సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, June 30, 2009

మొదటి సంపాదన


పార్ట్ టైం సంపాదనైనా,జీవితంలో మొదటి సంపాదన విలువ అపారం.ప్రపంచంలో సంతోషం అంతా మనదైనట్లు,అమౌంట్ తక్కువైనా ఓ లక్ష సంపాదించిన ఫీలింగ్.కాలేజీ రోజుల్లో చేతి ఖర్చులకి అమ్మనాన్నలని అడగకుండా కావాలనిపించినవి కొనుక్కోగలగటం మాటల్లో చెప్పలేని అనుభూతి.ఇంతకీ ఆ చిల్లర అవసరాలు ఏమిటీ అంటే--లెటర్ పాడ్స్,పెన్నులు,పుస్తకాలు,క్యాసెట్టులు,పైంటింగ్కి కలర్స్ గట్ర గట్ర..!ఇంతకీ నాకు దొరికిన చిరు సంపాదన ఏమిటి అంటే..విజయవాడ రేడియోస్టేషన్లో "యువవాణి" అని యువజనుల కార్యక్రమం ఉండేది.ఆ కార్యక్రమంలో 'రసవాహిని 'అనే శీర్షికలో ప్రోగ్రాం కి కాంట్రాక్ట్లు.ఏదొ ఒక విషయం మీద వ్యాఖ్యానం చెబుతూ ఆ విషయానికి సంబంధించిన పాటలు వెయ్యటం.అది కాకుండా హిందీ కవితలు రాసి వాటిని యువవాణిలో చదివే అవకాశం కూడా వచ్చింది.ఈ రెందు రకాల కాంట్రాక్టుల ద్వారా కాలేజీ రోజుల్లో కాస్తొ కూస్తో చిన్న సంపాదన ఉండేది.నాన్నగారికి పరిచయం ఉన్న ఆడియో ఏడ్ మేకెర్ ఒకాయన హిందీలో కొన్ని ఏడ్స్ నాతో చదివించుకునేవారు.అలా హిందీ ఏడ్స్ కి వాయిస్ ఇవ్వటం ద్వారా కొంత సంపాదన ఉండేది. ఆ సంపాదనంతా దాచుకుని ఒక "ఫిలిప్స్ టేప్ రికార్డర్" కొనుక్కున్నాను.నా అనందానికి అవధులు లేవు!!ఇంట్లో ఉంటే నా రికార్డర్ మోగుతూనే ఉండేది.ఎక్కువ వినద్దు పాడైపోతుంది అని ఇంక ఎవరూ అనేవారు కాదు.ఇప్పటికి నా టేప్ రికార్డర్ నాతొ భద్రంగా ఉంది.


విజయవాడలో "బుక్ ఫెస్టివల్" ఒకటి అప్పట్లో మొదలైంది.ఇప్పుడు అది మొదలెట్టి 17సంవత్సరాలైంది.మొదటి 12,13 సంవత్సరాలూ వదలకుండా వెళ్లాను.జనవరి మొదటివారంలో 10రోజులు జరుగుతుంది అది.వీలైనన్ని రోజులు వెళ్ళేదాన్ని."ఇంట్ళొ ఉన్న వందల పుస్తకాలు కాకుండా ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా పుస్తకాలు కొనేస్తున్నారు.ఇప్పుడు మీ కూతురు కూడా తయారైంది.సర్దలేక చస్తున్నా.."అని మా అమ్మ విసుక్కుంటూ ఉండేది.పిజీ అయ్యాకా రేడియోలో హిందీ పాఠాలు కండక్ట్ చేసే కాంట్రాక్టులు కొన్ని వచ్చాయి.సంపాదన కాస్త పెరగటంతొ బుక్ ఫెస్టివల్లొ పుస్తకాలు,ఆడియో క్యాసెట్లు కొనటం అలమారు నింపటం.ఇదే పని!

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే విద్యార్ధి దశలో మన అవసరాలకి మనం సంపాదించుకోవటంలో ఉన్న తృప్తి,ఆనందం అనుభవించే మనసులకే అర్ధం అవుతాయి!!

Sunday, June 28, 2009

అమ్మదొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ..

లలితసంగీతం మీద ఇష్టం ఉన్నవాళ్ళకు ఈ పాట తప్పకుండా తెలుస్తుంది.పాలగుమ్మి విశ్వనాధంగారు రాసి,సంగీతం సమకూర్చిన ఈ పాటని వేదవతీప్రభాకర్ గారు పాడారు.దూరదర్శన్ లో నా చిన్నప్పుడు ప్రసారం చేసినప్పుడు రికార్డ్ చేసుకున్న పాట ఇది.
తమ కూతురు గురించి ప్రతి తల్లీతండ్రి అనుకునే మాటలివి...నాకు చాలా ఇష్టమైన , చిన్నప్పుడు పాటలు పాడేప్పుడు నేను ఎక్కువగా పాడిన పాట ఇది.
పాట సాహిత్యం ఇక్కడ రాస్తున్నాను.వేదవతీప్రభాకర్ గారు పాడిన పాట లింక్ ఈ పోస్ట్ తో పెడుతున్నాను.

http://savefile.com/files/2140436
---------------------------------------
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ(2)

కొంగట్టుకు తిరుగుతూ ఏవొ ప్రశ్నలడుగుతూ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవొ ప్రశ్నలడుగుతూ
కలకలమని నవ్వుతూ కాలం గడిపే
నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

కధ చెప్పే దాకా కంట నిదురరాక
కధ చెప్పేదాకా నీవు నిదురపోక
కధ చెప్పేదాకా నన్ను కదలనీక
మాట తొచనీక మూతిముడిచి చూసేవు
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే
నిలువలేక నా మనసు నీవైపే లాగితే
గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా
గువ్వ ఎగిరిపోయినా గూడు నిదురపోవునా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ

నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే పదివేలు
కలతలు కష్టాలు నీదరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలలదారి నడవాలి
అమ్మదొంగా నిన్ను చూడకుంటే... నాకు బెంగ !!

ముళ్ళపూడి వెంకట రమణగారి "కోతికొమ్మచ్చి"

(బాపుబొమ్మ.కాం సైటు నుంచి ఈ ఫోటో)
"కొంత కాలం క్రిందట బ్రహ్మదేముని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపురేఖలు వేరట,ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం..."
"బాపురమణ"గార్ల ద్వయాన్ని తలుచుకుంటే నాకు గుర్తు వచ్చే పాట ఇది.
ముళ్ళపూడి వెంకట రమణగారు వారిద్దరి స్వీయచరిత్రని "కోతికొమ్మచ్చి" పేరుతో స్వాతి వీక్లీలో సీరియల్ రాసారు.అది ఇప్పుడు పుస్తక రూపంలో మన ముందుకు రాబోతోంది.ఈ నెల ౩౦వతారీఖు సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగబొతోంది.చాలా మందికి తెలిసే ఉంటుంది.ఆసక్తి గల అబిమానులు,హైదరాబాదు వాసులు ఆ కార్యక్రమంలో పాల్గొనగలరని ఈ పోస్ట్ రాస్తున్నాను.

Friday, June 26, 2009

Michael jackson--ఇక ఆ మనిషి కనిపించడు..వినిపించడు..!!


ఇప్పటికి ఇద్దరు,ముగ్గురు రాసేసారు.నేను కొత్తగా రాసేది ఏమీ లేదు.కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అబిమానం కొద్దీ..ఇంకా ఏదొ రాయాలని తపన..!చిన్నప్పుడు మా ఇంట్లొ 'Bad'album ఉండేది.అప్పుడు భాష,పదాలు అర్ధం అయ్యేవి కావు.కానీ ఆ మ్యూజిక్ నచ్చేది.పదే పదే ఆ పాటలు వినీ వినీ ఇంటర్లూడ్ లతొ సహా అవి బట్టీ వచ్చేసాయి...'భాడ్", 'లిబేరీన్ గాల్ ' 'మాన్ ఇన్ థ మిర్రర్ ' ఇవన్ని అందులోని పొపులర్ సాంగ్స్.తరువాత చాలా వచ్చాయి కానీ అందులో నాకు నచ్చినవి రెండే..

1) All I wann say is that They dont really care about us

2) పర్యావరణం,జంతు సంరక్షణ గురించి జాక్సన్ స్వయంగా రాసి,బాణీ కట్టిన పాట ఇది.

History:past,present and future,book I నుంచి earth song:ఆ ఫస్ట్ లిరిక్స్ చాలా బాగుంటాయి-- "What about sunrise What about rain What about all the things That you said we were to gain.. . What about killing fields Is there a time

What about all the things That you said was yours and mine... Did you ever stop to notice All the blood we've shed before

Did you ever stop to notice The crying Earth the weeping shores? "

వివాదాలు,విమర్శలూ,విబేధాలు...అనేవి ఫేమస్ పెర్సొనాలిటీస్ అందరికీ ఉన్నవే.

ఏది మంచి-ఏది చెడు?ఏది పాపం -ఏది పుణ్యం?

ఒకరి తీర్పు ఇంకొకరికి అన్యాయంఒకరి తప్పు ఇంకొకరికి ఒప్పు!!

అతని వ్యక్తిగతం నాకు అనవసరం.అతనిలొని సంగీతజ్ఞుని నేను అభిమానిస్తాను.పాప్ సంగీత సామ్రాజ్యానికి అతను మకుటంలేని మహారాజు!!
ఏది ఏమైనా..మరో సూర్యకిరణం అస్తమించింది..
మరో ప్రభంజనం మూగబోయింది..

మరో జీవితం ముగిసిపొయింది.. మరొ గళం మట్టిలో కలిసిపోయింది..

ఇక ఆ మనిషి కనిపించడు..వినిపించడు..ఇదే నిజం..ఇదే నిజం..

సుజాతగారు ఇందాక ఒక కామెంట్ లొ అన్నట్టు--అతని ఆత్మకి శాంతి ఉందొ లేదొ..

may his soul rest in peace!!

Thursday, June 25, 2009

'కోడ్' భాషలు :

(Hindu i Images లో తెలుగు తల్లి)

వినటానికి కొత్త భాషలా ఉండి మాట్లాడుకునేవారికి మాత్రమే అర్ధమయ్యే కొన్ని 'కోడ్' భాషలు మన తెలుగువారి సొత్తు. చాలా మందికి పరిచితం కూడా.వాటిల్లో-- 'క ' భాష , 'గ' భాష,వెనుకనుంచి పదాన్ని పలికే భాష....ఇలా కొన్ని ఉన్నాయి.వాటిల్లో 'క 'భాష అంటే ప్రతి పదానికీ ముందర 'క ' అక్షరాన్ని పెట్టి మాట్లాడటం. (ఉదా:కను కవ్వు కఏ కమి కచే కస్తు కన్నా కవు? అంటే:నువ్వు ఏమి చేస్తున్నావు?)


'గ ' భాష అంటే పదాం మధ్యన 'గ ' అక్షరాన్ని చేర్చి పలకటం. (ఉదా: నంగాకు అంగది వంగద్దు! అంటే: నాకు అది వద్దు!)


ఇక పదాన్ని వెనుకనుంచి పలికే భాష ఒకటి ఉంది.(ఉదా: లాఇ చ్చివ ర్చొకూ. అంటె: ఇలా వచ్చి కూర్చొ)ఈ భాషలో మా చిన్నప్పుడు మా పక్కింటి అబ్బాయి సినిమా పాటలు పాడేవాడు. "సునమ కేలిప నమౌ తంగీ వేనీ..." అని.స్వాతిముత్యంలోని "మనసు పలికే మౌనగీతం నీవే..' పాట అది. ఈ కోడ్ లాంగ్వాజీలన్ని కొత్తవారికి,మనకిష్టం లేనివారికి అర్ధమవ్వకుండా మనం అప్పుడప్పుడు ఉపయొగిస్తూ ఉంటాము.జంధ్యాలగారు 'చంటబ్బాయి" సినిమాలో హీరో,హీరోయిన్ల మధ్య వాడిన 'క ' భాష బాగా ఆదరణ పొందింది.'లేడీస్ టైలర్ ' సినిమాలొ వంశీగారు 'జ 'భాష ని కూడా పరిచయం చేసారు.


మా అమ్మగారి ఇంట్లో మావయ్యలూ,పిన్నిలూ,పెద్దమ్మా అందరూ ఈ 'కోడ్' భాషలన్నింటిని చాలా స్పీడుగా మాట్లాడేసుకుంటూ ఉంటారు.నా చిన్ననాటి ఒక సంఘటన ఈ సందర్భంగా చెప్పాలి.ఒకసారి మేము మా నాలుగవ మావయ్యతొ విశాఖపట్నం వెళ్తున్నాము.రైలులో మాతొ బాటూ ఒక కుటుంబం ఎక్కారు.ఎక్కిన మొదలు అందరూ 'క 'భాషలొ నే మాట్లాడుకోవటం మొదలెట్టారు.ఎవరికీ అర్ధం కాదనుకున్నారో ఏమో..ఇంక ఓ గంటలో విశాఖ వస్తుందనగా వాళ్ళు ఏవో ప్రశ్నలు వేసుకుంటూంటే..మా మావయ్య వాళ్ళకి 'క ' భాషలో సమాధానం చెప్పాడు. వాళ్లందరూ ఒక్కసారిగా సైలెంటు అయిపొయారు!! ఇందాకటినుంచీ వాళ్ళు మాట్లాడుకునేవన్నీ మాకు అర్ధమయిపొయాయని తెలిసేసరికీ వాళ్ళ మొహాలు మాడిపొయాయి...మళ్ళీ రైలు దిగే దాకా వాళ్ళెవ్వరూ మాట్లాడలేదు!!

Wednesday, June 24, 2009

మీనా


మీనా అంటే యద్దనపూడిగారి నవలానాయిక గురించి కాదు నేను చెప్పబోయేది.స్వశక్తి ని నమ్ముకున్న ఒక మంచి అమ్మాయి గురించి.మీనా మా ఇంట్లో పనిచేసే దుర్గ కూతురు.వాళ్ల అమ్మతొ పాటూ ఒక్క మా ఇంటికే వస్తుంది సాయానికి.తొమ్మిదింటికల్లా మళ్ళి వెళ్పోతుంది-కాలేజీకి తయారవ్వటానికి.ఇప్పుడు B.com ఫైనల్ కి వచ్చింది.సినిమా ల్లో హీరో లతో పాటూ హీరోయినులు కూడా బూతులు మాట్లాడేస్తూంటే.. అదే ఫాషన్ అనుకునే ఈ కాలంలో అంతటి సౌమ్యురాలిని,మృదుభాషిణిని నేను చూడలేదు.తన పనేదొ తాను చేసుకు పోతుంది.అడిగితే తప్ప సమాధానం చెప్పదు. మరాఠీ అమ్మాయి ఆయినా చక్కని తెలుగు మాట్లాడుతుంది.పొందికైన దుస్తులు ధరిస్తుంది.ఈ కలం పిల్లేనా అనిపిస్తుంది తనని చూస్తే. ఎన్విరాన్మెంటల్ సైన్సు కి సంబంధించిన ఏవొ టాపిక్కులు కావాలంటె ఆ మధ్యన కొన్ని డౌన్లోడు చేసి ఇచ్చాను.ఇవన్నీ చదివేస్తుందా...అని లోపల అనుకుంటూ.'పనమ్మాయి కూతురు ' అనే తక్కువ భావమేదొ నాలో ఉంది అప్పటికింకా. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాకా చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్ చెప్తుందని తెలిసింది ఈమధ్యనే.అబ్బో.. అనుకున్నాను.సంపాదనకే అయినా ఎంతొ కొంత విజ్ఞానం ఉంటేనే కదా నలుగురికి బోధించగలదు.తన ఇంట్లో ఇద్దరు చెలెళ్లకి,ఒక తమ్ముడికి చదువు చెప్తుంది.వాళ్ల అమ్మకి వంట సాయం చేస్తుంది.అన్నివిధాలుగా తల్లికి తొడుగా నిలుస్తుంది. రెండవ సంవత్సరం డిగ్రీ మార్కులు ఎన్నివచ్చాయి అని అడిగాను మొన్న యధాలాపంగా."70% " అంది కూల్ గా.మొదటి సంవత్సరంలో ఎన్ని వచ్చాయి? అని అడిగాను అనుమానంగా.."70%" అంది తొణక్కుండా...ఆశ్చర్యపోవటం నా వంతైంది.ఆర్ట్స్ సబ్జక్ట్ లకి ఫస్ట్ క్లాసు రావటమే గొప్ప నే చదువుకున్నప్పుడు.. ఇప్పుడు మార్కులు అంత స్త్రిక్ట్ గా వెయ్యకపొయినా ఒక పనమ్మాయి కూతురికి ఇన్ని మార్కులా? అనుకున్నాను...ఆ పిల్లని ఆమె తాహతబట్టి అంచనా వేసినందుకు నా మీద నాకే సిగ్గు వేసింది.నేను ఆడిగితే తప్ప మార్కుల గురించి చెప్పుకోని ఆ అమ్మాయి నిరాడంబరత ని చూసి ముచ్చట వేసింది. నా దృష్టిలో ఎవరెస్టంత ఎదిగిపొయింది ఆ అమ్మయి. పొద్దున్న లేవగానే కాఫీ ఇవ్వలేదని తల్లితొ గొడవ పడే ఆడపిల్లలని,20ఏళ్ళు వచ్చినా గుండ్రం గుండంగా ఉంటాయే అవేమిటి (ఆవాలు పేరు తెలియక వచ్చిన తిప్పలు అవి) అని అడిగే పిల్లలని చూసాను గానీ ఇంతటి అణుకువ,వినయ విధేయతలున్న పిల్లని ఈకాలంలో నేనసలు చూడనే లేదు.ఇది కొందరికి అతిశయోక్తిలా అనిపించవచ్చు.కానీ సినిమాలు చూడని టీనేజీ పిల్లలు ఈకాలంలో ఎంతమంది?మా పాత పనమ్మాయి అయితే వచ్చిన కొత్త సినిమా ఆ వారంలొ చూసేసి మాకు రివ్యూ చెప్పేసేది.అందుకే అనిపిస్తుంది నిజంగా మీనా ఈ కాలం ఆడపిల్లలకి ఆదర్శవంతం కాగల అర్హతలున్న మంచి అమ్మాయి అని.నేను,మావారు ఇద్దరం కూడా హామీ ఇచ్చాము -ఏ అవసరం ఉన్నా అడుగు సహాయం చేస్తాము అని.ప్రస్తుతం డిగ్రీ తరువాత ఆ అమ్మయి చేత ఏ ఏ ఎంప్లాయిమెంట్ ఓరియెంటెడ్ పరీక్షలు రాయించాలా? అని అలోచిస్తున్నను. స్వశక్తి ని నమ్ముకున్న ఆమె తన కాళ్ళపై తను నిలబడి మరికొందరికి మార్గదర్శకం కావాలని భగవంతుణ్ణి ప్రార్ధించాను.

Tuesday, June 23, 2009

ఇక్కడా అవేనా..??

చిరునవ్వు ,
ఓ పలకరింపు,
ఒక చిన్న మాట,
నిట్టూర్పులో చల్లని ఓదార్పు..
ఇవి చాలు జీవితానికి
పోరాటం నడపటానికి
ప్రశాంతంగా సేదతీరటానికి!
అక్షరాల భావుకతని, పదాల విన్యాసాలని, చిన్ననాటి ముచ్చట్లని,
కధలని,కబుర్లని, నిర్మలమైన స్నేహాలను చూసి సరదాపడ్డాను
కోల్పొయినదేదొ ఇక్కడ పొందుదామని ఆరాటపడ్డాను
స్పూర్తి పొందుదామని బ్లాగు ముంగిట్లో అడుగు పెట్టాను..
కానీ నెలతిరక్కముందే నిరాశ చుట్టుముట్టింది..
ఇక్కడా అవేనా..??

మనుషుల మధ్య ఏవో విసుర్లు,ఇంకేవో కసుర్లు
వాదోపవాదాలు, విమర్శలూ, వెక్కిరింతలూ...
నేనో కొత్త పక్షినే
తప్పొప్పులూ,పూర్వాపరాలు తెలియవు..
నీ సొదేదో నువు రాసుకు పో
లేక బ్లాగు మూసుకు ఫో..
మా గొడవలు నీకెందుకు అని ఎవరైనా అనచ్చు!!
కానీ నాకే ఏదొ బాధ ..మనసులో..
మన జీవితాలలో ఉన్నవి చలవా?
ఇంకా ఎందుకు కొత్తవి?
ఇక్కడా అవేనా..??


దీనికెన్ని వస్తాయో విమర్శలు...
గాంధీ గారంతటి మహోన్నత వ్యక్తికే తప్పలేదు విమర్శలు...
ఈ అనంత విశ్వంలో నేనెంత... నా ఉనికెంత?!

Monday, June 22, 2009

ఆర్టికల్ ఫ్రం నవ్య-- "నాకోసం నేను కాదు !"

ఇది ఇవాళ ఆంధ్ర జ్యోతి న్యూస్ పేపరులో నవ్యలో వచ్చిన ఒక ఆర్టికల్.నాకు బాగా నచ్చింది.ఇంట్రెస్ట్ ఉంటే చదవండి.

http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2009/jun/22navya2

Sunday, June 21, 2009

స్వగతం

ఇవాళ ఆదివారం అస్సలు 8అయితేకానీ లేవకూడదు అని నిన్న చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను. కాని అలా ఎప్పుడు అనుకున్నా ఇంకా త్వరగా మెలుకువ వచ్చేస్తుంది.ఇవాళ ఐదింటికే మెలుకువ వచ్చేసింది.నాకు మెలకువ వస్తే ఓ పట్టన నిద్ర పట్టదు..అప్పుడె లేచి ఏమి చేసేది?వాకింగు కూడ అటకెక్కి 2నెలలు అవుతోంది.బధ్ధకంగా ఉంది...ఆయన ఎంత హాయిగా నిద్రపోతున్నారూ...తామరాకు మీద నీటి బొట్టు తత్వం ఆయనది.నిద్దరోక నాలా ప్రపంచంలోఉన్న కష్టాలన్నింటి గురించీ ఆలోచిస్తూ దొరికే ఒక్క ఆదివారాన్నీ వేస్టు చేసుకోరు.శనివారం మాకు స్కూలులో,కాలేజీలో కూడా హాఫ్ డే ఉండేది..అందుకని ఇప్పుడు ఫుల్ డే ఆయన ఆఫీసు,పాప స్కూలు ఉండేసరికి...విసుగ్గా ఉంటుంది.వారంలో ఉన్న ఒక్క ఆదివారంలో ఏమిటొ ఏదో ఆనందాన్ని అనుభవించేసి,సుఖపడిపోవాలని ప్రతి వారం అనుకుంటూనే ఉంటాను...అన్ని వారాలకీ మించి బిజీగా ప్రతివారం గడిచిపోతూ ఉంటుంది..పక్కింట్లో అప్పుడే సుప్రభాతం మొదలైంది.మొగుడూపెళ్ళాలు ఎందుకో అరుచుకుంటున్నారు...సుప్రభాతం,భజగోవిందం,సూర్య స్తుతి,సూర్య దండకం,ఆదిత్య హృదయం కూడా అయిపోయి మీడియా ప్లేయరు సైలెంటు అయిపోయింది.అయ్యో..అప్పుడే అత్తగారు పూజ మొదలేట్టేసారు..ఇంక వంటింట్ళొకి పిల్ల లేవకుండా వెళ్తే కాసిని పనులు అవుతాయి.అది లేస్తే దాన్ని బ్రష్ చేయించేసరికీ ఉన్న ఓపిక ఊడి నీరసం వస్తుంది....!!

Saturday, June 20, 2009

అంతర్మధనం...


మధనం...అంతర్మధనం....

వైరాగ్యం యదార్ధమైనప్పుడు జీవితాన్ని ఆస్వాదించేదెలా?

కర్తవ్యం నిర్దేశింపబడిఉన్నప్పుడు కోరికల్ని నశింపజేసేదెలా?

చేయూత ఉన్నా చుట్టూరా ఒంటరితనమే ప్రజ్వలిస్తూంటే

మౌనమే ఆధారమని మనసుకి నచ్చచేప్పేదెలా?

తడిఆరని కన్నులు చీకట్లని చూస్తూంటే వెలుగునకై వెతికేదెలా?

బాధ్యతల నడుమ ప్రాణం గిలగిలలాడుతూంటే స్వేచ్చగా అది ఎగిరేదెలా?


Thursday, June 18, 2009

పులిహోర

ఇది చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన.అప్పుడు నా వయసు 18.వంటింట్లో 'ప్రయోగాల ' పేరుతో అప్పుడప్ప్పుడు చేతులు కాల్చుకోవటం తప్ప పెద్దగా వంట రాలేదింకా.ఆమ్మ ఊళ్ళో లేదు.కాలేజీ నుంచి వచ్చి నాన్నకి ఇష్టమైన బజ్జీలు చేయటంలో బిజీగా ఉన్నాను.నాన్న ఆఫీసు నుంచి వస్తూనే చెప్పిన వార్త విని గుండెల్లో అలజడి మొదలైంది.ఢిల్లీ నుంచి వస్తున్న ఒక పెద్ద ఆఫీసరు నాన్న మీద అభిమానం కొద్దీ మా ఇంట్లో దిగబోతున్నారని. పెద్దాయనకి ఏమి వండాలో అని కంగారు మొదలైంది.ఆయన రానేవచ్చారు."ఎక్కువగా ఏమీ వద్దమ్మా,లైటుగా ఉంటే మంచిది రాత్రి పూట" అన్నారు.ఏదో చేతనైన విధంగా గుత్తివంకాయ కూర,గోంగూర పచ్చడి,పొట్లకాయ పెరుగు పచ్చడి,సాంబారు,పరమాన్నం,ఆప్పడాలు మొదలైనవి చేసాను.'రాత్రిపూట అరగవు,ఇన్నెందుకమ్మా చేసావు" అంటూనే మళ్ళి మళ్ళీ వేయించుకుని భోజనం ముగించారు ఆఫీసరుగారు.!"అమ్మయి వంట బాగా చేసిందోయ్.మీ ఆవిడ అప్పుడప్పుడు ఊరు వెళ్తూ ఉండచ్చు ఇంక" అని ఒక ప్రశంస పడెసారు.హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నను. మర్నాడు ఆదివారం..షిరిడీ వెళ్తున్న ఒక ఫ్యామిలీకి మేము భోజనం ఇవ్వల్సి ఉంది.త్వరగా వంట మొదలెట్టాను.ఊళ్ళో ఉంటున్న మా పిన్ని ఫొన్ చేసింది నేను "పులిహోర" తెస్తున్నను.నువ్వు వేరేది వండు అని.ఇంతలో ఆఫీసరుగారు వంటింట్లోకి వచ్చారు "అప్పుడె వంట మొదలేట్టవేమి" అన్నరు.ఇలా రైల్వే స్టేషన్ కి భొజనం పట్టుకెళ్ళాలి అన్నాను.'యేమి వండుతున్నావు?" అన్నరు.కంగారులో 'పులిహోరండి ' అనేసాను.ఓహో అని వెళ్పోయి,5నిమిషాల్లో ఒక డబ్బాతో వచ్చారు."ఎటూ మీవాళ్ళ కోసం చేస్తున్నవుగా, నాకు కూడా ఈ డబ్బాలో కాస్త పెట్టియ్యి" అనేసి వెళ్ళిపోయారు.నాకు పులిహోర చేయ్యటం అప్పటికి ఇంకా రాదు.కంగారులో అబధ్ధం చెప్పినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. పిన్ని స్టేషన్ కి వచ్చేస్తానంది...గబగబా నాన్న దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పాను.ఆఫీసరుగారు బాత్ రూం లోకి వెళ్ళగానే ఫోను దగ్గరకు పరిగెట్టాము ఇద్దరం.పిన్నికి ఫొను చేసి ఇంటికి వచ్చేయమని ,కలిసి స్టేషన్ కి వెళ్దామని చెప్పము.ఈలోగా ఆఫీసరుగారు వచ్చి 'ఎక్కువ పెట్టకమ్మా.ఏదో చేస్తున్నానన్నావని అడిగాను" అన్నారు.నాకు కంగారు,నవ్వు రెండూ వచ్చాయి.ఇంకా నయం ఎలా చేస్తున్నావని వంటింట్లోకి తొంగి చూడలేదు అనుకున్నాను.బ్యాగ్గు సర్దుకుని ఆఫీసరుగారు హాలులో కూర్చున్నారు నేను పులిహోర డబ్బ ఎప్పుడు ఇస్తానా అని.నాన్నకి,నాకూ కంగారు పెరిగింది.ఆటొ తెస్తానుండండి అని నాన్న పిన్ని ఇంటికి బయల్దేరారు బండి వేసుకుని.సందు చివరకి వెళ్ళగానే పిన్ని కనిపించిందట,వెనుక కూర్చోపెట్టుకుని తీసుకు వచ్చారు.'దిగగానే వంటింట్లోకి వెళ్ళూ" అని బయటే మా పిన్నికి చెప్పారుట.ఏమీ అర్ధం కాని పిన్ని వంటింట్లోకి రాగానే ఒక్క ఉదుటన తన చేతిలోని పులిహోర బాక్సు లాక్కుని ఆఫీసరుగారి డబ్బా నింపి హాలులోకెళ్ళి ఆయనకు అందించాను.మరోసారి రాత్రి తిన్న వంటని పొగిడి ఆయన నాన్న తెచ్చిన ఆటోలో రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయారు.అయోమయంగా చూస్తున్న పిన్నికి విషయమంతా చెప్పి ఊపిరి పీల్చుకున్నం మేము.10రోజుల తరువాత ఢిల్లి నుంచి ఉత్తరం వచ్చింది "మీ అమ్మయి ఆవ పెట్టి చేసిన పులిహోర అద్భుతంగా ఉంది.ఈసారి అటువైపు వస్తే మా ఆవిడతో సహా మీ ఇంట్లోనే దిగుతాను మీ అమ్మయి చేతి పులిహోర తినటానికి" అని.'ఎందుకైనా మంచిది పిన్ని దగ్గర పులిహోర చెయ్యటం నేర్చుకోవే" అన్నారు నాన్న. వెంఠనే పిన్నికి ఫొను చేసాను."ఆ రోజు పులిహోర నేను చెయ్యలేదు.అప్పుడే నరసాపురం నుంచి వచ్చిన మా అత్తగారు చేసారు" అంది పిన్ని.ఇప్పుడు నరసాపురం వెళ్లాలా? అనుకున్నాము నేను,నాన్న!! ఇప్పటికీ ఈ సంగతి గుర్తు వచ్చినప్పుడల్లా నవ్వువస్తూఉంటుంది.

Tuesday, June 16, 2009

pot painting

Pot painting(flowervase)



flowervase, penstand

వెనకాల ఉన్నది అక్రిలిక్ షిట్ మీద గ్లాస్ కలర్స్ తో వేసినది..


flowervase on a wall


ఇది చాలా పాతది.




work on white acrylic sheet with M-seal



ceramic work on a cardboard



fabric painting on a TV cover



another pot, pen stand, work on acrylic sheet

flowervase, penstand , ఆ వెనకాల ఉన్నది అక్రిలిక్ షిట్ మీద గ్లాస్ కలర్స్ తో వేసినది..

Durga eyes



fabric painting on a bed sheet

ఇది ఒక ఫ్రెండ్ కి వేసి ఇచ్చినది.


ముగ్గులు..











ముగ్గు అంటే నాకు చాలా ఇష్టం. ముగ్గులు వెయ్యటం... అంటే అదొక సరదా.. సంక్రాంతి వస్తోంది అంటే ముగ్గులతొ రెడీ . రకరకాల ముగ్గులు యెక్కడెక్కడనుంచో సంపాదించి,పుస్తకంలో నింపటం...నెల పట్టడం, ముగ్గులు వెయ్యటం...సందులో అందరికన్న పెద్ద ముగ్గు వెయ్యాలని తాపత్రయపడటం...నేనే వేసేదాన్ని కూడా..పండగకి వేరే ఊరు వెళ్ళినా అక్కడా నేనే ముగ్గులు పెట్టేదాన్ని.అప్పుడు కమేరాలు,ఫొటొలు తీసుకోవటాలు తెలియవు...ఏవొ అప్పుడప్పుడు ఫొటొలు తీసుకున్న నేను వేసిన ముగ్గులు కొన్ని ఉన్నాయి.అవే ఇక్కడ పోస్టులో పెడుతున్నాను.ముగ్గులు చాలమంది వేస్తారు.కానీ కాకి ముగ్గులు కాకికి ముద్దు కదా ...

Monday, June 15, 2009

Hemant kumar,S.D.Burman...

నాకు చిన్నప్పటి నుంచీ పాత హిందీపాటల పిచ్చి.ఆ భాష మీద ఉన్న మక్కువ కొద్దీ హిందీలో యం.ఎ.కూడా చేసా.మా నాన్నగారి దగ్గర ఉన్న 2000క్యాసెట్ల లో సగం హిందీవే!అవి కాక రేడియోలో రొజూ 'మన్ చాహే గీత్ ' 'భూలే బిస్రే గీత్ ' వినటం అలవాటు(ఇప్పుడు మానేసాననుకోండి).నెట్ లో డౌన్లోడు చేసుకోవటం వచ్చాకా కాసెట్లూ,సీడీలూ కొనటం మానేసాను.మొన్న తెలిసినవాళ్ళింట్లో రెండు కొత్త అల్బంలు చుసాను.హేమంత్ కుమార్ ది ఒకటి,యస్.డి.బర్మన్ ది ఒకటి.
రెండింటిలో ఉన్న కొన్ని మంచి పాటల పేర్లు రాద్దామనిపించింది.హేమంత్ కుమార్ -సోలిడ్ గోల్డ్ అనే అల్బం లో ఉన్న రెందు సి.డిలలో ఉన్న కొన్ని ఆణిముత్యాలు:

1) नैन से नैन --jhanak jhanak pAyal bAje
२)जाने वो कैसे लोग थे जिन के प्यार को प्यार मिला- -pyAsA
३) ए नयन डरॆ डरॆ--kohrA

4)हम्ने दॆखी है उन आखॊ मे--khAmoshI

5)वो शाम कुच्छ अजीब थी--khAmoshI

6)तुम पुकार लॊ--khAmoshI

7) तुम्हॆ याद हॊगा कभी हुम मिलॆ थे--satta bAzAr

యస్ .డి.బర్మన్ గారి లెజన్డ్స్ సిరీస్ లో అయిదు సిడిలు ఉన్నాయి.వాటిల్లో కొన్ని ఆణిముత్యాలు:

तुम न जाने किस जहा मे खो गये--sazaa
चाँद फिर निकला --paying guest
दुखि मन मेरा --funtoosh
छॊड दो आचल ज़मान क्य कहेगा---paying guest
जाने वोह कैसे लॊग थे जिनके---pyaasa
जल्ते है जिसके लियॆ--sujaata
एक लड्कि भीगी भागी सी--chalti ka naam gaaDi
न तुम हमे जानो--baat ek raat ki
खोया खोया चान्द--kaalaa baazaar
पूछॊ न कैसॆ मैने रैन बितायी--meri surat terii aankhen
दिल क भवर--tere ghar ke saamne
दिन ढल जायॆ--guide

क्या से क्या हॊ गया--guide
रुलाके गय सप्ना मेरा--jewel thief

जीवन के सफ़र मे राही--muneemjI

ఈ పాటలన్నీ కూడా మాళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధురగీతాలే!



ఆమ్మే నా బెస్ట్ ఫ్రెండ్!!

ఈ టపా రాసే ముందు ఒక పుస్తకం గురించి చెప్పాలి.నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి "అమ్మకి జేజే".ఇది 2000లో పబ్లిష్ అయింది.అమ్మ గురించి ఒక 17మంది తో చెప్పించి దాన్ని ఆంధ్రజ్యోతి వీక్లీ లో అచ్చువేసి తరువాత వాటన్నింటినీ ఒక పుస్తకంలో పొందుపరిచారాయన. బాపురమణలు, బాలు, బాలమురళిగార్లు..మొదలైన గొప్పగొప్పవాళ్ళంతా వాళ్ళ అమ్మని గురించి భలేగా చెబుతారు ఈ పుస్తకంలో.దొరికితే తప్పకుండా చదవాల్సిన పుస్తకం.ఇంతకీ 'మా అమ్మ ' దగ్గరికి వచ్చేస్తే;
అమ్మ గురించి ఎంత రాసినా తక్కువే.ఆ సబ్జక్టు సముద్రమంత విశాలమైనది,లోతైనది.అందుకని చాల క్లుప్తంగా మాత్రమే రాద్దామని...

అమ్మానాన్నలతో పదహారేళ్ళు, నాన్నతో నలభైఏళ్ళ సాంగత్యం అమ్మది. జీవితమే ఆవిడ పాఠశాల.సహనానికి మరో పేరు మా అమ్మ.మౌనంతో సమస్యలని పరిష్కరించవచ్చని అమ్మని చూసి నేర్చుకున్నను.'ఎవరైనా రైజ్ అయినప్పుడు మనం మౌనంగా ఉండిపోతే సగం సమస్య తీరినట్లే ' అనేది అమ్మ.ఇంక అమ్మ చేసిన త్యాగాలు,పడిన అవమానాలూ,బాధలూ,వేదనలూ ఎన్నో.కానీ 'అందరితో పంచుకోవాల్సినది సంతోషం మాత్రమెఅనే అమ్మ ముఖంలో ఎప్పుడూ నేను చిరునవ్వునే చూసాను.ఎంత బాధ లోన ఉన్నా ఎప్పూడూ ఆవిడ బయిటకి వ్యక్తపరచడం నేను ఇంతవరకూ చూడలేదు.
పొద్దున్న లేచి స్నానం చేసి,పూజ చేసుకున్న తరువాతే మిగిలిన పనులు మొదలెడుతుంది ఇప్పటికీ. పనిమనిషి రాకపోతే అంట్లు కూడా తొమనిచ్చేది కాదు. పెళ్ళయితే ఎలాగూ తప్పవు.నాకు వదిలెయ్ అనేది.ఇప్పుడు తను అత్తగారు అయినా నాకన్నా కోడళ్ళని బాగా చూసుకుంటుంది. వాళ్ళతో స్నేహితుల్లా ఉండాలి అనేది ఆవిడ కన్సెప్తు.కావాల్సినంత ఫ్రీడం వాళ్ళకి. అలా చేయాలి,ఇలా ఉండాలి అని ఎప్పుడూ రూల్సు పెట్టదు.
మా నాన్నది మీడియారంగం కావటంతో మాకు ఎప్పుడూ వచ్చేపోయే జనాలు ఎక్కువే ఉండేవారు.2,3రోజులు ఉండటానికీ,లంచ్ కీ,డిన్నర్లకీ కూడా ఎవరోఒకరు వస్తూనే ఉండేవారు.వచ్చినవాళ్ళందరికీ విసుగు లేకుండా,కబుర్లు చెప్తూ వండిపెట్టేది ఆవిడ.నాకు తెలిసి 10రోజులైన పుట్టింటికి వెళ్ళలేదు తను.ఎందుకమ్మా అని అడిగితే 'మే నాన్నకి హోటల్ భోజనం పడదు.నే వెళ్తే ఇబ్బందిపడతారు ' అనేది."బిహైండ్ ఎవ్రీ సక్స్సెసుఫుల్ మాన్ థెరీజ్ అ ఉమన్"కి నిర్వచనం మా అమ్మే. ఆవిడ సుఖపడింది చాల తక్కువ, మాకు ఇచ్చింది చాలా ఎక్కువ.తాను ఒక కొవ్వత్తిలా కరిగి మాకు వెలుగును చూపింది.
మా పాప పుట్టినప్పుడు 20రోజులు ఐ.సి.యు.లో ఉంది.పుట్టిన 3వ రోజు ఒకటి,5వనెలలో ఒకటి-రెండు సర్జరీలు అయ్యాయి. ఆమ్మే లేకపోతే నేను నా పాపని నేను దక్కించుకోలేకపోయేదాన్ని.దానికి ఆవిడ చేసిన సేవ అపారం.జన్మంతా చేసినా ఆవిడ ఋణం నేను తీర్చుకోలేను అనిపిస్తూఉంటుంది. ఆమ్మ విలువ పెళ్ళయ్యాకే తెలుస్తుంది. అత్తగారింట్లో కొన్నాళ్ళు ఉన్నాకే అమ్మ బాగా మనకు అర్ధం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు అమ్మ అలా ఎందుకు చేసేదొ పెళ్ళయ్యాకా స్వీయానుభవం మీదే అర్ధం అవుతుంది.
అమ్మ దగ్గరున్న స్వాతంత్ర్యం మరెవరిదగ్గర దొరకదు మనకి. కసిరినా, కోప్పడినా, తిట్టినా, అరిచినా, మాట్లాడకుండా ఉన్నా.....మనల్ని భరించేది అమ్మ ఒక్కతే!!మనల్ని అర్ధం చేసుకుని,పొరపాట్లని ఎత్తిచూపి, మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా కాపాడే మన మొదటి గురువు అమ్మే కదా.అందుకే ఎప్పటికీ నా బెస్టు ఫ్రెండు మా అమ్మే!!

Saturday, June 13, 2009

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం...


ఈమధ్య వచ్చిన కొత్త పాటల్లో 'శశిరేఖా పరిణయం ' చిత్రంలో నాకు బాగా నచ్చిన పాట ఇది.సాహిత్యం+సంగీతం రెండూ ఏకమైతే అది మరపురాని గీతమే అవుతుంది.సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు,అనంత శ్రీరామ్ ఇద్దరూ చెరొక చరణం రాసినట్లున్నారు .ఏది ఎవరిదో తేలేదు కానీ పాట మాత్రం పదే పదే తలపుకోస్తూ ఉంటుంది.
ఇదిగో ఆ సాహిత్యం:
ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం,
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం
కలత పడుతుందే లోలోనా,
కసురుకుంటోందే నాపైన
తన గుబులు నేను, నా దిగులు తాను
కొంచమైనా పంచుకుంటే తీరిపొతుందేమో భారం ll పll

పచ్చగా ఉన్న పూతోట, నచ్చడం లేదే ఏ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా, గిచ్చినట్టుందే నన్నంతా(2)
ఉందలేను నెమ్మదిగా, ఎందుకంట తెలియదుగా(2)
తప్పటడుగొ, తప్పు అనుకో,తప్పదే తప్పుకు పోదాం తక్షణం,
అంటూ పట్టుపడుతోంది ఆరాటం పదమంటూ,
నెట్టుకెళుతోంది నను సైతం
ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం, అది ఏదో చెప్పనంటొంది నా మౌనం
ఉబికి వస్తూంటే సంతోషం, అదిమి పెదుతొందే ఉక్రొషం
తన వెనుక నేను, నా వెనక తాను
ఎంతవరకీ గాలి పయనం, అడగదే ఉరికే ఈ వేగం ll పll


ముల్లులా బుగ్గను చిదిమిందా, మెల్లగా సిగ్గును కదిపిందా
వానలా మనసును తడిపిందా, వీణలా తనవును తడిమిందా(2)
చిలిపి కబురు ఏం విందో, వయసుకేమి తెలిసిందో(2)
ఆద మరుపో, ఆటవిడుపో,కొద్దిగా నిలబడి చూద్దాం ఓ క్షణం,
అంటే కుదరదంటోంది నా ప్రాణం
కాదంటే ఎదురు తిరిగింది నా హృదయం !!

ఈ పాట రెండు చరణాలూ క్రింద అటాచ్ చేసిన రెండు లింకుల్లో వినవచ్చు.

" పోయినోళ్ళందరూ మంచోళ్ళు..."

"పోయినోళ్ళందరూ మంచోళ్ళు...
ఉన్నొళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులు.."

ఇంతకన్నా అర్ధవంతంగా, అందంగా, సూక్ష్మంగా ఎవరైనా పాట రాయగలరా అనిపిస్తుంది ఆత్రేయగారి పాటలు విన్నప్పుడల్లా.


ఊహతెలియనప్పుడు తాతయ్య,
స్కూల్లో ఉన్నప్పుడు తాతమ్మ,
ఇంటర్లో ఉన్నప్పుడు అమ్మమ్మ,
పీ.జి.లో ఉన్నప్పుడు మావయ్య,
నా క్లోజూ ఫ్రెండు అమ్మగారు,
ఆ తరువాత మా నానమ్మ...
క్రిందటేడు మా మామగారు...
నాలుగురోజుల క్రితం నా ఇంకో ఫ్రెండు అమ్మగారు... ..అందరో నాకు బాగా దగ్గరైన వాళ్ళు...
కనబడని దూరతీరాలకు వెళ్ళిపోయారు..,

ఇక ఎందరో సినే గేయ రచయితలూ,
గొప్ప వెలుగులు వెలిగిన హీరోలూ,హీరోయినులూ,వాగ్గేయకారులూ...
ఇంకా ఎందరో మహానుభావులు....
అంతా ఏమైపోయారు?ఇక కనిపించరా?

నిన్నటి వెలుగుల్ని చూసిన ఆ మహోన్నతవ్యక్తులంతా ఏరి?
ఇవాళ కావాలంటే వస్తారా?కనబడతారా?

ఎంత విచి త్రమో కదా జగత్తు..!

రెప్ప మూసి తెరిచేంతలో కనుమరుగౌతారు కొందరు
బ్రతుకు బాటలో మైలురాళ్ళుగా మిగిలిపోతారు కొందరు
తమ జీవితమే సందేశంగా మిగిల్చిపోతారు కొందరు
అందరికీ నీడనిచ్చి తాము శూన్యంలోకలిసిపొతారు కొందరు

ఎంత వెతికినా కానరారు

ఎంత పిలిచినా పలుకలేరు

నిశ్శబ్దం వెనుక మౌనంగా

చీకటిలో కలిసిన నీడలా వెంట ఉంటూ

కంటికింక అగుపడరు...

ఇదే ఇదే నిజమంటూ నిట్టూరుస్తాము

పదే పదే తలుచుకుని దుఖిస్తాము
అయినా తీరదు ఆక్రోశం
సేదే తీరదు ఉద్వేగం


అన్నీ తెలిసీ అన్నీ మరిచి నాటకమాడునేమానవుడు
మాటలతోటి ఈటెల కోటలు,చేతలతోటి హృదయాన గాయాలు
చాకచక్యంగా మోసాలెన్నో చేయగల సమర్ధుడీ మానవుడు

లోకం లోన తీరే ఇంతని వెతలు చెప్పునీనయవంచకుడు !!

మనతో పట్టుకుపోయేది ఏదీ లేదని,ఉన్నన్నాళ్ళూ మంచిగా మనిషిగా బ్రతకాలని,
తొటి మనిషి సంతోషంలోనే మన సంతోషం దాగిఉందని ఎప్పటికి అర్ధం చేసుకుంటామో మనం..?


Friday, June 12, 2009

ఉత్తరాలు !!

 
"ఉత్తరం" అంటే అదొక మధురమైన జ్ఞాపకం.ఉత్తరం దేముడు ఇచ్చిన ఒక తీయని వరం.మనసు పొరల్లో జ్ఞాపకాల దొంతరలో దాగిఉన్న కమ్మటి కబుర్లు ఉత్తరాలు.ఉత్తరం రాసే అలవాటు ఉన్న ప్రతిఒక్కరికీ అవి అమూల్యమైన సంపదలు.
 
'ఉత్తరం రాయగలిగిన ప్రతివ్యక్తి రచయితే' అన్నరు బెర్నార్డ్ షా.
 
 

చదువుకునేరొజుల్లో అదొక పిచ్చి.రెండు రోజులకి ఒక పొస్టు వచ్చి తీరాల్సిందే.పోస్టుమ్యానుకి ఎప్పుడూ మా అడ్రెసు కంఠతానే;యెందుకంటే మాఇంట్లో అతని దసరా మామూలు అందరికన్న రెట్టింపు!!


ఉత్తరం రాయటమూ ఒక కళే. దానికీ కొన్ని మూడ్స్ ఉంటాయి. డాబా మీద వెన్నెల్లో కూర్చున్నప్పుడు కొబ్బరాకుల గలగలలు వినిపిస్తూంటే ,ఝామ్మని వర్షం పదుతూంటే, వర్షం వచ్చి వెలిసాకా కమ్మని మట్టివాసన గుండెలనిండా పీల్చుకున్నప్పుడు, పొద్దున్నే లేవగానే అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, సూర్యుడు అస్తమించే నిశీధివేళ పక్షులు గూళ్ళకు వెళుతూ కిలకిలారావాలు చేస్తున్నప్పుడు, మంచి సినిమా చూసినప్పుడు,మది కదిపే సాహిత్యం చదివినప్పుడూ,అందమైన లెటర్ ప్యాడు దొరికినప్పుడు,బాగా రాసే పెన్ను చేతికందినప్పుడు....ఇష్టమైన పాటలో,లేక మధురమైన సంగీతమో పెట్టుకుని అది వింటూ రాయాలి ఉత్తరం! అప్పుడు కదులుతుంది కలం అక్షరాల వెంట వేగంగా,పరుగుపందెంలో విజేతలాగ.కానీ మధ్యలో యెవరైనా కదిపితే ఇంక పుడుతుంది మంట ...

అందుకే నేను ఉత్తరం రాసేటప్పుడు ముందుగానే వార్న్నింగు ఇచ్చేదాన్ని "నన్నెవ్వరూ దిస్టుర్బ్ చేయకండి.నేను ఉత్తరం రాసుకుంటున్నను" అని.నామట్టుకు నేను4పేజీలకన్నా తక్కువ యే రోజూ రాసి యెరుగను.10,12,20 పేజీల ఉత్తరాలు కూడా రాసిన రొజులు ఉన్నాయి.కార్డులు,ఇన్లాండు కవర్లూ రాసింది తక్కువే. మరి వంశపారంపర్యమేమో తెలేదు.మా తాతగారు మద్రాసులో 'లా' చదివే రోజుల్లో అడివి బాపిరాజుగారు తాతగారి రూమ్మేటుగా ఉండేవారుట.మా తాతగారు ఉత్తరాలు రాసినప్పుడూ,ఆయనకు ఉత్తరాలు వచ్చినప్పుడూ బాపిరాజుగారు అనేవారుట "భలే రాసుకుంటారయ్యా మీరు ఉత్తరలు.ఏది ఓ సారి చూపించు" అనేవారట. ఆయన 'తుపాను ' నవలలో ఉత్తరాల గురించి ఒక మంచి పేరాగ్రాఫే ఉంటుంది.మా ఇంట్లో పిన్నిలు , పెద్దమ్మ, మావయ్యలు, కజిన్సు, అన్నయ్యలూ, ఫ్రెండ్స్,ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపొయిన పక్కింటివాళ్ళు... అందరమూ తెగ రాసేసుకునేవాళ్ళం ఉత్తరాలు. మీ ఫమిలీ పోస్టల్ డిపార్టుమెంటుని బతికించేస్తోంది అని వేళాకోళం చేసినవాళ్ళూ ఉన్నారు.ఈ వ్యక్తిగత ఉత్తరాల్లో కొన్ని భద్రంగా దాచుకునేవి,ఏళ్ళు గడిచినా మళ్ళి మళ్ళి చదువుకునేవి,ప్రేమలేఖలు,త్రిపురనేనిగోపీచంద్ గారు చెప్పినట్టు 'పోస్టు చెయ్యని ఉత్తరాలు ' కూడా ఉంటాయి. ఓ 5,6యేళ్ళ నుంచీ ఈ ఉత్తరాల జోరు తగ్గింది.ఫొనులు,ఈ-మేల్స్,వచ్చేసాకా తీరుబడిగా ఉత్తరం రాసే ఖాళీ ఎవరికీ?తీరుబడి చేసుకుని మైల్ రాసినా చదివే తీరికే ఉండటంలేదు ఇప్పుడు కొందరికి. మొబైలు ఫొనులు వచ్చాకా ఈ-మేల్స్ కూడా తగ్గిపోయాయి. నాకైతే చాలమంది చుట్టాలు ఊళ్ళోనే ఉన్నరు.ఫ్రెంద్స్ అయితే చాలా మంది అడ్డ్రెస్సులోనే లేరు.


మొన్నొకరోజు మా ఫ్రెండు ఒకమ్మాయి ఫొను చేసి 'నీ ఉత్తరం చదివి చాలారోజులు అయ్యిందే.ఓ ఉత్తరం రాయి 'అని అడిగింది.రాయాలి దానికి.కాలేజీ రోజుల్లో ఆ జోరే వేరు.ఎక్కడ మంచి లెటర్ ప్యాడు దొరికితే అది కొనేయటం,రకరకాల కలర్ పెన్నులు,ఇంకులు,కొనేయటం ఉత్తరాలు రాసేయటం.పోస్టు వస్తే నేనే తెరవాలి.ఏవరైన ముట్టుకున్నారో యుధ్ధమే!నా చిన్నప్పుడు మా నాన్నగారికి శ్రోతలు రాసిన ఉత్తరాలు ఎన్ని వచ్చేవో. టి.వి.లో సురభి ప్రోగ్రాములో పెద్ద గంగాళాం నిండా ఉత్తరాలు చూపించేవారు కదా,ఆలానే వాచ్చేవి.అలమారా నిండిపోయాకా ఆవాన్నీ మా అమ్మ చింపేస్తే మేము బయట పడేసి వచ్చేవాళ్ళము.నెలనెలా ఇదే పని.ఎన్నని దాస్తాము?అప్పుడు దిజిటల్ కమేరాలు లేవు ఫొటొ తీసి దాచటానికి అనిపిస్తుంది.


నాకిప్పటికీ ఈ-మేల్ రాయటం కన్నా ఉత్తరం రాయటమే ఇష్టం. ఆ ఆనందమే వేరు.పెన్ను చేత పట్టుకుని ఆలోచనలని కాగితంపైన పెట్టడమే ఒక గొప్ప తృప్తిని ఇస్తుంది. అది రాయటం అలవాటు ఉన్నవాళ్ళకు మాత్రమే తెలిసిన అనుభూతి!!

Thursday, June 11, 2009

నేనిప్పుడు UKG?!




ఇవాళే వెళ్ళి స్కూలులో UKG ఫీజు కట్టి text booksతీసుకుని వచ్చాను.అట్టలు వేసి,లేబిల్స్ అతికించాము.ఇంక ఎల్లుండి నుంచీ స్కూల్!!"ఎన్నళ్ళో వేచిన ఉదయం.." అని పాడుకోవాలని ఉంది. 41/2 ఏళ్ళనుంచీ ఎదురు చూసిన ఉదయం.అది చంటిపిల్లప్పుడు దాన్ని చూసుకోవటంతో బిజీ ,అది పెద్దయ్యాకా దాని స్కూలుతో బిజీ ; nurseryలో ,LKGలో మధ్యహ్న్నం వచ్చేసేది.దింపటం తీసుకురావటం కలుపుకుంటే అసలు స్కూలుకి వెళ్ళినట్టే ఉందేది కాదు.నా హాబీలన్నీ మూలపడి ఇన్నాళ్ళూ బూజుపట్టేసాయి.నా రంగులు ,కుంచలూ చూస్తే మా పిల్లకి యెనలేని హుషారు.ఎప్పుడన్నా నే పెయింటింగు మొదలెడితే దాని రూపాన్నే మార్చేసి ఇంకో కొత్త బొమ్మ తయారు చేయగల సమర్ధురాలవటంతో నేనిన్నాళ్ళూ ఏమీ చెయ్యటానికి లేకపోయింది.ఇప్పుడింక సాయంత్రం3.30 దాకా స్కూలే.అది ఏమి తింటుందో,క్యారేజీ తెచ్చేస్తుందో అన్న దిగులు కన్నా నాకు ఖాళీ ఎక్కువ దొరుకుతుంది ,నేనింక నా చేతుల దురదంతా తీర్చేసుకోవచ్చు అన్న సంతోషం యెక్కువగా ఉంది.ఎంత స్వార్ధపరురాలినో కదా !
ఇక అసలు విషయంలోకి వచ్చేస్తే, నేనిప్పుడు UKG?!ఎందుకంటే ఇది తల్లితండ్రులకు కు 2nd ఇన్నింగ్సే కదా మరి!పిల్లలతో పాటూ మనమూ స్లిప్ టెస్టులకి,యూనిట్ టేస్టులకి,క్వార్టర్లీలకి,పెద్ద పరీక్షలకి,అన్నింటికీ వాళ్ళతో మనం కూడా కుస్తీలు పడుతూ ఉంటాము కాబట్టి ఇది మన 2nd ఇన్నింగ్సే ! నేను చిన్నప్పుడు ఏమి చదివానో నాకు గుర్తు లేదు.ఇప్పటి పిల్లలకి ఉన్న జ్ఞానం కూడా ఎందుకో అప్పుడు మనకు లేదు. కానీ ఇప్పుడు పాపతో చదువుతూంటే ఇవన్నీ అసలు చదివానా చిన్నప్పుడు అనిపిస్తుంది.నరసరీలు మనము ఎరుగము.సరే అదీ పాపతో చదివాను.తరువాత ఎల్.కే.జీ . ఎల్కేజీ లొ 5,6 వాక్యాల కధని బట్టి పట్టమనేవారు.చిన్న పాప ఏమి చదువుతుంది అనుకున్నాను.నేను పెద్దగా చదివించలేదు కూడా దానికి కష్టం అవుతుందేమో అని.LKG అయ్యే సరికీ అలాంటి కధలు ఓ 4,5 వచ్చేసాయి దానికి.(నాకింకా రానేలేదు)నోరువెళ్ళబెట్టడం నా వంతైంది.ఇప్పుడు UKGలో మొదటి లాంగ్వేజీ తెలుగుట!తెలుగు వాచకం చూసి మర్చిపోయిన అక్షరాలూ ,హల్లులూ మళ్ళీ నేర్చుకోవచ్చు కదా అని సరదా వేసింది.(తెలుగువాళ్ళము అయిఉండీ ఎ ,బి,సి,డిలు ముందర నేర్పటం ఏమిటి అని పాపకి అ,ఆ లు క్రితం ఏటనే నేర్పించేసాను.)ఇంకా ఏవో ఏడు రకాల టెక్ష్ట్ బుక్కులు,10 రకాల నొటుబుక్కులు ఇచ్చారు.యేమి చదివిస్తారో ఏమో!ఇక ఎల్లుండి నుంచి ready for school !!

Tuesday, June 9, 2009

గోదావరి జ్ఞాపకాలు..!


'గోదావరి ' ఆ పేరులో ఏదో ఆత్మీయత.రాజమండ్రీలో పుట్టినందుకా?తెలీదు.పెరిగినది విజయవాడలో అయినా నాన్నగారి ఊరు 'కాకినాడ ' కావటంతో ప్రతి శెలవులకూ మాకు ఒకే ప్రయాణం...కాకినాడకి.అప్పట్లో సర్కార్ ఎక్ష్ప్రెస్ అనే రైలు ఉందేది.ఫొద్దున్నే యెక్కితే మధ్యాన్నం కాకినాడ చేరేవాళ్ళం.అది ప్రతి ఊరిలోనూ ఆగుతూ వెళ్ళేది.ఆప్ అండ్ డౌను చేసే స్టూడెంట్లు,ఉద్యోగస్తులూ,పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళివారితో ఆ రైలు ఎప్పుడూ గొదావరిలా నిండుగా ఉండేది. దారిలో రాజమండ్రీ వచ్చేది.సింహాచలం సంపెంగపూల కోసం రాజమండ్రీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్ళం.ముందు గొదావరి స్టేషను వచ్చేది,ఆ తరువాత గోదావరి బ్రిడ్జి మీద రైలు వెళ్ళేది.ఆదో గొప్ప అడ్వంచరులా ఉండేది.కిటికీ సీటు కోసం నేను,మా తమ్ముడు ఎప్పుడూ ఫైటింగే! నది లో పడవలూ,జాలరులూ,చేపలూ,మేము వేసే అర్ధరూపాయి,రూపాయి బిళ్ళలు(యెందుకో అలా చిల్లర డబ్బులు వేయించేవారు నదిలో) ...రైలు బ్రిడ్జీ దిగే దాకా మహా సరదాగా ఉండేది.ఒడ్డుకి ఒకవైపున 'రాణి చిత్రాంగి గారి ' ఒక పాత కోట ఉండేది. కానీ ప్రతిసారి ఊరు వెళ్ళినప్పుడూ 'గోదావరి ' చాలా మారిపోతూ ఉండేది.మధ్యలో నల్లని పాయలా కొన్నళ్ళు ఉందేది.అది మరోసారి వెళ్ళినప్పుడు ఆకుపచ్చగా మారిపొయింది.మళ్ళీ కొన్నాళ్ళకి అదొక చిన్న 'ఐలాండ్ ' అయిపొయింది.కొన్నాళ్ళకి ఆ ఐలాండ్ నిండా బాగ గడ్డి పెరిగిపోయింది.గడ్డి తినిపింఛడానికి ఆవులు,గేదెలు,మేకలూ తీసుకుని వాటి తాలూకు మనుషులు ,కొన్ని చిన్న చిన్న పాకలూ,వీటన్నింటితో అదొక చిన్న నివాస స్ఠావరంగా మారిపోయింది.ఇదంతా జరగటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది.నీరు ఎండిపొతున్నందుకు బాధగా ఉన్నా కొత్తగా ఏర్పడిన ద్వీపం మాత్రం చూడటానికి ఎక్సైటింగ్ గా ఉందేది.ఇప్పుడింక కాకినాడ ,రాజమండ్రి రైలు ప్రయాణాలు ఆగిపొయినా ;ఆ జ్ఞాపకాలు మాత్రం తీయగా మిగిలి పోయాయి.

Friday, June 5, 2009

గుర్తింపు ..


ఉద్యోగం చేస్తేనేనా నేడు స్త్రీ కి గుర్తింపు?డబ్బు సంపాదనేనా జీవిత పరమావధి?

మనిషిని మనిషిగా మనిషి గుర్తించడా ?మనిషి స్వభావంలో మార్పు ఎప్పుడు వస్తుంది?

ఎన్ని వేలు సంపాదిస్తే చిన్నపిల్లలకి మన చేత్తో మనం అన్నం పెట్టుకున్న తృప్తి వస్తుంది ?

'అమ్మా' అని బిడ్డ కౌగిలిన్చుకున్నప్పుడు వచ్చే తృప్తి,ఆనందం యెంత పెద్ద ఉద్యోగం చేస్తే వస్తాయి ?

పిల్లల చిన్నప్పటి ముద్దు-ముచ్చట్లు ఉద్యోగాలకి వెళ్ళిపోయి కోల్పోతే మళ్లీ పొందగలమా?

భర్తకు కావాల్సినవి సమకూర్చి ,బయిటనుంచి రాగానే పలకరించి,దగ్గర కూర్చుని వడ్డించే ఓపిక,సమయం ఉద్యోగానికి వేళ్తే ఉంటాయా?ఈ ఆనందాన్ని ఉద్యోగం చేస్తే పొందగలమా?

తప్పనిసరి అయితే తప్పదు.పరిస్థితులతో రాజీ పడాల్సిందే!!

కానీ అలాంటి అవసరాలని పక్కన పెడితే;

పరుగులు,హడావుడిలు ,చిరాకులు,పరాకులు,పనుల పంపకాలు ,పంచుకోవటానికి మిగలని క్షణాలు ,పెంచుకోవటానికి వీలవని బంధాలు...ఇవే సంపాదన మనకిచ్చే వరాలు!

'పిండి కొద్దీ రొట్టె ','చెట్టు కొద్ది గాలి' అన్నట్లు--భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే,

జీతాలు పెరిగే కొద్ది పెరిగే సుఖాలు,వాటి కోసం కట్ అయ్యే loan instalments,ఆడవాళ్ళకి ఇంట్లో+బయట పేరిగే పనుల వత్తిడ్లు--కనిపించని సత్యాలు,ఓప్పుకోని నిజాలు.ఎక్కువ నలిగేది ఆడవాళ్లే.

కానీ ఇవాళ ఇవి ఎవరూ పట్టించుకోవట్లేదు .

"అయ్యో ఉద్యోగం చేయట్లేదా?"అంటారు పెద్ద నేరమేదో చేస్తున్నట్లు !

"మరి ఖాళీ సమయాల్లో యేంచేస్తూ ఉంటారు?" అని ప్రశ్న.ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ ఉంటానండి --అని చెప్పాలనిపిస్తుంది.

నిజంగా ఇంట్లో ఉండే ఏ ఇల్లాలికి తీరిక ఉంటుంది?పొద్దున్న లేచిన దగ్గర నుంచి 10,11గంటల దాకా స్కూళ్ళు,ఆఫీసుల హదావుడి.ఆ తరువాత ఇల్లు సర్దుడు,బట్టలు-ఇస్త్రీలు,నీళ్ళు కాచడాలు/వాటర్ ఫిల్టర్ కడగటాలు-బోటిల్స్ నింపి ఫ్రిజ్ లొ పెట్టడాలు,సాయంత్రానికి కూరలు,టిఫిన్లూ తయారీలు,కావాల్సినవి ఉంటే బయటికి వెళ్ళి కూరలు ,సరుకులూ తెచ్చుకోవటాలు ఇలా ఏ రోజు పని ఆ రొజు ఉంటుంది.ఇలా గృహిణి పనుల లిస్టు చెప్పుకుంటూ పోతే యెంతైనా ఉంటుంది..ఇక ఉండేది జాయింట్ ఫ్యామిలీ లో అయితే పనులతో పాటు బాధ్యతల బరువులు కూడా ఆడవారికి అదనపు సౌకర్యమే.

ఆదివారం అన్నిరోజులకన్న బిజీ.అన్ని పనులూ లేటు నడుస్తాయి కాబట్టి!! ఇలా రోజులో మహా అయితే ఒక గంట,2గంటలు పేపర్,పుస్తకం,టివి లకు లేక ఇతర హాబీలకి మిగిలి ఉంటాయి...

కానీ ఇవన్నీ కనిపించని పనులు.గృహిణి అంటే అందరికీ లోకువే!

అందుకే అనిపిస్తుంది మనిషిని మనిషిగా మనిషి ఎప్పటికి గుర్తిస్తాడు?అని.

వెనక ఉన్న ఆస్థిపాస్తులకో,సంపాదించే డబ్బుకో మాత్రమే విలువ ఇచ్చే మనిషి స్వభావంలో మార్పు ఎప్పుడు వస్తుంది?

గమనిక:

నేను ఉద్యోగం చేసే వాళ్లకు వ్యతిరేకిని కాను.ఉద్యోగం కేవలం డబ్బు కోసమే కాదు ,మనల్ని మనం నిరూపించుకోవటం కోసం అని కూడా నా అభిప్రాయం. కానీ పైన రాసినది ఇద్దరూ ఉద్యోగం చేసే చాలా మంది అలా ఇబ్బందులు పడతున్నారని చెప్పటానికి ; ఉద్యోగం చెయ్యని ఆడవాళ్ళని కించపరచకూడదు ,వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది అని చెప్పటానికి .

Wednesday, June 3, 2009

ప్రేమంటే..

ప్రేమంటే?
ప్రేమంటే...
గొప్ప గొప్ప సినిమాల్లో ,నవలల్లో ఉండేదేనా ?
అయిఉండోచ్చు!
కానీ నిజమైన ప్రేమ ఏమిటో సహజీవనం చేస్తేనే తెలుస్తుంది.
ప్రేమంటే ఒక వ్యక్తిలోని మంచితనాన్ని ,మంచి గుణాలని ,
కేవలం ఆ ఒక్క వ్యక్తినే ప్రేమించటం కాదు.
ప్రేమంటే 'నువ్వు ఇలా మారు,అలా మారు.అప్పుడు నిన్ను బాగా ప్రేమిస్తాను' అని కండిషన్స్ పెట్టడం కాదు.
ప్రేమంటే -- ఒక వ్యక్తితో పాటూ ఆ మనిషి తాలూకు ప్రపంచాన్ని కూడా ప్రేమించటం.
అది మన ప్రపంచం కన్నా విభిన్నంగా ఉన్నా సరే.
అవతలి వారి అభిప్రాయాలు ,అభిరుచులూ భిన్నంగా ఉన్నా సరే వాటిని గౌరవించటం .
ముఖ్యంగా ఒక మనిషి లోని 'లోపాల్ని' కూడా సుగుణాలతో సమానంగా స్వీకరించగలగటం ;
షరతులు పెట్టకుండా బేషరతుగా ప్రేమించగలగటమే ప్రేమంటే!!
ఎందుకంటే 'ఇవ్వటంలో' ఉన్న ఆనందం,హాయి అనుభవంతోనే అర్ధం అవుతాయి !!

Tuesday, June 2, 2009

తృప్తి ..!!


మనిషి ఒక్క భోజనం విషయంలోనే 'తృప్తి' పడతాడేమో
ఎందుకంటే,ఆ ఒక్క చోటే 'చాలు' అంటాడు మనిషి.
ఇంక వేరే ఏ విషయంలోనూ 'తృప్తి' పడటం ,'చాలు' అనుకోవటం జరగదేమో .
'నాకింకేం అక్కరలేదు.చాలు' అని ఎవరూ చెప్పరు.
ప్రతి మనిషిలో ఏదో ఒక కోరిక,ఆశ,అసంతృప్తి మిగిలే ఉంటుంది..
ప్రతి కంఠంలోనూ ఏదో ఒక అసహనం ధ్వనిస్తూనే ఉంటుంది..
ఏమీ లేని వాడికి ఏదో ఒకటి కావాలి --
ఏదో కొంత ఉన్నవాడికి ఇంకాస్త కావాలి --
అన్నీ ఉన్నవాడికి ఇంకా ఇంకా కావాలి --
బ్రతికే పద్దతి ఏదైనా ,బ్రతుకు విధానం ఏదైనా 'సంతృప్తి' అనేది మనిషికీ చాలా అవసరం.
అది లేనినాడు జీవితగమనం దుర్భరం అవుతుంది.
కానీ మనిషిలో తృప్తి అనేది పుట్టిన నాడు
'ఆన్వేషణ' 'అభివృద్ది' రెండూ కూడా ఆగిపోయే ప్రమాదం ఉందేమో ?!?