సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, April 23, 2011

తిలక్ గారి "నల్లజర్ల రోడ్డు"


నిన్న రాత్రి(21st) ఆకాశవాణి విజయవాడకేంద్రం నుండి 9.30p.mకి ప్రత్యేక త్రైమాసిక నాటకం ఒకటి ప్రసారం అయ్యింది. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి "నల్లజర్ల రోడ్డు" కథానికకు కందిమళ్ళ సాంబశివరావుగారు రేడియో అనుసరణ చేసారు. విజయవాడకేంద్రం సహాయ సంచాలకులు శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారిగారు ఈ నాటకాన్నినిర్వహించి, సమర్పించారు. నాటకం చాలా బాగుంది. కథను నాటకంగా మలచటం అంటే మరో సృష్టే. అది చాలా సమర్థవంతంగా చేసారు సాంబశివరావుగారు. 1964లో ఆంధ్రపత్రిక, ఉగాది సంచికలో ప్రచురితమైన కథ ఇది.

విచిత్రం ఏమిటంటే తిలక్ గారి కథల పుస్తకంలో నేను చదవకుండా వదిలేసిన కథలలో ఇదీ ఒకటి. నిన్న నాటకం విన్నాకా మళ్ళీ "తిలక్ కథలు" పుస్తకం వెతుక్కుని, పొద్దున్నుంచీ ఖాళీ దొరికినప్పుడల్లా ఈ కథను, అదివరకు చదవని మిగతా కథలను చదివాను. ఈ కథను అయితే ఇందాకా రెండవసారి మళ్ళీ చదివాను. 1964లో రాసిన ఈ కథలో అంతకు మునుపు పాతికేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన. కథ నాకు ఎంతగానో నచ్చింది. కథను చెప్పాలనిపించింది. కాస్తంత ప్రయత్నిస్తాను..

* * * * * * * * *

ఊరికి దూరంగా నల్లజర్ల అడవిలో ఒక తోట బంగ్లాలో "అవధాని" అనే ధనవంతుడైన ఆసామి తన చిన్ననాటి భయానక అనుభవాన్ని మిత్రులకు చెప్పటం మొదలుపెడతారు. కరంటు లేని ఆ చీకటి రాత్రిలో అవధాని చెప్పే కథను భయం భయంగా వింటూంటారు వారు.

తణుకులో టెన్నిస్ చాంపియన్ అయిన రామచంద్రం, కలప వ్యాపారి నాగభూషణం, పధ్ధెనిమిదేళ్ళ అతని మేనల్లుడు(కథ చెబుతున్న అవధాని) కలిసి ఏలూరు నుండి రాత్రి పదిగంటలు దాటాకా కారులో గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీదుగా తణుకు బయల్దేరతారు. తణుకు పదిహేను మైళ్ళ దూరంలో ఉందనగా నల్లజర్ల అడవి దగ్గర వాళ్ల కారు హటాత్తుగా ఆగిపోతుంది. సమయానికి కలక్టర్ గారింట్లో పెళ్ళికి వెళ్ళలేకపోతామేమో అన్న చిన్న అనుమానాన్ని అసలు అడవి దాటి బయటపడతామా అన్న ప్రాణభయం కప్పేస్తుంది. కాసేపటికి చీకట్లో ఆడవంతా భయంకరంగా కనబడుతుంది వాళ్లకు. చెట్ల గుబుర్ల మధ్య నుండి నేల జారుతున్న వెన్నెల కూడా భయపెట్టేట్లుగా ఉండటంతో భయం వాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తుంది.

ఆ చీకట్లో కారు బాగుచేయటానికి దిగిన రామచంద్రాన్ని ఒక పాము కాటువేస్తుంది. గిలగిల్లాడుతూ మృత్యువుకు అతి చేరువౌతాడు అతడు. అర్ధరాత్రిపూట ఆ చీకటి అడవిలో పాము కాటుకు గురైన రామచంద్రాన్ని ఎం చేయాలో తెలియక బెదిరిపోయి భయంతో వణికిపోతూంటారు నాగభూషణం, అతని మేనల్లుడు.

ఇంతలో అటుగా వచ్చిన సిధ్ధయ్య అనే పాములవాడు వీరిపై జాలి తలచి తన పాకకు తీసుకువెళ్తాడు. కానీ రామచంద్రానికి మంత్రం వేసేప్పుడు కావాల్సిన వేరుముక్క లేదని నిరుత్సాహపడతాడు. వయసుమళ్ళిన మీదట తనకు చూపు ఆనటం లేదని లేకపోతే ఆ చీకట్లో వెళ్ళి వేరు తెచ్చేవాడినని చెప్తాడు. చివరి ఘడియల్లో ఉన్న రామచంద్రాన్ని అలా వదిలేయలేక వేరు కోసం తాను వెళ్తానని బయల్దేరుతుంది సిధ్ధయ్య కుమార్తె సూరీడు. ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం భయానకమైన అడవిలోకి..చీకట్లో ఒంటరిగా వెళ్తున్న గర్భవతైన కుమార్తెను ఆపలేక నిస్సహాయంగా చూస్తూండిపోతాడు సిధ్ధయ్య.

సూరీడు వెనకకు వస్తుందా? రామచంద్రం ప్రాణాలు దక్కుతాయా? వారు తిరిగి ప్రయాణమవ్వగలుగుతారా? చివరికి ఈ కథానిక ఎటువంటి అనూహ్యమైన మలుపు తిరుగుతుంది? అన్నది మిగిలిన కథ. కథానిక ముగింపు చాలా భారమైనది. మనుషుల్లో మానవత్వం ఏ మాత్రం మిగిలుందో, దానికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలిపే కథ ఇది. ఉత్కంఠభరితమైన ఈ కథలో కథనం, కొన్ని వర్ణనలు, వాక్యాలు నిజంగా కట్టిపడేస్తాయి. కవిగానే కాక కథకులుగా కూడా తిలక్ గారు మనల్ని ఆకట్టేసుకుంటారు. సమాజానికీ, కట్టుబాట్లకూ లోబడకుండా తన ఇష్టానుసారంగా జీవనాన్ని సాగించే ధైర్యశాలిగా సూరీడు, ఆమెను సమర్ధించే తండ్రిగా సిధ్ధయ్య గుర్తుండిపోతారు.

కథలో నన్నాకట్టుకున్న కొన్ని వాక్యాలు:
* హృదయమూ, చమత్కారమూ, ఆలోచనా ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా, విరుధ్ధంగా బాగా డబ్బున్నవాడు.

*అతని భార్యనెక్కువ ప్రేమిస్తాడో, భార్యపేర అతని తండి రాసి ఇచ్చిన ముఫ్ఫైనాలుగెకరాలనూ ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక తేలక జిజ్ఞాసువులు చాలా మంది బాధపడేవారు పాపం.

* ఇటువంటి భోగట్టా నాకూ సరిగ్గా తెలియదు. మా ఆవిడకి తప్ప.

* ...ఈ తీవ్ర వేగానికి తట్టుకోలేక మనుష్యులు, సమాజమూ తమ చుట్టూ గోడలను కట్టుకుని లోపల దాక్కుంటారు. దేశానికేదో కీడు మూడిందని గోల పెడతారు..."

*..ఇప్పుడు రోడ్లు, టెలిగ్రాఫు తీగలు, పోలీసులు అన్నీ వచ్చి దొంగల్ని, కౄరమృగాల్ని నాశనం చేశాయి. వాటితో పాటూ వీరవరులూ, స్వధర్మనిరతులూ కూడా మాయమైపోయారు.

* చావుకన్నా దాన్ని గురించిన భయం భరింపలేనిది.

* ఆ నిమిషంలో స్వార్ధం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలూ అన్నీ ఆ ప్రాధమిక స్వార్ధానికి అంతరాయాన్ని కలిగించనంత వరకే. ప్రతి మనిషీ లోపల్లోపల ఒక పాము !

* రాత్రిపడిన బాధ, భయమూ పీడకలేమో అనిపించినట్టుంది......మామూలు పెద్దమనిషీ, శ్రీమంతుడూ, టెన్నిస్ ఛాంపియనూ అయిపోయాడు.

*** *** ***

కథ చదవటం అయిపోయాకా "ఏరు దాటాకా తెప్ప తగలేసినట్లు.." అన్న సామెత గుర్తుకువచ్చింది. పదిహేనొవ శతాబ్దంలో షేక్స్పియర్ రాసినా, ముఫ్ఫై ఐదేళ్ల క్రితం తిలక్ గారు రాసినా, ఇరవైయ్యోకటవ శతాబ్దంలో మరెవరు రాసినా మనుషుల స్వార్థ మనస్థత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయన్నమాట అని మరోసారి అనిపించింది.

12 comments:

Bhãskar Rãmarãju said...

http://koumudi.net/Monthly/2009/december/dec_2009_anaganagaOmanchikatha.pdf
నల్లజర్ల రోడ్డు కథ పై లికంకులో

SHANKAR.S said...

తిలక్ గారి కధల్లో నాకు బాగా నచ్చిన కథండీ ఇది. ఇందులో అడవిలో వెన్నెలని ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా పోలుస్తూ (ఒక సారి కాష్ట భస్మం లా ఉంది అని, మరోసారి మృత్యుదేవత నవ్వులా బూడిద రంగు వెన్నెల, ఆకుల మధ్య నుంచి కొంచం కొంచం వెన్నెల నేలమీదకు జారి వందలకొద్దీ కట్లపాములు, కొండచిలువలు పాకుతున్నట్లుగా ఉంది అని ఇలా) ఆ పాత్రల మనస్తత్వాన్ని వెన్నెల్లో ప్రతిఫలింపచేయడం నాకు నచ్చింది.

కథ చివర్లో సూరీడు ఏడుస్తూ రక్షించమని వాళ్ళని అడిగినప్పుడు పాపం అనిపిస్తుంది. ముగింపు చదివిన తరువాత చాలా సేపు (ఇంకా చెప్పాలంటే చాలా రోజులు) ఆ కథ తాలూకా ప్రభావం నుంచి బయటపడటం కష్టం.

తృష్ణ said...

భాస్కర్ గారూ, Thanks for the link. కానీ బ్లాగుల్లో నవలలయిన, కథల గురించి ప్రస్తావించినప్పుడు సస్పెన్స్ ఉంచాలంటారు కదా? లింక్ ఇచ్చి మరది బ్రేక్ చేసేసారే? వ్యాఖ్యలు మరి ప్రచురించకుండా ఎలా? అందుకని నేనూ ప్రచురించేసాను...:)

@శంకర్: పుస్తకంలోని అన్ని కథల్లోకీ నాకూ ఇది ప్రత్యేకం అనిపించిందండి. మీరు ప్రస్తావించినట్లు కొన్ని పదప్రయోగాలు చాలా బాగున్నాయి. అవి రాయాలని మనసు కొట్టుకుంది కానీ టపా నిడివి ఇంకా పెరిగిపోతుందనే ఇక ప్రస్తావించలేదు. "రోడ్డు రాక్షస సీమంతం లాగ ఉంది" అంటారు ఒకచోట. భలే ప్రయోగం !
మంచి పాయింట్ చెప్పారు. ధన్యవాదాలు.

Sujata M said...

తృష్ణ గారు,

ఇలాంటిదే, చలం కధ ఒకటి ఉంటుంది. బొబ్బిలి యుద్ధం బాక్ గ్రౌండ్ లో. పేరు గుర్తులేదు. కొందరు బొబ్బిలి ప్రజలు ఒక బండి లో ఊరొదిలి పారిపోతుంటారు. వారిలో ఒక దేశభక్తురాలైన వ్యభిచారిణి వుంటుంది... తనని ఇస్తే, ఈ గుంపు ని వొదుల్తామని గెలిచిన ంలేచ్చ్చుల (బహుశా ఫ్రెంచ్) సేనాధిపతి అడ్డు తగులుతాడు. ఆవిడ ససేమిరా ఒప్పుకోకపోయినా, సెంటిమెంటు తో మభ్యపెట్టి, ఆవిడ్ని బలి ఇచ్చి స్వతంత్రులవుతారు మిగిలిన జనం. కుల వ్యవస్థ పైనా, హిపోక్రసీ పైనా చలం టేకింగ్ అసమాన్యం ఇందులో. నాకు కధ అంతా లీలగా గుర్తు ఉంది గానీ మళ్ళీ పేరూ అదీ వెతుక్కోవడానికి ఆ పుస్తకం పోయింది. మీకు గుర్తు వుంటే చెప్తారా ?

తృష్ణ said...

@sujata: ...:(
have to find out.

malli said...

ఎంత సంతోషమైందో....
హారంలో...నల్లజర్ల రోడ్డు అన్న అక్షరాలు కనపడగానే వచ్చేసి టకటకా చదివాను.
ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు.డిగ్రీ లో ఉన్నపుడు ఈ కధ లో దొరికిన అనుభూతిని ప్రత్యక్షంగా అనుభవించడానికి ...
ఫ్రెండ్స్ అందరం కలిసి నల్లజర్ల రోడ్డు మీద బస్ ఆపించి దిగి మరీ చక్కర్లు కొట్టాం...(పగలే...ఏం చేస్తాం మరి....?)
మీ బ్లాగ్ బావుంది..
మల్లీశ్వరి.

malli said...

ఎంత సంతోషమైందో....
హారంలో...నల్లజర్ల రోడ్డు అన్న అక్షరాలు కనపడగానే వచ్చేసి టకటకా చదివాను.
ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు.డిగ్రీ లో ఉన్నపుడు ఈ కధ లో దొరికిన అనుభూతిని ప్రత్యక్షంగా అనుభవించడానికి ...
ఫ్రెండ్స్ అందరం కలిసి నల్లజర్ల రోడ్డు మీద బస్ ఆపించి దిగి మరీ చక్కర్లు కొట్టాం...(పగలే...ఏం చేస్తాం మరి....?)
మీ బ్లాగ్ బావుంది..
మల్లీశ్వరి.

మరువం ఉష said...

@తృష్ణ సెలవురోజున ఉదయాన్నే మంచి కథ చదివించారు. థాంక్స్.

@సుజాత, మీరడిగినది నాకు సుమారుగా తెలుస్తుంది. తప్పక వెనక్కి వస్తాను నిక్కచ్చిగా తెలిసాక.

Jyothi said...

Chala chala bagundandi Trushna garu, thanks for sharing the story with us

కొత్త పాళీ said...

గొప్ప కథని గుర్తు చేశారు.
It is one of his best.
పైన మల్లి గారు చెప్పినట్టు, ఒకసారి విజయవాడనించి రాజమహేంద్రి జీపులో వెళ్తూ దార్లో నల్లజర్ల అని బోర్డు కనబడగానే, అక్కడ సెంటర్లో దిగి, బడ్డికొట్లో ఒక టీ తాగి, కాసేపు తిలక్‌ని తల్చుకుంటూ అటూ ఇటూ పచార్లు చేసి, తోటివాళ్ళు కోప్పడ్డంతో ఇంక బయల్దేరి పోయాను. సుజాత గారు చెప్పిన చలం కథ కూడా గొప్పగా ఉంటుంది.

తృష్ణ said...

@మల్లి: భలే. నాకు ఆ రోడ్డులోకి వెళ్లాలని అనిపించిందండి కథ చదివాకా.
బ్లాగ్ నచ్చినందుకు + వ్యాఖ్యలూ ధన్యవాదాలు.

@ఉష: చాలా సంతోషం. ఆ కథ గురించి ఎవర్నీ అడగలేదింకా. అడిగి రాద్దామని అనుకుంటున్నాను. మీకీలోపు తెలిస్తే చెప్పండి. ధన్యవాదాలు.

తృష్ణ said...

@jyothi: ధన్యవాదాలు.

@కొత్తపాళీ: ఆ రోడ్డు చూడ్డం కోసమైనా అటువెళ్లాలనిపిస్తోంది. వేటూరి గారు రాసిన నవల చదివాకా కూడా అలానే 'సాగర్' ప్రాంతానికి వెళ్ళాలని అనిపిస్తుంది. చలంగారి కథ పేరు రాయాల్సిండి కదండీ..
ధన్యవాదాలు.