సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, December 29, 2011

"నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు" ఆడియో సీడీ రూపంలో



అలనాటి రేడియో నాటకాలకు ప్రాణమైన సుతిమెత్తని స్వరం ఆమెది. నాటకంలో ఆవిడ పాత్ర ఉన్నదంటే చెవులు రిక్కించుకుని నాటకం వినేవారు ఆమె ఆభిమానులు. నాటకం సాంఘికమైనా, పౌరాణికమైనా అందులోని పాత్ర కు అనుగుణంగా తన స్వరాన్ని మలుచుకోగల నిష్ణాతురాలు శారదా శ్రీనివాసన్ గారు. తనకు రేడియోతో గల అనుబంధాన్ని, ఎందరో ప్రముఖులతో పరిచయాలనూ, స్నేహాలనూ ఒక జ్ఞాపకాల మాలగా చేసి, ఇటీవల ఆరునెలల క్రితం శారదా శ్రీనివాసన్ గారు "నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు" పుస్తకం రచించారు. ఈ పుస్తకం ఎంతోమంది రేడియో అభిమానుల ప్రశంసలను అందుకుంది.




పలువురు బ్లాగ్మిత్రులు కూడా ఈ పుస్తక పరిచయాన్ని మనకందించారు. క్రింద ఉన్న linksలో ఆయా టపాలను చూడవచ్చు:
http://manishi-manasulomaata.blogspot.com/2011/07/blog-post.html

http://nemalikannu.blogspot.com/2011/09/blog-post_08.html



pustakam.net/?p=8205

pustakam.net/?p=8205




'సుధామధురం' బ్లాగర్, ప్రసిధ్ధ కవి, రచయిత, రిటైర్డ్ రేడియో కళాకారులు శ్రీ సుధామ గారు తమ టపాలో ఈ పుస్తక పరిచయానికి, శారదా శ్రీనివాసన్ గారిని గూర్చిన మరిన్ని మంచి కబుర్లను కూడా జతచేసారు.
sudhamadhuram.blogspot.com/2011/09/blog-post_11.html





ఇప్పుడు సరికొత్త విషయం ఏమిటంటే పలువురు మిత్రుల, అభిమానుల కోరికపై "నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు" పుస్తకం ఇప్పుడు సీడీ రూపంలో మన ముందుకు వచ్చింది. తన అనుభవాలను ఆవిడ స్వరంలోనే వినాలని, ముఖ్యంగా దూరదేశాలలో ఉన్న రేడియో అభిమానులు డ్రైవింగ్ చేసుకుంటూ కూడా వినేలాగ కావాలని పట్టుబట్టడంతో ఈ సీడీ రూపకల్పన త్వరత్వరగా జరిగింది. ఈ సీడీ మొన్న జరిగిన పుస్తక ప్రదర్శనలో SR communications ద్వారా వెలువడిందని తాజా వార్త. ఈ సంగతి శారదత్త(మా ఇంట్లో అందరం ఆవిడను అభిమానంగా అలా పిలుస్తాము) స్వయంగా ఫోన్ చేసి బ్లాగులో రాయమని చెప్పారు. నేను కూడా సీడి వినాల్సి ఉంది.


శారదా శ్రీనివాసన్ గారి మరో సీడీ వివరలు:


శారద గారి "నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు" పుస్తకానికి ముందుమాట రాసిన ప్రముఖుల్లో ఒకరు ప్రముఖ రచయిత "డా. పోరంకి దక్షిణామూర్తి" గారు. వారు రచించిన "ముత్యాల పందిరి" అనే నవలను పూర్తిగా శారదత్త స్వరం లో ఈ రెండవ సీడీలో వినవచ్చుట. ఈ నవల మొత్తం తెలంగాణా మాండలికంలో ఉంటుందిట. అయితే, ఈ సీడీ ఇంకా తయారీలో ఉందని సమాచారం.

Tuesday, December 27, 2011

దిగంతం


పుస్తకం మూసిన తరువాత కూడా ఆ అక్షరాలు మన వెనుకెనకే పెరిగెడుతుంటాయి
అచేతనమై మస్థిష్కంలో ఏ మూలో పడి ఉన్న అలోచనలు నిద్ర లేస్తాయి
వరుస క్రమంలో వెళ్ళే చీమకు తెలిసిన గమ్యమైనా నీకు తెలుసా అని నిలేస్తాయి
ఆ అక్షరాలు... పాఠకుడికి ఎక్కడ తగలాలో తెలిసిన వాడి చురకత్తులు


కాశీభట్ల వేణుగోపాల్ గారి "దిగంతం" నవల చదివాకా నా మనసులోంచి వచ్చిన వాక్యాలు అవి. ఇంతకు ముందు చదివిన "తపన" కన్నా ఇది నాకు బాగా నచ్చింది. సాధారాణంగా ఏ ఇతర రచనలోను కనబడని తెగువ, ధైర్యం వేణుగోపాల్ గారి రచలల్లో కనబడుతుంది. ఆలోచింపజేస్తుంది. ఒకోసారి భయపెడుతుంది. చదివిన ప్రతిసారి నేను ఆ అక్షరాల్లోని, వాక్యాల్లోని సృజనాత్మకతను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. వారి రచనలో కేవలం ఒక కథ మాత్రమే కాక అంతర్లీనంగా మరేదో... ప్రతికోణంలోనూ మరో కొత్త చిత్రంలా కనబడే ఒక abstract painting లా కనబడుతుంటుంది నాకు.

వేణుగోపాల్ గారి రచనల్లోని ఇతివృత్తం ఏదైనా, మనిషి ఆలోచనాపరంపరలోని అనావిష్కృత పార్శ్వాలను, మనిషిలోని వ్యతిరేక అంతర్భాగాన్ని తనదైన శైలిలో అక్షరీకరించటమే వీరి రచనల్లోని ముఖ్యోద్దేశమేమో అని మరోసారి బలంగా అనిపించింది. కొన్ని వాక్యాల్లో వేణుగోపాల్ గారు వాడే సంయుక్తాక్షరాలు (అంత అలవోకగా ఎలా వాడేస్తారో కానీ) చదవటానికి కష్టంగానే కాదు గమ్మత్తుగా కూడా ఉంటాయి. ఈ నవలలో కథానాయకుడి మాటల్లో తప్ప ఎక్కడా కనబడని అతని మూగ, అవిటి ముసలి తల్లి నాకు భలే నచ్చేసింది. చాలాచోట్ల అతను వర్ణించే ఆమె 'గాజుకళ్ల నిర్వికారమైన చూపు' నన్ను వెంటాడుతూనే ఉంది...ఇంకా...!


"దిగంతం" గురించి ఇంకేమీ రాయాలని నాకు అనిపించటంలేదు. నవలలో నాకు బాగా నచ్చిన కొన్ని వాక్యాలు :


 


" ఏ ముఖమూ లేని నేను నా ముందు పరిగెడుతున్నాను. ముఖమే లేని ఇంకో నేను... నన్నే తరుముతున్నాను."


"కోపం జ్ఞానాన్ని తొక్కి ముందుకు పోయింది."


"ఇళ్ళ చూరుల్లోంచీ పైకి లేచి రకరకాల ఆకారాలతో ఒళ్ళు విరుచుకుంటున్న పొగలూ...సర్రుసర్రుమని ఎప్పటికీ పోని దుమ్ముని ఊడుస్తూ ఆడవాళ్ళూ..."


"అన్నింటికీ...ఆ శూన్యం నిండిన చూపులే జవాబులు...! ఆమె మొహమ్మీద మడాతలన్నీ నాకు మూసేసిన పుస్తకాలు."


"జీవితం ఒక వ్యసనం...!
జీవించటానికి బానిసైనవాళ్ళే అంతా...!!
వ్యామోహవృక్షపు చిరు చిగురుకొమ్మలీ అలవాట్లు. "


"పగటి వెలుగులో గుర్తింపు దొరకని సామాజికులంతా ప్రవాస కాందిశీకుల్లాగా తరలిపొయే గుంపులో ఒకణ్ణైన నాకూ....ఓ ప్రవాసిక గుర్తింపు !"


"నేను కరెక్టు అయినా కాకపోయినా నా అభిప్రాయం మీద నాకు హక్కు ఉంటుంది కదా !"


"మనిషి మీదో మనిషికి కలిగే కృతజ్ఞత మోతాదు మిరితే బంధమై కూర్చుంటుందేమో...లేకపోతే ప్రతీది ఒక వ్యాపార సంబంధం కాదూ...?!"


"...కూరగిన్నెలో కాడ విరిగిన అల్యుమినియం గరిటే... కుంటికాలు అమ్మా ఒక్కలాగే ఉన్నారు.
ఇద్దరు సుఖాన్ని పంచేవాళ్ళే మరి."


"మనుషులు కూచునే చోట నాలుగు గోనెపట్టాల్తో గూడులా కట్టి ఉంది. ఓ ముసలి బిచ్చగత్తె తన సామాన్తో ఆ గూట్లో కాపురముంటోంది.
కాదేది ఆవాసానికి అనర్హం ఈ భారతదేశంలో...!"


"శ్రీరంగం ఎంతమంది బిచ్చగాళ్ళకి ఎన్ని పదిపైసలు నానేలు దానం చేసుంటాడు....? అడుక్కుతిఏ ముసల్దాని మీదో గొప్ప కవిత సృష్టించాడు."


"మనకు నచ్చని ప్రపంచాన్ని కూడా అలా వెనక్కి నెట్టేస్తూ మనకు నచ్చే లోకాల అంచులకు నడుచుకుంటూ మనం వెళ్లగలిగితే..."


"రకరకాల పుస్తకాల్లోంచి ఒక్కో పేజీ చించుకొచ్చి అన్నిటినీ కలిపి కుట్టిన పుస్తకం లాంటి మ్లిష్ట భావన... !"


"యే రోజుకారోజు ఒక జీవితాన్ని గడిపినట్లు గడిపేయటమేనా...?"


"దేన్నించీ యెవర్నించీ పారిపోయినా అలోచనల్నుంచి మనిషి పారిపోలేడు కదా....!"


"ఆయన చూసినట్లుగానే ప్రపంచం లో జనాలందరూ చూసుంటే...ఇన్ని వందల వేల కోట్ల రూపాయిల పువ్వులమ్ముడుపోతాయా రోజూ...?
అందుకే...అందరూ జంధ్యాలలు కాలేరు. ఆయనకు పుష్పవిలాపం...కోట్లాది జనాలకి పుష్పవిలాసం..."


"పరిపూర్ణమైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు...! సంపూర్ణత్వం ఓ మిధ్యాభావన మాత్రమే."


**** **** ****

ఈ నవల గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే భాను గారి "నేను-మీరు" బ్లాగ్లో ఇక్కడ చూడవచ్చు..

Tuesday, December 20, 2011

"The Power of your Subconscious mind"


ఒకోసారి మనం చదివిన పుస్తకాలనే మనం మర్చిపోతాం. అందులోంచి నేర్చుకున్న,గ్రహించిన మంచిని మనం విస్మరిస్తాం. మళ్ళీ ఎప్పుడో మనకి ఆ పుస్తకాలు కనబడ్డప్పుడు...అరే ఈ సంగతులన్నీ ఎలా మర్చిపోయాం... అనుకుంటాం. అలా నేను పూర్తిగా మర్చిపోయిన ఒక పుస్తకం Dr.Joseph murphy రాసిన "The Power of your Subconscious mind". పొద్దున్న కనబడింది. ఒక దశలో ఈ పుస్తకం నాకు ఎంతగానో ఉపయోగపడింది...ఇవాళ ఓసారి తిరగేస్తే నేనేనా ఇది చదివింది అని నాకే ఆశ్చర్యం వేసింది..! ముఖ్యమైన వాక్యాల దగ్గర ఫ్లవర్ మార్క్స్, పెన్సిల్ గీతలు పెట్టినది నేనేనా అనిపించింది..!! పదిహేనేళ్ల క్రితం ఒక ప్రొఫెసర్ గారు నాకు చదవమని చెప్తే కొనుక్కున్న రెండు పుస్తకాల్లో ఇదీ ఒకటి. రెండవది కూడా ఓసారి తిరగేయాలి..

ఈ పుస్తకంలో నేను మార్క్ చేసుకున్న కొన్ని వాక్యాలు:

Everything you find in your world of expression has been created by you in the inner world of your mind, whether consciously or unconsciously.

The first step is to make yourself aware of the hetero-suggestions that are operating on you. Unexamined, they can create behaviour patterns that cause failure in your personal and social life.

Remember, you have the capacity to choose. Choose life! Choose love! Choose health!


The suggestions and statements of others have no power to hurt you. You have the power to choose how you will react.


Believe in good fortune,Divine guidence, right action, and all the blessings of life.

... just as the water takes the shape of the pipe it flows through, the life principle in you flows through you according to the nature of your thoughts.


All frustration is due to unfulfilled desires. If you dwell on abstacles,delays, ansd difficulties, your subconcious mind responds accordingly, and you are blocking your own good.


Apply the power of prayer therapy in your life.Choose a certain plan, idea, or mental picture. unite mentally and emotionally eith that idea.A you remain faithful to your mental attitude, your prayer will be answered.


Scientists inform us that you build a new body every eleven months; so from a physical standpoint you are really only eleven months old. If you build defects beck into your body by thoughts of fear, anger, jealously, and ill will, you have no one to blame but yourself.


If you entertain thoughts that are not in accordance with the principle of harmony, these thoughts cling to you, harass you, worry you,and finally bring about disease... thoughts of fear, worry , anxiety, hatred....tend to destroy your nerves and glands - body tissue that controls the elimination of all waste marterial and keeps the organism in a state of purity.


IF you are full of fear about your future, you are also writing a blank check and attractive negative conditions to you.

Every morning as you awaken, deposit thoughts of prosperity, success,wealth, and peace.

when you place a seed i nthe ground, you donot dig it up again later in the day. You let it take root and grow.

Look at your fears; hold them up to the light of reason. Learn to laugh at your fears. That is the best medicine.Nothing can disturb you but your own thought. The suggestions, statements, or threats of other persons have no power. The power is within you, and when your thoughts are foccessed on that which is good, then God's power is with your thoughts of good.

Monday, December 19, 2011

ఈసారి పుస్తక ప్రదర్శన కబుర్లు





మా నాన్నగారు పుస్తకాలు బాగానే కొనేవారు కానీ పుస్తకాల మనిషి కాదు. ప్రముఖమైనవీ, తనకి ఆసక్తి ఉన్న పుస్తకాలు కొనేవారు. సాహితీమిత్రుల ద్వారా పరిచయమైన పుస్తకాలు కొన్ని, కొందరు బహుకరించినవి ఇంకొన్ని మా ఇంట్లో ఉండేవి. నాన్న లానే నాకూ మా ఇంట్లో ఉన్న పుస్తకాలతో తప్ప కొత్త పుస్తకాలతో పరిచయం తక్కువే. అందువల్ల సాహితీ లోకంతో నాకు పేద్ద పరిచయం ఏమీ లేదు. మా ఇంట్లో నే చూసిన... "అ నుండి ఱ" వరకూ అన్ని అక్షరాల నిఘంటువుల సిరీస్, చాలా వరకూ చలం రచనలు, శ్రీ శ్రీ పుస్తకాలు, శ్రీరమణ సాహితీ సర్వస్వం వాల్యూమ్స్, బాపు రమణల తాలుకూ పుస్తకాలు, సినిమాల నేపధ్యంలో ఉన్న కొన్ని పుస్తకాలు, కృష్ణశాస్త్రి గారి అన్ని పుస్తకాలు, టాగూర్ పుస్తకాలు, శరత్ సాహిత్యం అన్ని వాల్యూమ్స్, బాపిరాజు రచనలు, కొన్ని కవితా సంపుటిలు, కథా సంపుటిలు...మొదలైనవి మాత్రమే నాకు తెలిసిన పుస్తకాలు.

మర్క్ ట్వైన్, పి.జి.వుడ్ హౌస్, ఆర్.కె.నారాయణ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, డ్రాయింగ్ & పైంటింగ్ గురించిన ఆంగ్ల పుస్తకాలు చాల ఉండేవి చిన్నప్పుడు. కానీ ఒకసారి ఫైర్ ఏక్సిడెంట్ అయ్యి అవన్నీ కాలిపోయాయి. మళ్ళీ అవన్నీ ఇక కొనలేదు నాన్న. విజయవాడలో పుస్తకప్రదర్శన మొదలైన దగ్గర నుండీ దాదాపు 14 book festivals దాకా అన్నీ వదలకుండా చూసాను. తర్వాత ఇప్పుడు రెండేళ్ళ నుంచే మళ్ళీ పుస్తక ప్రదర్శన చూస్తున్నా, కొంటున్నా.

ఈసారి పుస్తక ప్రదర్శనలో నేను చూసిన కొన్ని మంచి పుస్తకాలు:

* "తూర్పుగోదావరి ప్రయాణం" అని మంచి మంచి ఫోటోలతో ఒక పుస్తకం ఉంది.(400/-) వాళ్ల వెబ్సైట్ కూడా ఉందిట http://www.egyatra.com అని. ఇటువంటి పుస్తకాలు అసలు ఆంధ్రాలో ఉన్న అన్ని ప్రదేశాల మీదా ఉంటే చాలా బావుంటుంది అనిపించింది.

* తెలుగు రచయిత్రులందరి పరిచయాలతో ఒక సంకలనం ఉంది. పేరు మర్చిపొయా కానీ అందులో అందరు స్త్రీ రచయిత్రుల పరిచయాలూ ఉన్నాయి.

* తాపీ ధర్మారావు గారు అనువదించిన "అన్నా కెరినీనా" పుస్తకం.

* బీనాదేవి సమగ్ర రచనలు.

* చలం రచనలన్నీ ఆకర్షణీయమైన కొత్త ప్రింట్స్ తో వచ్చాయి.

* నోరి నరసింహశస్త్రి గారి చారిత్రాత్మక రచనలు : (టాగూర్ పబ్లిషర్స్ అనుకుంటా.. )
రుద్రమదేవి,
నారాయణ భట్టు,
కవిద్వయము,
కవిసార్వభౌముడు(ఇది నా దగ్గర ఉంది)

* వేటూరి వారి పాటల పుస్తకాలు రెండు మూడు రకాలు ఉన్నాయి...("కొమ్మకొమ్మకో సన్నాయి" మాత్రం ప్రింట్లు లేవుట).

* యోగానంద స్టాల్లో "Living with the Himalayan Masters" ఒకటి.. (చాలా రోజులుగా కొనాలని...వీలైతే లాస్ట్ రౌండ్ లో చూడాలి)

* యోగానంద స్టాల్లో పోస్టర్స్ చాలా బావున్నాయి. రెండు కొన్నాను.

* అక్కడే చిన్న చిన్న ఇన్స్పిరేషనల్ బుక్స్ కూడా చాలా బావున్నాయి.

* పిలకా గణపతి శాస్త్రి గారి "హరివంశము", మరో మంచి పుస్తకం కూడా చూసా..పేరు గుర్తురావట్లే.

* కృష్ణాదేవరాయుల మీదో విజయనగరసామ్రాజ్యం మీదో ఒక పుస్తకం(పేరు గుర్తులేదు).
(గతంలో నేను "Forgotten Empire"కి తెలుగు సేత "విస్మృత సామ్రాజ్యం విజయనగరం" అని ఒకటి కొన్నాను.బావుంటుంది ఆ పుస్తకం.)

* "కొత్త పల్లి " అనే పిల్లల కథల మ్యాగజైన్ స్టాల్లో పిల్లల బొమ్మల కథల పుస్తకాలు బాగున్నాయి.

* సి.పి.బ్రౌన్ అకాడమీ స్టాలో కూడా రేర్ బుక్స్, కొన్ని జీవిత చరిత్రలు బావున్నాయి.

* పబ్లికేషన్స్ డివిజన్ (ఐఽబి మినిస్ట్రీ వాళ్ళది) స్టాల్లో కూడా పిల్లలకి మంచి పుస్తకాలు తక్కువ ధరల్లో ఉన్నాయి.
ముందు తెలుగు చదవటం నేర్పించాలనే ఉద్దేశంతో మా అమ్మాయికి పిల్లల ఇంగ్లీషు పుస్తకాలు ఏవీ కొనలేదు. అన్నీ తెలుగువే కొన్నాం.

* ఆక్స్ఫార్డ్ వాళ్ల దగ్గర చిన్నపిల్లలకు బాగా పనికివచ్చే మంచి మేథిమేటిక్స్ బుక్స్ ఉన్నాయి.

* ఇంగ్లీషు పుస్తకాల జోలికి వెళ్లలే.. (వెళ్తే మళ్ళీ కొనాలనిపిస్తుందని..:))

*** **** *****

తన దగ్గర ఉన్న పుస్తకాలు కాక వేరేవి కొనుక్కోమని నాన్న చెప్తూంటారు. అందువల్ల ఇంతవరకు నాకు తెలియని కొత్త పుస్తకాలు మాత్రమే కొంటూంటాను నేను. క్రితంఏడు నా కిష్టమైన యద్దనపూడి, కోడూరి నవలలు, రకరకాల శతకాలు మొదలైనవి కొనుక్కున్నా.

ఈసారి నే కొన్నవి చాలావరకూ పాత పుస్తకాలే కాబట్టి అవన్నీ లిస్ట్ రాయను కానీ కొన్ని పేర్లు రాస్తాను ..))

* బంకించంద్ర చటర్జీ రాసిన "ఆనంద్ మఠ్" తెలుగు అనువాదం. ఇదే పేరుతో హిందీలో సినిమా వచ్చింది. అందులో "వందేమాతరం" పాట చాలా ఫేమస్. సిన్మాలో భరత్ భూషణ్, గీతా బాలి ముఖ్య పాత్రలు.

* అడవి బాపిరాజు కథలు.

* Shakespeare sonnets కి తెలుగు అనువాదం.

* జి.వి.పూర్ణచంద్ గారి "తరతరాల తెలుగు రుచులు". ఈ పుస్తకంలోని చాలా వ్యాసాలు రేడియో టాక్స్ లాగ ప్రసారమయినవే. చాలా ఉపయోగకరమైన పుస్తకం.
(పూర్ణచంద్ గారు అదివరకూ చాలా ఏళ్ల క్రితం రాసిన "తల్లి వైద్యం" అనే పుస్తకం కూడా చాలా బావుంటుంది. నిత్యం మనం వాడే అన్ని వంట పదర్ధాలు, కూరలు,ఆకుకూరలు అన్నింటి ఉపయోగాలూ ఉంటాయి అందులో.)

* ప్రేమ్ చంద్ "నిర్మల". (స్కూల్ రోజుల్లో టివీలో సీరియల్ గా వచ్చేది ఈ నవల. )

* వాడ్రేవు వీర లక్ష్మీదేవి కథలు.

* "సత్యాన్వేషి చలం" (ఇది వాడ్రేవు వీరలక్ష్మి గారి పి.హెచ్.డి సిధ్ధాంత వ్యాసం.)

* కాశీభట్ల వేణుగోపాల్ గారి రెండు నవలలు.

* సోమరాజు సుశీల గారి రెండు పుస్తకాలు.

*వనవాసి

* chess ఆడటం గురించిన ఓ పుస్తకం..

* జె.పి.పబ్లికేషన్స్ వాళ్ల "ఎస్.జానకి మధురగీతాలు "(జానకి పాడినవి దాదాపు 265 పాటలు ఉన్నాయి ఈ సంకలనంలో)

* వంగూరి చిట్టెన్ రాజు గారి "అమెరికామెడి కథలు"

* "తెలుగు పద్యాలా? బాబోయ్ !" అని ఇంద్రగంటి శ్రీనివాసశాస్త్రి గారి పుస్తకం ఒకటి కొన్నా. మంచి మంచి పద్యాలతో భలేగా ఉంది పుస్తకం.
ఇంకా ఏవో అవీ ఇవీ.. కొన్నా !

* ఈసారి ఎక్కువభాగం మా అమ్మాయికి కథల పుస్తకాలు, బొమ్మల కథల పుస్తకాలు, బొమ్మల రామయణం, బొమ్మలతో భరతం కథలు, ఆక్స్ఫార్డ్ స్టాల్లో మేథిమేటిక్స్ బుక్స్ మొదలైనవి కొన్నాం.

* ఇంకా యోగానంద స్టాల్లో రెండు పోస్టర్స్ కొన్నా...





ఇవీ...ఈసారి పుస్తక ప్రదర్శన కబుర్లు...వీలైతే చివరిరోజు లోపూ మళ్ళీ మరో ప్రదక్షిణ చేయాలి.

ద్వారం లక్ష్మిగారు పాడిన "పూవులేరి తేవే చెలి"


"పూవులేరి తేవే చెలి" పాట తెలియనివారుండరు. ఈపాటను టివీలో ద్వారం లక్ష్మి గారు పాడే రోజుల్లో ఆవిడ పాట ఏది వచ్చినా సరే ఎక్కడున్నా పరిగెట్టుకుని వచ్చి వినేస్తూ ఉండేవాళ్ళం. కొన్నేళ్ళ తరువాత నాన్నగారి అవార్డ్ ప్రోగ్రాంలో ఆవిడ పాడటానికి బెజవాడ వచ్చినప్పుడు, గొంతు బాగోలేకపోయినా మా ఇంటికి వచ్చి పాట పాడి వెళ్ళారు. అదొక మరపురాని జ్ఞాపకం.

ఓసారి టివీలోనే వస్తూంటే రికార్డ్ చేసుకున్న "పూవులేరి తేవే చెలి" పాట ఇక్కడ పెడుతున్నాను...అప్పట్లో కుదిరిన విధంగా ఈ మాత్రం రికార్డ్ అయ్యింది. చాల రోజులనుంచీ వెతుకుతూంటే ఇన్నాళ్ళకు కేసెట్ దొరికింది.

ఆడియో:



సాహిత్యం:

ప: పూవులేవి తేవే చెలి పోవలే కోవెలకూ
నీవలె సుకుమారములూ,
నీ వలెనే సుందరములు
పూవులేవి తేవే చెలి పోవలే కోవెలకూ(3)

1చ: తుమ్మెద కాలూననివీ, దుమ్ము ధూళి అంటనివి
కమ్మగ వలచేవి, రకరకమ్ముల వన్నెలవీ
పూవులేవి తేవే చెలీ పోవలే కోవెలకూ

2చ: ఆలసించెనా పూజా వేళ మించిపోయెనా
ఆలయమ్ము మూసి పిలుపాలింపడు ప్రభువు
పూవులేవి తేవే చెలీ పోవలే కోవెలకూ

3చ: మాలలల్లుటెపుడే.. నవమంజరులల్లేదెపుడే
ఇక పూలే పోయాలి తలంబ్రాలల్లే స్వామి పైన
పూవులేవి తేవే చెలి పోవలే కోవెలకూ..


Friday, December 16, 2011

N.Ramani వేణు గానం - రెండు సీడీలు


చక్కటి హేమంత ప్రభాతాన సన్నని,కమ్మని వేణుగానం వినబడుతుంటే రోజంతా ఎంత హాయిగా గడుస్తుందో కదా..!
ఇటివల కొన్నN.Ramaniగారి ఈ రెండు సీడీలు - (అలైపాయుదే, నాదోపాసన) అటువంటి రమ్యమైన అనుభూతిని మిగులుస్తాయి.

పిడకల వేట లాగ చిన్న సంగతి... శ్రీ ఎన్.ఎస్. శ్రీనివాసన్ గారూ(శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి భర్త), శ్రీ ఎన్.రమణి గారు ఇద్దరూ కూడా ప్రఖ్యాత వేణుగాన విద్వాంసులు టి.ఆర్.మహాలింగం గారి శిష్యులే. ఇద్దరూ సమఉజ్జీలే. కాకపోతే శ్రీనివాసన్ గారు రేడియో స్టాఫ్ ఆర్టిస్ట్ గా రేడియోకే తన సేవను అందించారు.


కొనుక్కోవాలనుకునే ఆసక్తి ఉన్నవారి కోసం ఈ రెండు సీడీల్లో ఉన్న కృతుల వివరాలు:

అలైపాయుదే :

1) మనసులోని_ హిందోళ_త్యాగరాజకృతి

2) పరిదానమిచ్చితే_బిళహరి_పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

3) అలైపాయుదే_కానడ_ ఊత్తుక్కాడు వెంకట సుబ్బయ్యర్

4)రామకథా సుధ_ మధ్యమావతి_ త్యాగరాజకృతి

5) చిన్నన్ చిరుక్కిళియే_సుబ్రహ్మణ్యభారతి

6)మాగుడి_నాదనామక్రియఽపంతువరాళి_సంప్రదాయ రచన

నాదోపాసన:

1)కామాక్షి_ వర్ణం_ కంభోజి

2)గజాననయుతం_ చక్రవాకం _ ముత్తుస్వామిదీక్షితార్

3)గిరిపై నెలకొన్న_ శహన _ త్యాగరాజకృతి

4)నీ దయ రాదా_ వసంతభైరవి _ త్యాగరాజకృతి

5)నాదోపాసన_ బేగడ _ త్యాగరాజకృతి








Thursday, December 15, 2011

ఆ కుటుంబంతో ఒక రోజు


మొదట వేణువు బ్లాగ్లోనూ, మళ్ళీ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలోనూ, ఆ తర్వాత "పుస్తకం.నెట్" లోనూ ఈ పుస్తకం గురించి చదివాకా కొందామని వెతికితే నాకు ఈ పుస్తకం దొరకలేదు. ఈ మధ్యనే "నవోదయా"లో దొరికింది. అది జె.యు.బి.వి.ప్రసాద్ గారు రాసిన "ఆ కుటుంబంతో ఒక రోజు". ఇరవై కథల సంపుటం. ముందరే నవోదయాలో వెతికితే మరి దొరికేదేమో.




చాలా ఆత్రంగా పుస్తకం తెలిచిన నాకు ముందుమాటలో "చిన్నతనంలో గట్టి భక్తుడిని.. నాస్తికుడిగా మారిపోయాను...ఇప్పుడు భక్తి అంటే నాకు హాస్యం... ఈ కథలన్నింటికీ నా అనుభవాలు, జ్ఞాపకాలు, స్వయంగా చూసినవీ, విన్నవీ...." అని చూసి భయమేసింది. ఇంతకాలానికి కొన్నాను..ఈయన నాస్తికులుట.. కథలెలా ఉంటాయో... అని. కానీ మొదటి కథతోనే నా సందేహాల మబ్బులన్నీ విడిపోయాయి. రెండు, మూడు కథలు చదివేసరికీ రచయిత అంటే అభిమానం పుట్టుకొచ్చేసింది. ఏకబిగిన పుస్తకమంతా చదివేసా.

పుస్తకం లోని కథలన్నీ ఇదివరకూ రకరకాల వెబ్ పత్రికలలో అచ్చయినవే. కథలన్నింటిలోనూ మధ్యతరగతి జీవితం, దిగువ మధ్యతరగతి జీవనం, మనలో మనం వేసుకునే ఎన్నో రకాల ప్రశ్నలు మొదలైనవి కనబడతాయి. రచయిత వాటన్నింటినీ కథా రూప మిచ్చిన తీరు ఆసక్తికరంగా, మనసుకు హత్తుకునేలా ఉంది. ఎవరో మిత్రులు తమ అనుభవాలు మనతో చెప్తున్నట్లే. మొదటి కథ "ఆ కుటుంబంతో ఒక రోజు" కథలో అమెరికా వెళ్ళిన కొత్తలో, అనుకోకుండా ఓ ఇంటర్నెట్ స్నేహితుడి ఇంటికి వెళ్ళిన వైనం, వారింట్లో వాతావరణం చూసి, చదివి మనం కూడా ప్రసాద్ గారితో పాటూ చివర్లో చెవులు మూసుకుంటాం..:))

"నాస్తిక భర్త" కథలో భార్య శ్రావణమంగళవారం నోము నోచుకుంటూంటే, ఇబ్బందిపడుతూనే ఆమెకు వంటలోనూ ,పూజలోనూ సాయం చేసే ఓ నాస్తికుడైన భర్త ను చూసి నవ్వుకుంటాం. "ఏ సాయమూ చేయని ఆస్తిక మొగుడి కన్నా అన్ని సాయాలూ చేసే నాస్తిక మొగుడే బెటర్" అన్న సునంద మాటలు నిజమేనేమో అనిపిస్తాయి. "అంజనం", "అభిమానం", "ప్రశ్న" మొదలైన మరికొన్ని కథలు చిన్న పిల్లల్లో ఎన్ని రకాల భయాలు, నమ్మకాలు, ఆలోచనలూ ఉంటాయో, ఇంట్లోని ఆర్ధిక పరిస్థితులు వాళ్లలో ఎంతటి సంఘర్షణను రేపుతాయో కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. 'అభిమనం' కథలోని పిల్లవాడి ఆకలి బాధ, 'పుస్తకం' కథలో కాళ్ళకి లేని చెప్పులకోసం కన్నా ఓ పుస్తకం కొనుక్కోవటానికి ఓ దిగువమధ్య తరగతి కాలేజీ విద్యార్థి పడే ఆరాటం కంట తడిపెట్టిస్తాయి.

'మైల' , 'విధాయకం', 'మరణానంతరే..', 'ఇదేనా దీపావళి ? ', 'మంత్రాలకు శక్తి ఉందా?' మొదలైన కథలు అనాదిగా వస్తున్న కొన్ని ముఢనమ్మకాలనూ ప్రశ్నిస్తాయి. మనలో మనం ఇలాంటి ప్రశ్నలు ఎన్ని వేసుకుంటామో కదా అనుకునేలా చేస్తాయి. ఇక చివరిగా నాకు అన్నింటికన్నా బాగా నచ్చిన కథ 'అమెరికాలో రుబ్బురోలూ, కందిపచ్చడీ!'. "ఈ దరిద్రపు ఎలక్ట్రిక్ గ్రైండర్లలో చేసుకునే పచ్చళ్ళు ఏం బాగుండేడుస్తాయి? రుబ్బురోట్లో రుబ్బున పచ్చడే పచ్చడి. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ రామారావు పాట పాడుతూ పిండి రుబ్బుతుంటే...ఆ రుబ్బురోలునే తన్మయంగా చూసేవాడిని.....రుబ్బురోలు లేని జీవితం వృధా...." డైలాగు, ఆ తర్వాత రుబ్బురోలు కొనటం కోసం పడిన పట్లు, కొన్నాకా మొదట రుబ్బిన పచ్చడి తినిపించడానికి మిత్రులందరినీ ఇంటికి భోజనానికి ఆహ్వానించటం చదివి నవ్వాపుకోలేం. నేనైతే మా ఇంటికి ఈ పుస్తకం పట్టుకెళ్ళి, "భోజనం కూడా ప్రశాంతంగా తిననియ్యవా వాళ్ళనీ..." అని శ్రీవారు వేళాకోళం ఆడుతున్నా ఉడుక్కుంటూనే లేటుగా మూడింటికి మధ్యాన్నం భోజనం చేస్తున్న మా అన్నయ్యకు పక్కన కూచుని మరీ చదివి వినిపించేసా.

'వేణువు' బ్లాగ్ లో ఈ పుస్తకం గురించిన టపా 'ఇక్కడ'. అక్కడ సుజాతగారి ప్రశ్నలకు JUBV(రచయిత) గారి సమాధానం, మరి కొంత చర్చ కూడా చూడవచ్చు. 'పుస్తకం.నెట్లో' జంపాల చౌదరి గారి వ్యాసం '
ఇక్కడ' చూడవచ్చు .

Wednesday, December 14, 2011

ఎన్ కాదలే.. ఎన్ కాదలే..


ఏ.ఆర్.రెహ్మాన్ చేసిన పాటల్లో బెస్ట్ ట్యూన్స్ లో తప్పనిసరిగా చెప్పుకోదగ్గవి "డ్యుయెట్" సినిమాపాటలు. తెలుగు కాదు.. ముఖ్యంగా తమిళ్ "డ్యూయెట్" పాటలు. భాష తెలియకపోయినా తమిళం పాటలే చాలా బాగున్నాయని అప్పట్లో నేను ప్రత్యేకం ఈ తమిళ్ పాటల కేసెట్ ఓ కజిన్ తో తెప్పించున్నా. అన్ని పాటలు చాలా బాగుంటాయి. ఎన్నిసార్లు విన్నానో లెఖ్ఖలేదు...కద్రి గోపాల్ నాథ్ గారి saxophone అయితే అద్భుతం. అందులోనూ "ఎన్ కాదలే " పాటలో sax..గుండేల్ని పిండేస్తుంది..ఎన్నిసార్లు విన్నా తనివితీరదు...

ఇవాళ "ఎన్ కాదలే" పాటకు అర్ధం వెతుకుతూంటే నెట్లో దొరికింది...సాహిత్యం(అనువాదం) చాలా బాగుంది. ఎంతవరకు సరైన ట్రాన్స్లేషనో తెలీదు కానీ అర్ధం బాగుంది. తెలుగు డబ్బింగ్ పాటలో కన్నా వెయ్యిరెట్లు నయం. ఈ సాహిత్యానికి అర్ధం రాసినవారికి బోలెడు ధన్యవాదాలు.

"en kaadhalae en kaadhalae
ennai enna seiyya poagiRaai?
naan oaviyan endru therindhum nee
yean kaNNirandai kaetkiRaai?"

My love! my Love!
what are you going to do with me
Even though you know that I am an artist(painting)
Why are you asking my eyes?

"siluvaigal siRaguhaL
rendil enna thara poagiRaai?
kiLLuvathai kiLLivittu
yean thaLLi nindru paarkiRaai?"

the holy cross or Bird's wing
What are you going to give me?
Having sparked the desire in me
Why are you turning a blind eye?

(en kaadhalae...)
"kaadhalae nee poo eRindhaal
endha malayum konjam kuzhayum
kaadhalae nee kal eRindhaal
endha kadalum konjam kalangum"

My Love, if you threw a flower
even a mountain would blush
My Love, if you threw a stone
even an ocean would be disturbed

"ini meeLvadhaa illai veeLvadhaa?
uyir vaazhvadhaa illai povadhaa?
amudhenbadhaa visham enbadhaa?
illai amudha-visham enbadhaa?"

Should I proceed or back out?
Should I live on or die?
Are you the nectar or are you poison?
Else are you a mixture of both?

"kaadhalae un kaaladiyil
naan vizhundhu vizhundhu thozhudhaen
kaNgaLai nee moodikkondaay
naan kulungi kulungi azhudhaed"

My love,I prayed fervently at yout feet
You wouldn't open your eyes
Hence I cried inconsolably


"idhu maatramaa thadumaatramaa?
en nenjilae pani moottamaa?
nee thozhiyaa? illai edhiriyaa?
endru dhinamum poraattamaa?"


Is the change happening to me good or bad?
is there accumulation of snow flakes in my heart?
Are you a friend? or a foe?
Is that the conflict that is going on within me?

పాటలో బాలూ గళంలో పలికిన ఆవేదన అద్భుతం, వైరముత్తు గారి సాహిత్యం అద్భుతం. మీరూ వినేయండి ఓసారి...



Friday, December 9, 2011

విశాలాంధ్ర తెలుగు కథ (1910-2000)


కాలాంతరంలో సమాజంలో జరిగే మార్పుల్ని.. కలిగే చైతన్యాన్ని, సామాజికజీవనంలో కనబడే లోపాలనూ సులభంగా అద్దంపట్టగల సాహితీప్రక్రియ "కథ". విభిన్న దృక్కోణాలతో ఇప్పటిదాకా ఎన్నో కథా సంకలనాలు వెలువడ్డాయి. అయితే ఒక్కో సంకలనానిది ఒక్కో విశేషం. సామాజిక సమస్యలు, ప్రాదేశిక కథలు, స్త్రీ చైతన్యానికి సంబంధించినవి, అత్యంత ప్రజాదరణ పొందిన కథలు...ఇలా అనేక కథాంశాలు. 2002 అక్టోబర్లో ప్రధమ ముద్రణ ద్వారా విశాలాంధ్ర వారు అందించిన "విశాలాంధ్ర తెలుగు కథ (1910-2000)" సంకలనం కూడా ఒక అంత:సూత్రానికి కట్టుబడింది. అదేమిటంటే సామాజిక లోపాలు...వాటి తాలూకూ సమస్యలు. 1910 మొదలు 2000 వరకూ మొత్తం తొంభై ఏళ్ళలో వివిధ కథకులు అందించిన రకరకాల సామాజిక సమస్యల చిత్రణ ఈ కథల్లోని ముఖ్య కథాంశం. ఈ ఏడాది ఏప్రిల్ లో రెండవ ముద్రణ ద్వారా మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకానికి బాపూ వేసిన అందమైన ముఖచిత్రం ముచ్చట గొలుపుతుంది. ఇటువంటి మంచి కథసంకలనాన్ని అందించిన విశాంలాంధ్ర వారు, ఉత్తమమైన కథలను ఎంపిక చేసిన విశాంలాంధ్ర సంపాదకవర్గం ప్రశంసార్హులు.


ఈ సంకలనంలో ఆకలి, పర్యావరణ, రాజకీయ, ఆర్ధిక, నిరుద్యోగ, వృధ్ధాప్య సమస్యలు, స్త్ర్రీ సమస్యలు మొదలైన ఎన్నో సామాజిక సమస్యలను రచయితలు తమ తమ కథల్లో స్పృశించారు. తెలుగు కథ ద్వారా ఇంతటి వైవిధ్యమైన సామాజిక స్వరూపాన్ని ఒక చోట అందించటం మెచ్చదగ్గ విషయం. ఈ సంకలనంలో పొందుపరచాలని సంకల్పించిన అంత:సూత్రం సమాజికమైనది కాబట్టి (గత శతాబ్దపు ఉత్తమ కథల్లో) మానసిక చిత్రణ ఉన్న కథానికలకు చోటు ఇవ్వలేకపోయామని సంపాదకులు ముందుమాటలో చెప్పారు. ఇలాంటి ఒక ముఖ్యోద్దేశానికి కట్టుబడి ఉన్నందువల్ల ఈ సంకలనంలోని కథలు గత శతాబ్దపు జీవన విధానాలనూ, సామాజిక పరిస్థితులనూ,ఎన్నో రకాల సమస్యలను కళ్ళకు కట్టి చూపెడతాయి. ఇవి అందంగా, మనోహరంగా ఉండవు. గుండెల్లో బరువుని పెంచి, ఆవేశం రగులుస్తాయి. కన్నీరు తెప్పిస్తాయి. ఏళ్ళ తరబడి సమాజంలో మనం ఏదైనా మార్పుని చూస్తున్నామా? అసలు ముందుకు వెళ్తున్నామా? అక్కడే నిలబడిపోయామా..? అని మనల్ని ఆలోచింపజేస్తాయి.


గురజాడ అప్పారావు గారి "మీ పేరేమిటి?" అనే కథ తో మొదలయ్యే ఈ పుస్తకంలో మొత్తం 108 కథలున్నాయి. కథారచనలో అందవేసిన చెయ్యి ఉన్న రచయితలందరి కథలూ ఇందులో పొందుపరిచారు. చలం, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, అడివి బాపిరాజు, తిలక్, కాళీపట్నం రామారావు, చాగంటి సోమయాజులు, కొడవటిగంటి, ముళ్ళపూడి, వాసిరెడ్డి సీతాదేవి, బీనాదేవి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, మధురాంతకం రాజారాం, వాడ్రేవు చినవీరభద్రుడు, ఓల్గా, తల్లావఝ్ఝుల పతంజలిశాస్త్రి, రహమతుల్లా, కుప్పిలి పద్మ మొదలైనవారి రచనలను ఈ సంకలనంలో పొందుపరిచారు. చలం కథ "భార్య" అలనాటిబాల్య వివాహాలలోని లోపాలను తెలుపుతూనే ఒక స్త్రీ అంతరంగ అద్భుత చిత్రీకరణను మనకు చూపుతుంది. ఆనాటి సమాజంలోని మత మౌఢ్యాలను ఎత్తిచూపే గురజాడ గారి కథ ఈతరంలో రాసినదా అనిపించక మానదు. వాసిరెడ్డి సీతాదేవి గారి "తరాలూ-అంతరాలు" కథానిక తరతరాలుగా మారని అత్తాకోడళ్ళ సంఘర్షణను చూపెడుతుంది. అదివరకూ రహమతుల్లా గారి "బా" సంకలనంలో నాకు నచ్చిన "అమ్మీజాన్" కథ మరోసారి చదివాకా కంట్లో తడి అడ్డం పడింది. సి.సుజాత గారి "స్మైల్స్ ఫర్ సేల్" కథ ఉద్యోగినుల సమస్యలకు, మనోభావాలకు అద్దం పడుతుంది.



ఈ సంకలనంలో కథలు చదువుతుంటే చాలావారకూ వాటిలోని అంశాలు నిన్నటి శతాబ్దపు సామాజిక సమస్యల్లా కాక నేటి సమాజిక ప్రతిబింబాల్లా కనిపించటం చిత్రం ! సమాజంలో మార్పు నిజంగా వచ్చిందా? సమస్యలు అలానే ఉన్నాయా? అని సందేహం కలుగుతుంది. అయితే సమాజిక మార్పును గురించి ఆలోచించినప్పుడల్లా నాకు తోచే సమాధానం ఒక్కటే... సమాజంలో మార్పు తేవాలంటే ఉద్యమాలే నడపనక్కర్లేదు...ప్రతిఒక్కరం మన ఇంట్లోని భావితరాన్ని సరైన దారిలోకి మళ్ళించగలిగితే చాలేమో అని !



Thursday, December 8, 2011

జయ


మన స్నేహితుల్లో కొందరు మిత్రులు మనకు దగ్గరగానే ఉన్నా మనం వాళ్ళను నిర్లక్ష్యం చేస్తాము. పెద్దగా పట్టించుకోము. కాలం గడుస్తున్న కొద్దీ ఎవరిది వీడిపోయే అల్ప స్నేహమో, ఎవరిది చివరిదాకా వెన్నంటి నిలిచే నీడో అర్ధం అవుతుంది. అదృష్టం ఉంటే వాళ్ళు ఇంకా దగ్గరలోనే నిలబడిఉంటారు. అలా నేనూ చాలా ఆలస్యంగా గుర్తించిన ఒక మంచి స్నేహితురాలి గురించి ఈ టపా.

తన పేరు "జయ". నా కాలేజ్ మేట్. నా జూనియర్. రోజూ కాలేజీకి వెళ్ళే సిటీ బస్సులో మొదలైన మా పరిచయం స్నేహంగా మారటానికి మూడేళ్ళు పట్టింది. గాఢంగా మారటానికి ఇంకొన్నేళ్ళు పట్టింది. మొదట్లో తను నా జూనియర్ అన్న చిన్నచూపు... మిగతా స్నేహితులపట్ల ఎక్కువ శ్రధ్ధ ఉండేవి. కాలేజీ బస్ రూట్ లో నాకన్నా నాలుగు స్టాప్ ల ముందర 'వాళ్ళు ముగ్గురూ' ఎక్కేవారు. ఒకరు నా క్లాస్మేట్, నా ప్రాణ స్నేహితురాలు. మిగత ఇద్దరూ మా జూనియర్స్. వాళ్ళు ముగ్గురికీ ఎంతో దోస్తీ ఉండేది. నెమ్మదిగా నా స్నేహితురాలి వల్ల వాళ్ళిద్దరూ నాకు పరిచయం అయ్యారు. నలుగురం కాలేజీలో కలిసి తిరిగేవాళ్ళం. కలిసి లంచ్ తినేవాళ్ళం. సినిమాలకి, ఒకరిళ్ళకి ఒకరం వెళ్ళేవాళ్ళం.

ఒకసారి "జయ" ఇంటికి వళ్ళినప్పుడు తెలిసింది... వాళ్ళ అమ్మగారిదీ రాజమండ్రి అనీ, వాళ్ళ అమ్మగారు, మా పెద్దమ్మ క్లాస్మేట్స్ అనీ, వాళ్ళ మేనమామ నాన్న కొలీగ్ "భట్టుమావయ్యగారు" అని. పెద్దల పేర్లూ, కుటుంబాలూ తెలిసినవే అవ్వటం భలే ఆశ్చర్యం. అప్పటినుండీ మా స్నేహం కాస్త పెరిగింది. మా డిగ్రీ అయ్యాకా నా ప్రాణ స్నేహితురాలు వేరే యూనివర్సిటీలో చేరింది. వాళ్ళ డిగ్రీ అయ్యాకా, జయ ప్రాణ స్నేహితురాలు పెళ్ళయి వేరే దేశం వెళ్ళిపోయింది. జయ కూడా తిరుపతిలో ఎం.ఏ లో చేరింది. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. తను పీజీ అయ్యాకా B.Ed చేసింది. మళ్ళీ విజయవాడ వచ్చి ఓ కాలేజీలో లెక్చరర్ గా చేరింది. మళ్ళీ రాకపోకలతో స్నేహం పెరిగింది.

సన్నిహిత స్నేహితులు అందరికీ ఉంటారు. అయితే; ఎంత సన్నిహితంగా ఉన్నా, చనువుగా ఒక మాట అనలేని మొహమాటపు స్నేహాలే ఎక్కువ ఉంటూంటాయి. ఎంత స్నేహితులైనా సరే మనల్ని తిడితే అది మనపై ఉన్న అభిమానం వల్ల ఏర్పడిన చనువుతో అన్నారని అర్ధం చేసుకునేవాళ్ళేంతమంది ఉంటారు? జయను మొదట్లో నేనూ అలానే అర్ధం చేసుకోలేకపోయా. ఒకరోజు ఫోనులో మట్లాడుతుంటే జయ ఎందుకో నన్ను బాగా తిట్టింది. నాకు బాగా కోపం వచ్చింది. "మా ఇంట్లో కూడా నన్నెప్పుడూ ఇలా ఎవరూ తిట్టరు. ఇలా మాట్లాడితే నాకు నచ్చదు...అలాఅయితే నాతో మాట్లాడద్దు" అని ఠక్కున ఫోన్ పెట్టేసాను. ఇంకెప్పుడూ తనతో మాట్లాడకూడదు అనుకున్నాను. సరిగ్గా ఒక వారం తరువాత జయ మళ్ళీ ఫోన్ చేసింది. "ఏమ్మా కోపం తగ్గిందా? మాట్లాడతావా నాతో..?" అంటూ అనునయంగా మాట్లాడింది. నేను కొంచెం మెత్తబడినా పొడిపొడిగానే మాట్టడా. కానీ నా నిరసనను పట్టించుకోకుండా తను ఫ్రీగా మట్లాడినందుకు లోపల్లోపల సంతోషపడ్డాను. ఆ తరువాత తన కో లెక్చరర్ ఒకావిడ ద్వారా తనకు పెళ్ళి సంబంధం రావటం, పెళ్ళి అవగానే తను బొంబాయి వెళ్ళిపోవటం త్వరగా జరిగిపోయాయి. అక్కడే ఇంగ్లీష్ లెక్చరర్ గా చెరింది. అప్పుడప్పుడు ఉత్తరలు రాసుకునేవాళ్ళం.

నా పెళ్ళైన కొన్నాళ్ళకు మేము బొంబాయి వెళ్లటంతో మళ్ళీ మా స్నేహం మొగ్గలు తొడిగింది. ఈసారి మాది టీనేజీ స్నేహం కాదు. జీవితాన్ని అర్ధం చేసుకున్న ఇద్దరు మనుషుల స్నేహం. సంసారంలో ఒడిదొడుకులను చవిచూసిన ఇద్దరు స్త్రీల స్నేహం..! పరిచయమైన అన్నేళ్ళకు జయలోని నిజమైన స్నేహితురాలిని నేను అర్ధం చేసుకోగలిగాను. ఇక ఎప్పుడూ మాకు మాట పట్టింపూ రాలేదు..మేము దూరమైంది లేదు. నాలాంటి పిరికి మనిషిని ఒక లోకల్ ట్రైన్, రెండు బస్సులు మారి "thane"లో వాళ్ళ ఇంటికీ; ఒంటరిగా లోకల్ ట్రైన్స్ లో అంధేరీ, దాదర్, గేట్ వే ఆఫ్ ఇండియా మొదలైన ప్రాంతాలకు వెళ్ళగలిగానంటే అది జయ నేర్పిన ధైర్యమే. మేం బొంబాయిలో ఉన్నన్నాళ్ళూ జయ ఇంకా సన్నిహితమైపోయింది. చదువులో జూనియర్ అయినా, సంసారంలో సీనియర్ కావటం వల్ల ఎన్నో సలహాలూ, సూచనలూ ఇప్పటికీ ఇస్తూంటుంది. మేం బొంబాయి వదిలి వచ్చాకా ఇక మాకు ఉత్తరాలు లేవు. ప్రతి వారాంతం లోనూ ఫోనులే. ఇద్దరు పిల్లలు, ఉద్యోగం... ఉరుకులు పరుగుల బొంబాయి జీవితంలో వారంపదిరోజులకోసారన్నా నాకోసం తప్పక సమయం కేటాయిస్తుందని నాకు గర్వం.


ఆ మధ్యన నా ఆరోగ్యం బాలేనప్పుడు జనాల పలకరింపులు పరామర్శలూ వినలేక నేను చాలా రోజులు ఎవరి ఫోన్లు ఎత్తలేదు. జయ ఫోన్ కూడా రెండు మూడు సార్లు తియ్యలేదు. ఒకరోజు తనే మళ్ళీ చేసింది. మామూలు కబుర్లు మాట్లాడుతోంది. నేను ఏదో చెప్పబోయను. తను అంది..."ఏం చెప్పద్దు. అయిపోయిన విషయమే ఎత్తద్దు. మిగతా విషయాలు మాట్లాడు..." అంది. ఏం చెప్పాలో అని సతమతమౌతున్న నాకు తేలిగ్గా అనిపించింది. అంతవరకూ ఫోన్ చేసిన ప్రతివాళ్ళు జరిగిన విషయం తెలుసుకోవాలని ఆరాటపడ్డారు తప్ప అది తలుచుకోవటం వల్ల నేను పడే వేదనను అర్ధం చేసుకోలేకపోయారు. మనల్ని సరిగ్గా అర్ధం చేసుకున్న స్నేహితులు మాత్రమే ఎన్ని కాలాలు మారినా మన పక్కన తోడై నిలబడతారు అనటానికి జయలాంటి స్నేహితులే ఉదాహరణ.

తన గురించి ఒక్కటే నాకు కంప్లైంట్. ఎంతచెప్పినా మైల్స్ రాయటం నేర్చుకోదు. అసలు కంప్యూటర్ అంటే ఆసక్తే లేదు. నిన్న రాత్రి భట్టుమావయ్యగారి మీద రాసిన పోస్ట్ తనతో నెట్లో ఓపెన్ చేయించేసరికీ జుట్టు పీక్కున్నంత పనైంది. నా స్నేహితుల్లో నా బ్లాగ్ ఇప్పటిదాకా చూడనిది తనొక్కర్తే. నెట్ ఆపరేట్ చేయటం నేర్చుకొమ్మని బాగా తిట్టాను. ఇప్పుడు ఏ ఇగోలూ లేకుండా ఒకరినొకరం నిర్మొహమాటంగా తిట్టుకునేంత స్వేచ్ఛ మా స్నేహానిది. మా స్నేహానికిప్పుడు ఇరవైఏళ్ళు. జయకు నేనేమిటో తెలుసు. నాకు తన స్వచ్ఛమైన మనసు తెలుసు. అందుకే జయ నాకు సన్నిహితురాలు....ఎప్పటికీ.



Tuesday, December 6, 2011

భట్టుమావయ్యగారు


Linda Goodman పూనిన కాలేజీ రోజుల్లో ఇంటికొచ్చినవారందరినీ మీ sunsign ఇదేనా? అని అడగటం హాబిగా ఉండేది. అలా ఒకానొకరోజున భట్టు మావయ్యగారిని మీరు Sagittarius ఏనా? అనడగటం, ఆయన 'ఓసినీ...బానే చెప్పావే' ఆశ్చర్యపోవటం నాకింకా గుర్తే. అప్పటి నుంచీ ప్రతి ఏడూ నేనెక్కడ ఉన్నా డిసెంబర్ 6thన పొద్దున్నే భట్టుమావయ్యగారికి శుభాకాంక్షలు చెప్తూ ఫోన్ చెయ్యటం, 'నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవే..' అనే ఆయన పలకరింపు వినటం నాకు అలవాటైపోయింది. ఇవాళ పొద్దున్న ఒక విచిత్రం జరిగింది. ఎప్పుడూ మూడు నిమిషాల్లో టాక్ ముగించే భట్టుమావయ్యగారు ఇవాళ పన్నెండు నిమిషాలు మాట్టాడారు. ఆ కాసేపులో ఎన్ని విషయాలు చెప్పారో...చాలా ఆనందమైంది. రాబోయే తరానికి చెందిన ఆలోచనలు ఈనాడు చేయగల గొప్ప మేధావి భట్టుమావయ్యగారు. ఇవాళ ఎలాగోలా టైం కుదుర్చుకుని మావయ్యగారి గురించి బ్లాగ్లో రాయాలని అనుకున్నా...!

భట్టుమావయ్య గారు ఎవరు?
మా చిన్నప్పుడు "భాస్కరమ్మగారింట్లో" ఉండగా మా వాటాలోని రెండు గదులు అద్దెకిచ్చినప్పుడు, అందులో నాలుగైదేళ్ళు ఉన్నారు. అప్పటి నుంచీ నాకు భట్టుమావయ్యగారు తెలుసు. భట్టుమావయ్యగారి పూర్తి పేరు "పన్నాల సుబ్రహ్మణ్య భట్టు". ఒక్కమాటలో చెప్పాలంటే "బహుముఖప్రజ్ఞాశాలి". విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్ గా రిటైరయ్యారు. అనౌన్సర్ గా రిటైరయి ప్రస్తుతం విజయవాడలో విశ్రాంతి జీవితం గడుపుతున్నారు భట్టుమావయ్యగారు. పరిస్థితులు మరోలా ఉండుంటే స్టేషన్ డైరెక్టర్ గా రిటైరవ్వాల్సినవారు. అయినా ఆ చింత ఏ కోశానాలేని విశాల దృక్పధం ఆయనది.

70s,80s లోని రేడియో శ్రోతలకు ఈయన భట్టుగారి పేరు సుపరిచితం. చాలా కొత్తకార్యక్రమాలకు ఈయన నాంది పలికారు. శ్రీరజనీకాంతరావుగారు బెజవాడ రేడియోస్టేషన్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో, వ్యంగ్య రచనలు రాయటంలో దిట్ట అయిన భట్టుగారు "చెళుకులు" అనే రేడియో ప్రోగ్రాం ఒకటి చేసారు. ఉదయం ఏడున్నర ప్రాంతంలో వచ్చే ఈ కార్యక్రమం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ధ్వని మాధ్యమంలో ఇలాంటి కార్టూన్ కార్యక్రమం రావటం అదే ప్రధమం. భట్టుగారు రేపు ఉదయం ఎవరి మీద చెళుకులు పేలుస్తారో అని ఊరంతా ఎదురుచూసేది. విజయవాడ నవోదయ పబ్లిషర్స్ వారీ చెళుకులకు పుస్తకరూపాన్ని కూడా అందించారు. మాగంటి వెబ్సైట్లో ఉన్న ఈ పుస్తకం తాలూకూ పిడిఎఫ్ లింక్:
http://www.maganti.org/air/chelukulu.pdf




తరువాత "అనుభవ దీపం" అనే ప్రతీక నాటకం(symbolic play) ఒకటి భట్టుగారు రాసి, ప్రొడ్యూస్ చేసారు. రేడియో చరిత్రలో ఇలాంటి కార్యక్రమం రావటం అదే ప్రధమం. ఈ కార్యక్రమంలోకి శ్రీమతి వి.బి.కనకదుర్గ, శ్రీరంగం గోపలరత్నం గార్లతో పాడించిన పాటలు చాలా బావుంటాయి. "నాదబంధం" అని సంగీత వాయిద్యాల మీద చేసిన కార్యక్రమానికీ, "మార్గ బంధం" అని రోడ్లు తమ స్వగతాలు చెప్పుకుంటున్నట్లుగా చేసిన కార్యక్రమానికీ సృజనాత్మక విభాగంలో జాతీయ పురస్కారాలు వచ్చాయి భట్టుగారికి. హాస్య వ్యంగ్య రచనల్లో దిట్ట భట్టుగారు. "వీరపాండ్య పెసర బొమ్మన్" అనే కధానికను రాసి తరువాత నాటకంగా కూడా తయారుచేసారు. "పెసరల్ ఇన్సైడ్" అని పెసరట్టు + సాఫ్ట్వేర్ నూ కలిపి ఒక వ్యంగ్య కథ పత్రికకు రాసారు. ఈ కథ "ఆహా... ఓహో !" (ఆధునిక హాస్య వ్యంగ్య రచనలు) అనే పుస్తకంలో ప్రచురితమైంది. రేడియోలో పండుగల రోజుల్లో "ప్రత్యేక జనరంజని" ప్రసారం అవుతూ ఉండేది. అలాగ ఒకసారి ఓ పత్రికలో "ఆవు జనరంజని" అని పేరడీ రచన చేసారు. అంటే ఒక ఆవు తాను ఏన్ని సినిమాల్లో ఉన్నదీ, ఏ ఏ పాటలు తన పేరు మీద ఉన్నాయో ఇంటర్వ్యూలో చెప్తున్నట్లుగా అన్నమాట.


నాకు తెలిసిన భట్టుమావయ్యగారు :



రేడియో స్నేహం కాక భట్టుమావయ్యగారితో మరో స్నేహం ఉండి మాకు. అది అమ్మావాళ్ళ పుట్టిల్లు రాజమండ్రి స్నేహం. మా పెద్దమ్మ భట్టుమావయ్యగారి చెల్లెల్లు స్కూల్లో క్లాస్మేట్స్. తర్వాత కాలేజీలో నాకు బాగా మిత్రురాలైన "జయ" పెద్దమ్మ ఫ్రెండ్ వాళ్ల అమ్మాయి, అంటే భట్టుగారి మేనకోడలు అని తెలుసుకుని మరీ సంబరపడిపోయా. జయ కూ నాకూ ఇరవైఏళ్ళుగా గాఢమైన స్నేహం.




కార్టూన్లు, హాస్య రచనలు, పత్రికలలో ఎన్నోవ్యాసాలు, నాటకాలు, వ్యంగ్య రచనలు ఎన్నో చేసిన భట్టుమావయ్యగారు సరదగా బోలెడు డిగ్రీలు కూడా సంపాదించారు. హిందీలో ఎం.ఏ, జర్నలిజం కోర్స్, ఫిల్మ్స్ కి రిలేటెడ్ డిప్లొమా(పేరు గుర్తులేదు)...మొదలైన కోర్సులు చేసారు. ఆయన చేయటమే కాక ఎంతో మందికి ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ చేసేవారు. ఆయన జేబులో ఎప్పుడూ ఏవో పేపర్ కట్టింగ్లు ఉంటూండేవి. "ఇవి మీ అబ్బాయికి ఇవ్వు" అనో, "ఇవి మీ అమ్మాయికి ఉపయోగపడతాయి ఇదిగో" అనో అవసరం ఉన్నవాళ్ల చేతుల్లో పెట్టేసి వెళ్పోతూ ఉండేవారు. తాను చేయటమే కాక ఎంతో మంది ప్రోగ్రాం అఫీసర్లకీ, రేడియో స్టాఫ్ కీ ప్రోగ్రాములు చేయటానికి కొత్త కొత్త ఐడియాలు చాలా ఇస్తూండేవారు.

ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ ఈయనకు తెలీని విషయాలు ఉన్నాయా అని అశ్చర్యపోతూనే ఉంటాను. భట్టుగారితో పది నిమిషాలు మాట్లాడితే చాలు ఎవరికైనా రెండు విషయాలు ఇట్టే అర్ధమవుతాయి; ఆయనకు తెలియని విషయం ఏదీ లేదని, ఆయనతో మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలనీ. ఎందుకంటే వాటిలోని నిజాన్ని తట్టుకునే శక్తి అందరికీ ఉండదు మరి. అందువల్ల భట్టుగారు సూటిగా మాట్లాడే మాటల్లోని వ్యంగ్యాన్ని మంచి సలహాగా తీసుకుని, ఆయన మాటల్లో దాగున్న ఆప్యాయతని అర్ధం చేసుకున్నవారికన్నా వారి మాటల్ని అపార్ధం చేసుకున్నవారి సంఖ్యే అధికం ఇప్పటికీ...!!

భట్టుగారు మంచి రచయిత, విమర్శకుడు, సంగీతజ్ఞుడు, హాస్య-వ్యంగ్య రచయిత అని చాలామందికి తెలుసు. కానీ ఆయన నలభీములని బహు తక్కువ మందికి తెలుసు. నాకు తెలిసీ పెసరట్లు వేయటంలో ఆయన్ను మించిన స్పెషలిస్ట్ మరొకరుండరు. పెసలతో, పెసర పప్పుతో పాటు ఎన్ని రకాలుగా పెసరట్లు వేయవచ్చో చెప్పటం వెనుక ఆయన చేసిన ఎన్నో పరిశోధనలు ఉన్నాయి. మినపప్పు నానబెట్టి, రోట్లో స్వయంగా రుబ్బి, గారెలు ఆవడలు చేసి మిత్రులందరినీ ఆహ్వానీంచి మరీ జనాలతో తినిపించేవారు. మినపప్పు ఎంతసేపు నానితే గారెలు ఏ విధంగా వస్తాయో ఇట్టే చెప్పగలరు భట్టు గారు. ఒకసారి నాకు చేగోణీలు ఎలా చెయ్యాలో కూడా చెప్పారు.





భట్టుగారి పెసరట్ల ప్రతిభ గురించి ముళ్ళపూడి వెంకట రమణగారు "కోతికొమ్మచ్చి" పుస్తకంలో కూడా (30వ పేజి దగ్గర) ప్రస్తావించారు. ఓ పద్యం కూడా రాసారు ఇలా :
"పొట్టు పప్పు రుబ్బి మిర్చి గిర్చీ చేర్చి
భక్తి శ్రద్ధ కలిపి పోయునట్టి
భట్టుగారి అట్టు బహుగొప్ప హిట్టురా
విశ్వదాభిరామ వినుమ రమణ "
ఈ పద్యానికి బాపూ గారు వేసిన బొమ్మతో సహా ఉన్న లేమినేషన్ వీరింట్లో ఉంటుంది.

భట్టుమావయ్యగారి సతీమణి కృష్ణకుమారక్క(ముంజులూరు కృష్ణకుమారి). ప్రస్తుతం బెజవాడ రేడియో స్టేషన్లో 'అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్'. మావయ్యగారు, అక్క...ఇదేం వరస అని విన్నవాళ్లంతా అడిగేవారు. వారి పెళ్ళికి మునుపే కృష్ణక్క మాకు తెలియటం వల్ల తనను కృష్ణకుమారక్క అని పిలిచేవాళ్ళం. ఆ పిలుపు ఇప్పటికీ అలానే ఉండిపోయింది. తను అంత పెద్ద ఆఫీసరయినా నాకు మాత్రం ఎప్పటికీ తను చిన్నప్పటి కృష్ణకుమారక్క. ఆ దంపతులు ఇద్దరిపై నాకు చాలా ప్రత్యేక అభిమానం. వారిద్దరిని గురించిన ఓ బేతాళప్రశ్న మత్రం ఎప్పుడూ నన్ను దొలిస్తూఉంటుంది...కృష్ణకుమారక్క దొరికిన భట్టుమావయ్యగారు అదృష్టవంతులా? భట్టుమావయ్యగారు దొరికిన కృష్ణక్క అదృష్టవంతురాలా..? అని !!

హమ్మయ్య సాహసం చేసేసా ! నాకు తెలిసినది, తోచినదీ రాసేసాను. ఇప్పుడిక నాకు భట్టుమావయ్యగారు ఎన్ని మార్కులు వేస్తారో వేచి చూడాల్సిందే !

Monday, December 5, 2011

Remembering the evergreen "Dev.."


కళ్ళలో మెరుపు - చూపులో తీక్షణత - ఆశావాద దృక్పధం వెరసి దేవానంద్ ! దేవ్ ఒక legend. He is evergreen.


అర్దం కాకుండా గొణికినట్లుగా ఫాస్ట్ గా చెప్పే డైలాగులూ, ఒకేలాంటి వింత మేనరిజమ్స్ తో నటించే దేవానంద్ అంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ అతనిలోని ఎనర్జీ నాకెప్పుడూ నచ్చేది. జీవితంపై అతను కనబరిచే ఆశావాద దృక్పధం, మారుతున్న కాలంతో అణుగుణంగా అతను ఎన్నుకున్న పాత్రలు, సినిమాలు నాకు నచ్చేవి. ఎంత వయసు పైబడినా చెక్కుచెదరని అతనిలోని ఎనర్జీ, చురుకుదనం ఎవరినైనా ఉత్సాహవంతంగా చేయగలవు అనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఇటీవల ఒక టివీ ఇంటర్వ్యూ లో దేవ్ ను చూసినప్పుడు "ఎన్ని ఫ్లాపు లు ఎదురైనా ఇంకా సినిమ తీస్తానంటాడు... ఎంత ఉత్సాహవంతంగా ఉంటాడో...great man... ఇంత పోజిటివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండగలిగితే ఎంత బావుంటుంది " అనుకున్నాను మనసులో.

మామూలుగా ఎంత ఇష్టమున్నా బాలీవుడ్ హేమాహేమీల సినిమాలన్నీ కొనుక్కునీ చూడము, థియేటర్లో కూడా అన్నీ చూడము. అలాంటిది స్కూలు రోజుల్లోనే దేవానంద్ నటించిన Paying guest, jewel thief, Here rama hare krishna, Gambler, kala pani, Hum dono, Guide, jab pyar kisi se hota hai, tere ghar ke samne, jony mera naam, prem pujari, tere mere sapne, C.I.D, baazi, Man pasand, Taxi driver మొదలైన మంచి మంచి ఎన్నో సినిమాలనుచూపించింది దూరదర్శన్. డిడి-1వారికి ఎంతైనా ఋణపడి ఉండాల్సిందే. ఇందాకా రాసిన సినిమాలన్నీ కూడా అతని నటనా చాతుర్యాన్ని వివిధ కోణాల్లో చూపెట్టిన సినిమాలే. దేవానంద్ సినిమాలన్నింటిలోనూ నాకు బాగా ఇష్టమైనది "Hum dono". అందులోని "अभी ना जावॊ चॊड कॆ...कॆ दिल अभी भरा नही.."పాట నాకు చాలా ఇష్టం.



ఈ సిన్మాలోదే మరో ఇష్టమైన పాట "मैं जिन्दजी का साथ निभाता चला गया...हर फिक्र कॊ धुवॆ मॆं उडाता चला गया...". దేవ్ సినిమాల్లోని చాలా పాటలు ఇలానే ఆశావాద దృక్పధాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. నిజంగా తన జీవితాన్ని కూడా అదే పోజిటివ్ ఏటిట్యూడ్ తో గడిపాడు దేవ్.

తర్వాత ఆశా పారేఖ్ తో వచ్చిన "jab pyar kisi se hota hai". ఈ సినిమాలో దేవ్ చాలా యంగ్ గా, స్టైలిష్ గా కనబడతాడు. ఆ సినిమాలోని రెండు మంచి పాటలు:
जिया हॊ..जिया हॊ जिया कुछ बॊल्दॊ..अजिहॊ...


तॆरी झुल्फॊं सॆ जुदायी तॊ नही मंगी थी..





జార్జ్ బెర్నార్డ్ షా రచించిన "Pygmalion" అనే నాటికను "My Fair Lady" అనే ఆంగ్లచిత్రంగా తీశారు. చాలా గొప్ప సినిమా. ఈ సినిమాను హిందీలో "మన్ పసంద్" పేరుతో తీసారు. బాసూ చటర్జీ దర్శకత్వం. అందులో హీరో దేవానంద్. హీరోయిన్ టీనా మునీమ్. దేవ్ సినిమాల్లో నాకు బాగా నచ్చిన మరో సినిమా ఇది. మా ఇంట్లో అప్పటికే ఉన్న "My Fair Lady" వీడియోసినిమా చాలాసార్లు చూసి ఉండటం వల్ల చాలా ఆసక్తిగా టివీలో ఆ సినిమా చూసాం మేము. "మన్ పసంద్" కథలో కొన్ని మార్పులు చేసారు. ఆంగ్ల చిత్రం "My Fair Lady"లో Rex Harrison నటనకు ఏ మాత్రం తీసిపోకుండా నటిస్తాడు దేవానంద్ ఈ సినిమాలో. తర్వాత డిగ్రీ ఫైనలియర్లో "Pygmalion" నాటిక చదువుకుంటున్నప్పుడు, మా మేడం మాకు 'ప్రొఫెసర్ హిగ్గిన్స్' డైలాగ్స్ చదివి వినిపిస్తుంటే నాకు Rex Harrison
తో పాటు దేవానంద్ కూడా గుర్తుకు వచ్చాడు. అంతేకాక చాలా ఏంగిల్స్ లో ఆంగ్ల నటుడు Gregory Peck లాగ ఉంటాడనిపిస్తాడు దేవ్. ఆ సినిమాలోది "मैं अकॆला अपनी धुन मॆं मगन जिंदगी का मजा लियॆ जा रहा था..." పాట చాలా బావుంటుంది.



ఇంకా, చిత్రహార్లో "గేంబ్లర్" చిత్రంలోని "दिल आज शायर है..गंम आज नग्मा है.." అనే పాట ఎక్కువగా వేసేవారు. అది సాహిత్యం కూడా చాలా బావుంటుంది.





అత్యంత సెన్సేషన్ సృష్టించిన "గైడ్" సినిమాలోని ఈ నాలుగు పాటలూ ఆణిముత్యాలే.
"तॆरा मॆरा सपना अब ऎक रंग हैं.."
"गाता रहॆ....मॆरा दिल..."
दिन ढल जायॆ...रात न आये.."



"क्या सॆ कया हॊ गया...बॆवफा..तॆरॆ प्यार में.."





నాకు బాగా ఇష్టమైన మరికొన్ని మంచి మంచి దేవ్ పాటలు:
"अच्चा जी मैं हारी चलॊ मान जावॊ ना.."




"छॊड्दॊ आचल जमाना क्या कहॆगा.."




"माना जनाब नॆ पुकारा नही.."




"आस्मा कॆ नीचॆ हुम आज अपनॆ पीछॆ..."




"हम है राही प्यार का..हम सॆ कछ न बॊलियॆ..."




"याद किय दिल नॆ कहा हॊ तुम..."




"हम बॆखुदी मॆं तुम कॊ पुकारॆ चलॆ गयॆ..."




"फूलॊं कॆ रंग सॆ दिल की कलम सॆ.."

"ऎ दिल न होता बॆचारा...कदम न हॊतॆ आवरा..."




"खोया खोया चांद खुला आस्मा..."



"दिल का भवर करॆ पुकार.."




తన జీవితాన్నే ఒక ఉదాహరణగా చూపిన ఈ ఎవర్ గ్రీన్ హీరో రాసుకున్న జీవితచరిత్ర "రొమాన్సింగ్ విత్ లైఫ్" పుస్తకం ఈసారి పుస్తక ప్రదర్శనలో బాగా అమ్ముడుపోతుందేమో. నిండు జీవితాన్ని చూసిన ఈ మహానటుడు నిన్న ఉదయం నిష్క్రమించాడు..!! మరణం అనివర్యం.. ప్చ్...నిన్న వార్త విన్నప్పటి నుంచీ దేవ్ సినిమాలు, పాటలు ఏవేవో గుర్తుకొస్తూనే ఉన్నాయి.... సినిమాలోనైనా, జీవితంలోనైనా మిగిలేవి అవే కదా...జ్ఞాపకాలు..!


Wednesday, November 30, 2011

మిథునం : దస్తూరీ తిలకం


1998 లో "రచన" పత్రికలో బాపూగారి స్వదస్తూరిలో మిథునం కథానిక అచ్చయినప్పుడు; ఆ కథానిక, ఇంకా శ్రీరమణ గారి "బంగారు మురుగు" కథ తాలూకూ జిరాక్స్ కాపీ, రెండూ శ్రీకాంత శర్మగారు నాన్నకు ఇచ్చారు. అపురూపమైన బాపుగారి స్వదస్తూరిలో మిథునం కథానిక, ఆద్యంతం మధురమైన "బంగారు మురుగు".. రెండు కథలూ మా ఇంటిల్లిపాదికీ ఎంతగానో నచ్చేసి, ఆ రెండు కథలూ మరిన్ని జిరాక్సులు తీయించి మరికొందరు సాహితీ మిత్రులకూ, బంధువులకూ అప్పట్లో కొరియర్లో కూడా పంపించాము. తర్వాత ఇంటర్నెట్ లో బాపుగారి దస్తూరితో ఉన్న కథానిక పెట్టారనీ, బాగా ప్రాముఖ్యం పొందిందనీ విన్నాం.

తర్వాత మద్రాసు రేడియోస్టేషన్ నుంచి మిథునం కథ నాటక రూపంలో ప్రసారమైంది. శ్రీమతి పద్మజా నిర్మల గారు ప్రొడ్యూస్ చేసిన ఈ నాటకంలో సినీనటులు సుత్తివేలు, రాధాకుమారి గారూ అనుకుంటా ప్రధాన పాత్రలు పోషించారు. వాసుదేవన్ నాయర్ గారు ఈ కథపై తీసిన మళయాల సినిమా గురించి అందరికీ తెలిసినదే. తనికెళ్ళ భరణి గారు ఈ కథను తెలుగులో సినిమాగా తియ్యబోతున్నారన్నది కొత్త వార్త.



ఇప్పుడు మరొక కొత్తవార్త ఈ కథానిక అదే బాపూ గారి స్వదస్తూరీతో "ఒకే ఒక్క మిథునం" పేరుతో పుస్తకరూపంలో వచ్చింది. రచయిత శ్రీరమణ గారి ముందుమాట కొత్త విషయాలను తెలిపితే, శ్రీ జంపాల చౌదరి గారి ముందుమాట మనసుకు హత్తుకునేలా ఉంది.

ఈ పుస్తకాన్ని నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ గా పంపిన బ్లాగ్మిత్రుడు, అంతకు మించి మంచి సహోదరుడు అయిన శంకర్ గారికి బ్లాగ్ముఖంగా బోలెడు ధన్యవాదాలు. అభినందనలు.

Tuesday, November 29, 2011

కొత్త మొక్కల్.. కొత్త మొక్కల్...

సంచీలో...కొత్తగా కొన్న మొక్కలు


చలికాలంలో పూసే చామంతులు ఎన్ని రంగులు ఉన్నా మళ్ళీ కొత్త మొక్కలు కొందామనిపిస్తుంది. పెద్ద చామంతులు ఐదారు రంగులున్నాయి కదా అని ఈసారి చిట్టి చామంతులు కొన్నా. కుండీ నిండుగా బాగా పూస్తాయి ఇవి.


తెల్లటి ఈ స్వచ్ఛమైన గులాబీలు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా? ఒకే చెట్టుకి ఎన్ని మొగ్గలేసాయో...


ఎన్నో రోజుల నుంచీ చెంబేలీ తీగ కొనాలని. కుండీలో బాగా పెరగదేమో అని ఆలోచన. మొత్తానికి ఈసారి కొనేసా. మొగ్గ పింక్ కలర్లో ఉండి పువ్వు పూసాకా తెల్లగా ఉంటుంది. చాలా మత్తైన సువాసన ఈ పువ్వుది. చాలా ఇళ్ళలో గేటు పక్కగా గోడ మీదుగా డాబాపైకి పాకించి ఉంటుందీ తీగ.



క్రింది ఫొటోలోని గులాబీ రంగు గులాబి పువ్వు చెట్టు విజయవాడలో మా క్వార్టర్ గుమ్మంలో ఉండేది. చాలా పేద్ద చెట్టు. రోజుకు ఇరవైకి మించి పూసేది. ఎన్ని కొమ్మలు ఎందరికి ఇచ్చామో...అందరి ఇళ్ళలో ఈ మొక్క బతికింది. నర్సరిలో కనిపించగానే వెంఠనే కొనేసా.



ఇక ముద్దబంతి పువ్వులు అలా పేద్దగా పూసేసరికీ కొనకుండా ఉండగలనా? ఇంతకు ముందు కుండీలో వేసిన బంతునారు బాగానే పెరిగాయి. కొన్ని రేకపూలు పూస్తున్నాయి. కొన్ని ఇంకా మొగ్గలే రాలా..:(( అందుకని ఈ ముద్దబంతి కొనేసా...:))



Monday, November 28, 2011

చాలా సేపైంది..


చాలా సేపైంది
ఎంత సేపని కూర్చోను...
వెళ్పోతే వస్తావేమోనని
ఎదురుచూస్తే రావేమోనని
ఆలోచనలోనే పొద్దుగూకింది..

చీకట్లు కమ్మే సంజెవేళ ఎంతసేపని నిరీక్షించడం
ఆశనిరాశల తక్కెడకి ఎటుమొగ్గాలో తెలీని సందిగ్ధం
గెలుపుఓటమిల నడుమ మనసు ఆడుతోంది కోలాటం
రేపైనా వస్తావన్నది ఒక రిక్త నమ్మకం..

జీవిత చక్రాల క్రింద నలుగుతున్న రేయీపగళ్ళు..
చూస్తూండగానే పేజీలు మారిపోతున్న కేలెండర్లు !
జ్ఞాపకాల మాటున కదలాడే నీ ఊసులు
అలుపెరుగని కెరటాల లాస్యాలు
ఎంత దూరం పరుగులెట్టినా వద్దని
మళ్ళీ నీ దరికే చేరుస్తాయినన్నవి !!

ఎదురుచూపులు నావరకే ఎందుకు
నువ్వూ నాకోసం కలవరించకూడదూ..
అని తహతహలాడుతుంది మనసు
వెర్రిది.. దానికేమి తెలుసు
నీ మనసు రాయి అని
ఈ జన్మకు అది జరగని పని అని
అయినా ఎందుకో ఈ ఎదురుచూపు..
నాకోసం నువ్వొస్తావని... కలలు తెస్తావని..

చాలా సేపైంది..
ఎంతసేపని కూర్చోనూ...
వెళ్పోతే వస్తావేమోనని
ఎదురుచూస్తే రావేమోనని
ఆలోచనలోనే పొద్దుగూకింది..

tujhe bhulaa diyaa -- Mohit Chauhan






స్వరంలో గాంభీర్యం, హై పిచ్ లో కూడా సడలని పట్టు, కొన్ని పదాలు పలికేప్పుడు ఒక విధమైన జీర మొదలైనవన్నీ ఇతని గళంలోని ప్రత్యేకతలు. మొదటిసారి "మై మేరీ పత్నీ ఔర్ వో" సినిమాలో  "గుంఛా కోయీ" పాట విన్నప్పుడూ ఆహా ఓహో అనుకున్నా. "jab we met " లో " tu hi tu.." ఆ తర్వాత అతనికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తెచ్చిన Delhi-6 లో "masakali"  పాట సూపర్.

ఆ తర్వాత "న్యూయార్క్" సినిమా చూస్తున్నప్పుడు "తూ నే జో నా కహా... "  పాట బాగా నచ్చేసి పాడింది ఎవరా అని చూస్తే "మోహిత్ చౌహాన్" అని ఉంది. ఆ పాట ఎన్నిసార్లు విన్నానో....అంత నచ్చేసింది. సమాచారం వెతికితే కాలేజీ రోజుల్లో Silk route band తరఫున V channel, Mtv ల్లో "డూబా డూబా " అనుకుంటూ పాడిన అబ్బాయి ఇతనే అని తెలిసి ఆశ్చర్యపోయా.

తర్వాత అతను పాడినవాటిల్లో నాకు నచ్చినవి:
* "luv aaj kal" లో "ye dooriyaan" పాట

* once upon a time in mumbai"lO "పీ లూ..."

* rajneeti"లో "భీగీ సీ.."

* "Rockstar" లో దాదాపు చాలానే అద్భుతంగా  పాడాడు.

ఇప్పుడే ఇంకో కొత్త పాట add అయ్యింది. "anjaanaa anjaani" లో "తుఝే భులా దియా". ఈ పాట ఒకరోజు Fmలో వస్తూంటే సంగం నుంచీ విన్నా. అదే రికార్డ్ చేసి తర్వాత మర్చిపోయా. ఇవాళ మళ్ళీ ఏ ఫైల్ కనబడితే ఆ లైన్స్ తో నెట్లో వెతికితే ఫలానాసినిమాలోది అని తెలిసింది. పాట నాకు బాగా నచ్చింది. సాహిత్యం కూడా.







Saturday, November 26, 2011

ఈ కార్తీకం కబుర్లు





హమ్మయ్య ! పొద్దున్నే లేచి "పోలి స్వర్గం" దీపాలు వెలిగించేసాను. ఈ ఏటి కార్తీకమాస పూజలన్నీ సమాప్తం. అసలు పుణ్యప్రదమైన కార్తీక మాసంలో ముఖ్యంగా చెయ్యాల్సినవి దీపారాధన, పురాణ శ్రవణం లేదా పఠనం, ఉపవాసం, నదీస్నానం, దీపదానం, వనభోజనాలు మొదలైనవిట. వీటిలో కుదిరినవి చేసాను మరి. నదీస్నానం వీలయ్యేది కాదు కాబట్టి అది కుదరలేదు. ఉపవాసాలు చిన్నప్పుడు అమ్మతో ఉండేదాన్ని కానీ పెద్దయ్యాకా ఎందుకో వాటి జోలికి పోవాలనిపించలే. ఉండలేక కాదు కానీ ఏమిటో నమ్మకమూ, ఆసక్తి లేవంతే. so, ఉపవాసాలు కూడా చెయ్యలేదు.

నెలరోజులూ సాయంత్రాలు తులశమ్మ దగ్గర దీపంతో పాటూ కార్తీకపురాణంలో ఒకో అధ్యాయం చదివేసుకున్నా. కార్తీకపురాణంలో, సోమవారాలు శివలయంలో పొద్దున్న కానీ, సాయంత్రం కానీ దీపం వెలిగిస్తే బోలెడు పుణ్యమని రాసారు కదా అని శ్రధ్ధగా ప్రతి సోమవారం వెళ్ళి ఉసిరి చెట్టు క్రింద ఆవునేతిదీపం పెట్టేసి, పట్టుకెళ్ళిన పుస్తకంలోంచి నాలుగైదు స్తోత్రాలు అవీ చదివేసుకుని మరీ వచ్చేదాన్ని. ఆ గుడి ప్రాంగణం విశాలంగా ఉండి పేద్ద పేద్ద చెట్లు ఉంటాయి. నాకిష్టమైన కాగడా మల్లెపూల చెట్టు కూడా. దాని క్రిందే కూచునేదాన్ని మంచి సువాసన వస్తూంటుందని....:))


మధ్యలో ఓ ఆదివారం కీసరగుట్ట వెళ్ళి రామలింగేశ్వరస్వామి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత అక్కడ ఉన్న పార్కులో అందరూ వనభోజనాలు చేస్తూంటే మేమూ సేదతీరాం. ఓ చెట్టు క్రింద కూచుని గుళ్ళో కొన్న పులిహార పేకేట్లు తినేసాం. తీరా చూస్తే మేం కూచున్నది బిళ్వవృక్షం క్రిందన. చుట్టూరా బోలెడు మండి వంటలు కూడా అక్కడే వండుకుంటున్నారు. భలే భలే మనకూ వనభోజనాలయిపోయాయి అనేసుకున్నాం.




క్షీరాబ్ది ద్వాదశి నాడు చేసే పూజ నాకు చాలా ఇష్టం కాబట్టి అది బాగా చేసుకున్నా. ఈసారి అమ్మ మాటికి వచ్చింది. నేను, అమ్మ, పాప కలిసి పూజ చేసుకుంటుంటే భలే ఆనందం వేసింది. మళ్ళీ కార్తీకపౌర్ణమి పూటా శివాలయంలోనూ , ఇంట్లో తులశమ్మ దగ్గరా 365 వత్తులతో, ఉసిరి కాయతోనూ దీపం వెలిగించానా, ఇంకా ఎందుకైనా మంచిదని విష్ణుసహస్రనామాలు అవీ కూడా చదివేసా. మధ్యలో నాగులచవితి వచ్చిందా...అప్పుడు కూడా పుట్టకు వెళ్ళే ఆనవాయితీ లేదు కాబట్టి ఇంట్లోనే తులశమ్మలోని మట్టితో పుట్టలా చేసి, అందిమీద నావద్ద ఉన్న రాగి నాగపడగను కూచోబెట్టి ఇంట్లో అందరితో పాలు పోయించా. చిమ్మిలి, చలివిడి చేసి నైవేద్యం పెట్టా కానీ పుట్టకు ఫోటోతియ్యటం మర్చిపోయా...:( ఇక పౌర్ణమి అయిపోతే కార్తీకంలో మేజర్ పూజలన్నీ అయిపోయినట్లే. మిగిలిన రోజులు సాయంత్రాలు దీపం పెడుతూ ఉండటమే. నిన్నటి అమావాస్య దాకా.

అమావాస్య వెళ్ళిన పాడ్యమి తెల్లవారుఝామున "పోలి" అనే ఆవిడ కార్తీక దీపాలు ఇంట్లోనే, అదీ వెన్న చిలికిన కవ్వానికున్న వెన్నతో దీపాలు శ్రధ్ధగా పెట్టిన కారణంగా స్వర్గానికి వెళ్ళిందట. అందుకని ప్రతిఏడూ కార్తీకమాసం అయిపోయిన మర్నాడు పాడ్యమి తెల్లవారుఝామున లేచి నదీస్నానం చేసి, అరటిదొప్పలో ఆవునేతివత్తులు వేసి నదిలో దీపాలు వదులుతారు చాలామంది. నెలంతా దీపాలు పెట్టలేకపోయినా ఈ రోజు ముఫ్ఫై దీపాలూ పెడితే చాలని అన్ని దీపాలూ వదులుతారు. నదీ స్నానం చేసి అక్కడ దీపాలు పెట్టడం కుదరనివారు ఇంట్లోనే తులసమ్మ దగ్గర పళ్ళేం లోనో, పేద్ద బేసిన్ లోనో నీళ్ళు పోసి అందులోనే దీపాలు పెడతారు అమ్మలాగ. చిన్నప్పుడు అలా పళ్ళేంలో నీళ్ళల్లో అమ్మ దీపాలు పెట్టడం బావుండేది చూట్టానికి. ఇప్పుడు నేనూ అమ్మలాగ రాత్రే ఆవునెయ్యిలో వత్తులు వేసి ఉంచేసి, పొద్దున్నే అరటిదొప్పలో వత్తులు వెలిగించి నీళ్ళల్లో దీపాలు వదులుతున్నను క్రింద ఫోటోలోలాగ.




ఇంకా, కార్తీక మాసంలో ఎవరైనా పెద్ద ముత్తయిదువను పిలిచి పసుపు రాసి, పువ్వులు, పళ్ళు, పసుపు, కుంకుమ పెట్టి చీర పెడితే చాలా పుణ్యమని ఓ పుస్తకంలో చదివాను. ఎవరిని పిలవాలా అని ఆలోచిస్తూంటే అమ్మనాన్న ఉన్నారని మా పిన్నిలిద్దరూ, మరికొందరు కజిన్స్ అంతాకలిసి ఓరోజు ఇంటికొచ్చారు. ఇంకేముంది నాకు పండగే పండగ. మొత్తం అయిదుగురినీ కూచోపెట్టి పసుపు రాసేసి, మిగిలినవన్నీ పెట్టి అందరికీ తలో చీరా పెట్టేసి దణ్ణం పేట్టేసా. ఎంత పుణ్యమో కదా. శభాష్ శభాష్... అని భుజం తట్టేసుకున్నా..! నేనూ ఖుష్. బంధువులూ ఖుష్. దేవుడూ ఖుష్.

ఇక ఇవాళ పొద్దుటే దీపాలు వదలటంతో కార్తీకం అయ్యింది. హామ్మయ్య అనుకుని గాఠ్ఠిగా ఊపిరి తీసుకుని ఓ పుస్తకం పట్టుకున్నానా, మార్గశిర శుధ్ధ పాడ్యమి నాడు విష్ణుసహస్రనామం చదివితే మంచిది అని ఉంది ఆ పుస్తకంలో. సరే ఇంత పొద్దుటే చీకట్లో చేసే పనేముంది అనేసుకుని ఆ సహస్రనామాలు కూడా పూర్తయ్యాయనిపించా !!




ఈ విధంగా ఈసారి నా అకౌంట్ లో ఎప్పుడూకన్నా కాస్తంత ఎక్కువ పుణ్యమే పడేసుకున్నా...:)) దాంట్లోంచి ఎలాగూ సగం శ్రీవారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుందనుకోండి. ( భర్తల పాపంలో మనకూ వాటా ఉంటుందిట, మన పుణ్యంలో వారికి వాటా వెళ్తుందిట....:(( అసలిది దేవుడితో డిస్కస్ చేయాల్సిన పేద్ద విషయం.) మరీ నాలుగింటికి లేచానేమో.. బాగా నిద్ర వస్తోంది. ఇంక కాసేపు బజ్జుంటా.

యూట్యూబ్ లో పోలి స్వర్గం కథ రెండూ భాగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు చూడండి:
http://www.youtube.com/watch?v=a9459H0nerI&feature=related




Friday, November 25, 2011

అప్పుడేమైందంటే...


గత రెండు వారాల్లో ఇద్దరు ముగ్గురు ఫెండ్స్ మైల్ చేసారు. వారి మైల్స్ లో ఒకటే మెసేజ్..."సర్దుకోవటం అయ్యిందా? రోజూ చూస్తున్నా...బ్లాగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నావ్?" అని. ఏం రాయాలో తెలియక జవాబే రాయలేదు. నిన్నమరో ఫ్రెండ్ ఫోన్ చేసింది "ఎక్కడున్నావ్? ఏంటి సంగతులు?" అని. ఇక చెప్పక తప్పలేదు... " లేదు. మేం ఇక్కడే ఉన్నాం...వెళ్ళనే లేదు.." అని. 'అదేమిటి చెప్పావు కాదే...' అని ఆశ్చర్యపోయింది నా మిత్రురాలు ! అప్పుడేమైందంటే... అని చెప్పుకొచ్చాను..

చుట్టాలకూ, స్నేహితులకూ, బ్లాగ్మిత్రులకూ అందరికీ డప్పు కొట్టేసాను.. వెళ్పోతున్నాం.. వెళ్పోతున్నాం... అని. సామాను సగం సర్దేసాం. టికెట్స్ బుక్ చేసేసాం. పేకర్స్ వాడిని మాట్టాడేసాం. కొత్త ఊర్లో పాపకు స్కూలు మాట్టాడేసాం. నెల ముందే అక్కడ ఇంటికి అద్దెతో పాటూ ఏడ్వాన్స్ కూడా ఇచ్చేసాం. ఇంక నాల్రోజుల్లో ప్రయాణం అనగా అప్పటిదాకా మౌనంగా ఉన్న పాత ఆఫీసు బాసుగారి బుర్రలో బల్బు వెలిగింది. ఓహో ఇతగాడు వెళ్పోతే ఎలా...అని కంగారు పుట్టింది. ఇక మొదలుపెట్టాడు నస. రిలీవ్ చెయ్యటానికి రావటం కుదరట్లేదన్నాడు. ప్రయాణం పోస్ట్ పోన్ చేసుకొమ్మన్నాడు. మాదసలే ఆఫీసు కం రెసిడెన్స్. అతగాడికి మేమన్నీ అప్పజెపితే కానీ కదలటానికి లేదు. అలాగలాగ మరో పదిరోజులు గడిచాయి. ఈలోపూ నా దసరా పుజలు ఇక్కడే అయిపోయాయి. శెలవులు అయి స్కూళ్ళు మొదలైపోయాయి. ఇక తను కదిలినా నేను,పాప కదలటానికి లేదు. ఎలాగెలాగ అని టెన్షన్. అక్కడ కొత్తాఫీసువాళ్ళు ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని శ్రీవారిని తొందరపెట్టేస్తున్నారు.

ఈలోపూ మరో రెండు దారులు రారమ్మంటూ ఎదురయ్యాయి. అదీ, ఇదీ కాక మరో రెండు దారులా .... బాబోయ్... అనుకున్నాం. ఎటువైపు వెళ్లాలో తెలియదు. అసలు ఎక్కడికైనా వెళ్తామో వెళ్ళమో తెలియదు. గడిచిన రెండు నెలల కాలం ఎంత ఉద్వేగంతో, సంఘర్షణతో నడిచిందో... పరిస్థితులు మాలో ఎంత చికాకునీ, అనిశ్చింతనీ పెంచి పోషించాయో మా మనసులకు తెలుసు. చుట్టుతా అయోమయం, అసందిగ్ధం తప్ప మరేమీ కనబడేది కాదు.

చివరకు కొన్ని మాటలు జరిగాకా వాళ్ళ పాత ఆఫీసువాళ్ళు ఉండిపొమ్మని అడిగారు. సరే అయినవాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. పొరుగు రాష్ట్రం పోయి నా..అనేవాళ్ళు లేక, అర్ధంగాని ఆ అరవభాషను భరించటం కన్నా ఇక్కడ ఉండటమే మేలని నిర్ణయించుకున్నాం. సరేనని ఒప్పేసుకున్నాం. లేకపోతే ఈ కార్తీకమాసం అంతా మద్రాసు మహనగరంలో గడపవలసిన మాట..!! ఊరు మారలేదు కాబట్టి ఇంత త్వరగా మళ్ళీ నా బ్లాగ్ ముహం నేను చూడగలిగాను. లేకపోతే ఇహ ఇప్పట్లో మరో ఆరేడు నెలలు దాకా ఇటువైపు రాలేనని బెంగ పడిపోయా !

ఇలాంటివి సంఘర్షణలు, నిర్ణయాలు జరిగినప్పుడే మరీ బలంగా అనిపిస్తుంది..."అనుకున్నామని జరగవు అన్నీ..అనుకోలేదని ఆగవు కొన్ని...జరిగేవన్నీ మంచికనీ అనుకోవటమే మనిషి పని..." అని.

Wednesday, November 23, 2011

Anuranan - a resonance


అప్పుడెప్పుడో ప్లానెట్ ఎం లో తీసుకున్న ఒక సీడి కొన్ని నెలల తరువాత ఓపెన్ చేసి చూస్తే సరిగ్గా లేదు. తిరిగి ఇచ్చేస్తే తీసుకుంటాడో లేదో అన్న సందేహంతో వెళ్ళే సరికీ మరో సీడీ తీసుకోండి అన్నారువాళ్ళు. ఏం కొనాలా అని వెతుకుతూంటే కనబడింది బెంగాలీ చిత్ర దర్శకుడు అనిరుధ్ధ్ రాయ్ చౌదరి తీసిన "అనురనన్" అనే హిందీ సినిమా. mainmeri-patni-aur-woh సినిమాతో నచ్చేసిన రితుపర్నాసేన్ గుప్తా, ఇంకా రాహుల్ బోస్ , రైమా సేన్ మొదలైనవారు కనబడేసరికీ బావుంటుందనిపించి సీడీ తీసేసుకున్నాను.

కథనం కొద్దిగా స్లోగా సాగినా ఆసక్తికరంగా ఉండటంతో చివరిదాకా చూసాం. కానీ చివర్లో ఎదురైన ట్విస్ట్ చూసి...ఎండింగ్ లో ఈ ట్రేజెడి ఏంటీ...అని బెంబేలెత్తిపోయాం. అయితే సినిమా చివరిలో వచ్చే ఒకే ఒక డైలాగు ఆ కథ బాగా నచ్చేలా చేసింది. నిజంగా భార్యాభర్తల అనుబంధం ఇలా ఉండాలి....ఒకరిపై ఒకరికి నమ్మకం ఇలా ఉండాలి అనిపించేలా ఉన్న క్లైమాక్స్ మనసుకు హత్తుకునేలా ఉంది. "a friend is one.. who comes in when the whole world has gone out.." అని ఒక కొటేషన్ ఉంది. భార్యాభర్తల అనుబంధం స్నేహంతొనే ముడిపడుతుంది కాబట్టి, ప్రపంచం అంతా నమ్మినా నమ్మకపోయినా జీవిత భాగస్వామి నమ్మకం, వారి అనుబంధం ఇలా ఉండాలి.. అన్న సిధ్ధాంతాన్ని చూపిస్తుందీ సినిమా.

"అనురనన్ - a resonance" అన్నది సినిమా పేరు. resonance అంటే అనుకంపన. అంటే ప్రతిధ్వని అనుకోవచ్చేమో. రాహుల్ - నందిత, అమిత్ - ప్రీతి; ఈ రెండు జంటలు కలినప్పుడు, ఆ నలుగురి పరిచయం వారి వారి వైవాహిక జీవితాలపై చూపిన ప్రభావమే కథాంశం. అదే resonance. రాహుల్, నందిత కొన్నేళ్ళుగా లండన్ లో ఉంటుంటారు. కాంచనజంగ లో ఒక రిసార్ట్ కట్టే ఉద్యోగబాధ్యతపై రాహుల్ ను ఇండియా ట్రాన్స్ఫర్ చేస్తారు. లండన్ లో పరిచయమైన అమిత్, ప్రీతి దంపతులు ఇండియాలో వీరికి స్నేహితులుగా మారతారు. నొనీగా పిలవబడే నందిత మొదటి పరిచయంలోనే ప్రీతి జీవితంలో వెలితినీ, ఆమెలోని శూన్యతను పసిగడుతుంది. రాహుల్ ఊరు వెళ్ళినప్పుడు నందితను పలకరించటానికి అమిత్,ప్రీతి వచ్చినప్పటి సీన్ చాలా బావుంటుంది. అలంకరణ లేకుండా ఉదాసీనంగా ఉన్న నందిత ముహంలో భర్తను మిస్సవుతున్న భావం బాగా కనబడుతుంది. అదే సమయంలో వంటింట్లో బీటేన్ కాఫీ చేస్తుండగా వచ్చిన ప్రీతిని "दॊनॊं मॆं दरार कहां है? शरीर मॆं या मन मॆं या प्यार मॆं..." అని అడగటం, ప్రీతి దాటువెయ్యటం, "भागना है तॊ भाग.. लॆकिन खुद सॆ नही.." అని నందిత అన్న సీన్ చాలా నచ్చింది నాకు. ఈ సీన్ నందిత పాత్రను, ఆమె సునిశిత దృష్టినీ, వ్యక్తిత్వాన్నీ మరింత ఎలివేట్ చేస్తుంది.


రాహుల్ సినిమా మొదటి నుంచీ తన డిక్టాఫోన్(Digital Voice Recorder ) లో తన భావాలూ, అభిప్రాయాలూ రికార్డ్ చేస్తూ ఉండటం వెరైటీగా బాగుంది. సినిమా చివరలో కూడా కొన్ని బంధాలకు పేర్లు పెట్టలేము అని మాట్లాడే వాక్యాలు బాగుంటాయి. అవి కూడా అనుమానాన్ని వ్యక్తం చేసేలా ఉన్నా కూడా;ప్రీతి భర్తతొ సహా అందరూ రాహుల్,ప్రీతి ల స్నేహాన్ని అపార్ధం చేసుకున్నా సరే, అతనిని అపార్ధం చేసుకోకపోవటం ఆ భార్యాభర్తల గాఢానుబంధాన్ని తెలియజేస్తుంది.



రాహుల్, నందిత పాత్రల్లో అన్యోన్యమైన జంటగా రాహుల్ బోస్, రితుపర్నాసేన్ గుప్తా ల నటన ఆకట్టుకుంటుంది. భారతీయత ఉట్టిపడేలా చక్కని కాటన్ చీరల్లో, నుదుటిన ఎర్రని బొట్టుతో హీరోయిన్లిద్దరూ కనువిందు చేసారు. ముఖ్యంగా జుట్టుకు పెద్ద ముడి, కాటన్ చీర, నుదుటిన ఎర్రని బొట్టుతో సుచిత్ర సేన్ మనవరాలు, మున్ మున్ సేన్ కుమార్తె అయిన రైమా సేన్ చాలా అందంగా కనబడింది. నటన ఈమె రక్తంలో ఉందేమో అనిపించింది.



పౌర్ణమి పూట హిమాలయాలపై వెన్నెల పడే దృశ్యాన్ని అతి హృద్యంగా చిత్ర్రీకరించారు. ఆ సన్నివేశం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ రాహుల్ - ప్రీటి ల మధ్య డైలాగ్స్ కూడా బాగున్నాయి. అంతం చాలా బరువుగా విషాద భరితంగా నాకు నచ్చని విధంగా ఉన్నా కూడా, రాహుల్ ని అతని భార్య అర్ధం చేసుకుంది అని తెలపటం కాస్త ఊరటనిచ్చింది. సినిమా చివరి సన్నివేశంలో నందిత "चल पगली...तन सॆ कॊई उड सकता हैं? मन कॆ साथ उड...आत्मा कॆ साथ उड... फिर दॆखना सारा आकाश निछावर हॊजायॆगा तॆरॆ सामनॆ...ऎ मैं केह रही हूं तुम्सॆ केह रही हूं..." అంటుంది హాస్పటల్ బెడ్ పై ఉన్న ప్రీతి చేతిని తన చేతిలోకి తీసుకుని ! " ऎ मैं केह रही हूं तुम्सॆ केह रही हूं..." అన్న ఒక్క వాక్యంలో బోలెడు అర్ధం. ప్రీటి భర్త అమిత్ ఫోన్ చేసి సానుభూతి మాటలు చెప్పినప్పుడూ ఫోన్ మధ్యలో కట్ చేసేసి ఆమె ఏడుస్తుంది. దాని అర్ధం ఈ డైలాగ్ తో మనకు తెలుస్తుంది. కథనం స్లోగా ఉన్నా, అద్భుతమైన చిత్రీకరణ, అందమైన లాంస్కేప్స్, సరౌండింగ్స్ ముచ్చట గొలుపుతాయి. కథలోని ట్విస్ట్ మనసును భారం చేసినా, భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చూపిన ఈ చిత్రం చూడతగ్గది.

Tuesday, November 22, 2011

జంధ్యాల గారి "చిన్నికృష్ణుడు"(1988) నుంచి రెండు మంచి పాటలు..





రమేష్ బాబు, ఖుష్బూ నటించిన జంధ్యాల గారి "చిన్నికృష్ణుడు" సిన్మా నుంచి రెండు మంచి పాటలు. రెండూ కూడా నాకు భలే ఇష్టం :


పాడినది: ఎస్.జానకి
సంగీతం: ఆర్.డి. బర్మన్
సాహిత్యం:వేటూరి


మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచే నా ప్రేమ
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా మందారాలు(2)

పొద్దే తాంబూలాలై ఎర్రనాయే సంజెలన్నీ
పల్లవించే ఊహలన్నీ నా ప్రేమ బాటలాయె
ఈ దూరం దూరతీరం ముద్దులాడేదెన్నడో ((ప))

కన్నె చెక్కిళ్ళలో సందె గోరింటాకు
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు(2)
వచ్చే మాఘమాసం పందిరేసే ముందుగానే
నీవూ నేను పల్లకీలో ఊరేగే శుభవేళ
నీ చిత్తం నా భాగ్యం మనువాడేదెన్నడో
((ప))
=============================================

2)song:జీవితం సప్తసాగర గీతం
పాడినది: ఆశా భోంస్లే
సంగీతం: ఆర్.డి. బర్మన్
సాహిత్యం:వేటూరి


ప: జీవితం సప్తసాగర గీతం
వెలుగు నీడల వేగం
సాగని పయనం
కల ఇల కౌగిలించే చోట(2)

1చ: ఏది భువనం ఏది గగనం తారాతోరణం
ఈ చికాగో సిల్స్ టవరే స్వర్గసోపానము
ఏది సత్యo ఏది స్వప్నం నిజమీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ
హే...బ్రహ్మ మానసచిత్రం చేతనాత్మక శిల్పం
మతి కృతి పల్లవించే చోట(2)
((ప))

2చ: ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేఛ్ఛా జ్యోతులు
ఐక్యరాజ్య సమితిలోనా కలిసే జాతులు
ఆకశాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మియామీ బీచ్ కన్న ప్రేమ సామ్రాజ్యము
హే..సృష్టికే ఇది అందం
దృష్టి కందని దృశ్యం
కవులు రాయని కావ్యం
కృషి ఖుషి సంగమించే చోట(2)
((ప))

Sunday, November 20, 2011

Speilberg - టిన్ టిన్


Steven Speilberg. ప్రపంచంలో అత్యధిక ప్రాచుర్యం పొందిన ప్రముఖ దర్శకుల్లో ఒకడు. నాకెంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకడు. ఊళ్ళోకి స్పీల్ బర్గ్ సినిమా వచ్చిందంటే మాకు తప్పకుండా చూపించేవారు నాన్న. అలాగ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాల్లో సగం పైనే సినిమాలు చూడగలగటం వల్ల అతనంటే ఒక విధమైన ఆరాధన. మా ముగ్గురికీ(siblings) సుపరిచితుడు. ఒక చిరకాల నేస్తం. ఒక యుధ్ధ నేపధ్యంతో తీసిన "షిండ్లర్స్ లిస్ట్" కు ఆస్కార్ అవార్డ్ రావటం అనందకరమే అయినా ,కెరీర్ ప్రారంభించిన ఎన్నో ఏళ్ల తరువాత ఆస్కార్ రావటం ఆశ్చర్యకరం. చాలా సినిమాలు నేను చూడటం కుదరనే లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు విచిత్రంగా మేం ముగ్గురం, నాన్నతో కలిసి ఇవాళ స్పీల్ బర్గ్ తీసిన " The Adventures of Tintin " 3D చూడటం మధురమైన అనుభూతిని మిగిల్చింది నాకు.

విశ్వ విఖ్యత కార్టూన్ కేరెక్టర్ "టిన్ టిన్" గురించి కొత్తగా చెప్పేదేమీలేదు. ఎన్నో యేనిమేషన్ సిరీస్ లూ, కార్టూన్ పుస్తకాలూ, టివీ సీరియళ్ళూ. ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, "టిన్ టిన్" కేరెక్టర్ స్పీల్ బర్గ్ కి చాలా ఇష్టమని... సినిమా తీయాలని కొన్నేళ్ళ క్రితమే స్క్రిప్ట్ రెడి చేసుకున్నాడని...అది ఇప్పటికి కార్య రూపం దాల్చిందని. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక
performance capture చిత్రం. అంటే సినిమాలోని పాత్రలను ఒక పధ్ధతి ద్వారా యేనిమేట్ చేస్తారు. గతంలో మొదటిసారిగా ఇలాంటి ప్రయోగంతో 2004 లో వచ్చిన చిత్రం "The Polar Express". 3D గానే కాక ఐమాక్స్ స్క్రీన్ కోసం ప్రత్యేకంగా తయారుచేసారు ఈ చిత్రాన్ని. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఈ టిన్ టిన్ సినిమా తీసారు. 3Dలో ఈ చిత్రాన్ని చూడటమే ఒక ఆనందం అనుకుంటే, performance capture technique లో చూడటం ఇంకా గొప్ప అనుభూతి.



గతంలో స్పీల్ బర్గ్ సినిమాలకు సంగీతాన్ని అందించిన జాన్ విలియమ్స్ ఈ సినిమాకు కూడా ఆకర్షణీయమైన నేపధ్య సంగీతాన్ని అందించాడు. చిత్రకథ ఒక సాహసోపేతమైన రిపోర్టర్ కథ. టిన్ టిన్ అనే ఒక చిన్న రిపోర్టర్ ఒక చోట అందంగా కనబడ్డ ఒక పాత ఓడ నమూనాను కొంటాడు. ఆ బొమ్మ లో ఏదో రహస్యం దాగి ఉందని అది తన ఇంటి నుండి దొంగలించబడ్డాకా అనుమానం వస్తుంది టిన్ టిన్ కి. దానిని వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి అలాంటివే మరో రెండు ఓడ నమూనాలు ఉన్నాయనీ, వాటి వెనుక ఎన్నో ఏళ్ళ క్రితం సముద్రం పాలైన ఒక గుప్తనిధి తాలూకూ వివరాలు దాగి ఉన్నాయని తెలుస్తుంది.


టిన్ టిన్ చివరికి ఆ రహస్యాన్ని చేదింఛగలుగుతాడా? నిధి అతనికి దొరుకుతుందా? అన్నది మిగిలిన కథ. కథలో మరో ముఖ్య పాత్ర టిన్ టిన్ పెంపుడు కుక్క "స్నోయీ"ది. టెక్నికల్ గా చాలా బాగుంది. సినిమా నాకయితే బాగా నచ్చేసింది.

పిల్లలు చాలా బాగా ఆనందిస్తారని అనిపించింది. కార్టూన్లూ, యేనిమేటెడ్ ఫిల్మ్స్ ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది.


స్పీల్ బర్గ్ ప్రేమికులెవరైనా ఉంటే వారికి మరో ఆనందకరమైన వార్త ఏంటంటే తను దర్శకత్వం వహించిన "War Horse" అనే సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాబోతోందొహోయ్ !!!

Saturday, November 19, 2011

బాపు-రమణల మ్యాజిక్ "శ్రీ రామరాజ్యం"


బాపూగారు తమ "శ్రీ రామరాజ్యం"తో నయనానందం, శ్రవణానందం, రసానందం మూడూ కలిగించారు. ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. తన సినిమా ద్వారా ప్రేక్షకుడికి నయనానందాన్ని అందించటం బాపూగారి సినిమాల్లోని ప్రత్యేకత. ఆ ఆనందానికి రమణ గారి సంభాషణలు శ్రవణానందాన్ని కూడా జోడిస్తాయి. ఈ రెండు కలిసి ప్రేక్షకుడికి శాశ్వత రసానందాన్ని మిగులుస్తాయి. అదే బాపు-రమణల మ్యాజిక్. ఆ మ్యాజిక్ మళ్ళీ జరిగింది. చాలా ఏళ్ల తరువాత. నెట్ బుకింగ్ కుదరక, చాలా రోజుల తర్వాత నిన్న గంట ముందు వెళ్ళి నిలబడి కౌంటర్లో మొదటి టికెట్టు నేనే కొన్నా. కష్టానికి ఫలితం దక్కింది. శాశ్వత రసానందం మిగిలింది.

చిన్నప్పుడు ఎన్నిసార్లో బాపూ బొమ్మలతో ఉన్న బొమ్మల రామాయణం పుస్తకాన్ని తిరగేస్తూ, ఆ బొమ్మలను చూస్తూ ఉండేవాళ్ళం. వాటిల్లో కొన్ని బొమ్మలు మా తమ్ముడు వేసాడు కూడా. ఆ బొమ్మలను టైటిల్స్ లో మరోసారి మళ్ళీ చూసి బాల్య స్మృతుల్లోకి వెళ్పోయా ప్రారంభం లోనే. ఎర్రటి కేన్వాస్ మీద తోరణంలో కదులుతున్న పచ్చటి మామిడిఆకులు చిత్రమైన ఆనందాన్ని కలిగించాయి. మళ్ళీ ఓ "సంపూర్ణ రామాయణం", ఓ "సీతా కల్యాణం", ఓ "శ్రీరమాంజనేయ యుద్దమో" చూస్తున్న భావన. ఇన్నాళ్ళకు మళ్ళీ తెరపై పూర్తినిడివి రంగుల చిత్రాన్ని గీసాడే బాపూ అని మనసు మురిసిపోయింది. రాముడి ద్వారా, వాల్మీకి ద్వారా చెప్పించిన కొన్ని రమణ గారి డైలాగులు ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ కొట్టినట్లు, చికాకుగాను అనిపించలేదు. టకా టకా సీన్ పై సీన్ వెళ్పోయింది. నటీనటులందరూ తమ వంతు నటనా బాధ్యతను సమర్ధవంతంగా పోషించేసారు. డైరెక్టర్ ప్రతిభ ప్రతి ఫ్రేం లోనూ కనబడింది. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఇదే టెక్నాలజీ అందుబాటులో ఉండిఉంటే స్పీల్ బర్గ్ సినిమాలను మించిన చిత్రాలను మన విఠలాచార్య వంటివారు అందించేవారు కదా అనిపించింది.

ఇళయరాజా కూడా చాన్నాళ్ళకు ఏకాగ్రతతో పనిచేసినట్లు నేపధ్య సంగీతం తెలుపకనే తెలిపింది. ముఖ్యమైన సన్నివేశాల వెనకాల వచ్చిన వయోలిన్స్ మొదలైనవి ఇళయరాజా మార్క్ సంగీతాన్ని అద్భుతంగా వినిపించాయి. పాటలు కూడా విడిగా వినేకన్నా సినిమాలో చూస్తూంటే ఇంకా బాగున్నాయి అనిపించాయి. "జగదానంద", "ఎవడున్నాడీ లోకంలో", "రామ రామ రామ అనే రాజమందిరం" మూడు పాటలు నాకు బాగా నచ్చాయి. బాలు గళం చాన్నాళ్ళకు ఖంగుమంది.బాపూగారు ముందే చిత్రం గీసేసి, సన్నివేశాన్ని అలానే చిత్రీకరిస్తారని వినికిడి. ప్రతీ సన్నివేశానికీ బాపూ గారి ఫ్రేమింగ్, రాజు గారి సినిమాటోగ్రఫీ అద్భుతంగా కుదిరాయి. కొని దాచుకున్న పౌరాణిక చిత్రాల సీడీలకు ఈ చిత్రాన్ని కూడా జోడించాలి అని బలంగా అనిపించేలా ఉంది చిత్రం.

బాలకృష్ణ, నయనతార, శ్రీకాంత్ మొదలైన నటులను వారి పాత్రలలో చూసి ప్రేక్షకుడి మనసు తృప్తి పడిందంటే అది ఆ యా నటుల కృషి తో పాటుగా, వారితో అలా నటింపజేసిన ఘనత దర్శకుడిదే. సునీతా డబ్బింగ్ వాయిస్ సీత పాత్రకు ప్రాణం పోసిందని చెప్పాలి. ఏ.ఎన్.ఆర్ నటన చిత్రానికి అదనపు ఆకర్షణ. వశిష్ఠులవారిగా నటించిన బాలయ్యగారు డైలాగులు చెప్పేందుకు కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించగా, ఇంత వయసులో కూడా అంత స్పష్టంగా, పూర్వపు ధాటితో ఆయన డైలాగు చెప్పటం ఆశ్చర్యపరిచింది. నాగేశ్వరరావు సినీప్రస్థానంలో మరో మైలు రాయిగా ఈ వాల్మీకి పాత్ర నిలిచిపోతుంది. హనుమంతుడి పాత్రధారి నటన కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా కోయపిల్లవాడు బాలరాజుగా చేసిన పిల్లవాడు నాకు లవకుశుల కన్నా బాగా నచ్చేసాడు. లవకుశలుగా వేసిన పిల్లలిద్దరూ కాస్తంత బొద్దుగా ఉంటే బాగుండేదేమో అనిపించింది కానీ నటనలో ఎక్కడా ఓవరేక్షన్ వగైరాలు లేకుండా బహుచక్కగా చేసారు. పాటలు పాడేప్పుడు కూడా లిప్ సింక్ బాగా కుదిరింది.

అయితే అన్నీ ప్రశంసలేనా? లోపాలే లేవా సినిమాలో అంటే ఉన్నాయి. నటనా పరంగా ఒకటి రెండు చెప్పలంటే నయనతార ఎంత వంకపెట్టలేనటువంటి అత్యుత్తమ నటన కనబరిచినా "సీతాదేవి" వంటి శక్తివంతమైన పౌరాణిక పాత్రలో అంజలీదేవిలో, చంద్రకళనో, జయప్రదనో, బీ.సరోజాదేవినో మరచి నయనతార ను కూర్చోబెట్టలేకపోయాను నేను. బహుశా ఆమె బాపు మార్క్ పెద్ద కళ్ళ హీరోయిన్ కాకపోవటం కారణం కావచ్చు. ఇక వీపుపై ఎన్.టి.ఆర్ లాగనే పుట్టుమచ్చను పెట్టుకున్నా కూడా రాముడన్న, కృష్ణుడన్నా ఎన్.టి.ఆర్ మాత్రమేనన్న నానుడిని అధిగమించటం మరెవరివల్లా కాదేమో అనిపించింది. ఎన్.టి.ఆర్ లోని గాంభీర్యం కూడా బాలకృష్ణ నటనలో లోపించిందేమో అని కూడా అనిపించింది. అయినా చంద్రుడి అందాన్ని చూస్తామే కానీ మచ్చలు వెతుకుతామా మరి? ఇదీ అంతే. రా-వన్, రోబో లాంటి సినిమాలూ మాత్రమే పిల్లలకు ఎంటర్టైన్మెంట్ గా మారిన నేటి సూపర్ ఫాస్ట్ శతాబ్దపు రోజుల్లో అత్యుత్తమ విలువలతో ఇటువంటి పౌరాణిక చిత్రం రావటమే అదృష్టం నా దృష్టిలో.




కాకపోతే ఈ విజయానందాన్ని అనుభూతి చెందటానికీ, పంచుకోవటానికీ "రమణ" గారు బాపుగారితో, మనతో లేరన్నదొక్కటే విచారకరమైన విషయం. మొత్తమ్మీద రమణగారికి అంకితమిచ్చిన ఈ చిత్రం బాపురమణల కీర్తిప్రతిష్ఠలకు మరో కలికి తురాయి.