సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, January 19, 2011

వెన్నెల్లో వాకింగ్...


భోజనమయ్యాకా పది నిమిషాలు వాకింగ్ చేద్దామని బయటకు వచ్చా...లైట్ వెయ్యకుండానే సందంతా పరుచుకున్న తెల్లని వెన్నెల రారమ్మని పిలిచింది. చెవుల్లో ఇయర్ ఫోన్స్ తగిలించుకుని నడవటం మొదలెట్టాను. మెట్ల మీద కూడా వెన్నెలే. చిన్నప్పుడు నేర్చుకున్న లలితగీతం ఒకటి గుర్తుకొచ్చింది. అందులో "వెన్నెలలో వెండి మెట్ల దారురలో రావా...ఈ పుల బాటసారి మదిని వసంతమై పోవా.." అనే వాక్యం గుర్తుకొచ్చింది ఈ మెట్ల మీద పరుచుకున్న వెన్నెలను చూడగానే. ఇలాంటి వెన్నెల నిండిన మెట్లను చూసే రాసి ఉంటారు రచయిత అనుకున్నా. చలి తగ్గిపోయింది అప్పుడే. స్వెట్టర్ అవసరం అనిపించలేదు.


ఎఫ్.ఎమ్ ఛానల్స్ తిప్పుతూ నడుస్తున్నా. "వయ్యారి గోదారమ్మా..." మొదలైంది.. బాలు నవ్వుతో. ఆహా...అనుకున్నా.
"వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం?
కడలి ఒడిలో కలిసిపొతే కల వరం ! "
వేటూరిగారి మాట విరుపులో కూడా విరహమే.


"నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగా
మువ్వగోపాలుని రాధిక
ఆకాశవీణ గీతాలలోనా
ఆలాపనై నే కరిగిపొనా..."
వేటూరి గారి కలం లోంచి ఒలికిన ఆణిముత్యాల్లో ఇదీ ఒకటి. ఏం సాహిత్యం రాసారో కదా అనుకున్నా. కొన్ని పాటలు అదివరకు చాలా సార్లు విన్నవే అయినా , చాలారోజుల తరువాత మరోసారి విన్నప్పుడు కొత్తగా అనిపిస్తాయి. పాట అయిపోయింది. వెంఠనే మరొ వేటూరి గీతం మొదలైంది. ఇది ఇంకా బాగుంటుంది..


సా...నిసరి సా..నీ....మొదలైంది. "అన్వేషణ"లో "కీరవాణి " పాట..


"ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా.."


...నీ కన్నూలా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై.."
ఏం రాసారు...తిరుగుందా ఈ సాహిత్యానికి? కొత్త సినిమాల్లో ఇలాంటి పాటలేవీ? ఈ సాహిత్యం ఒక ఎత్తైతే, వీటికి ఇళయరాజా సంగీతం మరో ఎత్తు. రెండు పాటలకీ అద్భుతమైన సంగీతాన్ని అందించి ఇన్నాళ్ళ తరువాత కూడా వింటూంటే మైమరచిపోయేలా చేయటం ఆయనకే సొంతం. అప్పటి గోల్డెన్ ఇరా లో ఆయన అందించిన బాణీలన్నీ ఇలాంటివే. అతి చెత్త మూడ్ లో ఉన్నా కూడా స్టార్టింగ్ హమ్మింగో, ట్యూనో వినగానే అప్రయత్నంగా గొంతు కలిపేస్తాం పల్లవితో..! అలాంటి ట్యూన్స్ ఇళయరాజావి.


ఆలోచనలు నడుస్తూండగానే మరో రెండు పాటలు అయిపోయాయి. పది నిమిషాలనుకున్న నడక కాస్తా అరగంట దాటింది. ఇక ఈపూటకు చాల్లెమ్మని ఇంట్లోకి వచ్చేసా. వస్తూనే నా వెన్నెల్లో వాకింగ్ నీ, ఆలోచనల్ని ఇలా టపాయించేసా...

16 comments:

Afsar said...

trishna:

chaalaa goppa paata. mallee gurtu chesinanduku thanks.

avunu, aa saahitya viluva ippudu paatallo ledu. paata nadaka maarindi, adi ippudu parugu teeyaali kadaa!

afsar

శరత్ కాలమ్ said...

టపా బావుందీ, టైటిలూ బావుందీ.

మైత్రేయి said...

అవునండీ, నిన్న చందమామ మన అదరాబదరా హైదరాబాదుని అలరించాడు. ఎంత పెద్ద చందమామో! నేనూ ఆఫీసునుండి ఇంటికివస్తూ చల్లనివెన్నెలను ఆస్వాదించాను. కెబీఆర్ పార్క్ దగ్గర నెమళ్ళుకూడా కొండలెక్కి చూస్తున్నాయి.
ఇప్పటి కవులు ప్రకృతికి దగ్గరగా ఉండరు కదా మనలాగే సిటీల్లో ఉంటే ఏమి రాయగలుగుతారు? వేటూరిగారు పాటలు రాయటానికి పల్లెటూర్లకు, విహార ప్రదేశాలకు వెళ్ళేవాళ్ళని విన్నాను.
Thanks for sharing your happiness with us so beautifully.

పరిమళం said...

ఇప్పుడే సత్యవతిగారి బ్లాగ్ చూసి వస్తున్నా...వెన్నెలని ఆస్వాదించినవారిని చూస్తె భలే కుళ్ళుగా ఉంది.నాకా అవకాశం రాలేదు మరి త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల :( :(

మనసు పలికే said...

తృష్ణ గారు, ఎంత హాయిగా మీ టపా చదువుతూ ఉంటే.. నేను కూడా అలా వెన్నెల్లో వేటూరి గారి సాహిత్యం ఇళయరాజా గారి సంగీతంతో కలిపి వింటూ నడుస్తున్నట్లుగా ఉంది. చాలా బాగుంది:)

కృష్ణప్రియ said...

టపా బాగుంది! వయ్యారి గోదారమ్మా..." .. ఏ సినిమా ?

జయ said...

నాక్కూడా రోజూ వాకింగ్ కి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అంతా మరచిపోయి ఆ మ్యూజిక్ లో మునిగి పోయె అలవాటు చాలానే ఉంది. నిన్నటి వెన్నెల ఇంకా చాలా బాగుంది. వెన్నెల్లోని అనుభూతి వర్ణించటం నాతరమైతే కాదు. చాలా మంచిపాటలు కదూ అవన్ని.

తృష్ణ said...

@krishnapriya: vamsi teesina "preminchu pellaDu" movie andi.bhanupriya,raajendra prasad.

Bhãskar Rãmarãju said...

ఈ చైత్రవీణా ఝుంఝుం అని

నాకు బహు ఇష్టమైన పాట ఇది. ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి.

తృష్ణ గారూ చక్కటి టపా.

పండు said...

అలా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రాత్రిపూట నడిచేంత భద్రత మన రోడ్లమీద వుందా? వెనుకనుండి ఎవడన్నా వస్తున్నా తెలియదు, ఏదైనా వాహనం మీదకొస్తున్నా తెలియదు, అసలు ఏంజరుగుతుందో తెలియదు.. ఆలోచించండి

SHANKAR.S said...

వెన్నెల, వంశీ, వేటూరి, ఇళయరాజా .....ఏం కాంబినేషన్ అండీ బాబూ.....వీర లెవెల్లో ఎంజాయ్ చేసేసుంటారు.

మీ రేంజ్ లో కాకపోయినా నేనూ ఓ రెండు మూడు దోసిళ్ళ వెన్నెల తాగానోచ్ !!!!!!

ఇక వేటూరి గారి విషయానికొస్తే పదప్రయోగాలకి ఆయనకీ ఆయనే సాటి. నాకు సప్తపదిలో రేపల్లియ ఎద ఝల్లున పాట లో "ఆబాల గోపాల మాబాల గోపాలుని", "అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ" ప్రయోగం భలే ఇష్టం.

తృష్ణ said...

@అఫ్సర్:
@శరత్ ’కాలమ్’:
@మైత్రేయి:
@పరిమళం:
@మనసుపలికే:
@కృష్ణప్రియ:
@జయ:
@భాస్కర్ రామరాజు:
@పండు:
@శంకర్.ఎస్:
వ్యాఖ్యలందించిన బ్లాగ్మిత్రులందరికీ ధన్యవాదాలు.

తృష్ణ said...

@పండు: రాత్రిపూట రోడ్డు మీద ఒక్కదాన్ని వాకింగా? అమ్మో...! "సందులో.." అని టపాలో రాసానండి. బహుశా "మా ఇంటి ఆవరణలోని సందులో.." అని రాయాల్సిందేమో.

@శంకర్.ఎస్: అవునండి ఆ పాట బాగుంటుంది. "సప్తపది"లో పాటల గురించి చెప్పాలంటే నాకు "ఏ కులము నీదంటే.."పాట సాహిత్యం చాలా నచ్చుతుందండీ.

Hima bindu said...

బాగుందండీ టపా.అప్పుడెప్పుడో "నెమలికన్ను మురళి "రాసిన పోస్ట్'వెన్నెల్లో వేడిపాలు'గుర్తొచ్చిందిఆ పోస్ట్ నాకు చాల నచ్చిన పోస్ట్ .

తృష్ణ said...

@చిన్ని: వాకింగ్ చేసొచ్చి నేను పోస్ట్ రాసి మళ్ళీ చదువుకుంటూంటే నాకూ అదే టపా గుర్తుకొచ్చిందండి. ఆయన జానకి పాటల గురించి రాసిన గుర్తు.. ఎటొచ్చీ నేను విన్నది ఎఫ్.ఎం రేడియో పాటలు.నడిచింది మా ఇంటి వెన్నెల నిండిన సందులో..!

Ennela said...

chaala baagundi...naaku kuda aa paatalu chaala istam...memu ikkada anta frequentgaa vennela choodalemandee..climate sahakarinchadu....