సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, November 17, 2009

తిలక్ గళంలో ఆయన "వెన్నెల"

పదహారేళ్ళ క్రితం ఒక జనవరి నెల పుస్తకమహోత్సవం లో కవితలు నచ్చి "అమృతం కురిసిన రాత్రి" మిగతా పుస్తకాలతో పాటూ కొనుక్కుని ఇంటికి తెచ్చాను. ఏం కొన్నావని చూసిన నాన్న "ఈ పుస్తకం ఎందుకు కొన్నావు?"
అని అడిగారు. "నచ్చింది...కొన్నాను..." అన్నా. "ఈ కవితలను నువ్వు అర్ధం చేసుకోగలవా?" అన్నరు. "ఊ..." అన్నాను. "ఈ తిలక్ ఎవరో తెలుసా?" అన్నారు. తల అడ్డంగా ఊపాను. "మూర్తి బాబయ్య మేనమామగారు. రామారావు అంకుల్ వాళ్ళ తమ్ముడు." అన్నారు. "ఈ పుస్తకం పాత ముద్రణ మనింట్లో ఉంది. ఎప్పుడైనా చూసావా?" అన్నారు... లేదన్నాను. దాంట్లోని ఒక కవితను తిలక్ గారు స్వయంగా చదివిన రికార్డింగ్ ఇంట్లో ఉంది వినమన్నారు.

అలా పరిచయమయ్యింది "అమృతం కురిసిన రాత్రి" నాకు. మూర్తి బాబయ్య గిటార్ వాయిస్తే,తిలక్ గారు పాడేవారట, లేకపోతే ఎవరిచేతైనా పాడించుకుంటూ వినేవారట. కొన్ని కవితలని మూర్తిబాబయ్య ట్యూన్ కట్టి పాడించారు. "గగనమొక రేకు కన్నుగవ సోకు..." పాట నేను నేర్చుకుని పాడేదాన్ని... (నాన్న చిరకాల స్నేహితుడు మూర్తిబాబయ్యే "గమ్యం" సినిమాకు సంగీతం చేసిన ఈ.ఎస్.మూర్తి.)

తిలక్ గారు స్వయంగా చదివిన "వెన్నెల" కవిత బ్లాగ్మిత్రుల కోసం.....



కార్తిక మాసపు రాత్రివేళ
కావాలనే మేలుకున్నాను
చల్లని తెల్లని వెన్నెల
అంతటా పడుతోంది
మెత్తని పుత్తడి వెన్నెల
భూమి ఒంటిని హత్తుకుంది
శిశువులాంటి వెన్నెల
నవ వధువులాంటి, మధువులాంటి వెన్నెల
శిశిరానికి చెలించే
పొరల పొరల వెన్నెల
శరద్రధుని సౌధానికి కట్టిన
తెరల తెరల వెన్నెల
ఎంత శాంతంగా,
హాయిగా, ఆప్యాయంగా ఉందీ !
చచ్చిపోయిన మా అమ్మ
తిరిగొచ్చినట్టుంది
స్వర్గంలో ఎవరో సంగీతం
పాడుతున్నట్టుంది.
ఎంత నీరవ నిర్మల సౌందర్యం
నన్నావరించుకుంది ?
ఏ చామీకర చషకంతో
నా పెదవుల కందిస్తున్నది ?
ఈ రాత్రి నిద్రిత సర్వధాత్రి మీద
ఎవరు ఈ తళుకు తళుకు
కలల పుప్పొడిని వెదజల్లారు !
ఎవరీ మెరిసే ముఖమల్
జంఖానా పరిచి వెళ్ళారు !
ఓహో ! చంద్రకిత ధాత్రి
ఓహో ! కోరకిత గాత్రి
ఓహో ! శరధ్రాత్రి !
వ్యధలతో బాధ్యతలతో
భయాలతో మహితమైన
నా మనస్సుకిప్పుడూరట కలుగుతోంది.
ఈ వెన్నెల నా మనస్సులోకి
జారుతోంది
నా గుండెల పగుళ్ళనుండి కారుతోంది
నా అంతరాంతర రంగస్థల
ఏకాకి నటుడినైన నన్ను
తన మైత్రీ మధుర భావంతో
క్రమ్ముకుంటోంది
నా లోపలి లోపలి గుప్త
వీణా తంత్రీ నివహాన్ని
వేపధు మృదు లాంగుళుల
తాకి పలికిస్తోంది.
నన్ను బతికిస్తోంది
నా బతుక్కి అందాన్ని
అర్ధాన్నీ ఆశనీ
రచిస్తోంది
నా రచన తానైపోయింది
వెన్నెల వంటి నా ఉద్రేకానికి
తెలుగు భాష శరద్వియ
ద్విహార వనమై నడిచిపోయింది
చలి చలిగా సరదాగా ఉంది వెన్నెల
చెలి తొలిరాత్రి సిగ్గులా ఉంది
విరిసిన చేమంతిపువ్వులా ఉంది
పడకగదిలో వెలిగించిన
అగరొత్తుల వాసనలా ఉంది
పడగిప్పిన పాములు తిరిగే
పండిన మొగలి వనంలాగుంది
పన్నీరు జల్లినట్టు ఉంది
విరహిణి కన్నీరులా ఉంది
విరజాజుల తావితో కలిసి
గమ్మత్తుగా ఉంది
విచిత్రమైన మోహమణి
కవాటాలను తెరుస్తోంది
యౌవన వనంలోని కేళీ సరస్సులా ఉంది
దవుదవ్వుల పడుచు పిల్లలు
పకపక నవ్వినట్టుంది
దాపరికంలేని కొండజాతి
నాతి వలపులాగుంది
ఇది సృష్టి సౌందర్యానుభూతికి టీక
ఇది తరుణ శృంగార
జీవన హేలకు ప్రతీక
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు
గానపు తెన్నుల
జారెను తోటల
కొబ్బరి మొవ్వుల
ఇంటిముందు బోగన్ విల్లా పువ్వుల
ధనికుల కిటికీ పరదా చిరుసందుల
సురతాలస నిద్రిత సతి కపోలమ్ముల
జారిన జార్జెత్ చీర జిలుగుటంచుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
నిరుపేదల కలలో
కదలిన తీయని ఊహల
ఊరిపక్క కాలువ అద్దపు రొమ్ముల
ఊరి బయట కాలీకాలని
చితి కీలల
ఆడవిలో వికసించిన ఒంటరి పువ్వుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
(1965)

(ఇది పుస్తకంలోని కవిత. తిలక్ గారు చదివిన దాంట్లో కొన్ని మార్పులు ఉన్నాయి.)

ఈ పుస్తకంలో "అమృతం కురిసిన రాత్రి", "నువ్వు లేవు నీ పాట ఉంది", "నేను కాని నేను" నాకు బాగా నచ్చే కవితలు.

39 comments:

పరిమళం said...

నాదగ్గర ఉన్న అతి తక్కువ పుస్తకాల్లో నాకత్యంత ప్రియమైన పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి ! ఆ అమృత ధార అక్షయం ...అయన గళం నుండి విన్న మీరు అదృష్టవంతులు !

వేణు said...

తృష్ణ గారూ,

తిలక్ స్వరంలో ఆయన కవితను వినటం ఎంతో మంచి అనుభూతినిచ్చింది! అసలు ఆయన గొంతును వినగలనని నేనెప్పుడూ అనుకోలేదు.

‘‘..చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు
గానపు తెన్నుల
జారెను తోటల
కొబ్బరి మొవ్వుల..."

అందమైన భావాలను అంతే అందంగా తన గొంతులో పలికించారు తిలక్.

ఈ అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు!

బృహఃస్పతి said...

ఓహ్... మీరు తిలక్ గారి బంధువులా?? తెలుగులో నాకు నచ్చిన అతి కొద్దిమంది రచయితలలో తిలక్ గారు ఒకరు. ఆయన కవితలే కాదు కధలు కూడా నాకు చాలా ఇష్టం. ఆయన అముద్రితాలేవైనా దొరుకుతాయేమో ప్రయత్నించలేకపోయారా?

మురళి said...

nice...

కొత్త పాళీ said...

OMG OMG ... God bless you.
This cold miserable Tuesday already looks WONDERFUL!!!

జయ said...

ఎంత చక్కటి అనుభూతిని కలిగించారు తృష్ణ గారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటివే మీదగ్గిర ఉన్న అతివిలువైన వన్నీ మాకోసం పెట్టొచ్చుగా.

గీతాచార్య said...

ThankQ :-)

నిషిగంధ said...

తృష్ణ గారు, ఈ పోస్ట్ తో ఎంతటి అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించారో చెప్పలేను! తిలక్ గొంతు వినగలనని కలలో కూడా అనుకోలేదు.. చక్కటి కవిత అంతకంటే చక్కగా ఆయన గొంతులోంచి జాలువారుతుంటే వినడానికి ఎంత బావుందో! ఇంతమంచి బహుమానాన్ని అందించినందుకు శతకోటి ధన్యవాదాలతో పాటు ఒక అభిమాన హగ్ ని కూడా ఇస్తున్నాను :-)

ఉమాశంకర్ said...

తృష్ణ గారూ,

మాటల్లో చెప్పలేను ఈ ఆనందాన్ని.ఏదో కలలా ఉంది. మీకు వేన వేల ధన్యవాదాలు..ప్రస్తుతానికి ఇంతకుమించి మాటలు రావడం లేదు..

తృష్ణ said...

@పరిమళం: టపాలో పెట్టాను కదాండీ... విని మీరు కూడా ఈపాటికి అదృష్టవంతులైపోయారనే....

@వేణూ: అవునండీ. మనంతట మనం చదువుకునే కన్నా రాసినవాళ్ళు...(అది కూడా తిలక్ గారు) చదివితే కవిత ఇంకా అర్ధవంతంగా అనిపిస్తుంది.

తృష్ణ said...

@బృహ:స్పతి: మేము బంధువులం కామండీ...మిత్రులం. తిలక్ గారి అన్నగారు,మేనల్లుడూ ఇద్దరూ మా నాన్నగారికి స్నేహితులు. వారి రచనలు చాలామటుకు ఈ సంవత్సరారంభంలోనే వారి కుమారులు పున:ముద్రనగావించారండీ.

తృష్ణ said...

@మురళి: ఇవాల్టి సగం ప్రశంసలు మీకేనండీ. నిన్న మీ "ఊరి చివరి ఇల్లు" టాపావ్యాఖ్యకు మీ జవాబు చదివాకే నాకీ ఆలోచన వచ్చింది. ధన్యవాదాలు.

@కొత్తపాళీ: హృదయపూర్వక ధన్యవాదాలు.

తృష్ణ said...

@జయ: ప్రయత్నిస్తానండీ. కొన్ని రాయల్టీ సమస్యలు ఉంటాయి కదండీ..

@గీతాచార్య: థాంక్యూ...:)

తృష్ణ said...

@నిషిగంధ: మీకింతటి ఆనందాన్ని కలిగించటం నా అదృష్టంగా భావిస్తున్నానండీ...ధన్యవాదాలు.

@ఉమాశంకర్: నా బ్లాగ్ లో ఇది మీ మొదటి వ్యాఖ్య అనుకుంటానండీ..నాకు చాలా ఆనందంగా ఉంది.. తిలక్ గారి కవిత్వానికీ "జై"....

భావన said...

తృష్ణ: చాలా ని ఒక కోటి సార్లు కలుపుకుంటు వెళ్ళండి ధన్యవాదాల ముందు తిలక్ గారి గొంతు వినిపించినందుకు. నాకు మళ్ళీ వెనక్కి కూడా రావాలని అనిపించటం లేదు... చదువుకునే రోజులలో ఈ పుస్తకం చలం గారి ప్రేమ లేఖలు ఈ రెండే రామాయణ మహాభారతాలు నాకు. ఇంక అర్ధం చేసుకోండి నాకు ఈ రొజెంత సంతోషం కలిగించారో మీరు.. ఎలా రుణం తీర్చుకుంటానో ఏమో..

వేమన said...

తిలక్ కవిత్వం గురించి విన్నాను కానీ ఇప్పటి దాక చదవలేదండీ..చాలా బావుంది, ధన్యవాదాలు !

వేణూశ్రీకాంత్ said...

తృష్ణ గారు ఇంతటి మధురానుభూతిని నాలుగు మాటల్లో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదండి. సాధారణంగా కవితను రచయిత గళం నుండి వినడం చాలా బాగుంటుంది. ఇక తిలక్ గారి గళంలో వింటుంటే కవిత మరింత అందంగా తెలుస్తుంది. అసలు తిలక్ గారి స్వరం వినగలను అని నేను కలలో కూడా అనుకోలేదు. ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించినందుకు మీకు బోలెడంత ఋణ పడిపోయాను.

తృష్ణ said...

భావన: ఋణమా..? అంత పెద్దమాటేందుకు..? నావల్ల ఇంత మందికి ఇంత ఆనందం కలిగినందుకు నేనే మీఅందరికీ ఋణపడిపోయానీవాళ...



వేమన: మీక్కూడా థాంక్సండీ...for visiting my blog..

తృష్ణ said...

వేణూ గారూ, పైన భావనగారికి చెప్పిన జవాబే మీకూనూ...ఒక చిన్న పనివల్ల ఇంత మందికి ఇంత ఆనందాన్ని అందివ్వగలనని నేను అనుకోనేలేదండీ...నేనే అందరికీ ఋణపడిపోయాను...

Hima bindu said...

ధన్క్యు ...తృష్ణ గారు .

తృష్ణ said...

@chinni: thankyou too...:)

Unknown said...

తృష్ణ :
వెన్నెల జలపాతాల వంటి కవితల ద్వారా వచన కవిత్వం మీద ,కవిత్వీకరణ మీద ప్రగాఢమైన ఆకర్షణ కలుగజేసి,నా కవితా ప్రస్థానాన్ని బలీయంగా ప్రభావితం చేసిన కవి శ్రీ తిలక్.
ఆయన గళంలో ఆయన కవితలు వినగలగటం ఒక అపూర్వమైన అనుభవం/అదృష్టం.గొప్ప ఆనందాన్ని కించిత్తు విషాదాన్ని ఏకకాలంలో కలిగించారు.
మీకు అనేకానేక ధన్యవాదాలు.
మీ వద్ద ఆయన గానం చేసిన కవితలు ఇంకా వున్నాయా?
ఆమధ్య హైదరాబాదులో వారి కుమారుల ఆధ్వర్యంలో ఆయన సంస్మరణ సభ జరిగింది.పలువురు సాహిత్యా భిమానులు ఆయన కవిత్వాన్ని గుర్తు చేసుకున్నారు.మీకు తెలిసే ఉంటుంది.
ఈ టపా లింకును వారికి ఈ మెయిల్ చేస్తాను.
అభినందనలతో
వైదేహి శశిధర్

మీకు వీలైతే నాకు ఒక ఈ మెయిల్ పంపండి.

SRRao said...

తృష్ణ గారూ !
చాలా బాగుంది. మీఖజానాలోంచి అమూల్యమైన తిలక్ గారి వెన్నెలను తీసి మాకందించినందుకు కృతజ్ఞతలు. సమయాభావం వలన వెంటనే చూడలేకపోయాను.

తృష్ణ said...

వైదేహిగారూ, చాలా సంతోషం... ఆ సభలో ఈ గళమే వినిపించిన గుర్తు అండీ. ఇది మా నాన్నగారు పొందుపరుచుకున్న ఖజానాలోది. వేరే ఏమీ లేవండీ. అరుదైనదని నేనూ దాచుకున్నాను.
మీరు మైల్ ఐ.డి ఇవ్వలేదు? ఎవరికి మైల్ చెయ్యనండి? ....:) :) ధన్యవాదాలు.


@SRrao:ఆలస్యంగానైనా విన్నారు... ధన్యవాదాలు.

Telugu Movie Buff said...

తృష్ణ గారు మీకు శతకోటి ధన్యవాదాలు.
వింటుంటే మధురానుభూతి కలిగింది.
నిన్ననే చలం గారు, తిలక్ గారు వంటి వారి పుస్తకాలను సంపాదించి చదవాలి అని అనుకునాన్ను.
ఇంతలోనే ఇంతటి మహాప్రసాదం పొందగలిగాను.

జ్యోతి said...

తిలక్ స్వరంలో ఆయన కవితను వినటం ఒక అద్భుతమైన అనుభూతి. శతకోటి దన్యవాదాలు మాతో పంచుకున్నందుకు.

గీతాచార్య said...

Very nice effort. A small typo in the heading

Rani said...

తృష్ణ గారూ,అందరూ తిలక్ గారి గొంతు విన్నామని కామెంట్ రాశారు, ఆడియో ఫైల్ ఎక్కడుందొ నేను మిస్సయ్యాను అనుకుంటా,మీ పోస్ట్ లో దొరకలెదు. please help me.

తృష్ణ said...

@ G: : థాంక్యూ...

@రాణీ: కవిత పైన "Div Share " ఫైల్ ఉంది చూడండి... అది క్లిక్ చేస్తే voice వినిపిస్తుంది...

మరువం ఉష said...

తృష్ణ, ఈ ఉదయం మీ టపా నాకొక కానుక మాదిరి అందించబడింది. నిజంగా రాత్రంతా దాదాపు గా పని చేసిన నాకు ఆయన గళం, కవిత అమృతం కురిపిస్తున్నాయి. మీకు చాలా థాంక్స్ + అభినందనలు.

తృష్ణ said...

ఉష గారు, ధన్యవాదాలు.

Sreenivas Paruchuri said...

ఎవరో చెప్తే వచ్చి చూశాను. బాగుంది. పన్నెండేళ్ళ క్రితం "రజని" గారి దగ్గర కాపీ చేసుకున్న కవుల గొంతుకల్లో ఇదొకటి. ఆ టేపంతా తరువాత "ఈమాట"లోని శబ్దతరంగాలు శీర్షికలో పెట్టాను కానీ ఈ కవితెందుకో చేరలేదు.

తిలక్, రేడియోల సందర్భం వచ్చింది కాబట్టి ...

విజయవాడ కేంద్రం నుండే తిలక్ పైన ఒక డాక్యుమెంటరీ ప్రసారమయ్యింది: ఇంద్రగంటి, ఓలేటి, నండూరి, తదితరులతో. కొన్ని వ్యక్తిగత విషయాలు, కొంత కవిత్వం గురించిన చర్చలతో. మధ్య మధ్యలో ఓలేటి, NCV, ... కొన్ని తిలక్ కవితలు చదవటం. బాగుంటుంది వినడానికి. నాదగ్గరాకార్యక్రమం వుంది కానీ, digitize చేసే సమయం లేదు.

మరీ సొంతడబ్బా కొట్టుకుంటున్నట్లు మాట్లాడుతున్నానేమో. ... క్షంతవ్యుణ్ణి!

భవదీయుడు,
శ్రీనివాస్

తృష్ణ said...

@పరుచూరి శ్రీనివాస్:ఆ ప్రోగ్రాం పేరు "శిఖరారోహణం" అండీ.. ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు చేసారు..తణుకు వెళ్ళి తిలక్ గారి ఇమ్త్లో ఆయన తిరిగిన ప్రదేసశాల్లో తిరుగుతూ మాట్లాడుతూ.....నా దగ్గర ఉందండీ...
మీరు చాలా ఏళ్ళ క్రితం మా ఇంటికి వచ్చారు ఒకసారి నాన్నగారి కోసం...

వ్యాఖ్యకు ధన్యవాదాలండీ...

మరువం ఉష said...

తృష్ణ, ఒకసారి మళ్ళీ చూడండి - ఆయన గళం వినాలనుంది కానీ పనిచేయటం లేదు.

తృష్ణ said...

@usha: uploaded the voice again..please check now....and thanks for the same.

Bolloju Baba said...

wonderful wonderful

అనుభూతి కవిత్వాన్ని ఎలా చదవాలనటానికి ఇదో అద్బుతమైన ఉదాహరణ.

బొల్లోజు బాబా

తృష్ణ said...

@బోల్లోజు బాబా: అప్పుడెప్పుడో నే బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో "మీ బ్లాగ్ బాగుంది. రాసే విధానం రిఫ్రెషింగా ఉంది" అని ఒక వ్యాఖ్య పెట్టారు. మళ్ళీ ఇదే. Thanks for the visit.

WB said...

మిత్రులొకరు చెబితే, ఇప్పుడే విన్నాను! అసలు తిలక్ గారి కవిత్వం చదవటమే ఒక నునువెచ్చని అనుభవం - అలాంటిది తన కవితను ఆయనే స్వయంగా పాడితే వినటం ఒక దివ్యానుభవం. ఆయన్ను కలిసే అదృష్టం లేకపోయినా ఆయన గొంతు వినే భాగ్యం మీ వల్ల కలిగింది. ఇది చాలు! శతకోటి కృతజ్ఞతలు!!

తృష్ణ said...

@WB: pleasure is mine.. Thanks for the visit.