబాయి మిరప చేలో వేసే మొక్కలు, పూలు మరొక ఎత్తు. ఎంత పెద్ద పెద్దగా పూచేవో...

ఇందు said...

అవునండీ చిన్నప్పుడు రేకులు వేస్తే చెట్లు ఎలా వస్తాయ్ అని తెగ ఆలొచించేదాన్నీ :))) బాగుంది టపా! అసలు పండగ రోజుల్లో ముఖ్యంగా ఈ శ్రావణమాసపు టైంలో బంతిపూల కళే వేరు అవుంటేనే పండగ అన్నట్టు ఉంటుంది నాకైతే!:)

విరిబోణి said...

bavunnai mee banthi poola kaburlu :)

హరే కృష్ణ said...

మొదటిఫోటో చాలా బావుంది తృష్ణ గారూ
నేటి కుండీలే రేపటి బంతి వృక్షాలు అవ్వాలని ఆశిస్తూ :)

తృష్ణ said...

@ శంకర్.ఎస్: హార్టికల్చర్ ఎగ్జిబిషన్ లో తీసినదండీ..నెలలఒ పువ్వులు వచ్చేస్తాయండి. ఇప్పుడు పువ్వులు ఉన్న కుండీలు అమ్మేస్తున్నారండి నర్సరీల్లో. మీౠ హాయిగా ఆల్రెడీ పువ్వులున్న కుండీ కొనేసుకోండీ. ధన్యవాదాలు.

@sunita: తోపు అంటే "మరూన్" కలర్ అండీ. ఈ క్రింద లింక్ లో నేను చెప్పిన కారబ్బంతి పూలు చూడొచ్చు మీరు..
http://www.flowers.vg/flowers/marigold01.htm

ధన్యవాదాలు.

తృష్ణ said...

@ లత: అంత ఉత్సాహపడిపోకండీ..పీత కష్టాలు పీతవన్నట్లు..ఇండిపెండెంట్ ఇంటికి కూడా కష్టాలు ఉన్నయండోయ్..మొదట్లో మన బ్లాగ్మిత్రులు చెప్తే ఏమో అనుకున్నా..:))
ధన్యవాదాలు.

@ మనసుపలికే: అవును కదాండీ.. కొన్నిసార్లు బాగా పెద్ద పువ్వులు పూస్తాయి.
మీ ఙ్ఞాపకాల గురించి కూడా రాయండి మరి ..ధన్యవాదాలు.

తృష్ణ said...

@ ఇందు: నాకూ అదే డౌట్ చిన్నప్పుడు..:) గుమ్మానికి బంటి పువ్వుల మాల కట్టకపోతే పండగలాగే అనిపించదు నాకు.
ధన్యవాదాలు.

@ విరిబోణి: ధన్యవాదాలు.

@ హరేకృష్ణ: :)) ధన్యవాదాలు.

Ennela said...

భలే బాగుందండీ టపా... ఇక్కడ బంతి చెట్లు కనబడ్డప్పుడు చూసి నేను సంబర పడుతుంటే మా పిల్లలకి ఎంత నవ్వొస్తుందో!!!