Saturday, July 11, 2009

మధుర స్మృతులు--కొన్ని పూతీగెలు!!

మన గతస్మృతులలో కొన్ని కొన్ని జ్ఞాపకాలు మధురంగా అలా ఉండిపొతాయి.జీవితంలో కొన్ని సంఘఠనలే కాక కొన్ని రకాల చెట్లు,తీగెలు,పక్షులు,జంతువులు కూడా ఎందుకో చెరగని ముద్రవేసుకుని అలా నిలిచిపోతాయి.కొన్ని ఫూతీగెలు మొదట్లో సన్నని తీగలా పాకినా మెల్లగా వృక్షాల్లాగ మొదళ్ళు వృక్షాల్లాగ బలంగా మారిపోతాయి తిగలు పెద్దయ్యే కొద్దీ..అలా నా స్మృతులలోనిలిచిపోయిన కొన్ని పూతీగెలు--రాధామనోహరాలు,రేక మాలతి,గిన్నె మాలతి,సన్నజాజి,విరజాజి.
రాధామనోహరాలు:


వీటి పేరు ఇలాగనే విన్నాను నేను.చిన్నప్పుడు మేం అద్దెకుండే ఇంటిదొడ్లో బోలెడు ఖాళీస్థలం,మొక్కలు,పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి.ఇంటి గుమ్మానికి ఎడమపక్కన ఉండేది ఈ రాధామనొహరాలు తీగ.తెలుపు,లేత గులాబీ,ముదురు గులాబీ రంగుల్లో గుత్తులు గుత్తులుగా పూసేదిఆ తీగ.ఒకే తీగకి అన్ని రకాల రంగులు ఎలా సాధ్యమో అర్ధమవ్వదు నాకిప్పటికీ..రాత్రి అయ్యేప్పటికీ గేటు దగ్గర ప్రదేశమంతా మనోహరమైన సువాసనతొ నిండిపొయేది.ఆ వాసన కోసం కాసేపు గుమ్మం గట్టుమీద కుర్చుండిపోయేదాన్ని.ఆ పువ్వులన్నీ కోసి ,ఒక దాంట్లోకి ఒక పువ్వు గుచ్చి హారంలా చేసి ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు.రాత్రిపూట పూలు కోయద్దని మా అమ్మ కేకలేస్తూ ఉండేది.అనుకోకుండా మొన్న ఓ ఇంటి గోడ మీంచి తొంగి చూస్తున్నాయి ఈ పులు.వెంఠనే మొబైలుతో ఫొటొ తిసాం.రాత్రి కావటంవల్ల క్లియర్ గా లేదు ఫొటో.
రేక మాలతి:
ఇది చిన్నప్పుడు రాజమండ్రీ లో మా తాతగారి ఇంట్లో ఉండేది.తాతగారి ఇల్లు ఎత్తుమీద 10,15పెద్దపెద్ద మెట్లు ఎక్కాకా ఉండేది.పెద్ద ఇనుపచువ్వల గేటు తీసిన తరువాత మెట్లు మొదలు, పైన ఉన్న ముఖద్వారం దాకా పందిరి మీద పాకించిన ఆ రేకమాలతి అంటే నాకు భలే ఇష్టం ఉండేది. ఆ పూలపరిమళం ఇంకా జ్ఞాపకం నాకు...వర్షం కురిసిన రాత్రి బయటకు వచ్చి నిలుచుంటే మెట్ల నిండా రాలిన ఆ తెల్లనిపూలు,ఆ పరిమళం,ఆ మట్టి వాసన...మళ్ళీ పొద్దున్నే లేవగానే రాలిన కొత్త పాత పూలతో మెట్లన్నీ నిండిపోయి ఉండేవి....ఏళ్ళు గడిచినా ఇంకా నిన్ననే తాతగారింటికి వెళ్ళినట్లుంటుంది....మళ్ళీ ఎక్కడా ఆ రేకమాలతి తీగను,ఆ పూలను చూడలేదు.
గిన్నె మాలతి:
ఈ తీగ కాకినాడలొ మా నానమ్మగారి ఇంట్లో ఉండేది.దీన్ని కూడ వీధిగేటు మొదలుకుని ఇంటిగుమ్మం వరకూ ఇనుపపందెరపై పాకించారు.చిన్నగిన్నె ఆకారంలో ఉండే ఈ పువ్వులు క్రీమ్ కలర్ లో గుత్తులు గుత్తులుగా ఉంటాయి.సువాసన తక్కువే అయినా చూడటానికి అందంగా ఉంటాయి ఈ పూలు.ఇది కూడా అరుదుగా కనిపించే పూతీగే!
సన్నజాజి:
ఖాళీ ప్రదేశం ఉన్న ప్రతి ఇంట్లోనూ ఈ తీగ కనిపిస్తూనే ఉంటుంది.చాలా మందికి మల్లెపూలు ఇష్టం ఉంటాయి,నాకయితే ఎప్పుడూ సన్నజాజిపూలే ప్రాణం.అప్పుడే విచ్చుతూ ఉన్నప్పుడు వచ్చే ఆ పూల పరిమళాన్ని వర్ణించటానికి నాకు అక్షరాలు రావు...ఎందుకో బయట వేటిని ఎక్కువ అమ్మరు..ఈ పూలపందిరి మా చిన్నప్పుడు ఇంట్లో(రాధామనోహరాలున్న ఇంట్లో) ఉండేది.తరువాత గవర్నమెంటు క్వార్టర్ లోకి మారాకా అక్కడ నే పెంచిన తోటలో సన్నజాజి తీగెని కూడా పెంచాను.ఇప్పటికీ అక్కడ నే డాబా మీదకి పాకించిన ఆ తీగ ఉంది.కాకినాడాలో మా నానమ్మ ఇంటికి వెళ్తే అక్కడా ఉండేది.అక్కడ నాదే రాజ్యం కాబట్టి ఉన్నన్నాళ్ళూ నాకే పువ్వులన్నీ.ఆకుపచ్చ సంపెంగ,సింహాచలం సంపెంగ,జాజిపూలు,ఎరుపు,పసుపు కనకాంబరాలు,15 రకాల మందారాలు, అరటి, జామ, పారిజాతాలు, పనస,దబ్బ చెట్లతో మా మామ్మయ్య(నానమ్మని అలా పిలిచేవాళ్ళం) ఒక పెద్ద తోట పెంచుతూ ఉండేది.అక్కడ ఉన్నన్నాళ్ళు నాకా దొడ్లోనే మాకాం...ఆ రోజులే వేరు...
విరజాజి:
ఇది కూడా ఒక సాధారణ పూతీగే.మా చిన్నప్పటి ఇంట్లో ఉండేది.క్రింద 5,6వాటాలు అద్దెకు ఇచ్చి పైన మొత్తం ఇంట్లో ఒక్క ముసలావిడ ఉండేది.మల్లె,జాజి,విరజాజి,పారిజాతాలు... ఎన్ని పూలమొక్కలు ఉన్నా ఎవరిని మొక్క మీద చెయ్యి వేయనిచ్చేది కాదు ఆవిడ.ముసలావిడ చూడకుండా అందరం ఎప్పుడో ఓ పూట ఆ పూలని కోసేసుకుంటూ ఉండే వాళ్ళం.అదో గొప్ప సాహసం చిన్నప్పుడు.మాల కట్టడం రానప్పుడు ఈ పూలతో మాల కాట్టాలని తెగ ప్రయత్నించేదాన్ని.చిన్న కాడ ఉన్డటం వల్ల రెండు ముడులు వెయ్యగానే ముందర కట్టిన దండంతా ఊడిపోయేది.వీటి పరిమాళం కూడా అమోఘం.

ఈ నాలుగు రకాల పూతీగెలూ నా గతస్మృతులలో మధురమైన జ్ఞాపకాలలో భాగాలు...!!


6 comments:

మురళి said...

పరిమళ భరితంగా ఉందండి టపా...

తృష్ణ said...

మురళి సారూ, స్టాట్ కవుంటరు 64 అతిధులని చూపించినా,పొద్దున్నుంచి మీరొక్కరే ఈ టపాకు వ్యాఖ్య రాసారు. ఏదో నాకు వ్యాఖ్యలు రాసే నలుగురిలో ఒకరైన మీరు ఉండుండి ఇలా మాయమైపోతూ ఉంటే ఎలాగండీ?ఇది అన్యాయం.అలా మీ బ్లాగు తలుపులు మూసేసుకుని నే రొజూ చూసే బ్లాగుల్లోంచి అలా తప్పుకోవటంలో అంతరార్ధం? "నామ సార్ధకత" అంటే ఇదేనేమో :)

...Padmarpita... said...

సువాసనలను వెదజల్లారు మీరు ఈ టపాలో....
మురళీగారి మాయా వినోదం ఎన్నాళ్ళండి?

తృష్ణ said...

padmArpita gAru,dhanyavAdAlu.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మొన్న ఈటపా చదివాను గానీ రాధామనోహరాలు గమనించలేదు. దానిపేరు అది అని తెలియదు ఇంతకాలం. మాస్కూల్లో స్టేజ్‌కి రెండుపక్కలా ఉండేవి ఈతీగలు. వందేమాతరం పాడేబాచ్ దానికిందే నిలబడేవాళ్లు. ఒకసారి బాలలదినోత్సవానికి డీ.ఎస్.పీ వచ్చాడు. దాన్ని చూచి ముచ్చటపడి, అంటుతొక్కించి, ఆయన బంగ్లాలో వెయ్యించాడు.

భావన said...

ఏమిటో తృష్ణా.. ప్రతి భావాన్ని ఎదుటి వాళ్ళకు చెప్పాలంటే భాషే కదా పరికరం...కాని భాష ఎంత అల్పమైపోతుందో కొన్ని కొన్ని భావాలను పదాలలోకి తేవటానికి. భగవంతుడు ప్రకృతి తోడు గా, మనకేమో బహుమతి గా ఇచ్చిన వరం పువ్వులు. ఒక్క సారి ఆ పూరేక ను తడిమి నప్పుడే కదా జగతి లో సున్నితత్వం వుహూ కాదు అలపైని నురగ లోని అందాన్ని, వెన్నెల లోని మెత్తదనాన్ని, అమ్మ చేతి లోని మృదుత్వం అన్ని టిని కలిపి ఒక్క సారి గా వేలి మొన లకు అనుభవమవుతుంది..
రేక మాలతి నా అయ్యో నాకు అసలు గుర్తే లేదే ఆ పువ్వు, ఎక్కడ మీ తాత గారి వూరు? గిన్నె మాలతి తెలుసు ఆ తీగ కు తేనెటీగలు బాగా తుట్టులు పెడతాయి తెలుసా, బహుశా ఆ పువ్వు నుంచి ఎక్కువ మధువొస్తుందేమో.. ఇక రాధా మనోహరాలు.. అబ్బ మనసు పరవశమైపోతుంది ఆ పేరు వినగానే. ఇంక పెద్ద మాటలు కూడా రావు... చాలా చాలా ధన్యవాదాలు వూరు వెళ్ళే హడావుడి లో కూడా నాకు లింక్ ఇచ్చినందుకు.