సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, February 26, 2010

ఎవరు నువ్వని?


కేరింతలాడుతూ పరుగులెడుతూ దోబూచులాడుతున్న
అమాయకత్వాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
గారాల పాపాయిని అంది.

పుస్తకాలతో కుస్తీలు పడుతూ హడావుడిపడుతున్న
రిబ్బను జడల చలాకీతనాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
పోటీప్రపంచెంలోని విద్యార్ధిని అంది.

కళ్ళనిండా కాటుకతో
కలతన్నదెరుగని ఊహాసుందరిని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
విరబుసిన మందారాన్ని...కన్నెపిల్లని అంది.

చెలిమితో చెట్టాపట్టాలేసుకుని తిరగాడే
ఆర్తితో నిండిన నమ్మకాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
సృష్టిలో తీయనైన స్నేహహస్తాన్ని అంది.

అధికారంతో ఆ చేతులకు
రాఖీలు కడుతున్న ఆప్యాయతనడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
అన్నదమ్ముల క్షేమాన్ని కాంక్షించే సహోదరిని అంది.

సన్నజాజుల పరిమళాలను ఆస్వాదిస్తూ
వెన్నెల్లో విహరిస్తున్న అందాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నెనెవరో తెలియదా...
నా రాజుకై ఎదురుచూస్తున్న విరహిణిని అంది.

పెళ్ళిచూపుల్లో తలవంచుకుని బిడియపడుతున్న
సిగ్గులమొగ్గను అడిగాను
ఎవరు నువ్వని?
నెనెవరో తెలియదా...
అమ్మానాన్నల ముద్దుల కూతురుని అంది.

మెడలో మెరిసే మాంగల్యంతో
తనలో తానే మురిసిపోతున్న గర్వాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
దరికి చేరిన నావను..నా రాజుకిక రాణిని అంది.

వాడిన మోముతో, చెరగని చిరునవ్వుతో
తకధిమిలాడుతున్న సహనాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
బరువు బాధ్యతలు సమంగా మోసే ఓ ఇంటి కోడలిని అంది.

విభిన్న భావాలను సమతుల్యపరుస్తూ
కలహాలను దాటుకుని
పయనిస్తున్న అనురాగాన్ని అడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా..
కలకాలం అతని వెంట
జంటగా నిలిచే భార్యను అంది.

నెలలు నిండుతున్న భారంతో
చంకలో మరో పాపతో సతమతమౌతున్న
సంఘర్షణ నడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
ముద్దు మురిపాలు పంచి ఇచ్చే తల్లిని అంది.

అర్ధంకాని పాఠాలను అర్ధం చేసుకుంటూ
పిల్లలకు పాఠాలు నేర్పుతున్న ఓర్పు నడిగాను
ఎవరు నువ్వని?
నేనెవరో తెలియదా...
నా చిన్నారులకు మొదటి గురువుని అంది.

ఇక్కడిదాకా రాసి ఆగిన
కలాన్ని అడిగాను ఆగిపోయావేమని...
ఇంకా అనుభవానికి రాని భావాలను
వ్యక్తపరిచేదెలా..అని ప్రశ్నించింది..!!

Saturday, February 20, 2010

రాగ సుధారస



వాగ్గేయకారులలో నాకెంతో ఇష్టమైన "త్యాగయ్య" కృతులను కొన్నింటినైనా బ్లాగ్లో రాయాలని సంకల్పం. జనవరి నెలలో ఒకటి రాసాను. ఇది నాకు నచ్చిన మరొక కీర్తన...
బాలమురళిగారు పాడిన ఈ కీర్తన ఇక్కడ వినవచ్చు:




త్యాగరాయ కృతి
రాగం: ఆందోళిక
తాళం: ఆది

ప: రాగ సుధారస పానము చేసి - రంజిల్లవే ఓ మనసా (ప)
అ.ప : యాగ యోగ త్యాగ - భోగఫల మొసంగే (ప)

చ: సదాశివమయమగు - నాదోంకారస్వర
విదులు జీవన్ముక్తు - లని త్యాగరాజు తెలియు (ప)

నా కర్ధమైన అర్ధము:

ఓ మనసా! రాగమనెడి అమృతమును సేవించి రంజిల్లుము. ఇది యాగము, యోగము, త్యాగము, భోగము మొదలైన భోగముల ఫలములను అందిస్తుంది. నాదము సదాశివమయమైనది.ఓంకారూపమందు నిలిచిన ఆ నాదమే రాగమైయింది. ఈ సత్యానెరిగినవారంతా జీవన్ముక్తులు అన్నది త్యాగరాజు తెలుసుకున్న సత్యం.

Monday, February 15, 2010

పుత్రికోత్సాహం...


"పుత్రోత్సాహం" లాగ పుత్రికోత్సాహం నాలో పొంగి పొరలింది మొన్నటి రోజున...ఎందుకంటారా? వాళ్ళ స్కూలు ఏన్యువల్ డే సందర్భంగా జరిగిన ఫంక్షన్లో మా ఐదేళ్ల పాప మొదటిసారి స్టేజి ఎక్కి "వెల్కం డాన్స్" చేసింది. భయపడకుండా, ధైర్యంగా, నవ్వుతూ, కాంఫిడెంట్గా..! నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...బహుశా వాటినే పెద్దలు ఆనందభాష్పాలు అంటారేమో..
ఆ రోజు పాప పుట్టినరోజు కూడా అవ్వటం నాకు ఇంకా సంతోషాన్ని కలిగించింది. సమయానికి మావాళ్ళెవరూ ఊళ్ళో లేకపోయారు. అమ్మ,తమ్ముడు మాత్రం రాగలిగారు.

కాకి పిల్ల కాకికి ముద్దు. ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు. కానీ మా పాపకు మొదట్లో పుట్టిన ఐదు నెలల్లో రెండు ఆపరేషన్లు జరగటం...ఆరునెలలుదాకా నిద్రాహారాలు లేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మనుషుల్లో పడిన పిల్ల అవటంవల్ల మాకు అందరికీ అదెంతో అపురూపం. అలా కళ్ళలో పెట్టుకు పెంచినపిల్ల ఇవాళ స్టేజి మీద డాన్స్ చేస్తూంటే మరి ఆనందమేగా. నాలోని నెగెటివె పోయింట్స్ రాకుండా అన్నీ మంచి గుణాలను అది పుణికిపుచ్చుకోవటం అదృష్టమే అనుకుంటాను. భగవంతుని దయ వల్ల పాప మంచి చదువు చదివి తన కాళ్ళపై తాను నిలబడాలని నా ఆకాంక్ష.

ఇదంతా బాగుంది కానీ తెర వెనుక కధ కూడా రాయాలని...

డాన్సు ప్రాక్టిసు కోసం నెల రోజులనుంచీ స్కూలువాళ్ళు పిల్లలను తెగ తోమేసారు. హోం వర్క్ లేదు చదువు లెదు. డాన్సులే డాన్సులు. పిల్ల ఇంటికి వచ్చి కాళ్ళు నెప్పులని గొడవ. ప్రొగ్రాం రోజున మూడింటికి పిల్లలను పంపమంటే పంపాము. నాలుగున్నరకు కార్యక్రమం మొదలౌతుందంతె నాలుగింటికే వెళ్ళి కూర్చున్నాము. స్టేజి తయారి దగ్గర నుంచీ కుర్చీలు వేయటం దాకా అంతా చూస్తూ దోమల చేత కుట్టించుకుంటూ కూర్చుంటే....ఏడున్నరకు మొదలెట్టారు. గెస్ట్ లందరి స్పీచ్లు అయ్యి కల్చురల్ ప్రోగ్రాంస్ మొదలయ్యే సరికీ ఎనిమిది దాటింది.

అదృష్టవశాత్తూ మా పాపది వెల్కం డాన్స్ అవటం వల్ల ముందు అది అయిపోయింది. కాని మొత్తం అయ్యేదాకా పిల్లలను పంపము అన్నారు. వంట్లో బాలేదు అంత సేపు కూర్చోలేను మొర్రో అని మొత్తుకున్నా వినరే...! మొత్తానికి ఎలాగో బ్రతిమిలాది నీరసంతో ఇంటికీ రాత్రి వచ్చేసరికీ పది అయ్యింది.


పుత్రికోత్సాహం సంగతి ఎలా ఉన్నా ఇంకెప్పుడు ఇలా డాన్సులకు పంపకూడదు అని నిర్ణయించుకున్నాను ప్రస్తుతానికి.కానీ తరువాత పాప ఇష్టపడి చెస్తాను అంటే చేసేదేముండదని తెలుసు..:) ఎందుకంటే వాళ్ళ ఉత్సాహాన్ని ఆపే ప్రయత్నం చేయలేము కదా. కాకపోతే ముందుగానే పర్మిషన్లూ అవి తీసుకుని ఉంచుకోవాలి అనుకున్నాము.

చలిలో పిల్లలను స్టేజీ పక్కన కూర్చోపెట్టారు.పిల్లలకు చలి+ దోమలు కుట్టేసి దద్దుర్లు. 4,5 గంటలు ఆకలితో ఉన్నారని మనకు బాధ తప్ప వాళ్ళకు ఆ ఉత్సాహంలో ఆకలే తెలియలేదు...:)

Friday, February 5, 2010

ఏది శాశ్వతం?

ఏది శాశ్వతం..?జీవితంలోని ఏది ఏది శాశ్వతం కాదని తెలిసినా...ఈ ప్రశ్నను ఇప్పటికి గత రెండు రోజుల్లో వేయి సార్లు వేసుకుని ఉంటాను..! కాస్త విశ్రాంతిగా ఉంటుందని అమ్మావాళ్ళింటికి వచ్చాను. అందుకే మనసునాపుకోలేక అమ్మ ఆ మాయ కంప్యూటర్ జోలికి వెళ్లకని వారిస్తున్నా...ఇలా వెంఠనే తపా రాయగలుగుతున్నాను...

నేను రాయబోయేది కధ కాదు...ఒక జరిగిన యదార్ధం...అది వింటూంటే అసలు దేముడు అంత నిర్దయంగా అయిపోయాడే అనిపిస్తుంది...మనసు వికలమౌతుంది...నేను ఈ సంగతి రాసేది ఎవరి మనసునీ భారం చెయ్యాలని కాదు. కానీ, జీవితంలో ఏదీ మన చేతుల్లో ఉండదు...మనం కేవలం నిమిత్తమాత్రులమే అని మనకు తెలియచెప్పటానికి నాకు ఎదురైన ఒక ఉదాహరణను తెలుపాలని ఇది రాస్తున్నాను..

ఒక అందమైన కుటుంబం. మావారి సమీప బంధువులు. భార్య,భర్త,అమ్మాయి,అబ్బయి. రెండేళ్ల క్రితం ఇంజినీరింగ్ చదువుతున్న ఆ ఇరవై ఏళ్ళ అబ్బాయి హటాత్తుగా అలవిగాని అనారోగ్యం వచ్చి ఒక సంవత్సరం నానా యాతనా అనుభవించి ప్రాణాలు వదిలాడు. ప్రానం నిలవదని తెలిసినా లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించారు తల్లిదండ్రులు...అయినా ఫలితం దక్కలేదు.ఆ తల్లి బాధ వర్ణనాతీతం...మళ్ళీ రెందేళ్ళ తరువాత ఆమధ్యన ఆ తల్లిని చూసి నేను గుర్తుపట్తలెకపోయాను. అంతగా పాడయిపోయారు ఆవిడ .ఎంతో అందమైన రూపం ... అసలు గుర్తుపట్టలేనంతగా పాడయిపోయారు. మనోవ్యధకు మందు లేదంటే ఏమిటో ఆవిడను చూస్తే అర్ధమైంది..!

ఇక ఉద్యొగలరీత్యా భార్య ఒక చోటా,భర్త ఒక చోట,చదువు రీత్యా అమ్మాయి ఒక చోటా మూడు ఊర్లలో కాలం గడుపుతున్నారిన్నాళ్ళూ. పది రోజుల క్రితం కూడా మాతొ ఫొన్లో మాట్లాడారు ఆయన. ఎంతో మంచి మనిషి. బీ.పీ,సుగర్ ఎమీ లేవు.కొద్దిపాటి ఆస్థ్మా ఉంది. కొద్దిగా బాలేదని భార్య ఉన్న ఊరు స్వయంగా బస్సెక్కి వెళ్ళారు.

హటాత్తుగా ఫోను వారం క్రితం...ఆయన ఐ.సి.యూ లో ఉన్నారని. నాకు వెంథనే ఆవిడ ఎలా ఉన్నారో అనిపించింది. నాలుగు రోజుల క్రితం ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారన్నారు...మావారు,బంధువులు వెళ్ళారు. నిన్న పొద్దున్నే తుది శ్వాస విడిచారని మావారు ఎస్.ఎం.ఎస్ వచ్చింది...
నాకసలు ఏం తోచలేదు..ఏది శాశ్వతం...ఏమిటి జీవితం...అని రకరకాల ప్రశ్నలు...మనసంతా వికలమైపోయింది. కొడుకుని పోగొట్టుకున్న బాధ నుండి కోలుకోకుండానే ఈ బాధ..ఇంతటి దెబ్బని అసలు తట్టుకోవటం ఆ తల్లికీ,అమ్మాయికీ ఎంతటి కష్టమో..అసలు వాళ్ళు ఎలా కోలుకుంటారు అన్న ప్రశ్నలకు నాకు సమాధానమే దొరకటం లేదు...అయ్యో దేవుడు కాస్తైనా దయ చూపలేదే అని బాధ కలిగింది..నిద్ర కూడా పట్టటం లేదు బాధతో...

రేపు ఏమి జరుగుతుందో తెలియని అసందిగ్ధ క్షణికమైన జీవితం కోసం మనమింత తాపత్రయ పడుతున్నామే అని నాకు విరక్తితో కూడిన భావనలు కలిగాయి. జీవితమే శాశ్వతం కానప్పుడు...కొన్ని సంఘటనల వల్ల కలిగే భావోద్వేగాలూ,కోపాలూ,తాపాలూ జివితాంతం మనతో మోసుకోవటం అనేది ఎంతటి అవివేకమైన పనో అనిపించింది...

ఇంతకానా ఎక్కువ కష్టాలు,బాధలు ఎందరి జీవితాల్లోనో ఉండి ఉండచ్చు..కాని ఎదురుగా కనిపించిన,నిన్ననే జరిగిన సంఘఠన కావటంతో బ్లాగ్లో రాయాలనిపించి రాసేస్తున్నాను...నా వేదనను బ్లాగ్మిత్రులతొ పంచుకోవాలని...

ఇంతకన్నా రాయాలని ఉన్నా రాయలేని నిస్సత్తువ...వెనుక నుంఛి అమ్మ అంటోంది...అందుకే మీ ఆయన కంప్యూటర్ బాగు చేయించటంలేదు...అది ఉంటే ఇక నిన్ను నువ్వు పట్టించుకోవు...అని..!!

ప్రస్తుతానికిక శెలవు మరీ...

Wednesday, February 3, 2010

కారణ జన్ములు...

క్రితం వారం అనుకుంటా ఒక హోటల్ కు డిన్నర్ కు వెళ్తే అక్కడ "దర్శకులు విశ్వనాథ్"గారిని చూడటం జరిగింది. బాగా దగ్గర నుంచి అదే చూడటం. అదివరకులా కాక బాగా సన్నబడ్డారు. వయసు ప్రభావం...వాకింగ్ స్టిక్ కూడా ఉంది చేతిలో..!ఆయన కుటుంబంతో కాబోలు ఉన్నారు. భోజనం అయిపోయి వెళ్పోతున్నారు. అందుకని ఇంక దగ్గరకు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. కాకపోతే అన్ని గొప్ప సినిమాల సృష్టికర్త ను అలా "ఓల్డ్ ఏజ్"లో చూడలేకపోయాననే చెప్పాలి...ఏదో సినిమా మళ్ళీ తీస్తున్నారని వినికిడి.

ఆ తరువాత "వేటూరి"గారి పుట్టినరోజు సందర్భంగా చాలా చానల్స్ వాళ్ళు ఆయనతో ఇంటర్వ్యూ లు ప్రసారం చేసారు. చాలా బాగా ,ఓపికగా మాట్లాడారు. ముఖ్యంగా తెలుగు భాష ప్రాముఖ్యత గురించి, జాతీయ స్థాయిలో తెలుగు భాష ఎంతటి నిరాదరణకు,అలక్ష్యానికీ గురౌతోందో చక్కగా వివరించారు. ఆత్రేయగారి "నేనొక ప్రేమ పిపాసిని.." పాట గొప్పతనాన్ని ప్రతి వాక్యం, పదం గుర్తుచేసుకుంటూ చెప్పారు.
ఆయన ఇంకా రాస్తున్న కొత్త సినిమా పాటల వివరాలు చెప్పారు. చానల్ వాళ్ళు ఆయన రాసిన "సాంగ్స్ బిట్స్" వినిపించారు. అంతా బాగుంది కానీ,అయ్యో ఎంతటి మాహా రచయిత పెద్దవారైపోయారే అనిపించింది...

ఇటీవలే గాన కోకిల "లతా మంగేష్కర్" అక్కినేని అవార్డ్ అందుకోవటం, మన రాష్ట్రంలో వివిధ సత్కారాలు అందుకోవటం చూపించారు. సుమధుర గాయనికి "ఎనభై ఒకటి" సంవత్సరాలట.ఇటీవలే గాన కోకిల "లతా మంగేష్కర్" అక్కినేని అవార్డ్ అందుకోవటం, మన రాష్ట్రంలో వివిధ సత్కారాలు అందుకోవటం చూపించారు. సుమధుర గాయనికి 81సంవత్సరాలట. ఆ అద్భుత గాయనికి సాటిలేరెవరూ అనుకున్నాను.

అక్కినేని అవార్డ్ సభలో అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతూంటే 87ఏళ్ల మనిషి ఆరోగ్యం పట్ల ఎంత శ్రధ్ధ తీసుకుంటారో అని అబ్బురం కలిగింది. ఆయన డిసిప్లీన్ , ఆరోగ్యం పట్ల ఆయన చూపే జాగ్రత్త చాలా మందికి మార్గదర్శకం కావాలి అనుకుంటూ ఉంటాను అస్తమానం.

ఈ మహామహులందరూ కారణ జన్ములు. ఎవరికి వారే "యునీక్" అనిపించింది. బాగా రాసేవారూ, పాటలు పాడేవారూ ,బాగా నటించేవారూ, సినిమాలు తీసేవారు చాలా మంది ఉన్నారు.. ఇంకా వస్తారు కానీ , పైన రాసిన మహామహులందరిని రీప్లెస్ చేసేవారు మాత్రం ఎవ్వరూ ఉండరు...పుట్టరు అనిపించింది. ఇటువంటి మహానుభావులెందరికోసమో నేమో త్యాగయ్యగారు అన్నారు..."ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు.." అని.

****************************
బ్లాగ్మిత్రులకు:
నా సిస్టం బాగవకపోవటం వల్ల బ్లాగులు చూసి చాలా కాలమైంది...! నాకొక బ్లాగుందని నేనే మర్చిపోతానేమో అని ఇన్నాళ్ళకు ఇలా ఓ టపా రాసే ప్రయత్నం చేసాను. తరచూ చూసే బ్లాగులు చూడకపోయినా నాకు బాధే. బ్లాగుల
పట్ల నాకున్న మక్కువ అటువంటిది. వీలున్నప్పుడెప్పుడో మిస్సయిన టపాలన్ని చదువుతాను.
టపాలు తగ్గిపోయినా "తృష్ణ"ను మర్చిపోకండేం...!