Wednesday, January 12, 2011

గాలిపటాలుఊరినిండా అడుగడుగునా అమ్మకానికి పెట్టిన గాలిపటాలను చూస్తూంటే "స్నేహం" సినిమాలోని "ఎగరేసిన గాలిపటాలు"పాట గుర్తుకు వచ్చింది.ఆ పాటలోని కొన్ని వాక్యాలు...

"ఎగరేసిన గాలిపటాలు...
దసరాలో పువ్వుల బాణం..
దీపావళి బాణా సంచా..
నులివెచ్చని భోగిమంటా..

చిన్ననాటి ఆనవాళ్ళు
స్నేహంలో మైలురాళ్ళు
చిన్నప్పటి ఆనందాలు
చిగురించిన మందారాలు...."

పి.బి.శ్రీనివాస్ పాడిన ఈ పాట ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలని తట్టిలేపుతుంది. నాకు గాలిపటాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా ఇంటిపక్కన ఉండే మా కన్నా పెద్ద పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూంటే అదేదో 8th wonder లాగ చూసేవాళ్ళం. అసలు నలుపలకలుగా ఉన్న ఆ కాగితం అలా గాల్లో అంత ఎత్తుకి ఎలా వెళ్తుంది అని ఆశ్చర్యం కలిగేది. ఎగరేస్తు దూరంగా ఉన్న గాలిపటాలతో పోటీ పడటం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు గాలిపటాలను ఇంకా ఇంకా ఎత్తుకు ఎగరేసుకోవటాలు, పడగొట్టడాలూ భలేగా ఉండేది. మధ్య మధ్య ఆ పిల్లలు దారం పట్టుకొమ్మని చెప్పి ఏదో పని మీద వెళ్ళివచ్చేవారు. మహాప్రసాదం లాగ ఆ దారన్ని అతి జాగ్రత్తగా పట్టుకుని, ఆ గాలిపటం దగ్గర్లో ఎగిరే మరే గాలిపటానికీ చిక్కకుండా వెళ్ళినవాళ్ళు వచ్చేదాకా కాసేపన్నా గాలిపటాన్ని ఎగరవేయటం గొప్ప థ్రిల్ గా ఉండేది. అలా కాసేపు గాలిపటాన్ని పట్టుకోవటం కోసం పెద్దపిల్లలందరూ గాలిపటం ఎగరేస్తున్నంత సేపూ అక్కడే నిలబడి చూస్తూ ఉండేవాళ్ళం..ఓ సారివ్వవా? అని అడుగుతూ...అదో మధురమైన జ్ఞాపకం.

గాలిపటం ఎగరేయటం నేర్పమంటే, "చిన్నపిల్లలు మీకు రాదు" అనేసేవారు వాళ్ళు. ఉక్రోషం వచ్చి నేనూ,మా తమ్ముడూ కలిసి గాలిపటం కొనుక్కొచ్చి మేడ మీదకి వెళ్ళి, ఒకళ్ళం దారాన్ని పట్టుకుంటే ఒకళ్ళం గాలిపటం పట్టుకుని దూరంగా పరిగెత్తుకువెళ్ళి దాన్ని ఎగరేయటానికి ప్రయత్నించేవాళ్ళం. కాస్త ఎగిరేది. క్రింద పడిపోయేది. కొన్ని కాస్త దూరం ఎగిరి ఏ చెట్టు కొమ్మకో చిక్కుకుని చిరిగిపోయేవి. అలా గాలిపటాన్ని ఎగరేయాలన్న కోరిక కోరికలాగే ఉండిపోయింది. అన్నయ్యకూ ,తమ్ముడికీ కూడా రాదు ఇప్పటికీ. పెళ్ళయ్యాకా మావారు, మా మరిది ఇద్దరూ గాలిపటాలు ఎగురవేయటంలో ఎక్స్పర్టులు అని తెలిసి చాలా సంతోషించాను. ఇంట్లో పాత సామానుల్లో గాలిపటాల దారాలు అవీ చూసి సంబరపడిపోయేదాన్ని. కానీ కొన్ని కారణాలవల్ల చాలా ఏళ్ళు గాలిపటాలు ఎగరేయటం మాకు కుదరనే లేదు. క్రితం ఏడు మా పాప వీధుల్లో అమ్ముతున్న గాలిపటాలను చూసి కావాలని మారాం చేసింది. కొనిపెట్టాం. వాళ్ళిద్దరూ మేడ మీదకు వెళ్ళి ఎగరేసుకుని వచ్చారు. కానీ ఏవో పనుల్లో ఉండి నాకు వెళ్ళి చూడటం కుదరనేలేదు. పనయ్యి నేను పైకి వెళ్దామని బయల్దేరేలోపూ వాళ్ళు క్రిందకు వచ్చేసారు.

ఈసారి మళ్ళీ పాప గాలిపటాలు కొనమని గొడవచేస్తూంటే ఈ చిన్నప్పటి ఊసులన్నీ గుర్తుకొచ్చాయి. ఈసారి ఏమైనాసరే గాలిపటాన్ని స్వయంగా ఎగరేయాలని పట్టుదలగా ఉంది. మరి ఏమౌతుందో చూడాలి..
ప్రతి ఏడూ గుజరాత్ లో ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈసారి కూడా 21st ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ ఈ నెల తొమ్మిది నుండీ ఇవాళ్టివరకూ జరిగింది. గుజరాత్ అంతా టూరిస్ట్ లతో మహా సందడిగా ఉంటుంది ఈ సమయంలో. ఒక కైట్స్ ఫెస్టివల్ తాలూకూ క్లిప్పింగ్ చూడండి...రకరకాల గాలిపటాలు భలే అందంగా ఉన్నాయి ఈ వీడియోలో.2010 లో జరిగిన 20th kites festival తాలూకూ వీడియో లింక్:
http://www.youtube.com/watch?v=6eWny8zBa8s&feature=fvw.


11 comments:

SHANKAR.S said...

చిన్నప్పుడు రెడీమేడ్ గాలిపటాలు కొనుక్కోడం కంటే ఇంటిదగ్గర పిల్లలంతా కలిసి చీపురు పుల్లలు(ఒకటి రెండు ఈనెల చీపుర్లు ఈ వంకతో మాయం అయిపోయేవి), దారపుండలు, మామూలు న్యూస్ పేపర్లతో పాటు రంగురంగుల కాగితాలు కలిపి స్వంతం గా గాలిపటాలు చేసుకోవడం వాటిని అంతా ఒకే మేడ మీదకి చేరి ఓ పక్క మెడ నొప్పెడుతున్నా, అంత ఎండలో ఆకాశం లో చూడడానికి కళ్ళు లాగుతున్నా తదేక ధ్యాసతో ఇంట్లో వాళ్ళు తిట్టే దాకా ఎగరేయడం. చెట్టు కొమ్మల్లోనూ, కరెంట్ వైర్ల మీద ఏదయినా చిక్కుకుంటే దాన్ని తీసే ప్రయత్నం చేయకుండా వెంటనే తయారు చేసుకున్న స్పేర్ గాలిపటం తో మళ్ళీ రెడీ అయిపోయేవాళ్ళం.

అసలు పోటీ దాటుకుని పైపైకి ఎదగాలన్న సూత్రాన్ని, మనసు ఎంత అడ్డదిడ్డం గా ఎగిరినా దాని కంట్రోల్ మన చేతుల్లో ఉన్నంత వరకు పరిస్థితి మన చేయి దాటిపోదనే సత్యాన్ని ఈ గాలిపటం చెబుతుందేమో అనిపిస్తుంది.

అన్నట్టు మర్చిపోయా స్నేహం సినిమా ఎక్కడ దొరుకుతుందండీ? ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను. అన్నట్టది రాజేంద్రప్రసాద్ ఫస్ట్ సినిమాట కూడా కదా

Ennela said...

అరెరె, నా దగ్గరకొచ్చెయ్యండీ నెను నేర్పుతాగా...
మా అత్తవారింట్లో అందరూ గాలిపటాలు ఎగరేసేవారే.లేడీస్ ఎగరెయ్యకూడదు కదా(??) అందుకని ఓన్లీ చక్రీ(ఇలా అంటే మా ఇంట్లో నవ్వుతారు,,వాళ్ళు చర్కా అంటారుట) పట్టుకోడానికి మాత్రం నన్ను పిలిచేవారు తమ్ముళ్ళందరూ(మా వారి తమ్ముళ్ళు).మా వారు అలా తమ్ముళ్ళని నన్ను చూసుకుని 'ఒచ్చిందిరా తెలంగాణా పోరీ అని మురుసుకునే వారు..(మెచ్చుకోలో, తిట్టో ఇప్పటికీ తెలియదనుకొండీ...కానీ గుర్తొస్తే భలే ఉంటుంది..)... మంచి సీను గుర్తు చేసినందుకు మీకు...బోల్డు థాంక్స్లు.

గీతాచార్య said...

ఏరోడైనమిక్స్ తెలుసుకునేందుకు గాలి పటాలు మంచి మార్గం. నాకు గాలిపటాలంటే లే ఇష్టం. ఆ గాలి పటాల సీన్ కోసమే ఏఎన్నార్, సావిత్రిల తోడికోడళ్ళు సినిమా అంతా ఓపిగ్గా చూశాను చిన్నప్పుడు. మళ్ళా ఎక్కడన్నా ఆ సీనొస్తుందేమో అని

జయ said...

చిన్నప్పుడే ఏముంది. ఇప్పటికీ గాలిపటాల అనుభవం ఉంది. కాకపోతే ఇప్పటికీ ఇంతేసంగతులు. నాకు డూప్ తప్పదు:) పాపని నెక్లెస్ రోడ్ తీసుకెళ్ళి చూపించండి. ఆ గాలిపటాలు చాలా బాగుంటాయి.

నిషిగంధ said...

మీ టపాతో నేను కూడా అలా అలా నా చిన్నతనంలోకి ఎగిరి వెళ్ళొచ్చాను, తృష్ణా! మా తమ్ముడు, వాడి ఫ్రెండ్స్ అందరూ మా ఇంట్లోనే గాలిపటాలు తయారు చేశేవాళ్ళు.. నన్నసలు చిటికిన వేలు కూడా పెట్టనిచ్చేవాళ్ళు కాదు.. ఎప్పుడన్నా ఆ జిగురు అయిపోతే అప్పటికప్పుడు కాస్త అన్నం వండటానికి మాత్రం నన్ను పిలిచేవాళ్ళు.. 'బాగా మెత్తగా వండక్కా' అని పైన ఆర్డర్స్! :-)

మీకూ, మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు :-)

SRRao said...

మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

శి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి _ శిరాకదంబం

తృష్ణ said...

@శంకర్.ఎస్: బావున్నాయండి మీ గాలిపటం కబుర్లు. అలానే మీరు చెప్పిన గాలిపటం నేర్పే సత్యం కూడా 100% కరక్ట్ అన్పించింది!
స్నేహం పాటలే నా దగ్గర ఉన్నాయి. సినిమా ఎక్కడ దొరుకుతుందో తెలీదండి.ఇప్పటిదాకా నేనూ చూడలేదండి.

తృష్ణ said...

@ఎన్నెల: లేడీస్ ఎగరెయ్యకూడదా..? తెలీదండీ...
కబుర్లు పంచుకున్నందుకు మీక్కూడా ధాంక్స్లు..:)

@గీతాచార్య: మరి ఈసారి ఎగరేసారా? గాలిపటాల మీద మరోపాట HDDCSలోనిది ఇక్కడ చూడొచ్చు
http://www.youtube.com/watch?v=A4g-Wpqe2EM

థాంక్యూ.

తృష్ణ said...

@జయ: ఈసారి మా ఇద్దరి సరదా బానే తీరిందిలెండి. నేనూ గాలిపటాల గురించిన పాఠాలు చాలానే నేర్చుకున్నా. ధన్యవాదాలు.

@నిషిగంధ: అవునాండి..భలే. మేము కూడా చిన్నప్పుడు తయారు చేసేవాళ్ళం. జిగురు మైదాతో చేసేవాళ్ళం. విషెస్ చెప్పినందుకు బోలెడు థాంక్స్లు.

తృష్ణ said...

@ఎస్.ఆర్.రావు: విషెస్ తెలిపినందుకు ధన్యవాదాలు రావు గారు. కానీ ఈసారి రైతుల పంటల నష్టాలు అవీ చూసి పండగ సరదా పోయిందండి.. అందుకే నా బ్లాగ్లోనూ, మరెందులోనూ ఎవరికీ శుభాకాంక్షలు తెలపలేకపోయాను.

Sasidhar Anne said...

innalu trushna gari blog kanapadaledu.. Anduke comments veyyaleka poyya.
post chadivi comment pedutha.